23, అక్టోబర్ 2017, సోమవారం

వార్తలపై పెత్తనం ఎవ్వరిది, సంపాదకుడిదా? యజమానిదా? – భండారు శ్రీనివాసరావుపత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాలు గడిచాయి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్  ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్,  చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో  పాటు  ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు.  పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి   ఒక నివేదిక  పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్   అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ  నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ (I am appalled with your report) అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
 “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. (Don’t I have the freedom to differ with my editor?)
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”

17, అక్టోబర్ 2017, మంగళవారం

తీరు మారుతున్న పార్టీ మార్పిళ్లు


పార్టీ మార్పిడుల విషయంలో వార్తల స్క్రోలింగులు వారాల తరబడి సాగుతాయి ఇలా:
పార్టీ మారాలనే ఆలోచనలో పలానా
పార్టీ మారే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పలానా
పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన పలానా
తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేసిన పలానా
పార్టీ అధినాయకత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పలానా
నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తీవ్ర నిర్ణయాలు తప్పవంటున్న పలానా
అధికార పార్టీ అగ్రనేతతో సమావేశమైన పలానా
దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్న పలానా
ఏ నిర్ణయమైనా కార్యకర్తలతో చర్చించి నిర్ణయిస్తానన్న పలానా
రేపోమాపో పార్టీ మారనున్న పలానా
పార్టీ మారి కొత్త కండువా కప్పుకున్న పలానా

( కొన్ని రోజుల పాటు వార్తల్లో ఉండడానికి ఇదొక కొత్త టెక్నిక్ అని గిట్టని వారి ఆరోపణ) 

14, అక్టోబర్ 2017, శనివారం

కేవలం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన  జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు  వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త.  మా నాన్నగారు మా వూరు కంభంపాడు  కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ    ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.  
“అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా  ఒక కవితలో రాశారు.
ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.
నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల  ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.       

దేవుడికి కులమేదీ?


సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.
ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళిత వాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.

తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు  అన్నీ ‘రామాలయంలో హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా నియమించారు. 

13, అక్టోబర్ 2017, శుక్రవారం

చైనాలో రైలు ప్రయాణం


పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన సిల్క్ రూటులో సాహస యాత్ర పుస్తకంలో రాసిన ఒక విషయం గుర్తుకు వస్తోంది. అయిదేళ్ళ క్రితం చైనాలో తాను జరిపిన  రైలు ప్రయాణ అనుభవాన్ని ఆయన ఇలా అభివర్ణించారు.
“చైనా భాషలో లీన్ యాన్ అంటే పువ్వుల తోట అని అర్ధం. కానీ ఎడారి కొసన ఉన్న పట్టణం కాబట్టి ఎక్కడా చెట్టూ చేమా జాడ కూడా లేదు.  రైలు స్టేషన్ కు మూడంచెల పటిష్టమైన భద్రత. టిక్కెట్టు యెంత ముందు కొనుక్కున్నా ఎవర్నీ ప్లాట్ ఫారం మీదికి వెళ్ళనివ్వరు. రైలు రావడానికి ఓ పదినిమిషాల ముందు లోపలకి అనుమతిస్తారు. సామానులు మోయడానికి కూలీలు వుండరు. వృద్ధులతో సహా అందరూ ఆరోగ్య వంతులే కాబట్టి ఎవరి లగేజి వాళ్ళు అవలీలగా మోసుకెడతారు. ప్లాట్ ఫారం శుభ్రంగా అద్దంలా వుంటుంది. ఎటువంటి దుకాణాలు వుండవు. రణగొణ ధ్వనులు చెత్తాచెదారానికి ఆస్కారంవుండదు. రైలు కదలగానే ప్లాట్ ఫారం ఖాళీగా, నిశ్శబ్దంగా వుంటుంది. ఒకరిద్దరు రైల్వే ఉద్యోగులు మాత్రమె కనబడతారు. ఇక ప్రతి బోగీకి ఒక అటెండెంటు నీటుగా నీలం రంగు డ్రెస్సులో తలమీద టోపీతో ఉంటాడు. టిక్కెట్లు చెక్ చేయడం, బెర్తులు చూపించడంతో పాటు ప్రతి గంటకు చీపురుతో పెట్టె మొత్తం శుభ్రం చేస్తుంటాడు. వారిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడింది. ప్రతి ఆరు సీట్లకి ఒక ప్లాస్టిక్ చెత్త బుట్ట వుంటుంది. ప్రయాణీకులు చెత్త అందులోనే వేస్తారు. అటెండెంటు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తాడు. ప్రతి బోగీలో బాత్ రూములు, వాష్ రూములు విడిగా వుంటాయి. టాయిలెట్లు వెస్ట్రన్ తరహా కాదు. పాత మోడల్స్. అంటే ముసలివారితో సహా ఎవరికి ఆ దేశంలో మోకాళ్ళ నొప్పులు లేవని అర్ధం అయింది. ప్రయాణీకులు అందరి వద్దా డిస్పోసబుల్ స్లిప్పర్స్ వున్నాయి. రైలు ఎక్కగానే బూట్లు విప్పేసి వాటిని ఉపయోగించి దిగేముందు వాటిని చెత్త డబ్బాలో వేస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాత్రి పడుకోబోయే ముందు ఆడామగా తేడా లేకుండా అందరూ శుభ్రంగా బ్రష్ చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
“చైనా రైల్వేలలో నాకు నచ్చిన మరో విషయం ఏమిటంటే రాబోయే స్టేషన్ కు అయిదు నిమిషాల ముందు, స్టేషన్ దాటినా తర్వాత అయిదు నిమిషాల పాటు టాయిలెట్ తలుపులు ఆటోమేటిక్  గా లాక్ అవుతాయి. ఈ పద్దతి వల్ల రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలు, పరిసరాలు శుభ్రంగా వుంటాయి. రైలు మార్గాలను దేశ మంతటా ఫెన్సింగ్ చేశారు. దానివల్ల పశువులు, మనుషులు, వాహనాలతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవు.
“ఆరోగ్యం పట్ల చైనీయుల చైతన్యం నన్ను ఆశ్చర్య పరిచింది. నలభయ్ గంటల సుదీర్ఘ ప్రయాణం. కండరాలు పట్టేయకుండా ఏదయినా స్టేషన్లో రైలు ఆగిందంటే చాలు గభాలున ప్లాట్ ఫారం మీదకు గెంతి వార్మ్ అప్ లు మొదలు పెడతారు.

