28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 98 ) : భండారు శ్రీనివాసరావు

 

ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం.
ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిపై ఒకనాడు నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదీ ఎప్పుడు? దాదాపు పుష్కర కాలం క్రితం. అదీ ఎక్కడా? తిరుమల కొండపై అర్ధరాత్రి సమయంలో. ఎవరూ దీనికి సాక్షి? సాక్షాత్తు మా ఆవిడ నిర్మల.
ఎంత కోపం వచ్చింది అంటే పట్టరానంత, చెప్పలేనంత. శిఖరసమానుడైన ఆయన ముందు నేనో పిపీలికాన్ని. ఆ సంగతి తెలుసు. అయినా కోపం వచ్చింది.
చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ రుక్మిణమ్మ గారు ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది వెళ్ళగక్కాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు.
కోపం వచ్చినప్పుడు అవతల మనిషి ఎవరు? ఎంత గొప్పవాడు అన్నది ఆలోచించే విచక్షణ వుండదు. అది వుంటే కోపమే రాదు కదా!
ఇంతకీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి మీద నాకు కోపం ఎందుకు వచ్చిందో చెప్పే ముందు, ఆయన్ని గారి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పాలి. చెడ్డ ముక్కలు చెప్పడానికి కడిగి గాలించినా ఏమీ దొరకదు. అంతటి పరిశుద్ధుడు ఆయన.
నాకు బాగా పరిచయం వున్న సీనియర్ అధికారుల్లో ఎల్.వీ. సుబ్రహ్మణ్యం గారొకరు. ఆయన నోటి వెంట పరుషమైన మాట రావడం నేను వినలేదు. మృదుస్వభావి. నిబంధనలు అనుకూలంగా వుంటే చేతనైన మాట సాయం చేసే సహృదయులు.
ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం గారు స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో నేను హైదరాబాదు ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా వున్నాను. ఒకనాడు మా కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మా క్లబ్ సభ్యుల కోసం మీ సంస్థ నుంచి టేబుల్ టెన్నిస్ పరికరాలను విరాళంగా ఇవ్వడానికి వీలుపడుతుందా అని అడిగాను. దానికి జవాబుగా ఆయన ‘అక్కడ (క్లబ్ లో) మీరు ఎంతసేపు వుంటారు’ అని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి ఎవరినైనా పంపిస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయన ఉద్దేశ్యం వేరు. మేము అడిగినవన్నీ, మా మీటింగ్ పూర్తయ్యేలోగా పంపాలని అనుకున్నట్టున్నారు. అలాగే అదే రోజు పంపారు కూడా.
మరి అలాంటి మనిషిపై కోపం ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆయన పాదాలపై పడాలని అనుకోవడం ఎందుకు? ఏమిటీ విరోధాభాస ?
నిన్న రాత్రి నా హితైషి ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారి నెంబరు అడిగారు. అడగకుండానే కారణం చెప్పారు. టీవీ ఇంటర్వ్యూ నో, వెబ్ ఛానల్ ఇంటర్యూనో తెలియదు యూ ట్యూబ్ లో చూశారట. అది చూసిన తర్వాత ఆయన దృష్టిలో సుబ్రహ్మణ్యం గారు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన విశ్వరూపం సైజుకు ఎదిగారట. దానికి కారణం కూడా కృష్ణారావు గారే ఆ ఇంటర్వ్యూలో విన్న విశేషాల రూపంలో చెప్పారు.
