16, ఫిబ్రవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (85 )- భండారు శ్రీనివాసరావు

 

యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే

పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.

ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.

డెబ్బయ్యవ దశకంలో రేడియో శ్రోతలకు చిరపరిచితమైన ఈ స్వరం హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూ ప్రాంతీయ వార్తల్లో వినపడేది.

ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. ఉర్దూలో ఓనమాలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు. కాని వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు. ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో జ్ఞాపకం.

కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా,  పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు రేడియో ఉద్యోగంలో దక్కింది.


దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి.


“1933లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో
చిన్న రేడియో కేంద్రం నెలకొల్పాడు. ఆయన  కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా  పరిమితమైన దూరాలకే వినిపించేవి.  ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు.  అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి.  ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితల కోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన  తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు  వార్తలు చదివేవాళ్ళు. మల్లి  పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి” అని డాక్టర్ పి ఎస్ గోపాల కృష్ణ చెప్పారు.


ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతాబాద్ లోని యావర్ మంజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.

తోకటపా: డెక్కన్ రేడియో స్టేషన్ ఫోటో కోసం చేసిన ప్రయత్నం వృధా అయింది. నేను 1975లో రేడియోలో చేరినప్పుడు ఉన్న పాత భవనం కూల్చి ఆ ప్రదేశంలో నూతన భవనంతోపాటు కొత్త స్టుడియోలను నిర్మించారు. ఆ భవనం ఫోటో కూడా పదిలపర్చలేదు. ఇక నేను పుట్టని రోజుల నాటి డెక్కన్ రేడియో ఫోటో కోసం వెతకడం అత్యాశే అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఇలాంటి సందర్భాలలో జంధ్యాల శంకర్ గారు గుర్తు వస్తుంటారు. ఆయన విజయవాడ నగరానికి మేయరుగా పనిచేశారు. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారికి మంచి సన్నిహితులు. ఆయన మేయరుగా ఉన్న సమయంలో విజయవాడలోని కొన్ని పురాతన భవనాలను, చారిత్రక ప్రదేశాలను ఫోటోలు తీసి భద్రపరిచే కార్యక్రమం చేపట్టారు. చేశారు కూడా. కాలక్రమంలో ఆ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆయన తీయించి భద్రపరచిన ఫోటోలు కూడా, సరైన సంరక్షకులు లేక చెదలుపట్టి పోయాయి. ఇప్పుడు ఆ చెదలు పట్టిన ఫోటోలు కూడా లేవు. జంధ్యాల శంకర్ గారి ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అయింది.

(ఇంకా వుంది)

15, ఫిబ్రవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో – ( 84) – భండారు శ్రీనివాసరావు

 రేడియో కధాకమామిషు

రేడియో ఉద్యోగం కోసం హైదరాబాదులో ఇంటర్వ్యూకు హాజరై బెజవాడకు తిరిగి వచ్చినప్పటి నుంచి అసలీ ఉద్యోగం ఏమిటి అనే వెంపర్లాట నాలో  మొదలయింది. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి  ఇంటికి వచ్చే నాలుగయిదు తెలుగు, ఇంగ్లీషు  పత్రికలు తిరగెయ్యడం తప్ప రేడియో కార్యక్రమాలు శ్రద్ధగా వినే అలవాటు లేదు. మా అన్నయ్య ఆఫీసు నుంచి ఇంటికి రాగానే రేడియోలో ప్రాంతీయ వార్తలు పెట్టేవాడు. అంటే దాని అర్ధం నన్ను కూడా వాటిని వినమని. అంతవరకూ నేను చేస్తున్నది ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం. రేడియో వాళ్ళు పేపర్లో ప్రకటించిన ఉద్యోగం హోదా అసిస్టెంట్ ఎడిటర్ బ్రాకెట్లో రిపోర్టింగ్ అని వుంది. ఆ ఉద్యోగం తీరుతెన్నులు ఏమిటో బొత్తిగా తెలియదు. రిపోర్టింగ్ అనే పదాన్ని బట్టి రిపోర్టర్ జాబు అనుకున్నాను. జ్యోతిలో నండూరి రామ్మోహన రావు గారి దయ వల్ల రిపోర్టింగ్ లో కొంత అనుభవం వుంది. తిరుమలశెట్టి శ్రీరాములు గారు, డి. వెంకట్రామయ్య గారు, మాడపాటి సత్యవతి గారు చదివే ప్రాంతీయ వార్తలు వింటూ వుండేవాడిని. విజయవాడ రేడియో కేంద్రంలో అప్పటికి ప్రాంతీయ వార్తా విభాగం లేదు. అంచేత వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ఉద్యోగం వచ్చినప్పటి మాట కదోయి నాయనా అని నాకు నేనే సర్దిచెప్పుకునేవాడిని.


