29, నవంబర్ 2012, గురువారం

రష్యా చూడలేకపోయా!


సిటీబ్యూరో, న్యూస్‌లైన్: ‘అప్పట్లో సోమియట్ రష్యాది ఒక క్రమబద్ధ జీవితమని విన్నా. అదో ఐరన్ కంట్రీ అని తెలుసు. ప్రపంచంలో రష్యా, అమెరికాలు రెండు కూటములని వినేవారం. అలాంటి రష్యాకు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా వెళ్లే అవకాశం వచ్చింది. ఆమె రెండు రోజులు ఆగమనడంతో ఆగిపోయా. రష్యానే చూడలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చారు తమిళనాడు గవర్నర్ రోశయ్య. బుధవారం రవీంద్రభారతిలో భండారు శ్రీనివాసరావు రచించిన ‘మార్పు చూసిన కళ్లు’ (అలనాటి మా మాస్కో అనుభవాలు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ... ‘అప్పట్లో రష్యాలో ఏం జరిగినా సెన్సార్ అయి తెలిసేవి. అక్కడ చాలా పెద్ద మార్పులే జరిగాయి. అప్పట్లో జర్నలిస్టులు ఎక్కడో ఉండేవారు. వారికి తెలుగు, ఇంగ్లీషులో... జరిగిన విషయాలు రాసుకొని తీసుకెళ్లి ఇచ్చేవారం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్టింగరింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత సందుసందుకు విలేకరులు వచ్చేశారు. వార్తల సేకరణలో పోటీ పెరిగి కొంత సమాచారం వేగంగా ఇచ్చేసి, తిరిగి సవరించుకునే పరిస్థితులున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వృత్తి రీత్యా అక్కడికి వెళ్లిన శ్రీనివాసరావు గొప్ప దేశంలో చోటు చేసుకున్న మార్పులను గుర్తు చేస్తూ పుస్తకం రాయడం మంచి పణామం’ అన్నారు. ప్రముఖ పాత్రికేయిడు జి.ఎస్.వరదాచారి మాట్లాడుతూ... ‘రష్యాలో చోటు చేసుకున్న మార్పులు వింటూ ఉంటే సమయం తెలియదు. ఇంతకు ముందే శ్రీనివాసరావు పుస్తకం తెచ్చి ఉంటే బాగుండేది’ అన్నారు. 

ప్రసార భారతి మాజీ సీఈఓ కె.ఎస్.శర్మ మాట్లాడుతూ శ్రీనివాసరావు పుస్తకం చదవుతుంటే ఆయన అనుభవాలు అందరికీ అనుభవంలోకి వస్తే ఎంత బాగుండు అని పిస్తుందన్నారు. మహా టీవీ సీఈఓ ఐ.వెంకట్రావు మాట్లాడుతూ... అలనాటి సోవియట్ యూనియన్ అనుభవాలంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను అన్నారు. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తిగా మహత్తరమైన అక్కడి అనుభవాలను వివరించారన్నారు. ది హిందు హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్‌కుమార్ మాట్లాడుతూ పుస్తకంలోని ఇంగువ కథ వింటూ ఉంటే నవ్వొస్తుందన్నారు. 

ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి.అమర్ మాట్లాడుతూ... ‘శ్రీనివాసరావు స్ఫూర్తితో రోశయ్య ఆర్థిక మంత్రి ఉండగా ఆయన ఆపార రాజకీయ అనుభవాల గురించి పుస్తకం తెస్తే బాగుంటుందనుకొంటున్నా. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీడియాలో సీరియస్‌నెస్ పోయింది. జర్నలిజంలో రాణించాలనుకునే వారికి సీనియర్ జర్నలిస్టుల అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి’ అని చెప్పారు. రచయిత శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రేడియో మాస్కోలో తెలుగు న్యూస్ రీడర్ ఉద్యోగం కోసం రష్యా వెళ్లే అవకాశం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ర ష్యా వెళ్లిన న్యూస్ రీడర్‌ని నేనొక్కడినే. అమెరికాకు ఎదురొడ్డి నిలిచిన సోవియట్ల శకం -కనురెప్పల కిందే నలిగిపోయింది. రష్యాలో పెద్దపెద్ద మార్పులే జరిగాయి’ అన్నారు. కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి జి.సన్యాసిరావు, ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్ డి.వెంకట్రామయ్య పాల్గొన్నారు.