ఇటీవలనే, అంటే తిరుమలలో తొక్కిసలాట జరిగిన తర్వాత, సుబ్రహ్మణ్యం గారు తన స్నేహితుడితో కలిసి తిరుపతి వెళ్ళారు. ఒకప్పుడు టీటీడీకి సర్వాధికారిగా పనిచేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఆయనకు సకల లాంఛనాలతో దైవ దర్శనం లభించి వుంటుంది. కానీ ఆయన ఎల్వీ సుబ్రహ్మణ్యం. నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. అందుకే కధ వేరే విధంగా నడిచింది.
టీటీడీలో ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ క్యూలో ప్రవేశించారు. లోపల కాలక్షేపానికి ఇద్దరూ కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు దగ్గర ఉంచుకున్నారు. మిగిలిన భక్తులు అందరితో పాటు కంపార్టు మెంట్లలో వెయిట్ చేస్తూ, దేవస్థానం వారు అందించే అన్న ప్రసాదాలు తింటూ, ఇచ్చిన పాలు తాగుతూ సుమారు పన్నెండు గంటలకు పైగా గడిపి, సామాన్య భక్తుల మాదిరిగానే జయవిజయుల దగ్గర నుంచే స్వామి దర్శనం చేసుకుని, ప్రసాదం స్వీకరించి వచ్చినట్టు ఆ ఇంటర్వ్యూలో ఎల్వీ గారు మాటవరసకు వెల్లడించిన ఈ విషయాలు తనకు దిగ్భ్రాంతి కలిగించాయని కృష్ణారావు గారు చెప్పారు. కాకపోతే, క్యూ కాంప్లెక్స్ లో టాయిలెట్ల పరిస్థితి ఇంకా మెరుగు పరచాల్సిన అవసరం వున్నట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు రాజాజీ రామాయణంలోని ఒక ఘట్టం గుర్తుకు వచ్చిందన్నారు. అంత్య సమయంలో రావణ బ్రహ్మ, రాజు అనేవారు ఎలా పరిపాలించాలో ఆ ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ, ‘మంచి అనుకున్న పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయాల’ని చెబుతాడు. లంక చుట్టూ వున్న ఉప్పు సముద్రాన్ని పాల సముద్రంగా మార్చాలనే కోరిక రావణాసురుడికి వుండేదట. అటువంటి మంచి పనులు చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడు అయివుండి కూడా చేయలేక పోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతారు. క్యూ కాంప్లెక్స్ టాయిలెట్లే కాదు, ఏ మార్పు చేయలన్నా చేయగలిగే అధికారం ఉన్న పదవిని రెండేళ్ల పైచిలుకు నిర్వహించిన తాను కూడా ఎన్నో చేయాలని అనుకున్నప్పటికీ, అన్నీ చేయలేకపోయాను అని ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారట.
ఇది విన్న తర్వాత సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం చేయాలని ఎవరికి అనిపించదు? నాకూ అలానే అనిపించింది.
ఇక నా కోపం సంగతి.
2012 లో కాబోలు, ప్రెస్ అకాడమి వాళ్ళు వయోధిక పాత్రికేయులను కొందర్ని తిరుపతి తీసుకువెళ్ళారు. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సదస్సు కోసం. శ్రీయుతులు వరదాచారి గారు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ శ్రీనివాసన్ గారు, మాఢభూషి శ్రీధర్ గారు ఇలా కొంతమందిమి ఆ బృందంలో వున్నాము. వెడుతున్నది తిరుమల పుణ్యక్షేత్రం కాబట్టి, తోడుగా భార్యను వెంట తీసుకువెళ్ళే వెసులుబాటు కల్పించారు. మొత్తం ఇరవై మందికి పైగా వున్నాము.