“భీకరాకార పర్వత గర్భాలను తొలిచి నిర్మించిన టన్నెల్స్ ద్వారా సాగిన ఆ రైలు ప్రయాణం ఒక మధురానుభూతి”

(For copies: Shri Paravastu Lokeswar, Navodaya Colony, Hyderabad, Cell: 9160680847, 9392698814) 

12, అక్టోబర్ 2017, గురువారం

చీరే మేరే సప్నే – భండారు శ్రీనివాసరావు


వారాల అబ్బాయిలా ప్రతి గురువారం పొద్దున్నే యధావిధిగా స్నేహ టీవీ డిబేట్ కు వెళ్ళొచ్చి తీరిగ్గా మరోమారు పేపరు తిరగేస్తుంటే మా ఆవిడ ఫోను సంభాషణ చెవుల్లో పడింది. మిగతా సమయాల్లో ఏమో కాని, ఫోను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆవిడ స్వరం స్పష్టంగా, స్పుటంగా వినిపిస్తుంది.
“ఇక్కడ వానల సంగతా. నిన్న  కాస్త తెరిపి ఇచ్చింది కానీ, మళ్ళీ భారీ వర్షాలు అంటూ టీవీలు భయపెడుతున్నాయి. మీకక్కడ చలికాలం అనుకుంటా. పొతే, ఒక సంగతి చెప్పాలి వొదిన గారు, మీరు నమ్ముతారో లేదో కానీ రాత్రి మీరు కల్లోకి వచ్చారు. అసలే మీది పచ్చటి పసిమి ఛాయ, అమ్ముమ్మ గారిలా.  దానికి తోడు  నెమలి పించం రంగు చీరె. మామిడి పిందెల ఆరంజి కలర్ బార్డరు. రిచ్ పల్లు.  ఒకటే  మెరిసిపోతున్నారు. ఒకసారి  సారి మీరు అమెరికా నుంచి వచ్చినప్పుడు, అప్పుడు ఎయిర్ పోర్ట్ బేగం పేటలో వుండేది, విమానం దిగి మీరు నడిచి వస్తుంటే అద్దాల తలుపు లోంచి చూస్తూ కళ్ళు తిప్పుకోలేక పోయాను. చీరె రంగు అదేకాని చిన్న చిన్న  బుటాలు. శ్రీకాంత్ పెళ్ళికి నేను పెట్టిన ఆ చీరె కట్టుకుని మీరలా వస్తుంటే యెంత సంతోషం అనిపించిందో. అన్నట్టు మాటల్లో  మరిచేపోయా. మీరు అప్పుడు పెట్టిన చీరె లాంటిదే వెతికి వెతికి మరీ  కొనుక్కున్నాను.  మీరీసారి వచ్చినప్పుడు చూపిస్తాలెండి. కాకపొతే మస్టర్డ్  కలర్ కి రెడ్  బార్డరు.  మీరు తప్పకుండా వస్తారు, చూస్తారు ఒదినె గారు.  తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమైతాయని అంటారు కూడా.......”
అలా అలా సాగిపోతోంది మా ఆవిడ మాటల ఝరి.