25, నవంబర్ 2012, ఆదివారం

మార్పు చూసిన కళ్ళు - అందరికీ ఆహ్వానంమార్పు చూసిన కళ్ళు - అందరికీ ఆహ్వానం 


18, నవంబర్ 2012, ఆదివారం

బస్సులో వచ్చిన బంధువులు


బస్సులో వచ్చిన బంధువులు
‘బస్సు వేసుకుని మరీ ఆరోజు మా ఇంటికి భోజనానికి వచ్చిన వారందరూ నిజానికి మా బంధువులు కాదు. కానీ, ఒక్క పూట మా ఇంట్లో గడిపిన ‘పుణ్యానికి’ మాకు ఆత్మబంధువులుగా మారారు.
‘ఇస్కస్ బృందం తరపున మన రాష్ట్రం నుంచి వచ్చిన వారిని అంతకు మునుపే రెండు మూడు సోవియట్ నగరాలు చూపించి మాస్కోలోని ఓ పెద్ద హోటల్ లో బస ఏర్పాటు చేశారు.  బందరుకు చెందిన నరసింహమూర్తిగారనే పెద్దమనిషి ఆ బృందంలో వున్నారు. శాకాహారి అయిన మూర్తి గారు, రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందుగానే వాకబు చేసుకుని, నాకు ఓ కార్డు ముక్క రాసి తాను వస్తున్న విషయం ముందుగానే తెలియచేసారు. వారిని కలవడానికి హోటల్ కు వెళ్ళిన నేను, వారితో వున్న రష్యన్ దుబాసీతో సహా  మొత్తం బృందాన్ని వెంటబెట్టుకుని వాళ్ల బస్సులోనే మా ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ దిగిన అతిధులను చూసిముందు  మా ఆవిడ బిత్తర పోయినా  వెంటనే తమాయించుకుని అందరికీ వంట ఏర్పాట్లు చేసింది. అంతా పచ్చళ్ళు, కారాలు, సాంబారు, పెరుగుతో భోజనాలు చేసి అన్నదాతా సుఖీభవా! అని ఆశీర్వదించి వెళ్లారు. అలా ఆ రోజు మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఇన్నేళ్ళ తరువాత ఇప్పటికీ కూడా ప్రతియేటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ల సహృదయతకు ఖరీదు  కట్టే షరాబు యెవ్వడు?’             
ఇలాటి వివరాలు మరిన్ని  తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

విడాకులా! వద్దు బాబోయ్!! అనే భర్తలు


విడాకులా! వద్దు  బాబోయ్!! అనే భర్తలు
అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీ బాలవృద్ధులదే!. ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. చలిదేశం కాబట్టి ప్రతి వారికి చిన్నదో పెద్దదో ఓ గూడు అవసరం. కొంపాగోడూ లేని వాళ్లు మనదగ్గరలాగా ఫుట్ పాతులపైనా, ప్లాటుఫారాలపైనా రోజులు వెళ్ళమార్చడానికి వీలుండదు. ఇళ్ళ కేటాయింపు ఆడవారి పేరుపై చేసే పద్దతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా  ఇంటి వ్యవహారాల్లో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. ఆర్ధిక స్వావలంబన స్వేచ్చాజీవితానికి ఆలంబనగా మారింది. నిండా ఇరవై ఏళ్ళు నిండకుండానే మొదటి ముగ్గురు  మొగుళ్లకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా రష్యన్ యువతుల సొంతం అయింది. సోవియట్ రష్యాలో ఏటేటా పెరిగిపోతున్న విడాకుల విషయంలో ఓ జోకు ప్రచారంలోకి వచ్చింది. భార్యాభర్తల్లో విడాకులు ఎవరు ఇచ్చినా, ఎముకలు కొరికే ఆ చలిదేశంలో, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత  పెళ్ళాంతోనూ, పాత  పెళ్ళాం కొత్త మొగుడితోను  కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు కాలం గడపాల్సిన పరిస్తితి మగవాళ్లది. ఈ దుస్తితి పగవాళ్లకు కూడా రాకూడదని సరదాగా చెప్పుకునేవారు.
‘మాస్కో రేడియోలో నతాషా అనే సహోద్యోగి ఇరవై లోపే ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో మొగుడితో సంసారం  చేస్తోంది. మా ఆవిడ శిలావిగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా అంటుండేది. ఎందుకంటే, పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత కూడా ఇంకా అదే మొగుడితో  కాపురం చేస్తున్నందుకట.”  
ఇలాటి  విశేషాలు తెలుసుకోవాలంటే   మార్పుచూసిన కళ్ళుపుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

