ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం.
ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిపై ఒకనాడు నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదీ ఎప్పుడు? దాదాపు పుష్కర కాలం క్రితం. అదీ ఎక్కడా? తిరుమల కొండపై అర్ధరాత్రి సమయంలో. ఎవరూ దీనికి సాక్షి? సాక్షాత్తు మా ఆవిడ నిర్మల.
చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ రుక్మిణమ్మ గారు ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది వెళ్ళగక్కాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు.
కోపం వచ్చినప్పుడు అవతల మనిషి ఎవరు? ఎంత గొప్పవాడు అన్నది ఆలోచించే విచక్షణ వుండదు. అది వుంటే కోపమే రాదు కదా!
ఇంతకీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి మీద నాకు కోపం ఎందుకు వచ్చిందో చెప్పే ముందు, ఆయన్ని గారి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పాలి. చెడ్డ ముక్కలు చెప్పడానికి కడిగి గాలించినా ఏమీ దొరకదు. అంతటి పరిశుద్ధుడు ఆయన.
నాకు బాగా పరిచయం వున్న సీనియర్ అధికారుల్లో ఎల్.వీ. సుబ్రహ్మణ్యం గారొకరు. ఆయన నోటి వెంట పరుషమైన మాట రావడం నేను వినలేదు. మృదుస్వభావి. నిబంధనలు అనుకూలంగా వుంటే చేతనైన మాట సాయం చేసే సహృదయులు.
ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం గారు స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో నేను హైదరాబాదు ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా వున్నాను. ఒకనాడు మా కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మా క్లబ్ సభ్యుల కోసం మీ సంస్థ నుంచి టేబుల్ టెన్నిస్ పరికరాలను విరాళంగా ఇవ్వడానికి వీలుపడుతుందా అని అడిగాను. దానికి జవాబుగా ఆయన ‘అక్కడ (క్లబ్ లో) మీరు ఎంతసేపు వుంటారు’ అని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి ఎవరినైనా పంపిస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయన ఉద్దేశ్యం వేరు. మేము అడిగినవన్నీ, మా మీటింగ్ పూర్తయ్యేలోగా పంపాలని అనుకున్నట్టున్నారు. అలాగే అదే రోజు పంపారు కూడా.
మరి అలాంటి మనిషిపై కోపం ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆయన పాదాలపై పడాలని అనుకోవడం ఎందుకు? ఏమిటీ విరోధాభాస ?
నిన్న రాత్రి నా హితైషి ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారి నెంబరు అడిగారు. అడగకుండానే కారణం చెప్పారు. టీవీ ఇంటర్వ్యూ నో, వెబ్ ఛానల్ ఇంటర్యూనో తెలియదు యూ ట్యూబ్ లో చూశారట. అది చూసిన తర్వాత ఆయన దృష్టిలో సుబ్రహ్మణ్యం గారు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన విశ్వరూపం సైజుకు ఎదిగారట. దానికి కారణం కూడా కృష్ణారావు గారే ఆ ఇంటర్వ్యూలో విన్న విశేషాల రూపంలో చెప్పారు.
ఇటీవలనే, అంటే తిరుమలలో తొక్కిసలాట జరిగిన తర్వాత, సుబ్రహ్మణ్యం గారు తన స్నేహితుడితో కలిసి తిరుపతి వెళ్ళారు. ఒకప్పుడు టీటీడీకి సర్వాధికారిగా పనిచేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఆయనకు సకల లాంఛనాలతో దైవ దర్శనం లభించి వుంటుంది. కానీ ఆయన ఎల్వీ సుబ్రహ్మణ్యం. నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. అందుకే కధ వేరే విధంగా నడిచింది.