నాకు బుద్ది తెలుస్తున్న తొలి రోజుల్లో రేడియోని చూసింది మా స్వగ్రామం కంభంపాడులోని చామర్తి వీరభద్రరావు మామయ్య గారింటిలో. వాళ్ళ ఇంటి మధ్య హాలులోని అల్మారాలో ఒక భోషాణం పెట్టె మాదిరిగా వుండేది. దాని కిందనే మోటారు కార్లలో వాడే బ్యాటరీ మాదిరిగా ఒక పెద్ద బ్యాటరీ వుండేది. కార్లలో వాడే బ్యాటరీ కాదు గానీ రేడియో కోసం ప్రత్యేకమైన బ్యాటరీ. బాగానే పెద్దది. ఎవరెడీ కంపెనీ వారి బ్యాటరీ. ఆ కంపెనీ గుర్తు 9 అంకె. ఆ నెంబరు మధ్యలో నుండి దూకుతున్నట్లున్న పిల్లి బొమ్మ ఆ బ్యాటరీ మీద ఉండేది.
ఆ పెద్ద గదిలో పైన ఆ మూల నుంచి ఈ మూలకు నైలాన్ తో అనుకుంటా తయారు చేసిన ఒక జాలీ మాదిరి యాంటీనా కట్టి వుండేది. (అప్పటికి దాని పేరు  యాంటీనా అని తెలియని వయసు) మా  మామయ్యగారు రేడియో ఆన్ చేయగానే కింది భాగంలో పచ్చటి లైటు ముందుకూ వెనక్కూ సాగుతూ ఒక చోట ఆగిపోయేది. మా మామయ్యగారికి భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలు రేడియోలో ఎప్పుడు వస్తాయో ఆయనకు ముందుగా ఎలా తెలుసో నాకయితే తెలియదు. కానీ రేడియోలో అవే పాటలు వచ్చేవి. బహుశా ఆకాశవాణి ప్రచురించే వాణి పత్రిక తెప్పించేవారేమో. ఒక వేళ భానుమతి స్వరం వినబడకపోతే, వెంటనే గ్రామఫోన్ పెట్టె బయటకు తీసి, బాసింపట్టు వేసుకుకూర్చుని భానుమతి పాట రికార్డు వేసుకుని వినేవాడు. మాకేమో రేడియో వినాలని. ఆయనకేమో భానుమతి పాట వినాలని. రేడియోలో అప్పుడప్పుడూ హరికధలు, ఆదివారాల నాడు తెలుగు సినిమా (సంక్షిప్త శబ్ద చిత్రం) వేసే వాళ్ళు. ఇక ఆ రోజు ఆయన ఇల్లు తిరుణాల మాదిరిగా వూరిజనంతో నిండిపోయేది. ఎందుకంటే వూరి మొత్తానికి అదొక్కటే రేడియో. అలాంటి రోజుల్లో మా మామయ్య గారు ఆ రేడియోను తీసుకుని వచ్చి పదిలంగా బయట వరండాలో ఓ బల్ల మీద వుంచి రేడియో పెట్టేవారు, వచ్చిన జనమంతా విననడానికి వీలుగా.
పొరబాటున ప్రసారంలో ఏదైనా అంతరాయం వస్తే ఆయన వెంటనే హార్మనీ పెట్టె బయటకు తీసి దానిపై వున్న మీటలపై చేతివేళ్ళను కదిలిస్తూ, మరో చేతితో ఆ పెట్టెకు వెనుకవైపువున్న చెక్క పలకను వెనక్కీ ముందుకూ జరుపుతూ గొంతెత్తి ఏదో ఒక పద్యం అందుకునేవారు. కొంతమంది ఊరిజనం కూడా ఆయనతో గొంతు కలిపేవారు.
ఒక విధంగా మా మామయ్య గారిల్లు పొద్దుగూకే వేళకు వూరిజనాలకు వినోదకేంద్రంగా మారిపోయేది.
అదీ రేడియోతో నా మొదటి పరిచయం.
తర్వాత స్కూలు చదువుకోసం బెజవాడ వెళ్లి మా లాయరు బావగారు తుర్లపాటి హనుమంతరావు గారింట్లో ఉండేవాడిని. ఆయన ఇంట్లో ఆఫీసు గదిలో ఒక బీరువా మీద ఒక చిన్న సైజు రేడియో వుండేది. దానికి మా వూళ్ళో రేడియో మాదిరిగా యాంటీనా వున్నట్టు లేదు. కరెంటుతో పనిచేసేది. కాకపోతే ఆ రేడియో పెట్టే అధికారం మా బావగారికి మాత్రమే వుండేది. ఇంట్లో వాళ్ళం ఎవ్వరం దాని మీద చేయివేసే సాహసం చేసేవాళ్ళం కాదు. పొద్దున్నే భక్తి రంజని, ఇంగ్లీష్ వార్తలు అంతే! ఆ తర్వాత రేడియో నోరు తెరిచేది కాదు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుమోపినప్పుడు ఆ చారిత్రాత్మక సంఘటనను బీబీసీ కాబోలు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ రోజు మా బావగారు నిబంధనలను కాస్త సడలించి రేడియో పెట్టారు. గుర్రుబర్రు మంటూ ఇంగ్లీష్ లో ప్రసారం అయిన ఆ కార్యక్రమంలో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా అందరం చెవులొప్పగించి విన్నాం.