తనకొచ్చిన కల గురించి అప్పుడే చూసొచ్చిన సినిమా కధలా తీరు తీరున  వర్ణించి చెబుతోంది. మరి నాకూ కలలు వస్తాయి. కానీ, లేచిన తరువాత ఒక్కటీ గుర్తుండి చావదు.      

10, అక్టోబర్ 2017, మంగళవారం

హై టెక్ సీఎం చంద్రబాబు


చంద్రబాబు నాయుడికి హై టెక్ సీఎం అనే పేరు ఏనాటి నుంచో వుంది. దానికి తగ్గట్టే టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పటికప్పుడు ‘అప్ డేట్’ అవుతుంటారు కూడా.
‘భారత్ అంబుల పొదిలో మరో కొత్త యుద్ధ విమానం’ అన్నట్టుగా చంద్రబాబు వాడే పదాల పొదిలోకి కూడా కొత్తవి వచ్చి చేరుతుంటాయి. నిన్న విశాఖలో మరో రెండు కొత్త పదాలను – ‘బ్లాక్ చెయిన్, అగ్రి హ్యాకధాన్’ అనేవాటిని  ఆయన ప్రయోగించారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారికి ఆ పదాలు కొత్తవి కాకపోవచ్చు కానీ  చాలామందికి తెలియనివే అవి.
గత మూడున్నర సంవత్సరాలుగా ఆయన నోటి వెంట జాలువారిన పదాలను ఒక పెద్దమనిషి క్రోడీకరించారు. వాటిల్లో మచ్చుకు కొన్ని.     
“హాపీనెస్ ఇండెక్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్, ఫోర్త్ ఐటి రివల్యూషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్, లార్జర్ కనెక్టివిటీ.... వర్ట్యువలైజేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ సీడింగ్, డ్రోన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్........” ఇలా ఇలా ఎన్నో.
వీటి మూలాలు బోధపడితే కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాదు.

ఆయన పొడ గిట్టనివారు అంటుంటారు,  ఎన్నికలకు ముందు ప్రసంగాలలో వినబడని ఈ పదాలు, ‘విక్రమార్కుడి సింహాసనం కధ’ లో మాదిరిగా,   అధికారంలోకి రాగానే ఆయన నోటి వెంట ఇలాంటివన్నీ  ధారాపాతంగా ఎలా వస్తాయని. 

9, అక్టోబర్ 2017, సోమవారం

హోదాలేని అధికారం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు


కొన్ని వారాలు వెనక్కి వెడితే...
సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను.
“అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.
అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి వచ్చింది.
అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలువుంటాయి.
పూర్వం నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్ తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత తోస్తే అంతే!’ అనే వాళ్ళు పరోక్షంలో.
ఇప్పుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు పెట్టారని పత్రికల్లో చదివాను. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్ చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు  రైల్వేశాఖ డిప్యూటీ  మంత్రిగా వున్నప్పుడు  ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి విలేకరులకు  తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ చేసారుట. సంతోషమే.
పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఎన్డీయే ప్రభుత్వం, యూపీఏ తేడాలేదు. శనివారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు ఎయిర్ పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన వాహనాలు. అవి  వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రి గారి శాఖ స్థాయిని బట్టి ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు. యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి ఖర్చులు పెట్టేవాళ్ళు.

తోక టపా : పూర్వం ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన జన్మదినం రోజున ఎవ్వరూ పుష్ప గుచ్చాలు తేవద్దని ముందస్తుగా ప్రకటన కూడా విడుదల చేసారు. ఆరోజు ఆయన్ని కలిసి అభినందనాలు తెలపడానికి వచ్చిన వాళ్ళ చేతుల్లో పుష్ప గుచ్చాలు లేవు. వాటి స్థానంలో అత్యంత ఖరీదైన  కాశ్మీరీ  శాలువలు వున్నాయి.    

