31, మార్చి 2019, ఆదివారం

ఐ.క్యు. టాబ్ లెట్స్


ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు. కాబట్టి ఒక కధ గుర్తు చేసుకుందాం.
భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.
ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు.  తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని  రెండు ఇడ్లీలు తీసి  తినడం  ఆ ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.
మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన ఉత్కంఠ మరింత పెరిగింది.
రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే సీను.
బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా అడిగేశాడు.
“అయ్యా! ఇలా అడగడం మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”
అయ్యరు ఇలా జవాబిచ్చారు.
“ఇవి ఐ.క్యు.  టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో వున్నాయి. వీటిని తిని, భోజనం గట్రా ఏమీ లేకుండా  మేము రోజులతరబడి వుండగలం”
“వీటిని ఎలా తయారు చేస్తారు” బ్రిటిషర్ ఆరా.
అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన  సంభారాలు గురించీ, తయారు చేసే విధానం గురించీ వివరంగా చెప్పారు.
“మంచి సంగతులు మీనుంచి తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే కాదు, మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.
అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.
“నా దగ్గర ఇంకా మూడే మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”
బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి అరవై రూపాయలు అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని  తిన్నాడు.
మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది.
రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్ అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా! ఏమైనా మరచిపోయారా!”
“చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా చెప్పాను”
“మరి ఈ టాబ్ లెట్ల ఖరీదు అంత వుండకూడదే”
“చెప్పాను కదా  ఇవి మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్ క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం) 

28, మార్చి 2019, గురువారం

బెట్టింగు సర్వేలు

మా చిన్నతనంలో వరి కళ్లాల సమయంలో పొలాల్లో రాశిగా పోసిన వడ్లను కొలిచి బస్తాలకు ఎత్తేముందు మా బాబాయి ఉజ్జాయింపుగా చూసి ఇన్ని పుట్లు అని చెప్పేవాడు.(పుట్టి పది బస్తాలు). ఇంచుమించుగా ఆయన చెప్పినట్టే జరిగేది.
నటశేఖర బిరుదాంకితులు కృష్ణ, ఏ సినిమా అయినా (తన సొంత సినిమాతో సహా) విడుదల అయిన వెంటనే ఇన్ని రోజులు ఆడుతుందని చెప్పేవారట. ఆయన అన్నట్టే ఆ సినిమా ఫట్టో,హిట్టో అయ్యేదట.
ఇప్పుడు రాజకీయ పార్టీల వంతు వచ్చింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో రోజుకొక సర్వే వస్తోంది. జ్యోతిష్కులు కూడా రంగం లోకి దిగారు. అసలే రాజకీయ పార్టీలు ఆడుతున్న మైండు గేములతో ఇప్పటికే తలలు తిరిగి తల పట్టుకు కూర్చున్న జనాలకు ఈ సర్వేలు మరింత అయోమయం కలిగిస్తున్నాయి.


బహుశా బెట్టింగుల స్థాయి పెంచడానికి కాబోలు.

Journalist Bhandaru Srinivasa Rao Reveals Behind Adala Prabhakar Reddy J...

Senior Journalist Bhandaru Srinivasa Rao About Plus Points In AP Electio...

Senior Journalist Bhandaru Srinivasa Rao Says War One Side In AP Electio...