17, నవంబర్ 2012, శనివారం

ఎవరీ వడ్డెర చండీదాస్ ?


ఎవరీ వడ్డెర చండీదాస్ ?
మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఆంధ్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏండ్లూ పూండ్లు గడిచిపోతున్నా ఆ రచన గురించి అతీగతీ తెలియకపోవడంతో ‘తన నవలను తనకు భద్రంగా  వొప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమయిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో పురాణంగారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు  సెలవులో వెళ్లడం వల్ల అప్పుడు వారపత్రికలో తాత్కాలికంగా సబ్ ఎడిటర్ గా   పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్ని గాలించి, పాతకట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము.
ఆ విషయం రచయితకు తెలియచేద్దాం అనుకుంటూనే పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రచురించడం చకచకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు వడ్డెర చండీదాస్.(అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న  ‘హిమజ్వాల’.        
వెలుగు చూడని ఈ సంగతులు తెలుసుకోవాలంటే -  ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

16, నవంబర్ 2012, శుక్రవారం

కన్ను కొట్టని కరెంటు దీపాలుకన్ను కొట్టని కరెంటు దీపాలు
మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడి వారికి తెలియదు.
ఒక నగరం నగరాన్ని, ఆ మాటకు వస్తే, ఒక దేశం దేశాన్ని అందులోను నీళ్ళు గడ్డకట్టే చలి వాతావరణం కలిగిన దేశాన్ని, ఆ దేశపు జనాన్ని   పొత్తిళ్లలో పసిపాపాయిల మాదిరిగా  వెచ్చగా ఏటిపొడుగునా వుంచడాన్ని అక్కడే చూసాము. ఏడాదిలో దాదాపు పది నెలలపాటు మంచు దుప్పటి కప్పుకుని వుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోగలగడం అక్కడ మాత్రమే సాధ్యం. అదీ పైసా (కోపెక్కు) ఖర్చులేకుండా.
ఇళ్ళూవాకిళ్ళు, ఆఫీసులు, ఆవరణలు, బస్సులు,రైళ్ళు, టాక్సీలు,ట్రాములు,హోటళ్ళు,సినిమా హాళ్ళు, స్కూళ్ళు కాలేజీలు, చివరాఖరుకు  స్విమ్మింగ్ పూల్స్ కూడా ఎయిర్ కండిషన్ అంటే నమ్మ శక్యమా చెప్పండి.’   
మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మార్పుచూసిన కళ్ళుపుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

