19, మార్చి 2019, మంగళవారం

వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి


ఆదివారం  సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా చివరికి వెళ్ళలేకపోయాను. తన కలంతో ‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్  సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ గారి  కాంటాక్టు నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్ కూడా పెట్టాను.
ఈరోజు ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.
‘హలో! నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’
ఎంతో సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.
‘ఇదేమిటి, సుబ్రహ్మణ్యం మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.
‘అదీ నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’
అదీ శ్రీ రమణ అంటే!
చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను వింటూపోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి  ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నేను నండూరి రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ తర్వాతనే  శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు.
ఉషశ్రీ తో కదా మొదలు పెట్టింది.
శ్రీ రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల మధ్య.
ఉషశ్రీ ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచివడబోసి వాటి సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.
శ్రీ రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య నిన్నటి సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.
ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిరువురూ మంచి స్నేహితులు.
విజయవాడ రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’ చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!
శ్రీ రమణ చెప్పారు.
ఆయన ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు.      

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

వాల్మీకి కార్ల్ మార్క్స్ కాంబినేషనేమో?