27, మార్చి 2019, బుధవారం

రెండు మరణాలు – భండారు శ్రీనివాసరావు


గత రెండు రోజుల్లో మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చెప్పాపెట్టకుండా బతుకు రైలు బండి దిగి వెళ్ళిపోయారు.
ఒకరు పద్మ. మా చిన్న  మేనత్త మనుమరాలు. ఆ అమ్మాయికి యాభయ్ ఆరేళ్ళు అంటే నమ్మబుద్దికాదు. అంత నేవళంగా వుంటుంది. పద్మను నవ్వు మొహంతో కాకుండా వేరే విధంగా మా చుట్టపక్కాలు ఎవ్వరూ చూసి ఎరుగరు. నవ్వుతూ పలకరించేది. పలకరిస్తూ నవ్వేది. అలాంటి నవ్వులన్నీ మాకు ఇచ్చేసి తాను మాత్రం ఎంచక్కా ఎక్కడికో వెళ్ళిపోయింది. విచిత్రం ఏమిటంటే పదంటే పది రోజుల్లో తన ప్రాణాలు తీసే జబ్బు తన ఒంట్లో ప్రవేశించిందని తనకు తెలియదు. ఆసుపత్రివాళ్ళు పెదవి విరిచి ఇంటికి తీసుకుపొమ్మని చెప్పారు. పద్మకు ఆ విషయం తెలియదు. జబ్బు నయమైందనుకుని నవ్వుతూ సిబ్బంది అందరికీ టాటా చెప్పి వెళ్ళింది. అంతే! మరునాడు ఇంట్లోను లేదు. అసలు  ప్రపంచంలోనే లేదు. ఇలా కూడా మనుషులు చనిపోతారా అని ఇంకా అందరిలో తొలగని అనుమానం.
రెండో వ్యక్తి తాజుద్దీన్. మా పక్క ఫ్లాట్ లో వుండేవాళ్ళు. చిన్న కుటుంబం. ఇప్పుడు ఎక్కడో దూరంగా వుంటున్నారు. భార్య అనీస్. బ్యూటీపార్లర్ లో పనిచేస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు. రగీనా, అలేజా. పిల్లలు కాదు అందమైన బొమ్మలు. చిన్నతనంలో దాదాపు మా ఇంట్లో, మా ఆవిడ ఒడిలోనే పెరిగారు. తాజ్ ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతడికి అంత చిన్న వయస్సులోనే రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి రెండు సార్లు ఎల్లారెడ్డి గూడా నుంచి మోటారు సైకిల్ పై ఒక్కడూ వెళ్లి నాంపల్లి లోని ఆసుపత్రిలో డయాలిసిస్ చేయించుకుని ఇంటికి వచ్చేవాడు. ఆరేళ్ళ క్రితం కరెంటు కోతలు బాగా ఉన్నరోజుల్లో లిఫ్ట్ పనిచేయక నీరసంగా మెట్లెక్కి వస్తుండేవాడు. చాలా రోజుల వరకు అతడు డయాలసిస్ చేయించుకుని వస్తున్నాడని, కిడ్నీలు చెడిపోయాయని నాకు తెలవదు. మామూలు సమయాల్లో చాలా హుషారుగా ఉండేవాడు. పిల్లలంటే ప్రాణం.
తాజుద్దీన్ కూడా పద్మ కన్ను మూసిన రోజునే హైదరాబాదులో మరణించాడు.
ఒక రచయిత అన్నట్టు ‘భగవంతుడు పెద్ద టెర్రరిస్ట్’.
నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా ఎప్పుడు ఎవరి  ప్రాణాలు తీస్తాడో తెలవదు.         

26, మార్చి 2019, మంగళవారం

KSR Live Show | YS Jagan Counter on Babu over KCR's 1000Cr for AP Electi...

ప్రతి మంగళవారం మాదిరిగా ఈరోజు ఉదయం సాక్షి టీవీ   KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి లక్ష్మీ పార్వతి (వై.ఎస్.ఆర్.సి.పీ.), శ్రీమతి సీతాకుమారి (బీజేపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్).

25, మార్చి 2019, సోమవారం

వై ఎస్ వస్తే రాష్ట్రం రావణకాష్టమే!


2004లో ఎన్నికలు ముగిశాయి. వై ఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. ప్రత్యర్ధి శిబిరం టీడీపీ తో  పాటు కాంగ్రెస్ లోని కొన్ని వర్గాల్లో కలవరం. వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఎలా! ఈ రాష్ట్రం ఏమైపోతుంది. పార్టీలు సరే. అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు. ఆందోళన.
పాత జానపద చిత్రాలలో రాజుగారి సైనికులు వూళ్ళపై పడి దోచుకునేవారు. ఆడవారిని చెరపట్టేవారు. ఇలాంటి సన్నివేశాలు దర్శనమిస్తాయని నోళ్ళు నొక్కుకున్నారు.  
కానీ తర్వాత ఏం జరిగింది. రౌడీ మూకలు వీధుల్లో స్వేచ్చావిహారం చేయలేదు. ఇళ్ళపై పడలేదు. ముఠాకక్షలు, కార్పణ్యాలు ప్రబలలేదు. హత్యలు, మాన భంగాలు జరగలేదు. అధికారులను వేధించలేదు. అసలు కర్ఫ్యూ అనేది గతకాలపు ముచ్చట అయింది. పై పెచ్చు అనేక కొత్త కొత్త ప్రజా  సంక్షేమ పధకాలకు ఆయన పాలనా కాలం ఒక సాక్ష్యంగా నిలిచింది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాడు. ఎందుకంటే మనది రాజ్యాంగానికి కట్టుబడి నడిచే వ్యవస్థ కనుక.
ఈ మధ్య ఓ ఇష్టాగోష్టి సమావేశంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు ఈ సంగతి చెప్పారు.
కాబట్టి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిందే. అంతే  కాని జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు ధోరణితో పాలించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విధంగా సాగుతున్న ప్రచారానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన చెప్పిన మాటల తాత్పర్యం.    