బీసెంటు రోడ్డులో జంధ్యాల నారాయణ మూర్తి (సినిమా డైరెక్టర్ జంధ్యాల తండ్రి) గారి బుష్ రేడియో స్టోర్స్ వుండేది. మా బావగారు ఆయన గారు మంచి స్నేహితులు. అంచేత పిల్లలం అప్పుడప్పుడూ ఆ దుకాణంలో కాసేపు కూర్చుని రేడియో కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టే ప్రోగ్రాములు వినేవాళ్ళం. ఆ విధంగా మా ముచ్చట తీర్చుకునేవాళ్ళం.


హైస్కూల్లో చేరిన తర్వాత సెలవుల్లో మా వూరికి వెళ్ళినప్పుడు ఊరి మద్యలో మైకులో వినిపించే పంచాయతీ రేడియో సెంటర్ మాకు ఆటవిడుపు. రోజూ సాయంత్రం వేళల్లో ఓ రెండు మూడు గంటలు రేడియో వినడానికి వూళ్ళో వాళ్ళు ఆ మైకు దగ్గరికి చేరేవాళ్ళు. అది కూడా ఒక్క విజయవాడ మెయిన్ స్టేషన్ మాత్రమే. సాయంత్రం ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు, వ్యవసాయదారుల కార్యక్రమం, ఎప్పుడయినా ఓ హరికధా కాలక్షేపం. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. మొదట్లో బాగున్నా, సినిమాపాటలు వినే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడే వాళ్ళం.