వెళ్ళిన పని పూర్తి చేసుకున్న తరువాత దర్శనం కోసం కొండపైకి వెళ్ళాము. ప్రెస్ అకాడమి చైర్మన్, ఈవో, టీటీడీ చైర్మన్ బాపిరాజులకు ఒక్కొక్కరికి ఆరుగురికి చొప్పున మాత్రమే స్పెషల్ దర్శనం ఇప్పించగల వీలుంది. ఇద్దరో ముగ్గురో మిగిలిపోయారు. అప్పుడు వున్న ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి వారికి కూడా దర్శనం ఇప్పిస్తే ఆయన్ని అడిగేవారు లేరు. కానీ ఆయన అలాంటి వాడయితే ఇంత ఘనంగా రాయాల్సిన అవసరం పడేది కాదు. ఎంత మృదుస్వభావో, అంతటి నిక్కచ్చి మనిషి. మొత్తం మీద బాపిరాజు గారు ఎవరికీ చెప్పారో ఏమిటో తెలియదు. అందరికి చక్కటి దర్శన భాగ్యం కలిగింది.
అసలు కధ ఇక్కడే మొదలైంది. ఆడవారికి తిరుపతిలో రెండో దర్శనం లేకుండా తిరిగి వస్తే తృప్తిగా వుండదు. అదే కోరిక మా ఆవిడ వ్యక్తపరచింది. వెంట వచ్చిన బృందం యావత్తు కిందికి వెళ్ళిపోయింది. అక్కడి పీఆర్వో, రంగారావు గారు అనుకుంటా, మరో దర్శనం ఏర్పాటు చేశారు. కొంచెం ఇబ్బందిగానే జరిగినా, రెండో దర్శనం చేసుకుని బయటకి వచ్చేసరికి బాగా పొద్దు పోయింది. కిందికి ఏ వాహనాలను ఆ సమయంలో అనుమతించరట. దాంతో ఎలాంటి వసతి, భోజన ఏర్పాట్లు లేకుండా కొండ మీద ఇరుక్కుపోయాము.
ఎల్వీ గారికి, బాపిరాజు గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఆఫీసులో కూడా అదే పరిస్థితి. చాలా పొద్దు పోయిన తర్వాత ఎల్వీ గారు ఫోన్ చేశారు. అప్పటికప్పుడు వసతి ఏర్పాటు చేయడం కుదరదని నిష్కర్షగానే చెప్పారు. నాతో నా భార్య కూడా వుందని, ఈ అర్ధరాత్రి తిరుమలలో ఎలా వుండాలని అని అడిగిన తర్వాత మెత్తపడి, తన ఆఫీసులో వున్న గదిలో ఈ రాత్రికి పడుకోమని మమ్మల్ని అక్కడికి పంపించారు. ఆ రాత్రి వేళ ఏమీ దొరకవని అక్కడ ఉన్న మనిషి ఎవరో పుణ్యాత్ముడు, నాలుగు అరటి పండ్లు ఇచ్చాడు. అవి తిని పడుకుని తెలతెలవారకమునుపే కొండదిగి వచ్చాము. అప్పుడు సుబ్రహ్మణ్యం గారి మీద నాకు వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. ఇంత తెలిసిన మనిషి, అన్ని అధికారాలు చేతిలో ఉంచుకుని ఇసుమంత సాయం చేయలేదే అన్నదే ఆ కోపం.
ఒకానొక కాలంలో తిరుమలలో సర్వాధికారాలు కలిగిన అదే వ్యక్తి, రిటైర్ అయిన తర్వాత తన మిత్రుడితో కలిసి సామాన్య భక్తుడి మాదిరిగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చిన సంగతి కృష్ణారావు గారి ద్వారా తెలిసి ఆయన మీద నాకున్న గౌరవాభిమానాలు వేలరెట్లు పెరిగాయి. అప్పటివరకు లోలోపల గూడుకట్టి వున్న కోపం మంచులా కరిగిపోయింది. ఇంతటి ఉదాత్తమైన మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనే అంతర్మధనం మొదలయింది. ఆ నాటి నా ప్రవర్తనకు నిష్కృతి లభించాలి అంటే మిగిలిన దారి ఒక్కటే.
అందుకే సుబ్రహ్మణ్యం గారూ! స్వీకరించండి నా పాదాభివందనం.
(ఆ ఇంటర్వ్యూ లింక్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు)
కింది ఫోటోలు:
హైదరాబాదు మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు, ఆనాటి మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారితో నేను
(ఇంకా వుంది)
Like
Comment
Send