Why AP Parties Increase Welfare Schemes More Than a Limit? | The Debate ...ప్రతి సోమవారం ఉదయం మాదిరిగానే  ఈరోజు  AP 24 X 7 Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రాజీవ్ (వై.ఎస్.ఆర్.సీ. పీ)

24, మార్చి 2019, ఆదివారం

వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లేనా | News Scan LIVE Debate With Vijay...

ప్రతి ఆదివారం  మాదిరిగానే ఈరోజు ఉదయం  TV 5 News Scan Live Debate With Vijay On AP Politics చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ సాయిబాబా (టీడీపీ), శ్రీ కఠారి శ్రీనివాస్ (విశ్లేషకులు, శ్రీ షఫీ (విశ్లేషకులు)

రోజూ చచ్చి బతికే జర్నలిస్టుప్రకాశశాస్త్రి గారు పూర్వకాలపు జర్నలిస్టు. మరీ అంత పాతకాలపు మనిషేమీ కాదు. 1975లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తర్వాత వారిని ప్రతిరోజూ సచివాలయం ప్రెస్ రూములో కలిసేవాడిని. భేషజాలు అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే తత్వం.
ఆయన ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు కాబోలు, జూనియర్ రిపోర్టర్ ఎవరైనా కలవగానే, ‘ఏరా అబ్బాయి ఏవిటి విశేషాలు’ అని చాలా ఆప్యాయంగా పలకరించేవారని ఆకాలంలో ఆయనతో పనిచేసి ఇప్పుడు మీడియాలో సీనియర్లుగా ఉన్న చాలామంది గుర్తు చేసుకుంటూ వుంటారు.
తను ఆరోజు రాసిన వార్త మరునాడు పత్రికలో పడగానే అది చూపిస్తూ, ‘అరె అబ్బాయి, ఈరోజుతో మనం చచ్చినట్టే లెక్క. మళ్ళీ మనం  రాసిన వార్త రేపు వస్తే అప్పుడు మనం బతికున్నవాళ్ళలో జమ. వార్తలు రాస్తుంటేనే జనాలు  మనం బతికున్నట్టు అనుకుంటారు. ఏరోజు రాయకపోతే ఆరోజు అంతే సంగతులు.  ఇదేరా మన జీవితం’ అని సరదాగా చెబుతుండేవారట.
అన్నట్టు టీవీ 9 అనగానే గుర్తొచ్చే పేరు మురళి. ఈ మురళి ఎవరో కాదు ఈ ప్రకాశశాస్త్రి గారి కుమారుడే.         