ఈ లోపల మా ఇంటి పెత్తనం మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు చేతికి వచ్చింది. ఆయన చేసిన మొదటి పనేమిటంటే విజయవాడ వెళ్లి నాలుగు బా౦డ్లో, అయిదు బా౦డ్లో తెలియదు, ఓ ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చాడు. మా వూళ్ళో అడుగుపెట్టిన మొదటి ట్రాన్సిస్టర్ అదే. అంతకు ముందు బ్యాటరీతో పనిచేసే రేడియో మాత్రమే మేము చూశాము. ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్ళే ఆ రేడియో ఆ రోజుల్లో వూళ్ళో వాళ్ళందరికీ చూడముచ్చటగానే కాకుండా విచిత్రంగా కూడా వుండేది. రేడియో సిలోన్ నుంచి మీనాక్షి పొన్ను దొరై సమర్పించే కార్యక్రమంలో వినిపించే తెలుగు పాటలు మొదటిసారి వినే భాగ్యం కలిగింది.
ఇక ఆ తర్వాత రేడియో యుగం మొదలయింది.  ప్రతి ఇంటా రేడియో. ప్రతి చేతిలో బుల్లి ట్రాన్సిస్టర్. క్రికెట్ కామెంటరీలు వింటుంటే అచ్చం క్రికెట్ గ్రౌండ్ లోనే వున్నామా అనే అనుభూతి కలిగేది. ఆ ఉత్సాహం రేడియో వినేవాళ్ళ మొహాల్లో, చేతల్లో కేరింతల రూపంలో కనబడేది. రేడియో పుణ్యమా అని బుర్ర కధలు, హరి కధలు, పురాణ కాలక్షేపాలు, సంగీత కచ్చేరీలు అన్నీ ఇళ్ళ లోగిళ్ళలోకి తరలివచ్చాయి.
ఎప్పటికో అప్పటికి సొంతంగా రేడియో కొనుక్కోలేకపోతానా అనే కోరిక నాతోపాటే పెరిగి పెద్దయి రేడియో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తీరలేదు. ఎందుకంటే రేడియో వాళ్ళే మాకో ట్రాన్సిస్టర్ రేడియో, దానితోపాటే చేతిలో పట్టుకుని తిరిగే టేప్ రికార్డర్  ఇచ్చారు. దాంతో కొనే అవసరం లేకుండా పోయింది. ఆ రేడియోకి కావాల్సిన బ్యాటరీ సెల్స్ కూడా నెలకోసారి ఆఫీసువాళ్ళే సప్లయి చేసేవాళ్ళు. బదిలీ అయినప్పుడో, రిటైర్ అయినప్పుడో ఆ రేడియో తిరిగిచ్చేయాలనేది కండిషన్. నా విషయంలో ఇది కూడా జరగలేదు. ఎందుకంటే ఏ బదిలీలు లేకుండా చేరిన చోటే, అంటే హైదరాబాదులోనే మూడు దశాబ్దాల తర్వాత పదవీవిరమణ చేశాను. ప్రభుత్వ సర్వీసులో ఇదొక రికార్డు అనేవాళ్ళు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఆ రేడియో ఏమైందో తెలియదు. మధ్యలో అయిదేళ్ళు దేశంలోనే లేను. రేడియో మాస్కోలో పనిచేయడానికి వెళ్లాను. తిరిగివచ్చిన తర్వాత కూడా ఆ రేడియో గురించి అడిగినవాళ్ళూ లేరు. ఆ రికార్డులు వున్నట్టూ లేదు. అసలు అదేమై పోయిందో నాకూ గుర్తులేదు. ఒకసారి బి.హెచ్.ఇ.ఎల్. ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులందరికీ అరచేతిలో ఇమిడే బుల్లి ట్రాన్సిస్టర్ రేడియోలు గిఫ్ట్ గా ఇచ్చారు. దీనివల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, సచివాలయంలో మంత్రుల ప్రెస్ మీట్లు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సంగతులను అక్కడికక్కడే వారికి వినిపించేవాడిని. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా రేడియో వార్తల్లో వచ్చింది అని వాళ్లు ఆశ్చర్యపోతుంటే అదో తుత్తిగా ఫీలయ్యేవాడిని.