27, ఫిబ్రవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (97) – భండారు శ్రీనివాసరావు

 వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ

 

కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడ నుంచి  రేడియోలో వార్తలు చదివినవారు.  తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వాళ్ళు. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో కలిసి  బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని విన్నాను. ప్రయాగ భార్య  నిర్మల గారు మంచి రచయిత్రి.  ప్రయాగ ఎంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. చక్కటి సుబోధకమైన ఆధ్యాత్మిక రచనలు  చేస్తుంటాడు. అది ఇంకా మంచి విషయం.

పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగా వెళ్ళి ఆ రోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న నేను చదివిన వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.

 

సుస్వరం, వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష,  అసాధారణ ధారణ శక్తి ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా మంచి పేరు సంపాదించుకోవడానికి పనికొచ్చాయి.

కార్యక్రమాల ప్రసారం విషయంలో ఒక్క ఆలిండియా రేడియోలోనే సమయపాలన అనేది పాటిస్తూ రావడం దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఒక మంచి సాంప్రదాయం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్సన్ లో కూడా ఈ విధానం లేదు. అందుకే రేడియో టైం ని బట్టి ప్రజలు తమ గడియారాల్లో టైం సరిచేసుకోవడం ఆనవాయితీ. ఢిల్లీ నుంచి మొదలు పెట్టి కన్యాకుమారి వరకు అన్ని రేడియో కేంద్రాల్లో వార్తల  ప్రసారం ఒక క్రమపద్ధతి ప్రకారం ఒకే సమయానికి మొదలవుతుంది, ఒకే సమయానికి ముగుస్తుంది. పావు నిమిషం కూడా తేడా రాదు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే:    

బెజవాడ న్యూస్ యూనిట్ లో ప్రాంతీయ వార్తల  బులెటిన్ మొత్తం తెలుగులోనే తయారు అవుతుంది. హైదరాబాదులో అలా కాదు. ఉర్దూ బులెటిన్ కూడా వుంది కాబట్టి  మెయిన్ బులెటిన్ ఇంగ్లీష్ లో తయారు చేసి తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లకు చెరొక కాపీ ఇస్తే, ఎవరి భాషలో వాళ్ళు అనువాదం చేసుకునేవాళ్ళు. పైగా ఎడిటర్లకు  మరో సులువు ఏమిటంటే,  ఇంగ్లీష్ టైపులో వంద వాక్యాలు వుంటే,  వాటిని తెలుగులోకి అనువాదం చేసుకుంటే పది నిమిషాలు వార్తలు చదవడానికి సరిగ్గా  సరిపోతాయి అనే ఒక అంచనా వుండేది. అంచేత  స్టెనోకి డిక్టేట్ చేసేటప్పుడే ఆ వార్త ఎన్ని వాక్యాలు వచ్చిందో ఎడిటర్ కి ముందే తెలుస్తుంది. ఆ పద్దతి విజయవాడలో లేదు కాబట్టి, వార్తలను తెలుగులో రాసి ఇస్తాము కాబట్టి, ఒక్కోసారి బులెటిన్ నిడివి  అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకు వెళ్ళి అందించేలోగానే,  రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సమయాన్ని సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏ ఏ క్షేత్రాలలో, ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ తాను అక్కడే వుండి చూసి చెబుతున్నట్టుగా,  అనర్ఘళంగా, ఆశువుగా  చెప్పేవాడు. ప్రయాగ గురించి నేను ముందు చెప్పిన  విశేషణాలు, సుస్వరం, వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష,  అసాధారణ ధారణ శక్తి ఇవన్నీ అలాంటి సమయాల్లో అతడికి, మాకూ కూడా  అక్కరకు వచ్చేవి. వినే శ్రోతలకు సయితం అతడు అలా ఆశువుగా చదువుతున్నాడు అనే భావన కలిగేది కాదు.

బెజవాడనుంచి మరో న్యూస్ రీడర్ కొప్పుల సుబ్బారావు.

మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారు కాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి, అందుకు అనువుగా సమయం సర్దుబాటు చేసుకుంటూ   వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు.

ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావులది మంచి జోడీ. రేడియోలో చేరకముందు నుంచి కూడా స్నేహితులు. వీరిద్దరికీ రేడియో స్టేషన్ దేవాలయం. వార్తలు చదివే స్టూడియో గర్భగుడి. అందులోకి ప్రవేశించే ముందు కాలి జోళ్లు బయటే వదిలి లోపలకు వెళ్ళేవాళ్ళు. ఎదురుగా వున్న మైక్రోఫోన్ కి  రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టి వార్తలు చదవడం మొదలుపెట్టేవాళ్ళు.  రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఇద్దరి పేర్లూ జనం గుర్తు పెట్టుకుంటున్నారు అంటే ఈ నిబద్ధతే ప్రధాన కారణం.

తలలో నాలుక’ అంటే సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నకొద్దీ, అంతకు ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే, మరో విభాగంలో ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే, డబ్బింగులో సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.