కాశీపట్నం చూడరబాబూ! – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 24-03-2019, SUNDAY)
మా చిన్నతనంలో పల్లెటూళ్ళకు పర్వదినాల్లో జంతర్ మంతర్ పెట్టె వాళ్ళు వచ్చేవాళ్ళు. అది చూడడానికే వింతగా వుండేది. మూడుకాళ్ల స్టాండు పై నిలబెట్టేవాళ్ళు. లోపల బొమ్మలను చూడడానికి వీలుగా ఓ పక్కన రంధ్రం వుండేది.  ఒకడు తాళం కొడుతూ ‘కాశీపట్నం చూడరబాబూ’ అంటూ కాశీ విశ్వనాధ దేవాలయమూ, గంగా నదీ మొదలయిన బొమ్మలు చూపుతుండేవాడు.
కాశీ పట్నం చూడర బాబు
విశ్వనాథుని చూడ బాబు
కలకలలాడే గంగా నదినీ
కన్నుల పండగ చూడర బాబూ.......అని పాడుతూ వచ్చే ఆ జంతర్ మంతర్ పెట్టెలవాళ్ళు ఊళ్లోకి రాగానే జనం ఎగబడేవారు.
 పక్క వూళ్ళో తిరుణాల చూడడమే అబ్బురమనుకునే  రోజులు. ఇక ఏకంగా ఎక్కడో ఉన్న కాశీపట్నం చూపిస్తాను రమ్మంటుంటే ఇక చెప్పేదేమి వుంటుంది. డబ్బులిచ్చిమరీ  చూసేవాళ్ళు. లోపల బొమ్మలు కదలకపోయినా అవి కదులుతున్నాయి అనేంత హంగామా చేసేవాళ్ళు ఈ జంతర్ మంతర్ పెట్టెలవాళ్ళు.
ప్రస్తుత కాలంలో మేనిఫెస్టోల పేరుతొ ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న హంగామా చూస్తుంటే అలనాటి, మా చిన్నతనంలో చూసిన ఈ పెట్టెలవాళ్ళు గుర్తుకొస్తున్నారు.
సుమతీ శతకాలుసూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు” 
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. ఓటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు.  ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుకమండువేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. ఒళ్ళు గడ్డ కట్టే చలికాలంలో కూడా వెచ్చటి వాగ్దానాల దుప్పటి కప్పుతుంది.
కలర్ టీవీలులాప్ టాపులునెలసరి భత్యాలునగదు బదిలీలుభూసంతర్పణలుపట్టు చీరెలుపసుపు కుంకాలుఉచిత వైద్యాలుఆల్  ఫ్రీ చదువులుబంగారు తల్లులుకరెంటు మీదిబిల్లు మాది తరహా హామీలు, ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాల ప్రకటనలతో   వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ప్రజలనుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి నింపుకున్న ఖజానా డబ్బులతోనే  ఓటర్లకు  నజరానాలు గుప్పిస్తూ, ఇలా ఈ చేత్తో తాయిలాలు  ఇచ్చి అలా ఆ చేత్తో ఓట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల మేమిఫెస్టోలు  నూటికి నూరుపాళ్ళు అచ్చంగా  ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులనే చెప్పాలి.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. అసలు ఇస్తారా ఇవ్వరా, ఏరు దాటినా పిదప బోడి మల్లయ్య బాపతా అనే ప్రశ్నలకు సమాధానాలు వుండవు.  ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదుఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. అందుకే ఉచితానుచితాల ఊసెత్తకుండా ‘ఉచిత తాయిలాలు’ భారీగా  ప్రకటించుకుంటూ పోతున్నారు.
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం రివాజు. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి, ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. ఓటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతే ఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల క్విడ్ ప్రోఖో ఎత్తులను చిత్తు చేయాలంటే ఓటర్లు కూడా తమ సొంతమేనిఫెస్టోలు విడుదల చేయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.
మీరిలా వోటు వేసి గెలిపించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వస్తేనే కాని రాజకీయ పార్టీల లేనిపోని హామీల వరదకు అడ్డుకట్ట పడదు. ఈ నేపధ్యంలో వచ్చిన ఆలోచనే ‘ఓటర్ల మేనిఫెస్టో’      
1.     ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అనుమానాలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని హామీ ఇచ్చిన పార్టీలే  తమ పార్టీ నిధులనుంచి  ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి. ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ఉచిత హామీలను యెలా అమలు చేస్తారని ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పే బాధ్యత మీడియా తీసుకోవాలి.

2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న  చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి. సాధ్యమైనంత వరకు ఇందుకు మీడియాను ఉపయోగించుకోవాలి (డబ్బిచ్చి కాదు సుమా! లేకపోతే ఇది మరో క్విడ్ ప్రోఖో అయ్యే ప్రమాదం వుంది)
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. వీలయితే, ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ రద్దీగా వుండే రోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తారోఖోలు నిర్వహించరాదు. అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి.
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ఉచిత వినోదపు పన్ను వసూలు చేయాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత అధికార అందలం ఎక్కడం కోసం ఏర్పడే అవకాశవాద కూటములను నిషేధించాలి.
ఇవి కొన్ని మాత్రమె. ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ ఓటర్ల మేనిఫెస్టోలను మరింత సమగ్రం చేసే బాధ్యతను ప్రజాసంఘాలు నెత్తికెత్తుకోవాలి.

తోకటపా:
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్

19, మార్చి 2019, మంగళవారం

వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి


ఆదివారం  సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా చివరికి వెళ్ళలేకపోయాను. తన కలంతో ‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్  సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ గారి  కాంటాక్టు నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్ కూడా పెట్టాను.
ఈరోజు ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.
‘హలో! నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’
ఎంతో సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.
‘ఇదేమిటి, సుబ్రహ్మణ్యం మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.
‘అదీ నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’
అదీ శ్రీ రమణ అంటే!
చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను వింటూపోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి  ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నేను నండూరి రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ తర్వాతనే  శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు.
ఉషశ్రీ తో కదా మొదలు పెట్టింది.
శ్రీ రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల మధ్య.
ఉషశ్రీ ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచివడబోసి వాటి సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.
శ్రీ రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య నిన్నటి సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.
ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిరువురూ మంచి స్నేహితులు.
విజయవాడ రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’ చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!
శ్రీ రమణ చెప్పారు.
ఆయన ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు.      