టీటీడీలో ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ క్యూలో ప్రవేశించారు. లోపల కాలక్షేపానికి ఇద్దరూ కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు దగ్గర ఉంచుకున్నారు. మిగిలిన భక్తులు అందరితో పాటు కంపార్టు మెంట్లలో వెయిట్ చేస్తూ, దేవస్థానం వారు అందించే అన్న ప్రసాదాలు తింటూ, ఇచ్చిన పాలు తాగుతూ సుమారు పన్నెండు గంటలకు పైగా గడిపి, సామాన్య భక్తుల మాదిరిగానే జయవిజయుల దగ్గర నుంచే స్వామి దర్శనం చేసుకుని, ప్రసాదం స్వీకరించి వచ్చినట్టు ఆ ఇంటర్వ్యూలో ఎల్వీ గారు మాటవరసకు వెల్లడించిన ఈ విషయాలు తనకు దిగ్భ్రాంతి కలిగించాయని కృష్ణారావు గారు చెప్పారు. కాకపోతే, క్యూ కాంప్లెక్స్ లో టాయిలెట్ల పరిస్థితి ఇంకా మెరుగు పరచాల్సిన అవసరం వున్నట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు రాజాజీ రామాయణంలోని ఒక ఘట్టం గుర్తుకు వచ్చిందన్నారు. అంత్య సమయంలో రావణ బ్రహ్మ, రాజు అనేవారు ఎలా పరిపాలించాలో ఆ ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ, ‘మంచి అనుకున్న పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయాల’ని చెబుతాడు. లంక చుట్టూ వున్న ఉప్పు సముద్రాన్ని పాల సముద్రంగా మార్చాలనే కోరిక రావణాసురుడికి వుండేదట. అటువంటి మంచి పనులు చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడు అయివుండి కూడా చేయలేక పోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతారు. క్యూ కాంప్లెక్స్ టాయిలెట్లే కాదు, ఏ మార్పు చేయలన్నా చేయగలిగే అధికారం ఉన్న పదవిని రెండేళ్ల పైచిలుకు నిర్వహించిన తాను కూడా ఎన్నో చేయాలని అనుకున్నప్పటికీ, అన్నీ చేయలేకపోయాను అని ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారట.
ఇది విన్న తర్వాత సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం చేయాలని ఎవరికి అనిపించదు? నాకూ అలానే అనిపించింది.
ఇక నా కోపం సంగతి.
2012 లో కాబోలు, ప్రెస్ అకాడమి వాళ్ళు వయోధిక పాత్రికేయులను కొందర్ని తిరుపతి తీసుకువెళ్ళారు. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సదస్సు కోసం. శ్రీయుతులు వరదాచారి గారు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ శ్రీనివాసన్ గారు, మాఢభూషి శ్రీధర్ గారు ఇలా కొంతమందిమి ఆ బృందంలో వున్నాము. వెడుతున్నది తిరుమల పుణ్యక్షేత్రం కాబట్టి, తోడుగా భార్యను వెంట తీసుకువెళ్ళే వెసులుబాటు కల్పించారు. మొత్తం ఇరవై మందికి పైగా వున్నాము.
వెళ్ళిన పని పూర్తి చేసుకున్న తరువాత దర్శనం కోసం కొండపైకి వెళ్ళాము. ప్రెస్ అకాడమి చైర్మన్, ఈవో, టీటీడీ చైర్మన్ బాపిరాజులకు ఒక్కొక్కరికి ఆరుగురికి చొప్పున మాత్రమే స్పెషల్ దర్శనం ఇప్పించగల వీలుంది. ఇద్దరో ముగ్గురో మిగిలిపోయారు. అప్పుడు వున్న ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి వారికి కూడా దర్శనం ఇప్పిస్తే ఆయన్ని అడిగేవారు లేరు. కానీ ఆయన అలాంటి వాడయితే ఇంత ఘనంగా రాయాల్సిన అవసరం పడేది కాదు. ఎంత మృదుస్వభావో, అంతటి నిక్కచ్చి మనిషి. మొత్తం మీద బాపిరాజు గారు ఎవరికీ చెప్పారో ఏమిటో తెలియదు. అందరికి చక్కటి దర్శన భాగ్యం కలిగింది.
అసలు కధ ఇక్కడే మొదలైంది. ఆడవారికి తిరుపతిలో రెండో దర్శనం లేకుండా తిరిగి వస్తే తృప్తిగా వుండదు. అదే కోరిక మా ఆవిడ వ్యక్తపరచింది. వెంట వచ్చిన బృందం యావత్తు కిందికి వెళ్ళిపోయింది. అక్కడి పీఆర్వో, రంగారావు గారు అనుకుంటా, మరో దర్శనం ఏర్పాటు చేశారు. కొంచెం ఇబ్బందిగానే జరిగినా, రెండో దర్శనం చేసుకుని బయటకి వచ్చేసరికి బాగా పొద్దు పోయింది. కిందికి ఏ వాహనాలను ఆ సమయంలో అనుమతించరట. దాంతో ఎలాంటి వసతి, భోజన ఏర్పాట్లు లేకుండా కొండ మీద ఇరుక్కుపోయాము.
