31, జులై 2015, శుక్రవారం

'ఊ' అంటే వస్తుందా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎక్స్ ప్రెస్ టీవీలో గురువారం  సాయంత్రం  చర్చ జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రతినిధి చెబుతున్నారు. 'పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదన్నది ఆయన ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ పడుతున్నారనీ, ఆయనా, కొందరు  మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద  చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఈ చర్చ తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు సాయంత్రం  కాగానే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,  ఆ కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
'బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి వుంటే వస్తుందా?'
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'


(30-07-2015)       

2 కామెంట్‌లు:

విసుకి వాడి మనస్సె ఒక విశ్వం... చెప్పారు...

meeloa manchi sense of humour undhi Sir..

నీహారిక చెప్పారు...

ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ప్రధాని/రాష్ట్రపతి వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది.కానీ అది అందరూ కోరుకునే ప్రత్యేక హోదా కాదు.దానిని మించిన అపురూపమైన హోదా వస్తుంది.

(ఇపుడు మీరు "ఊ" అని అనాలి)