ఉద్యోగం చేసిన రోజుల్లో పుట్టని యావ, అసలు రేడియో ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే మీమాంస రిటైరైన తర్వాత మొదలయింది. ఇటువంటి విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది నాలాగే రిటైర్ అయ్యారు. అనేకమంది జీవించి లేరు. ఉన్నవారిలో కూడా చాలామందికి కొన్ని కొన్ని జ్ఞాపకం. అక్కడక్కడా మతిమరపు. డాక్టర్ పద్మనాభ రావుగారి లాంటి వాళ్ళు విషయ సేకరణ చేసి రేడియోకి సంబంధించి కొన్ని పుస్తకాలు రాసారు. మరొక వ్యక్తి డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ. గతంలో ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన స్వయంగా రాసి అనేక సదస్సుల్లో సమర్పించిన పరిశోధనాపత్రాలు అనేకం వున్నాయి. ఆయన పనితీరు నాకు తెలుసు. పైగా ధారణ శక్తి అపారం. సాధికారత లేకుండా ఏదీ రాయరు. కాబట్టి ఆయన్నిఅడిగీ, ఫోనులో మాట్లాడి చాలా విలువైన సమాచారం సేకరించాను. అలాగే మరొకరు వీవీ శాస్త్రి గారు. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. సాయంకాలక్షేపాల కబుర్లలో రేడియోకి సంబంధించిన కబుర్లు అనేకం ఆయన నోటి వెంట విన్నాను.  ఏతావాతా మొత్తం మీద చాలా సమాచారాన్ని పోగుచేసి, కొంతవరకు నా బ్లాగులో భద్రపరిచాను. వాటి ఆధారంగా మరికొన్ని రేడియో సంగతులు ఈ శీర్షిక ద్వారా తెలియచెప్పాలనేది సంకల్పం. ఇక  రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రుల సంగతులేవీ అంటే వాటిని గురించి ముందు ముందు ముచ్చటించుకోవచ్చు.

కింది ఫోటో:

మా మామయ్య చామర్తి వీరభద్ర రావు గారు



(ఇంకా వుంది)

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (83 )- భండారు శ్రీనివాసరావు

 ముందే మనవి చేసుకున్నాను, ఇది నా ఒక్కడి కధ కాదని, నా చుట్టూ అల్లుకున్న ప్రపంచం కధ అని.

కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా,  కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్‌వయోలిన్‌పియానో,  కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు పోసుకుని ఇప్పటికి కొంచెం అటూ ఇటూగా తొంభయ్ ఏళ్ళు. అయినా, నేటికీ ఆ ట్యూన్‌,  స్మార్ట్  ఫోన్ల లో  రింగ్‌ టోన్‌ / కాలర్ టోన్ గా (మన్నించాలి, ఈ రెంటికీ నాకు తేడా తెలియదు)  వినిపిస్తూనే వుంది. వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ అవుతూనే ఉంది.

నేను స్మార్ట్ ఫోన్ వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ని నా   రింగ్‌ టోన్‌ / కాలర్ టోన్ గా వాడుతున్నాను. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నాకు వినపడే రింగ్ ధ్వని అదే  అన్నమాట.  రేడియోతో చిరకాల అనుబంధం నన్నీపనికి పురికొల్పింది. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు రేడియో ప్రసారాలు మొదలు కావడానికి ముందుగా వినపడేది ఈ సిగ్నేచర్ ట్యూనే. ఒకానొక రోజుల్లో ఇంటిల్లి పాదికీ ఇది కోడి కూత. అది వింటూనే జనం తమ నిత్య వ్యవహారాలు మొదలుపెట్టే వారు.