చవక అనే పదం కన్నా చవక


చవక అనే పదం కన్నా చవక 
మన రూపాయికి నూరు పైసలు మాదిరిగానే రష్యన్ రూబుల్ కు వంద కోపెక్కులు. ఒక కోపెక్కుకు దొరికే వస్తువులు కూడా వున్నాయి. ఉదాహరణకు అగ్గిపెట్టె, కోడి గుడ్డు లాటివి. గ్యాలన్ పెట్రోలు ముప్పయి కోపెక్కులు. పది రూబుళ్ళు మనవి కావనుకుంటే కారు ట్యాంకు నింపుకోవచ్చు. పాలకూ,పెట్రోలుకూ ధరలో తేడా వుండదు. ఒక్క మాస్కోలోనే కాదు దేశం అంతటా ఒకేవిధమయిన ధరవరలు. పల్లెల్లో బస్తీల్లో అంతా సమానమే. పైగా ప్రతి  వస్తువు మీదా దాని ధర ముద్రించి వుంటుంది. ఆఖరికి ఒక్కొక్క కోడి గుడ్డుపై కూడా ఒక్క కోపెక్కు అని ధర స్టాంప్ వేసి వుంటుంది. బేరసారాల అవసరం లేకపోవడం, ధర గురించిన బాధ లేకపోవడం ఇవన్నీ భాష తెలియని మా బోంట్లకు వరంగా మారాయి” 
మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మార్పుచూసిన కళ్ళుపుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను:            9394712208      , Email: lakshmanarao_konda@yahoo.co.in>,

15, నవంబర్ 2012, గురువారం

మాస్కో గోంగూర


మాస్కో గోంగూర
‘మాస్కోలో అన్నీ చవకే కాని శాకాహారులకే కొద్దిగా ఇబ్బంది. మంచు దేశం కాబట్టి కూరగాయలు దొరకవు. దొరికినా మనవైపు అలవాటయినవి అసలే దొరకవు. ఒకటీ అరా కానవచ్చే ఆకు కూరల్లో కొన్నింటిని మా ఆవిడ శబరి మాదిరిగా కొరికి చూసి – గోంగూర పులుపుకు కాసింత దగ్గరగా వున్న ఒక ఆకు కూరకు ‘గోంగూర’ అని నామకరణం చేసింది. ఆ తరువాత మాస్కోలో వున్న అయిదేళ్ళూ వచ్చిన అతిధులకు ఆ గోంగూరతోనే ఆతిధ్యం.’
‘మాస్కోలో పాలకు కొదవలేదు. వున్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మ పదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు చేసుకోవచ్చు. కానీ, తోడుకు పెరుగేదీ? ఢిల్లీ నుంచి ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ చిన్ని గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతి చేసుకున్న పెరుగుతో ప్రారంభించిన ‘తోడు’ ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమై సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాము. దాంతో ఇక మాస్కోలోని తెలుగు లోగిళ్ళలో పెరుగు వడలు, పెరుగు పచ్చళ్ళు, ఆవకాయ కారంతో పెరుగన్నాలు, మజ్జిగ పులుసులు స్వైర విహారం చేయడం మొదలెట్టాయి.”    
మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

14, నవంబర్ 2012, బుధవారం

మంచు సమాధుల్లో మోటారు కార్లు


మంచు సమాధుల్లో మోటారు కార్లు
‘మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం. ఆ తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే మిగిలిన నాలుగు నెలలు కూడా చలికాలమే’ 
‘తెల్లటి మంచు రేకలు నిరంతరం నింగి నుంచి జాలువారుతూనే వుంటుంది. ఆ మంచువానలో దుస్తులన్నీ మంచు కొట్టుకు పోతాయి కాని తడిసి ముద్దయి పోవు. ఎందుకంటే అక్కడి మైనస్ టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. ఇళ్లముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. చాలామంది కార్లను మంచు సమాధుల్లోనే వుంచేసి మెట్రో రైళ్ళలో రాకపోకలు సాగిస్తుంటారు.’


వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి
కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు
దీపావళి శుభాకాంక్షలు 


మీ హృదయాంగణంలో
మీ గృహప్రాంగణంలో
దీపావళి దివ్య కాంతులు వెల్లివిరియాలని
మనసారా కోరుకుంటూ –

నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు 


12, నవంబర్ 2012, సోమవారం

ఎంతెంత దూరం? ఇంకెంత దూరం? - భండారు శ్రీనివాసరావు


ఎంతెంత దూరం? ఇంకెంత దూరం?  - భండారు శ్రీనివాసరావు

టీఆర్ఎస్ అధినేత  కె.చంద్రశేఖరరావుకు మళ్ళీ కోపం వచ్చింది. ఢిల్లీ పిలిపించి, రోజుల తరబడి చర్చించి పిదప  మొండి చెయ్యి చూపించిన చేతి పార్టీ నాయకులపై  ఆయన నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని, ఇక నమ్మే ప్రసక్తి లేదనీ, ఎన్నికల్లోనే అమీతుమీ తేల్చుకుని తెలంగాణాను సాధించుకుంటామనీ పార్టీ మేధోమధనం అనంతరం ఆయన  తేల్చిచెప్పారు. ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా తెలంగాణా తదాఖా చూపుతామని హెచ్చరించారు.  వంద అసెంబ్లీ సీట్లు, పదిహేను లోకసభ స్థానాలు టీ.ఆర్.ఎస్. తనకు తానుగా గెలుచుకుంటే ఢిల్లీ దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని తమ చేతులో పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మరో విధాన ప్రకటన చేశారు. అనుభవం మీద తత్వం బోధపడడమంటే ఇదే కాబోలు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే  తెలంగాణా విషయంలో చేసిన ప్రకటన మరో రకంగా వుంది. అనుకూల ప్రతికూల వర్గాలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి వీలుగా కూడా  వుంది.  ఇన్నేళ్ళు ఆగిన వాళ్లు మరికొన్ని నెలలు ఆగలేరా అని ఒక ప్రశ్నాస్త్రాన్ని ఆయన విభజన వాదులపై సంధించారు. పరిష్కార  ఘడియ రోజుల్లో కాకపోయినా కొన్ని నెలల్లో వుందని ఆ మాటలకు కొందరు భాష్యం చెబుతుంటే,  పరిష్కార మార్గాన్ని చెబితే స్వాగతిస్తామని చెప్పడం ద్వారా తాము ఇంతవరకు ఎలాటి పరిష్కారాన్ని కనుగొనలేదన్న నిజాన్ని చెప్పకనే చెప్పారని మరికొందరు అన్వయాలు అద్దుతున్నారు.
కేంద్ర మంత్రి చేసిన ప్రకటన, అసలు  విషయాన్ని మరింత గందరగోళపరిచేదిగా వున్నప్పటికీ, తెలంగాణా పట్ల కేంద్రం ఇంకా ఒక స్పష్టమయిన అవగాహనకు రాలేదన్న స్పష్టమయిన సంకేతం ఇచ్చేదిగా వుండడం విశేషం.       
మరోపక్క  మాజీ జీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు ఇంకో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినేత్రికి చివరాఖరు లేఖ రాయబోతున్నామని హెచ్చరిస్తూనే, డిసెంబర్ 9 లోగా   రాష్ట్ర విభజన విషయంలో తమ అభీష్టానికి అనుగుణంగా అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఒకటి రెండు రోజుల్లో బహిర్గతం చేసే ఆ లేఖలో తమ భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేస్తామని కూడా ముక్తాయింపు ఇచ్చారు. ఇవి పైకి విలేఖరులకు చెప్పిన మాటలు. పత్రికల్లో  వెలువడ్డ అభిజ్ఞవర్గాల కధనాలు మరింత ఘాటుగా వున్నాయి.
తెలంగాణా ఏర్పాటు విషయంలో రాజీలేని పోరాటానికి సిద్ధపడుతున్నట్టు ఆ కధనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చివరి ప్రయత్నం పట్ల కూడా అధినేత్రి  సానుకూలంగా స్పందించక పోతే వేర్పాటును కోరుకునే సంఘాలు, సంస్థలతో కలసి ఒక ఫ్రంటు ఏర్పాటు చేసే అంశాన్ని సైతం ఆ ప్రాంతపు కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.           
కేంద్ర హోం మంత్రి చెప్పిన దాని ప్రకారం తెలంగాణా  అంశానికి సంబంధించిన సమస్త  వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద వున్నాయి. అన్ని  వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది.  వారికి కావాల్సింది  రెండేళ్ళ లోపు  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.