18, మార్చి 2019, సోమవారం

AP CM Chandrababu Controversial Comments on YCP over TRS Alliance | The ...

AP CM Chandrababu Controversial Comments on YCP over TRS Alliance | The ...

నన్ను’గోడ’ దించిన టీవీ జర్నలిస్ట్ వెంకట కృష్ణ - భండారు శ్రీనివాసరావునన్ను’గోడ’ దించిన టీవీ జర్నలిస్ట్ వెంకట
కృష్ణ  - భండారు శ్రీనివాసరావు
అంటీముట్టనట్టుగా, తామరాకుమీది నీటి
బొట్టులా, కాస్త ముదురుగా చెప్పాలంటే ‘గోడ మీది పిల్లి’లా టీవీ చర్చల్లో నా వైఖరి
ఉంటుందని చాలామంది చెప్పారు. ఇంతెందుకు, ఇంటికి రాగానే మా ఆవిడే అంటుంది, ఇక ‘గోడ’
దిగండని. మా ఆవిడ నాకు పెట్టిన ముద్దు పేరు ‘గోపి’
దీనికి కారణం నాకు నేనుగా పెట్టుకున్న
నిబంధన. ఎంతో అవసరం అయితే తప్ప పార్టీల పేర్లు, వ్యక్తుల పేర్లు,టీవీ చర్చల్లో  నా నోటి నుంచి రాకూడదని.
ఈరోజు సోమవారం ఎప్పటి మాదిరిగానే AP
24 X 7 న్యూస్ ఛానల్ లో  “The Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ఎప్పటి మాదిరిగానే నా విశ్లేషణ. చూసీ చూసీ, వినీ
వినీ  విసుగు పుట్టిందో ఏమో కానీ వెంకట
కృష్ణ నవ్వుతూనే ఈ అంశం లేవనెత్తారు. ‘నొప్పించక తానొవ్వక’ అనే ఈ విధానం వల్ల ఒక
జర్నలిష్టుగా మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చినట్టు అవుతుందా అని.
ఆ విధంగా ఆయన నా నెత్తిన పాలు పోశారు.
నేను ఎందుకిలా మాట్లాడాల్సి వస్తోంది అనే ప్రశ్నకు బహిరంగంగా ఒక టీవీ వేదికగా వివరణ
ఇచ్చుకునే ఓ మంచి అవకాశం నాకాయన కల్పించారు. అందుకు కృతజ్ఞుడిని.  

17, మార్చి 2019, ఆదివారం

పారాచూట్ పాలిటిక్స్ | News Scan Debate With Vijay On AP Politics | 17th ...పాజిటివ్ ఓటింగ్
ప్రభుత్వాలు చేసిన మంచి పనులు,
అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలు చూసి
ప్రజలు ఓట్లు వేస్తే అది పాజిటివ్ ఓటింగ్. మేలు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే
సద్గుణం ప్రజలకు వుంది.
అయితే నాయకులకు ఓ వార్నింగ్. మీరు ఈ
విషయంలో   ఓటర్లకు ఆదర్శంగా వుండాలి.
‘మేము స్వప్రయోజనాలకోసం పార్టీలు
మారుతుంటాము, డబ్బులావాదేవీలు చక్కబెట్టుకుంటూ ఉంటాము. మీరు మాత్రం ప్రలోభాలకు
గురికాకుండా ఓటు వేయండి’ అని నీతి వాక్యాలు చెబితే కుదరదు.
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత’మని మీరు
అనుకున్నట్టు ఓటర్లూ అనుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.   