6, అక్టోబర్ 2017, శుక్రవారం

ముఖ్యమంత్రిని కలవడం ఎలా! – భండారు శ్రీనివాసరావు


యాక్టివ్ జర్నలిజంలో ఉన్న కాలంలో   రాజకీయాల్లో తలపండిన అనేకమంది తరచుగా అడిగే ప్రశ్న ‘ముఖ్యమంత్రిని కలవడం ఎలా?’  ఆ రోజుల్లో నాకు ఆశ్చర్యం కలిగించే ప్రశ్న అది.
ముఖ్యమంత్రులను కలవడం ఆషామాషీ కాదు అన్న వాస్తవం ‘విలేకరిత్వం’ ఒదిలిన తర్వాత కానీ నాకూ అర్ధం కాలేదు.  అప్పటిదాకా తలుపు తోసుకుని వెళ్ళిన తమను, ఆ  ‘తలుపు’ దగ్గరే అడ్డగించే ద్వారపాలకులకి తమ  ‘ప్రవర’ చెప్పుకోవడం చిన్నతనం అనిపించి అసలు అటు ఛాయలకు పోవడమే మానుకున్న సీనియర్ జర్నలిష్టులు నాకు మార్గదర్సులు. వార్తలు రాసే ఉద్యోగం  ఒదిలేసిన తర్వాత నేను కూడా గత పదేళ్లుగా ముఖ్యమంత్రులను కలిసింది లేదు. అంచేత సీఎం లను కలవాలనే కోరికకు మనసులోనే  మంగళం పాడుకున్నాను.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసేఆర్ ఆ పదవిలోకి రావడానికి కొద్ది కాలం ముందు ఆయన్ని  కలుసుకునే అవకాశం నాకు లభించింది. అంతే కాదు ఆయనతో కూర్చుని ఒకే టేబుల్ మీద భోజనం చేస్తూ ముచ్చటించుకునే అపూర్వ అవకాశం కూడా నాకు అప్పుడే దొరికింది. ఆ తర్వాత ఆయన కొత్త తెలంగాణా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే!  అక్కడి నుంచి ఆయన్ని టీవీల్లో చూడడమే ఎక్కువ.
కేసీఆర్ విలేకరుల సమావేశాలు నిర్వహించడమే తక్కువ. అయినా ఆయనకూ, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియాలో లభించే విస్తృత ప్రచారం గమనించినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లోనే ఆయన మీడియాను అదుపుచేసి, తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారనే ప్రచారం కూడా తక్కువ జరగలేదు. మరి మూడున్నర ఏళ్ళ తర్వాత కూడా సానుకూల ప్రచారం ఆవగింజంత కూడా తగ్గినట్టులేదు. మరి దీనికి ఏమి చెప్పాలి?
ఇంకో విషయం చాలామంది గమనించే వుంటారు. రాజధానిలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల్లో చాలామందికి ఇప్పుడాయన ఒక ఆరాధ్య నాయకుడిగా కనబడుతున్నాడు. ఈ సంగతి  ఈ మధ్యాన్నం వెళ్ళిన ఒక పెళ్ళిలో తెలిసింది. దానికి హాజరయిన వారిలో అనేకమంది హైదరాబాదులో స్థిర పడ్డ ఆంధ్రులు, నూతన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. అందరిదీ ఒకే మాట. మూడేళ్ళ క్రితం వరకు వారికి కేసేఆర్ లో ఒక విలన్ కనబడ్డాడు. ఇప్పుడు ఒక హీరో కనబడుతున్నాడు.
ఈ ముచ్చట్లు అలా సాగుతున్నప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. ‘మధ్యాన్నం మూడు గంటలకు కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్. రెండున్నర కల్లా వచ్చేయండి’ అని పిలుపు.
కానీ,  జరుగుతోంది  మా (అన్నయ్య) మనుమడి పెళ్లి.  కాకపొతే తప్పకుండా వెళ్ళే వాడినేమో!
వెడితే పాత మిత్రులు కొందరు కలిసే అవకాశం కూడా దొరికేది. అలాగే కాస్త దూరం నుంచి అయినా కేసీఆర్ ని చూసే సావకాశం కూడా.
అయినా ఇప్పుడు రాయడానికి ఒక చిన్నదో పెద్దదో పేపరు, వార్త చెప్పడానికి రేడియో నా వెనుక లేవు, ఏదో ఫేస్  బుక్ లో నా ఇష్టం వచ్చింది రాసుకునే వీలుతప్ప.       

వెళ్లేందుకు సంక్షేపించడానికి బహుశా ఇదీ ఒక కారణం కావచ్చు.