సరే! మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందని కేంద్ర మంత్రి ఒక ఉచిత సలహా ఇచ్చారు బాగానే వుంది. కాని, తెలంగాణా అంశం కారణంగా రాష్ట్రంలో కుంటుపడ్డ పాలన సంగతి ఏమిటి? పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే పాలకులు, ఉన్నతాధికారుల దినవారీ   వ్యక్తిగత జీవితాలపై  వెంటనే పడే అవకాశాలు లేని అస్తవ్యస్త  వ్యవస్థ మనది. అందుకే పాలన కుంటుపడ్డా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వుండడానికి కారణం ఇదే. కానీ పాలితుల పరిస్తితి మరోరకంగా వుంటుంది. నిధుల లేమి కారణంగానో, ఇతరేతర కారణాలతోనో   ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ  వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల ప్రజలు  పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే,  రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సిరావడంవల్ల పాలన  కొంత మేరకు  మందగించిందనే   సర్కారు   సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం.
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే  ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా వేళ్ళూనుకుని  పాతుకుపోయివున్న ప్రగాఢ  కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి  ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై  కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు యాంత్రిక జీవన రంగ స్తల  యవనిక పైకి వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం ఉద్యమాలు చెలరేగినప్పుడు - చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు  సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది.
విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన ఇవన్నీ గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు  బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన  తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా  వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే  అవకాశంగా తీసుకుని తమ  పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని  తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.
మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా  బడికి  ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే  ఆఫీసులకు సెలవు పెట్టి తమ పిల్లలను చదివిస్తున్న రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల చదువులకే పెద్దపీట వేసే తలితండ్రులే ఈనాడు  లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు.  వాళ్లు ఆఫీసులకు రావడం  ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని  తమ వాహనాల్లో ఇళ్లనుంచి సకాలంలో  ఆఫీసులకు  తరలించే కొత్త యాజమాన్య వర్గాలు తయారయ్యాయి. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కాలంతో పరిగెత్తే కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.
ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను  శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన  పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు  ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే  వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ  వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.
తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి  నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు  లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను ఎవరు యెంత గట్టిగా కోరుకుంటున్నారో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు.  అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే  క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం పోరాడేవారిలోనే  పోరాటపటిమ కొరవడుతోందనే అపోహలకు ఆస్కారం కలుగుతుంది. 
వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. కొడుతూ కధ వింటున్న పిల్లలు అంటారు. బావిలో పడ్డ సూది  అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న వేస్తుంది.  అది అర్ధం కాని పిల్లలు ఆ!అంటారు. ఆ!అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (12-11-2012)