 

ఇంతకీ ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌ని కంపోజ్‌ చేసిందెవరో తెలుసా..ఆ సంగీతజ్ఞుడి పేరు వాల్టర్  కౌఫ్‌మన్‌. చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన వ్యక్తి. 1934లో ముంబైకి వచ్చిన కౌఫ్‌మన్‌, బాంబే చాంబర్‌ మ్యూజిక్‌ సొసైటీలో పియానో వాద్యకారుడిగా ఉండేవాడు. ఇండియన్‌ బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీ విజ్ఞాపన మేరకు 1936లో ఒక ట్యూన్‌ కంపోజ్‌ చేసి ఇచ్చాడు కౌఫ్‌మన్‌. పాశ్చాత్యశాస్త్రీయ సంగీతాల మేళవింపుగా దీనిని రూపొందించాడాయన. శివరంజని రాగం ఆధారంగా దీనిని కంపోజ్‌ చేశారని చెబుతారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ ట్యూన్‌ని మారుద్దామని కొందరు అన్నారట! అయితే, ఈ స్వరంలో ప్రణవనాదం అయిన ఓంకారం ప్రతిధ్వనిస్తున్నట్టు ఉందనే అభిప్రాయంతో ఆ ట్యూన్ మార్చే ప్రయత్నాన్ని విరమించుకున్నారట ఆకాశవాణి అధికారులు.

1934 లో ఇండియాకు వచ్చిన పద్నాలుగేళ్ళపాటు ఈ దేశంలోనే వుండిపోయాడు. బాంబేలోని విల్లింగ్టన్ జింఖానాలో ప్రతి గురువారం నాడు ఒక సంగీత కచ్చేరీ ఇచ్చేవాడు. ఆయన బృందంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  సంగీత విద్వాంసుడు జుబెన్ మెహతా  తండ్రిగారయిన మెహ్లీ మెహతా వుండేవారు. ఆయన వయొలిన్ పైనా,  కౌఫ్‌మన్‌ పియానో పైనా శ్రోతలను అలరిస్తూ వుండేవారు.  ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్  ట్యూన్ లో వయొలిన్ వాయించింది మెహ్లీ మెహతా అనేవారు కూడా లేకపోలేదు.

కౌఫ్‌మన్‌ సంగీతంలో దిట్ట. పూర్వపు జెకొస్లవాకియా దేశంలో 1907 లో జన్మించిన ఈ సంగీత కారుడు, బెర్లిన్ సంగీత కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నాడు. నాజీల బాధితుడిగా అతడు భారతదేశానికి ఓ కాందిశీకుడుగా వచ్చాడు. ఇండియాకు వీసా దొరకడం చాలా సులభం కాబట్టి తాను ఈ దేశాన్ని ఎంచుకున్నానని ఆయన చెప్పేవాడు.

1937  నుంచి  1946 వరకు ఆల్ ఇండియా సంగీత విభాగంలో డైరెక్టర్ గా రేడియోలో పనిచేశాడు. ఈ  దేశపు అతి గొప్ప సంగీత కళాకారులను గురించి తెలుసుకోవడానికి  ఈ ఉద్యోగం ఎంతగానో  ఉపకరించిందని తను రాసిన ఒక పుస్తకంలో  ఆయన వెల్లడించారు.

పాతతరానికి చెందిన అనేకమంది భారతీయ  సంగీత విద్వాంసులు, రేడియో వారు చెక్కుల  రూపంలో ఇచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, విచ్చు రూపాయలలో ఇస్తే సంతోషంగా తీసుకునేవారని, ఆ నాణేలను జాగ్రత్తగా లెక్కపెట్టుకోవడానికి తమ వెంట ఎవరో ఒకరిని తోడు తెచ్చుకునేవారని తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇండియా వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 1957 లో అమెరికాలో స్థిరపడడానికి ముందు కొన్నేళ్ళు ఇంగ్లాండ్ లో, కెనడాలో గడిపారు. 1984 లో కౌఫ్‌మన్‌ అక్కడే కన్ను మూశారు.