కొప్పుల సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

‘విజయవాడలో దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియోలో అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’

పదమూడేళ్ల కిందటి ఆ రోజు నాకు బాగా గుర్తుంది.    

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వచ్చిన ఆ స్వరం 2012 జులై ఐదో తేదీ రాత్రి  శాశ్వతంగా మూగబోయింది.

విజయవాడ కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వతమై, చకచకా మెట్లెక్కి,  పైమెట్టు చేరుకున్న తరువాత కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే వుండేవాడేమో.

తను పనిచేసేది విజయవాడలో. నేనేమో  హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు. అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.  

హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు. పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.

అదేమిటో ఆ రోజు అంటే 2012 జులై ఐదో తేదీన హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవలేదు.

ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.

నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.

ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.

అతడు రాలేడు.  నేనే వెళ్ళాలి.

కింది ఫోటోలు:

ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు








(ఇంకా వుంది)

26, ఫిబ్రవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (96) – భండారు శ్రీనివాసరావు

 

ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”

ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.

ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను, అవసరాలను  ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని, ఢిల్లీ లో చాలా కాలం వున్న ప్రముఖ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.

ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు అనువదించె/ చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.

1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో ఎవరో సూటూ బూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.

వెంకట్రామయ్య గారు ఆయన్ని నాకు పరిచయం చేశారు.  ఆయనే ఏడిద గోపాలరావుని అప్పుడు తెలిసింది.  వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.

నాకంటే ముందు మాస్కోలో, రేడియో మాస్కోలో చాలా కాలం పనిచేశారు. మాస్కోలో కూడా ఆయన వదిలివెళ్ళిన ముద్ర సామాన్యమైనది కాదు. సాంస్కృతిక పరమైన గోష్టులకు, సమావేశాలకు ఆయన నివాసం ఒక కేంద్రంగా వుండేదని చెప్పుకునేవారు. ముందే చెప్పినట్టు  ఏడిద గోపాల రావు గారు తన పరిధిని కేవలం ఉద్యోగానికి పరిమితం చేసుకోలేదు. ఆ పరిధిని దాటి కార్యకలాపాలను విస్తరించుకోవడం ఆయన నైజం. 'సరస నవరస' అనే నాటక, సాంస్కృతిక సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలు పోషించారు. వందకు పైగా నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ నాటక అకాడమీ గౌరవ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 'ధియేటర్ ఆర్ట్స్‌'లో డిప్లొమా పొందారు.


రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. రవీంద్ర భారతిలో  పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.

రేడియో వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో 2020 లో  కన్నుమూశారు.

కింది ఫోటో

ఏడిద గోపాల రావు



(ఇంకా వుంది)

25, ఫిబ్రవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (95) – భండారు శ్రీనివాసరావు

 

రేడియో సంగతులు రాస్తున్నారు మరి విజయవాడ రేడియో సంగతి ఏమిటి అని అడిగారు రేడియో అభిమాని కప్పగంతు శివరామ ప్రసాద్  గారు. మూడు దశాబ్దాల ఉద్యోగ పర్వంలో నేనెప్పుడు విజయవాడ ఆకాశవాణిలో పనిచేయలేదు. అక్కడి కళాకారులతో వ్యక్తిగత పరిచయాలు తక్కువ. ఏమైనా రాసినా, వారినీ వీరినీ అడిగి రాయాల్సిందే.

అలా అని నాకు విజయవాడ రేడియో ప్రాంగణంతో అసలు పరిచయం లేదని కాదు. అక్కడ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు నాకు మంచి స్నేహితులు. ఎప్పుడైనా ఆయన సెలవుపై వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుంచి వెళ్లి తాత్కాలికంగా ఉదయపు ప్రాంతీయ వార్తల ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండేవాడిని. వారం అనుకుని వెళ్ళిన వాడిని ఒక్కోసారి వారాల తరబడి అక్కడే వుండిపోయే వాడిని. ఢిల్లీ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా  టియ్యే డియ్యేలు క్లెయిం చేసే అలవాటు నాకు లేదు. ఆ అవసరం పడేది కాదు.  ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ వాహనాలే. తీసుకువెళ్ళిన బ్యాంకుల వాళ్ళో, లేక ప్రభుత్వ సంస్థల వాళ్ళో బస, భోజనం ఏర్పాట్లు చూసేవాళ్ళు. అలాగే,  డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్ళినప్పుడుగాంధీ నగరంలోని  మా ఏడో అక్కయ్య భారతి ఇంట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలుఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.

పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే ఆమె లేచి స్నానం చేసి, ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి ,నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.

 బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.

ఇక బెజవాడ రేడియో గురించి కన్నవి, విన్నవితోపాటు  సేకరించిన విశేషాలు కొన్ని.

ఆకాశవాణి, విజయవాడ కేంద్రం’
ఒకానొక కాలంలో ప్రాభాత వేళలో ఈ పదాలే  జనపదాలకు మేలుకొలుపు పిలుపులు.
అలాంటి విజయవాడ రేడియోకి ఇప్పుడు డెబ్బయ్ ఏడేళ్లు. అంటే నాకంటే వయసులో రెండేళ్లు చిన్నదే.
బందరు రోడ్డు, పున్నమ్మతోటలో ఉన్న విజయవాడ రేడియో కేంద్రం గురించి తెలియనివాళ్ళు, వినని వాళ్ళు ఆంధ్రప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీత సాహిత్యాలలో ఘనాపాటీలు, దిగ్గనాధీరులైన అనేకమంది  ప్రముఖులు ఈ కేంద్రం ద్వారా తమ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన వాళ్ళే.
ఈ కేంద్రం పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు. 
“1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసి వుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి) రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక హైదరాబాదులో డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి  హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
శ్రీ సుధాకర్ మొదునూడికి ( sudhakar modunudi) విజయవాడ ఆకాశవాణితో  బాల్యం నుంచి అనుబంధం. పన్నెండేళ్ల వయసులో 'బొమ్మరిల్లు' లో 'బాలల సంగీతసభ' లో పదిహేను రూపాయల కాంట్రాక్టుకు పాడిన రోజునుండి  ఒక సంగీత ప్రయోక్తగా అదే కేంద్రంలో పనిచేసేవరకు బెజవాడ రేడియోలో ఆయన ప్రస్థానం సాగింది. ఆ అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే.
నాచిన్నతనంలోని పాత రేడియో స్టేషను జ్ఞాపకాలు ఎన్నటికీ మరపున పడవు. ఆ ప్రాంగణాన్ని (ప్రస్తుతం అక్కడ దూరదర్శన్ కేంద్రం వుంది) సమీపించగానే ఏదో లోకంలోకి అడుగిడినట్లు ఉండేది. పెద్ద పెద్ద చెట్లమధ్య, పైకి పెంకుటిల్లులా కనిపించేది. ఇరువైపులా దారిపొడుగునా ద్వారం వరకూ పూలకుండీలు వరుసగా పేర్చి ఉండేవి. వాటిలోని బంతిపూలు పరిమళాలు వెదజల్లేవి. నిలయ కళాకారులందరూ తెల్లటి జుబ్బా, పంచెకట్టి, ఒకరితో మరొకరు చతురోక్తులాడుకుంటూ దర్శనమిచ్చేవారు. నాటకాల రిహార్సల్సూ, దేశభక్తి గీతాల సాధనలూ, ఇవన్నీ విశాలమైన ప్రాంగణంలోని చెట్లక్రిందేగుంపులు గుంపులుగా కూర్చొని కొనసాగించేవారు. మేడపైకి చెక్కమెట్లు. పైన ఆఫీసు గదులు.
ఇక లోపలికి అడుగిడగానే పెద్దహాలు, మధ్యలో అద్దాల పెట్టెలో కొత్తగా కట్టబోతున్న (ప్రస్తుత) రేడియో స్టేషన్ భవంతి నమూనా, దానిపై అందంగా అమర్చిన పూల గుత్తుల పింగాణీ జాడీ, ఎదురుగా మూడు స్టూడియోలు, ఒకటి సంగీతానికి, రెండవది నాటకాలకు, మూడవది ప్రసంగాలకు.