16, మార్చి 2019, శనివారం

హెల్ప్ లెస్

రాజకీయ వ్యాసాలకు వ్యక్తిగత అభిమానాలకు లంకె కుదరదు. దేని దారి దానిదే. అలా అని మనసులో మాటలు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఏదోవిధంగా రచనలలో తొంగిచూడడం కద్దు. కీర్తిశేషులు, ప్రముఖ జర్నలిస్టు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని దాచుకోవడానికి సందేహించేవారు కాదు. ఆయన హయాములోనే బడుగు, బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన అంటూ వుండేవారు. అయితే అది తన వ్యాసాల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడేవారు.
సినీ నటుల పట్ల అభిమానం పెంచుకునే రీతిలోనే రాజకీయ నాయకుల విషయంలో కూడా అభిమానులు తయారవుతున్నారు. ఇది తప్పేమీ కాదు.
మా కుటుంబం విషయమే తీసుకుందాం. దాదాపు తొంభయి శాతం మందికి చంద్రబాబునాయుడు అంటే చెప్పలేని ఇష్టం. మొదటి సారి ఆయన ఓటమి పాలయినప్పుడు, మా కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఆయన్ని చూడాలని కోరితే వాళ్ళని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాను. అందులో గీత అనే ఆవిడ తన సానుభూతి వాక్యాలతో చంద్రబాబుకు కంటనీరు తెప్పించింది. వాళ్ళని సముదాయించాల్సిన పరిస్తితి ఆయనది. ఇన్నేళ్ళు గడిచినా ఆయన పట్ల వారి అభిమానంలో మార్పులేదు.
ఇక జగన్ అన్నా ఆయన పార్టీ అన్నా ప్రాణం పెట్టేవాళ్ళు రోజూ నా చుట్టూతా కనిపిస్తుంటారు. మా పనిమనిషి, వంట మనిషి, వాచ్ మన్ ఇలా అనేక కుటుంబాల వాళ్ళు నాకు తెలుసు. సాక్షి పత్రిక కేలండర్ పై వేసే వై ఎస్ ఫోటోను ఫ్రేము కట్టించి దాచుకుంటారు. ప్రతి ఏటా ఆ పని చేయడం చూసి నాకు చిత్రమనిపిస్తుంది. జగన్ జైలు నుంచి విడుదల అయిన రోజున తమ రోజువారీ పనులు పక్కన బెట్టి గంటలు గంటల పాటు జైలు పరిసరాల్లో ఆయన కోసం ఎదురు చూస్తూ గడిపారన్న తెలుసుకుని ఆశ్చర్య పోవడం నా వంతయింది. ఇన్నేళ్ళు గడిచినా వాళ్ళూ అంతే! జగన్ పట్ల వారి అభిమానం రవంతకూడా చెక్కుచెదరలేదు.
కాబట్టి, ఎవరి అభిమానాలు వారివి. మా కుటుంబంలోని బాబు అభిమానులకు, జగన్ అభిమానులకు నేను రాసే రాతల్లో కొన్ని బాగా నచ్చుతాయి. కొన్ని అస్సలే నచ్చవు. ఆ విషయం నాకు తెలుసు.
కానీ ఈ విషయంలో నేను హెల్ప్ లెస్.


(పైన పేర్కొన్న రాజేంద్ర ప్రసాద్ గారే మరో మాట కూడా చెప్పేవారు. జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్షం పట్ల కొంత సానుభూతి చూపాలని అనేవారు. ప్రచారం చేసుకోవడానికి పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతిలో వుంటుంది. ఆ వెసులుబాటు లేని ప్రతిపక్షాల సంగతి కనిపెట్టి చూడాలని దాని తాత్పర్యం)