రేడియోకి (ఇక్కడ రేడియో అంటే ఆకాశవాణి) అభిమానులు ఉన్నట్టే రేడియోలో పనిచేసిన వారికి కూడా రేడియో అంటే తగని అభిమానం, ఆరాధన. ఉదాహరణకు రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన రావూరి భరద్వాజ గారి విషయమే  తీసుకుందాం. ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నేను చిరకాలం కలిసి పనిచేసినవారిలో భరద్వాజ ఒకరు. ఆయన పొడవాటి గుబురు  గడ్డం పెంచని రోజులనుంచి నాకు తెలుసు. రావూరి భరద్వాజ గారికి   జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది.  మనసుకు మాత్రమే  ఆర్ద్రం అయ్యే రీతిలో ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.

"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?

రెంటాల గారి ప్రశ్న.

భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన  సమాధానం :

"కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేనునా భార్యనా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ,  ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశంఆలోచించే తీరికరాసే ఉత్సాహం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందోలేదో కానీ… నేను చనిపోయాకనా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులుసాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటేవచ్చే జన్మలో ఆకాశవాణి (ఆవరణలో)  ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!"

మరి రేడియోలో కళాకారులు చేసేది ఉద్యోగం (వృత్తి) అందామా! (ఉపాధి) అనురక్తి అందామా!

అలాగే మరో రేడియో కళాకారిణి రేడియో చిన్నక్క.

ఒకానొక కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్ ప్రసాద్ గారు కొన్నేళ్ళ క్రితం ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రేడియోపై రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.
మేమెవ్వరం రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ అంతకు కొన్నేళ్ళ ముందటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
రేడియో న్యూస్ రీడర్, ప్రసిద్ధ కథకుడు, కీర్తిశేషులు డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో 2018 ఏప్రిల్ లో హైదరాబాదులో ఒక ఇష్టాగోష్టి విందు సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను తొమ్మిది పదులు నిండి కూడా ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆ రోజు నుంచి నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు పునర్జన్మ ఇచ్చాడు అని. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు. వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి నాకు నోట మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడేది. ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”
ఆవిడ అలా మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.
ఒక మంచి మాటలో ఇంతటి శక్తి ఉందా!

కింది ఫోటోలు:


(రావూరి భరద్వాజ గారు)


(రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ గారితో నేను)






 

(ఇంకా వుంది)

 

13, ఫిబ్రవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో - 82

 బిగ్ జీరోకి బిగ్ బ్రేక్

అయాం ఎ బిగ్ జీరో రాయడం మొదలుపెట్టిన తర్వాత కిందటి నెల చివర్లో బిగ్ బ్రేక్ పడింది. అప్పటికి 81 ఎపిసోడ్స్ అయ్యాయి. జనవరి 27  నుంచి ఈ రోజు వరకు అంటే పదిహేడు రోజుల పాటు దాని జోలికి పోలేదు అంటే నాకే విడ్డూరంగా వుంది.

నిరుడు 2024 నవంబరు పదకొండో తేదీన  ప్రారంభించిన ఈ సీరియల్ ‘రచనోద్ఘాతం’  తోకటపాలో ముందే చెప్పినట్టు, శారీరకంగామానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు  ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత.  అయినా సరే, అన్నీ గుర్తు తెచ్చుకుని, నాకుగా నేను తలకెత్తుకున్న  ఈ బాధ్యతను పూర్తిచేయాలనేది నా సంకల్పం.  

 నాకున్నది ఒక్కటే రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి. దానికి నా ఆరోగ్యం సహకరించాలి.