లోపల కార్యక్రమం ప్రసారమౌతున్నదని హెచ్చరిస్తూ తలుపులకు పైన వెలిగే ఎర్రలైట్లు. చేతిలో కాగితాలు పట్టుకుని, హడావుడిగా అటూ ఇటూ నడిచే అనౌన్సర్లు.  ఒకమూల స్పీకరునుండి మంద్ర గంభీరంగా వినిపించే ప్రత్యక్ష ప్రసారం.  పై కప్పున చిన్న శబ్దంతో అలుపెరుగక తిరిగే పంకాలు. తెల్లటి గోడలకు శబ్ద నియంత్రణ రంధ్రాలు. గది గోడలకానుకొని రెండువైపులా సోఫాలు. వాటిలో కాలుమీద కాలేసుకొని దర్శనమిచ్చే లబ్ధప్రతిష్టులు.
ఆనాడు నేననుకునేవాణ్ని,  ఏనాటికైనా ఉద్యోగమంటూ చేస్తే ఇక్కడే చేయాలి'.అని. దేవుడు ఆనాడే 'తథాస్తు' అంటూ దీవించాడేమో.  దశాబ్దాలుగా అక్కడే  పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించే భాగ్యం నాకు కలిగింది.”


ప్రముఖ వైణికుడు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ విజయవాడ రేడియోను తన మాతృసంస్థగా భావించి గౌరవిస్తానని ఆ కేంద్రంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరు ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.  శ్యామసుందర్ నాన్నగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు మొదట మద్రాసు రేడియో కేంద్రంలోనూ, తరువాత విజయవాడ కేంద్ర ఆవిర్భావం నుంచి 1973  వరకు వీణా వాద్యం వాయించేవారు. తరువాత రేడియోలో పనిచేసే అదృష్టం తనను కూడా వరించిందని, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 1965లో మొదలు పెట్టి 2005 దాకా వాయిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి టాప్ గ్రేడ్ విద్వాన్ గా వీణా వాద్యం వినిపిస్తున్నానని శ్యామసుందర్  చెప్పారు. రేడియోతో ఈ కుటుంబం సంబంధం అక్కడితో ఆగలేదు. ఆయన చెల్లెలు పరిటి  రాజేశ్వరి సైతం రేడియోలో ఏ గ్రేడ్ వైణికురాలు. ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో స్థిరపడి అక్కడ కూడా సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. శ్యామసుందర్  భార్య శ్రీమతి జయలక్ష్మి, ఆయన సోదరుడు సత్యప్రసాద్ కూడా రేడియో సంగీత కళాకారులే. పొతే, వారి బావమరది శ్రీ పప్పు చంద్ర శేఖర్ కూడా విజయవాడ రేడియో నుంచే తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. వారి మామగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు కూడా 1948 నుండి విజయవాడ కేంద్రంలో వైణిక విద్వాంసుడిగా సేవలు అందించారు. అంటే, తమలోని సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి ఒక కుటుంబం యావన్మందికీ,  విజయవాడ రేడియో కేంద్రం  ఆశ్రయం కల్పించిందన్న మాట.

కింది ఫోటో చాలా అపూర్వమైనది.
విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసిన మహామహులందరు ఇందులో కానవస్తారు. ఆకాశ‌వాణిలో దిగ్దంతులైన క‌ళాకారులు వీరు. ఆకాశవాణి కళాకారులు శ్రీ కందుకూరి రామభద్రరావు,, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల పదవీ విరమణను పురస్కరించుకుని జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా తీసిన ఫోటో ఇది. అంద‌రివీ కాక‌పోయినా 99 శాతం మంది పేర్లు లభించాయి.  (Photo Courtesy : Senior Journalist: Shri KVS Subramanyam)

ఫోటోలోని మహనీయుల వివ‌రాలు:
ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని
కూచున్నవారు: శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు.
కూర్చున్నవారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపు గోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడి రామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి, సి.రామమోహన రావు,జి.ఎం.రాధాకృష్ణ, సితార్ కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వర రావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం, ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,.చివరివారు వై.సత్యనారాయణ


 






ఇంకా వుంది)