11, నవంబర్ 2012, ఆదివారం

ఆత్మీయ వచనంరాయపాటి సాంబశివరావు,
పార్లమెంటు సభ్యులు, గుంటూరు

వ్యాపారపు పనులమీద విదేశాలకు వెళ్ళినప్పుడు అనేకమంది పరిచయం అవుతుంటారు.
కొందరితో పరిచయాలు ‘రైలు స్నేహాల’ మాదిరిగా విడిపోయేవరకు విడలేని విధంగా వుంటాయి. మరికొన్ని జీవితాంతం కొనసాగుతాయి.
నేను మొదటిసారి శ్రీనివాసరావును కలుసుకున్నది హైదరాబాదులో.  రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన తరువాత  రేడియోలో పనిచేసే ఆకిరి రామకృష్ణారావు, ఆయనా  కలసి వచ్చి  ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ అదే శ్రీనివాసరావును చాలా ఏళ్ళ తరువాత మాస్కోలో కలిసాను. అంతకుముందు ఆయన స్థానంలో పనిచేసిన ఏడిద గోపాలరావుతో నాకు మంచి పరిచయం. అలాగే  ‘రాదుగ’ ప్రచురణాలయంలో పనిచేసే ‘ఆర్వీయార్’ కూడా బాగా తెలుసు. మాస్కోలో వున్న తెలుగు విద్యార్ధులందరికీ వాళ్ళిద్దరూ ‘గాడ్ ఫాదర్స్’ లాటివారు.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న కాలంలో ఇండియన్ ఎంబసీ లో పనిచేసే తెలుగువాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతకుముందు వరకు అంటీ ముంటనట్టుగా వుంటున్న తెలుగు కుటుంబాల నడుమ సంబంధాలు శ్రీనివాసరావు మాస్కో వచ్చిన తరువాత బాగా మెరుగుపడ్డాయి. దీనికి కొంత ఆయనకు స్వతహాగా వున్న ‘పీఆర్’ కారణమయితే, ఆయన భార్య నిర్మలాదేవి ఆప్యాయతా ఆదరణ బాగా దోహదం చేశాయని  నేననుకుంటున్నాను.
నేను మాస్కో వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళేవాడిని. భోజరాజు ఆస్థానం మాదిరిగా ఇల్లంతా సందడి. శనాదివారాలు వచ్చాయంటే చాలు మాస్కోలోనే కాదు   చుట్టుపక్కల నగరాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్దులెంతోమంది వారింట్లో కనిపించేవారు.  వాళ్ళావిడ నిజంగా అన్నపూర్ణ. ఎంతమంది వచ్చినా విసుగులేకుండా వండి వార్చేది. అన్నదాతా! సుఖీభవ!
పోతే, శ్రీనివాసరావు (నేను ఆప్యాయంగా ‘సీనప్పా’ అని పిలుస్తాను) ఆనాటి మాస్కో రోజులు గురించి   రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ పుస్తకం చదివాను. అప్పటి, అక్కడి పరిస్తితులను కళ్ళకు కట్టినట్టుగా రాసాడని అనడంలో సందేహం లేదు.
నాకొచ్చిన సందేహం ఒక్కటే. ఇలాటిది రాసి ఇన్నేళ్ళుగా నాకెందుకు చెప్పలేదన్నదే.


(సం) రాయపాటి సాంబశివరావు                 

10, నవంబర్ 2012, శనివారం

మిత్రవాక్యంఐ. వెంకట్రావు, చీఫ్ ఎడిటర్, మహా టీవీ,
మాజీ ఎడిటర్, ఆంధ్ర జ్యోతి, మాజీ చైర్మన్, ప్రెస్ అకాడమిఅలనాటి సోవియట్ అనుభవాలు అంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా కేవలం ఒక సాధారణ వ్యక్తిగా తన అనుభవాలను గ్రంథస్తం చేయడం బాగుంది. ఈ పుస్తకానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టడం ఇంకా బాగుంది. ఇందులోనే  ఆయన కవి హృదయం కూడా  అర్ధమవుతుంది.
శ్రీనివాసరావు, నేనూ డెబ్బయ్యవ దశకంలో బెజవాడలో ఆంధ్ర జ్యోతిలో కలిసి పనిచేసాము. వాళ్ల అన్నగారు భండారు పర్వతాలరావు గారినుంచి చక్కని  సంభాషణా చతురతను  అందిపుచ్చుకుని వుంటారు. ఎక్కడవుంటే అక్కడ నవ్వుల వాన కురిపించడం వాళ్లకు వంశానుగతంగా లభించిన వరమేమో.
శ్రీనివాసరావు   జర్నలిస్టుగా కన్నా హాస్య  రచయితగా  మరింత బాగా రాణిస్తాడన్న అభిప్రాయం మాలో చాల మందికి వుండేది.  ఆరోజుల్లోనే  ఆంధ్రజ్యోతిలో ఆయన అనుదినం  రాసిన  నాలుగు పంక్తుల ‘వాక్టూన్లు’,  ఆ తరువాత ఆకాశవాణిలో సొంత గొంతుకతో  వారం వారం వినిపించిన ‘జీవన స్రవంతి’ దీనికి ప్రబల  తార్కాణం. ఆ వొరవొడే ఈ పుస్తకంలో కూడా తొంగి చూసింది. చదివించే గుణాన్ని  సుతారంగా ఈ రచనకు అద్దింది.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న రోజుల్లో నేనొకసారి వెళ్లాను. వున్నది కొద్ది రోజులే అయినా ఈ పుస్తకంలో రాసినవి అక్షర సత్యాలని అప్పటి రోజులను తలచుకుంటే అనిపిస్తోంది.
ఇన్నేళ్ళ తరువాత రాసినా వాటిల్లో తాజాతనం తగ్గకపోవడానికి ఆ రోజులకున్న ప్రత్యేకతే కారణం.
భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి నుంచి, దూరదర్శన్ నుంచి వృత్తిరీత్యా  పదవీ విరమణ చేసివుండవచ్చు.  కానీ,  ప్రవృత్తి రీత్యా ఆయనకు అక్షర సన్యాసం లేదు. అందుకే కాబోలు ఇప్పటికీ ఆయన అక్షర సాంగత్యాన్నే కొనసాగిస్తున్నారు.
ఆలస్యంగా అయినా ఈ  పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నందుకు ‘వయోధిక పాత్రికేయ సంఘం’ వారు అభినందనీయులు.