దుర్గంధ భరితం - ఏపీ రాజకీయం

ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం  అది ఆంధ్రప్రదేశ్.
ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
గంటల్లో దృశ్యం మారిపోయింది. అది సహజ మరణం కాదు, హత్య అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అంతే! రాజకీయం రంగంలోకి వచ్చింది. చనిపోయింది సాక్షాత్తు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి కావడంతో రాజకీయం తన డేగ రెక్కలు విప్పుకుంది. అందులోను ఎన్నికల కాలం. ఎవరు మాత్రం వదులుకుంటారు ఈ మహత్తర అవకాశం. అదే జరుగుతోంది. ఒక ఉత్తమ రాజకీయ నాయకుడి ఆకస్మిక మరణం అమానుష రాజకీయానికి ఒక వేదికగా మారింది. ఎక్కడయినా ఇలా జరుగుతుందా! జరగదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అక్కడ అలాగే జరుగుతుంది. జరిగితీరాలి.
సంఘటనపై పోలీసులు స్పందించారు. చనిపోయింది కడప జిల్లాకు చెందిన  ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో డీజీపీ స్థాయి అధికారి పెదవి విప్పి మాట్లాడడంలో అసహజం ఏమీ లేదు. కానీ అది కూడా ఒక వివాదాంశం అయికూర్చుంది. ఎండుమంటే, అది ఆంధ్రప్రదేశ్.
వివాదం కావడానికి కూడా కారణం లేకపోలేదు. గతంలో విచారణ సాగుతుండగానే పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తొందరపడి  స్పందించిన దాఖలాలు వున్నాయి. ఉన్నతస్తానాల్లో ఉన్న పోలీసు  అధికారులు ఇలా  బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యానాలు చేయొచ్చా  అనే చర్చ అనవసరం. ఎందుకంటె అది ఆంధ్రప్రదేశ్.
ఈలోగా అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన  ఒక నాయకుడు టీవీ తెరలపై కానవచ్చి ‘జగనే తన బాబాయిని హత్య చేయించాడని ఒక బాంబు పేల్చారు.  ఇలా తొందరపడి ఒక నిర్ధారణకు రావడం, ప్రతిపక్ష నేతపై ముందూ వెనకా చూసుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సబబా అంటే ఎంతమాత్రం కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అలాగే జరుగుతుంది.
వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్ళు ఊరుకుంటారా! ఊరుకుంటే అది రాజకీయపార్టీ కానేరదు. ఏకంగా ఆ పార్టీ అధినాయకుడే స్పందించారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని జగన్ మోహన రెడ్డి ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందనేది అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం. ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు చేయడం సహేతుకమా అంటే సమాధానం మళ్ళీ ఒక్కటే. అది ఆంధ్రప్రదేశ్.
మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్దులను ఖరారు చేయడంలో, అసంతృప్తులను బుజ్జగించడంలో, పార్టీ మారి వచ్చేవారికి కండువాలు కప్పి తమ పార్టీ తీర్దాలు ఇప్పించడంలో తలమునకలుగా ఉన్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి  విలేకరుల సమావేశం పెట్టి సంఘటన పూర్వాపరాలను వివరించారు. పనిలో పనిగా అనుమానపు వేలును జగన్ వైపు చూపించారు. ఇది అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
విడ్డూరంగా అనిపించే విషయం ఏమిటంటే ఒక చిన్న స్థాయి పోలీసు అధికారి చెప్పాల్సిన మాటలు ముఖ్యమంత్రి చెప్పడం.
‘ఉదయం సహజ మరణం అన్నారు. గంటల్లో అది హత్య అని తేలింది. సంఘటన జరిగింది వారింట్లో. చనిపోయిన మనిషిని స్నానాలగది నుంచి పడక గదికి చేర్చారు.  రక్తపు మరకలు తుడిచేశారు. సాక్ష్యాధారాలు మాయం చేసే దురుద్దేశ్యంతో అలా చేసారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి సహజ మరణం అని నమ్మించే ప్రయత్నం చేసారు. ఇంట్లో హత్య జరిగినప్పుడు ఎవరయినా ముందు పోలీసులకు సమాచారం అందిస్తారు. హత్యాప్రదేశంలో ఆనవాళ్ళు చెరిపేయరు. అందుకే అనుమానాలు. వీటి నివృత్తి జరగాలి. క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. అందుకే ‘సిట్’ ఏర్పాటు’ అన్నారాయన. అది ఆంధ్రప్రదేశ్. అందుకే ప్రతి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందిస్తారు.
వైసీపీ ఊరుకుంటుందా! గతంలో హైదరాబాదులో నటుడు బాలకృష్ణ ఇంట్లో ఒక దుస్సంఘటన జరిగినప్పుడు పోలీసులు వచ్చేలోగా ఆ ఇంటి వాళ్ళు రక్తపు మరకలను శుభ్రం చేయలేదా అని గుర్తు చేస్తున్నారు.
‘ఒక ఘోరం జరిగింది. తెల్లారి చూస్తె ఇంటి పెద్ద బాత్ రూములో చనిపోయి పడివున్నాడు. ఆ దృశ్యం చూసిన ఇంట్లో వాళ్ళు ముందు ఏం చేస్తారు? ఆ విగత జీవిని వేరే గదిలోకి తరలిస్తారు. శరీరం మీద నెత్తురు మరకలు వుంటే తుడుస్తారు. చనిపోయిన వాడు పరాయి మనిషి కాదు, చూస్తూ చూస్తూ పోలీసులు వచ్చేదాకా అలా స్నానాల గదిలో  వదిలేయడానికి. మానవత్వం ఏ కోశానా  లేనివాళ్ళు మాత్రమే అలాంటి దుష్టపు ఆలోచనలు చేస్తారు’ అని చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇది సరే! ఒప్పుకుందాం. మరి సహజ మరణం అంటూ ఇచ్చిన పిర్యాదు సంగతేమిటి? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఉండదు. ఎందుకంటే  అది ఆంధ్రప్రదేశ్.     