గత మూడువారాలుగా అనేక మానసిక ఒత్తిళ్ళు. మా రెండోవాడి ఏడూడి మాసికాలు, అమెరికా నుంచి, కటక్ నుంచి పిల్లల రాకలు, వాళ్ళు వెళ్లి ఇల్లు ఖాళీ కాగానే మనసు ఖాళీ కావడం, జలుబు వెలగని బలుబులా  పట్టుకుని ఓ పది రోజులు వదలని రొంప, దగ్గు  నన్ను జీరో రచనకు దూరం చేసాయి.

ఈరోజు, ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ రోజున, అయాం ఎ బిగ్ జీరో పునః ప్రారంభించాలని సంకల్పం. ఎనభయ్ రెండో ఎపిసోడ్ కి సమాయత్తం. అదే ఇది.

నిజానికి రేడియో అంటే వార్తలు కాదు, సంగీతం. సంగీతం అంటే  ఢమఢమల సంగీతం కాదు. ఎందరో విద్వద్మణులు సమకూర్చిన సంగీతం. ఈ రోజు, ఫిబ్రవరి పదమూడు,  ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రముఖ దినపత్రిక ఏడుగురు ఆర్జే (రేడియో జాకీ) లతో ఇంటర్వ్యూలు చేసి ఒక పెద్ద ఆర్టికిల్ ప్రచురించింది. సంతోషపడుతూ చదివాను. ఈనాటి తరానికి రేడియో సంగీతం అంటే అదే! మరి  వాళ్ళని ఎలా తప్పుపట్టగలం?  

ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి.                                   

మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం),  బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహనరావు, ఎల్లా వెంకటేశ్వరరావు  (మృదంగం) ప్రపంచం సీతారాం,  ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ).   మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకు వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం,  హైదరాబాదు కేంద్రం  నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే,  అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.  కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూ వచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే, తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే  పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉద్యోగం కాదు, ఉపాధి అనుకుని వచ్చి చేరినవారిలో కొందరు,  మారిన పరిస్తితులతో రాజీపడలేక రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో  ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపెరుకాదనీ, ఎప్పుడో దశాబ్దాల క్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.  

 నిబంధనల  పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి సీతారాం గారే ఒక ఉదాహరణ.

లోకాన్ని ఒదిలి వెళ్ళిన ప్రపంచం

ప్రసిద్ధ సంగీత విద్వాంసుడుఫ్లూట్ కళాకారుడు ప్రపంచం సీతారాం, 2014లో మరణించినప్పుడు ఆయన సంస్మరణ వ్యాసానికి నేను ఎంచుకున్న శీర్షిక ఇది. 

సంగీతానికి చావు లేదు. అయితేఅజరామరమైన సంగీతాన్ని జనాలకు వొదిలి పెట్టి వెళ్లి, సంగీత కారులు మాత్రం  అమరులుగా మిగిలిపోతుంటారు. అలాంటి సంగీత నక్షత్రమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం. అంతటి సంగీతకారుడు పనిచేసిన రేడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క  కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల  ఏ యోగ్యతా నాకు లేదనిఆ ఒక్కటే  ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌకరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఇందుకు దోహదం చేసింది.

 

ఇది జరిగి కూడా పాతిక ముప్పయ్యేళ్ళు అవుతుందేమో. ఇంకా ఎక్కువో.

మంగళగిరి,  నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారసపడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై. ప్రమోషన్ మీద  బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీతకారుడు.  కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేదికాదు. పైగా అలాటి వారికి  మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.

జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో,  ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల దరిమిలా, రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధాన పరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఫ్లూటు వాయిద్యంలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రపంచం సీతారాం గారు, అమెరికాలోని శాండియాగోలో వుంటున్న తన కుమారుడు ప్రసన్నను చూడడానికి  వెళ్ళి, అక్కడే ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచివెళ్ళారు.

తన సంగీత జ్ఞానంతో తెలుగు  సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, దేశం ఎల్లలు  దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయి దేశంలో మరణించడం విధి విచిత్రం.

(ఇంకా వుంది)


కింది చిత్రం ప్రపంచం సీతారాం