(సం) ఇనగంటి వెంకట్రావు మార్పుచూసిన కళ్ళు


మార్పుచూసిన కళ్ళు


“కొంత కాలం గడిచిన తరువాత కొన్ని విషయాలు విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని ఔనా! అనిపిస్తే మరికొన్ని ఔరా! అనిపిస్తాయి. గతానికి వున్న గొప్పదనం అదే.
“భండారు శ్రీనివాసరావు రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ చదువుతుంటే ఆయన అనుభవాలు అందరి అనుభవం లోకి వస్తే యెంత బాగుండు అని నాకు అనిపించింది. కానీ ఇప్పుడది అసంభవం. రచయిత ఆ దేశంలో గడిపివచ్చిన కాలం అలాటిది. ఇప్పుడది చరిత్రలో భాగం.
“ఒక దేశంలో కొన్నాళ్లో, కొన్నేళ్లో వుండివచ్చేవాళ్ళు చాలామంది తారసపడుతుంటారు. అక్కడి అనుభవాలను గుదిగుచ్చినట్టు చెప్పేవాళ్ళూ  వుంటారు. కానీ, ఆహ్లాదకరంగా, వాస్తవాలను వక్రీకరించకుండా, ఏకబిగిన చదవాలని అనిపించేట్టుగా కొందరు మాత్రమే తమ అనుభూతులను అక్షరబద్ధం చేయగలుగుతారు. ఇది చదివిన తరువాత శ్రీనివాసరావు ఈ కోవకు చెందిన వాడన్న అభిప్రాయం నాకు కలిగింది.”


– శ్రీ కె.ఎస్.శర్మ,(ఐ.యే.ఎస్.),  మాజీ సీయీవో, ప్రసార భారతి (ఆకాశవాణి,దూరదర్శన్) న్యూ ఢిల్లీ

ఈ విశేషాలు తెలుసుకోవాలంటే   ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

9, నవంబర్ 2012, శుక్రవారం

రష్యన్ మహిళ నోట తెలుగు మాట


రష్యన్ మహిళ నోట తెలుగు మాటమేము మాస్కో చేరిన మరునాడే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది.
'శ్రీనివాసరావు గారూ మీ ఆగమనం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము’ అంటూ జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే దేశం కాని దేశంలో తెలుగు తెలిసిన విదేశీ వనిత ఒకరున్నారని సంతోషపడ్డాము.’
వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఇంగువ తెచ్చిన తంటా


మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఇంగువ తెచ్చిన తంటా


"మాస్కోలో శాకాహారులకు ఏమీ దొరకవు అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము - మాస్కో ఎయిర్ పోర్ట్ లో  లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాము. హైదరాబాదు నుంచి సూటు కేసులనిండా పట్టుకొచ్చిన వంట  సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కాని, మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణంలో గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామని ఎన్నో విధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంత కూడా అర్ధం కాని రష్యన్ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అని అర్ధం అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకుంటున్నంత ప్రమాదకరము, మాదక ద్రవ్యం కాదని రుజువు చేసుకున్న తరువాతనే అక్కడ నుంచి బయట పడగలిగాము" 
   
ఇలాటి సంగతులు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను:            9394712208      , Email: lakshmanarao_konda@yahoo.co.in>,