జరిగింది హత్య అని ఇరుపక్షాలు నిర్ధారణకు వచ్చి బహిరంగంగా ఆ సంగతి అంగీకరిస్తున్నారు. పోలీసులు కూడా హత్యే అని అంటున్నారు. ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ప్రత్యెక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది.
‘ఠాట్!  ‘సిట్’ పనికిరాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. సీబీఐ చేత దర్యాప్తు చేయించి నిజం నిగ్గు తేల్చాలి’ అని వైసీపీ నాయకుల డిమాండ్. డేటా చోరీ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే తెలుగు దేశం పార్టీ  చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ.
‘వీళ్ళకి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. మాట్లాడితే సీబీఐ అంటారు. తమ నేరాలను కప్పి పుచ్చుకోవడానికే ఆ డిమాండ్లు’ చంద్రబాబు ఆరోపణాస్త్రం.
‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నిసార్లు సీబీఐ దర్యాప్తుకు పట్టుబట్టలేదు. అంటే స్థానిక పోలీసుల మీద నమ్మకం లేకనేనా? మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం వుంది. విశ్వాసం లేనిది ప్రభుత్వం మీదనే. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం’ వైఎస్ ఆర్ సి పీ నాయకుల ప్రత్యారోపణ.
నిన్నకాక మొన్న సీబీఐ ని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వం అని ఘీంకరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈడీ మీద నమ్మకం లేదన్నదీ ఆయనే. తనకు నమ్మకం లేదంటే అందరూ దాన్ని నమ్మాలి. మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటే మాత్రం  మాకు వ్యవస్థల మీద నమ్మకం లేదని భాష్యం చెబుతుంటారు’ అనేది వారి ముక్తాయింపు.  
ఒక పెద్దమనిషి మరణించినప్పుడు అదీ హత్య అని నిర్ధారణ అయినప్పుడు జరగాల్సిన వాదోపవాదాలు ఇవేనా! ఖచ్చితంగా కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్.    
వివేకానంద రెడ్డిని వివాదరహితుడిగా అభివర్ణిస్తూ,  నివాళులు అర్పించిన రాజకీయ నాయకులే ఆయన మరణాన్ని వివాదగ్రస్తం చేస్తూ వుండడం ఓ విషాదం.
సరే! ఇవన్నీ ఒకెత్తు. మీడియా ఈ సంఘటనపై స్పందిస్తున్న తీరు.  చర్చల రూపంలో విచారణ సాగిస్తున్నవైనం. ఇది బాధ్యత కలిగిన మీడియా చేయాల్సిన పనేనా! ఈ ప్రశ్న కూడా అనవసరం. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
సరే! ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే సాగేవే. వాటిని కాసేపు ఒదిలేద్దాం.
చనిపోయిన ఆ మంచి మనిషిని గురించి ఓ మంచి ముక్క చెప్పుకుందాం  
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి.
రవీంద్ర భారతిలో దూరదర్సన్ ఏదో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిధులు, ముఖ్యుల కోసం ముందు రెండు వరసలు ఖాళీగా ఉంచారు. నేను మూడో వరసలో కూర్చున్నాను.
వెనుకవైపు జనం బాగా నిండి పోయారు. అక్కడక్కడా ఒకటో అరో కుర్చీలు ఖాళీగా వున్నాయి.
కార్యక్రమం మొదలు కావడానికి కాస్త ముందు బక్కపలచగా ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చి నాలుగో వరసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీ వెతుక్కుని కూర్చున్నారు. ఎక్కడో చూసినట్టుగా వుందే అనుకుంటూ తేరిపార చూస్తే అయన ఎవరో కాదు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు. ముందూ వెనకా సెక్యూరిటీ కూడాలేదు.
వెళ్లి ముందు వరసలోకి రమ్మంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. పరవాలేదు ఇక్కడే కూర్చుంటాను, నాకేమీ ఇబ్బంది లేదుఅన్నారాయన అంతకంటే సున్నితంగా.
రాజకీయాల్లో అటువంటి నిరాడంబరత్వం నిజంగా అపురూపమే. 

15, మార్చి 2019, శుక్రవారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు


(నిన్న అంతర్జాతీయ నిద్రా దినోత్సవం’ట’. కాస్త మాగన్నుగా నిద్ర పట్టడం వల్ల దాన్ని గురించి రాయడంఒకరోజు ఆలస్యం అయింది)
'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -
నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది.
అయితే, 'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని మాత్రమే వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.
“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన వినీలాకాశాన్ని నేరుగా పడక గదిలోకి తీసుకువచ్చి గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ 'మందు కొడితేనే కానీ నిద్రపట్టదు' అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే, వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.
ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.