ఎల్వీ గారికి, బాపిరాజు గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఆఫీసులో కూడా అదే పరిస్థితి. చాలా పొద్దు పోయిన తర్వాత ఎల్వీ గారు ఫోన్ చేశారు. అప్పటికప్పుడు వసతి ఏర్పాటు చేయడం కుదరదని నిష్కర్షగానే చెప్పారు. నాతో నా భార్య కూడా వుందని, ఈ అర్ధరాత్రి తిరుమలలో ఎలా వుండాలని అని అడిగిన తర్వాత మెత్తపడి, తన ఆఫీసులో వున్న గదిలో ఈ రాత్రికి పడుకోమని మమ్మల్ని అక్కడికి పంపించారు. ఆ రాత్రి వేళ ఏమీ దొరకవని అక్కడ ఉన్న మనిషి ఎవరో పుణ్యాత్ముడు, నాలుగు అరటి పండ్లు ఇచ్చాడు. అవి తిని పడుకుని తెలతెలవారకమునుపే కొండదిగి వచ్చాము. అప్పుడు సుబ్రహ్మణ్యం గారి మీద నాకు వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. ఇంత తెలిసిన మనిషి, అన్ని అధికారాలు చేతిలో ఉంచుకుని ఇసుమంత సాయం చేయలేదే అన్నదే ఆ కోపం.
ఒకానొక కాలంలో తిరుమలలో సర్వాధికారాలు కలిగిన అదే వ్యక్తి, రిటైర్ అయిన తర్వాత తన మిత్రుడితో కలిసి సామాన్య భక్తుడి మాదిరిగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చిన సంగతి కృష్ణారావు గారి ద్వారా తెలిసి ఆయన మీద నాకున్న గౌరవాభిమానాలు వేలరెట్లు పెరిగాయి. అప్పటివరకు లోలోపల గూడుకట్టి వున్న కోపం మంచులా కరిగిపోయింది. ఇంతటి ఉదాత్తమైన మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనే అంతర్మధనం మొదలయింది. ఆ నాటి నా ప్రవర్తనకు నిష్కృతి లభించాలి అంటే మిగిలిన దారి ఒక్కటే.
అందుకే సుబ్రహ్మణ్యం గారూ! స్వీకరించండి నా పాదాభివందనం.
(ఆ ఇంటర్వ్యూ లింక్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు)
కింది ఫోటోలు:
హైదరాబాదు మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు, ఆనాటి మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారితో నేను
(ఇంకా వుంది)
5 కామెంట్‌లు:
మీకంటే వయసులో చిన్న వారు కదా . పాదాభివందనం వద్దు. మెచ్చుకుంటే చాలు. ధార్మిక ప్రవృత్తి, నిజాయితీ కలిగిన ఎల్వీ గారు అత్యుత్తమ మైన ఐ ఎ ఎస్ అధికారి. ఆయనకు తెలుగు భాష పై పట్టు ఉంది. ఆంగ్ల పదాలు బహు తక్కువ గా వాడుతూ అనర్గళంగా తెలుగులో ప్రసంగించగలరు.
అంత పేరుప్రతిష్ఠలు. ముఖ్య కార్యదర్శి పదవి…… ఇవన్నీ ఒక అహంభావి ముందు నిలబడలేక పోయాయన్నమాట . ఒక బ్రిలియంట్ కెరీర్ అలా ముగిసిందన్నమాట 😒.
అధికారం లో వున్న వారికి స్వామి వారు స్వయానా కల్పించిన స్పెషల్ ప్రివిలేజెస్ ఉపయోగించు కో కుండా ఏదో పెద్ద కార్యం సాధించి నట్లు క్యూలో నిలబడి పోవడమ్మును దాని గురించి డబ్బా కొట్టుకోవడమున్నూ గొప్పేనా ?
మీరు రెండో దర్శనం రాత్రి ఆలస్యంగా
చేసుకొని వస్తే మీకు వసతి సౌకర్యం ఎల్వీ గారు సమయంతో సంబంధం లేకుండా🤔 కల్పించాలి. లేకపోతే పట్టరాని కోపం వచ్చింది. ఇదేమి చోద్యం. అయితే మీకు మంచి వారిని మెచ్చుకునే స్వభావం ఉంది.
అయితే మాడభూషి శ్రీధర్ వంటి వారు ప్రభుత్వ సౌకర్యాలు సదుపాయాలు పొంది మళ్ళా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తుంటారు. ఎప్పుడూ ఏదో అసంతృప్తి గా ఉంటారు. ఎందుకో
అయ్యా, “అజ్ఞాత” (4:13 am) గారూ,
ఎల్వీ సుబ్రమణ్యం గారు “డబ్బా కొట్టుకోవడం” చేసినట్లు పైనున్న బ్లాగు పోస్టులో అనిపించలేదే ? simple గా ఉండే ప్రభుత్వ ఉన్నతాధికారులు డబ్బా కొట్టుకోరే. ఆ కొండొకచో ఒక పని జరుగుతుంటుంది - సదరు అధికారి స్వయంగా డబ్బా కొట్టుకోకపోయినా వారి సిబ్బంది, సహోద్యోగులు, పై అధికారులు ఈయన నిజాయితీ గురించి నలుగురి దగ్గరా మాట్లాడతారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి