30, జూన్ 2015, మంగళవారం

అందరి శ్రేయోభిలాషి


'ఈ పాడు ప్రపంచంలో అందరూ అందరే. ఎవరికీ మనగురించి పట్టదు. మన మేలు కోరుకునే వాళ్లు ఎవళ్ళూ లేరు' అన్నాడు ఏకాంబరం
'అలా యెలా? అసలాసంగతి ముందు చెప్పు' అడిగాడు లంబోదరం
'యెలా ఏమిటి? ఈ డాక్టర్లు వున్నారు చూడు, మనం బాగుండకపోతేనే వాళ్లకు బాగుండేది. అందుకే ఏదో రోగం రొష్టూ రావాలనే వాళ్ల యావంతా'
'అలాగా'
'అలాగే. పోలీసులకి మనం ఒక దొంగ కావాలని, అయితే ఓ పట్టు పట్టేసుకుని అడ్డదారిలో  ఓ ప్రమోషనో, రహదారిలో  ఓ ఆమ్యామ్యానో నొక్కేద్దామని దొంగచూపులు చూస్తుంటారు.  లాయర్లూ  అంతే! ఏదో ఒక కేసులో ఇరుక్కుంటే మనల్ని  బయట పడేసి తాము బాగుపడిపోదామని వెధవది వాళ్లకు వెధవాశ. పొట్టకొస్తే అక్షరమ్ముక్క రానివాళ్లమయితే ట్యూషన్లు చెప్పి నాలుగు డబ్బులు పోగేసుకుందామని చూస్తారు టీచర్లు. ఇక మన ఇంటి ఓనరు వుంటాడు చూడు, మనం ఎప్పటికీ ఏబ్రాసి మొహం వేసుకుని ఇలాగే  సొంత ఇల్లు కొనుక్కోకుండా, జీవిత పర్యంతం వాడికి కిరాయి కడుతూ అద్దె ఇంట్లోనే అఘోరించాలని పాడు ఏడుపు. పోనీ ఆ పంటి వైద్యుడికయినా మనమీద కనికరం వుందా అంటే అదీ లేదు, మనం పుటకతోనే పుచ్చిన పళ్ళతో పుడితే పండగ చేసుకునే రకం. మన స్కూటరు పంక్చరు కావాలని, కారు  ఇంజిను రీబోరింగుకు రావాలని మెకానిక్కులు దేవుడికి మొక్కుకున్నా ఆశ్చర్యం లేదు. ఏం చెప్పమంటావు లంబోదరం,  ఈ లోకంలో అందరూ మన కీడు కోరుకునేవారే. ఒక్క దొంగ తప్ప. వీళ్ళందరికన్నా ఇళ్లకు కన్నాలు వేసే ఆ దొంగే మిన్న'


'దొంగా! అదెలా!' నోరెళ్ళబెట్టి అడిగాడు లంబోదరం'
ఏకాంబరం చెప్పిన జవాబుతో లంబోదరం తెరుచుకున్న నోరు మళ్ళీ మూతపడకుండా అలాగే వుండిపోయింది.
'ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒంట్లో పుష్కలంగా వుండాలి. ఏడువారాల నగలు చేయించుకోవాలి. బ్యాంకుల్లోనే కాదు ఇళ్లల్లోను దాచుకునేంత దండిగా డబ్బులుండాలి.   రాత్రి పూట హాయిగా గురక పెట్టి నిద్రపోవాలి' అని మనసారా కోరుకునే శ్రేయోభిలాషి నిజానికి ఈ సృష్టి మొత్తంలో దొంగ ఒక్కడే. కాదంటావా లంబోదరం!
(30=06=2015)

Note : Courtesy Image Owner 

ఒక్కసారి రైలెక్కాలని వుందొదినా!


"ఈ మాట అనకపోయినా బాగుండేదని ఆ సాయంత్రం ఓ లక్ష సార్లయినా అనుకుని వుంటాను. కానీ బంగారు లేడి కోరిక కోరి భర్తకు దూరమయిన సీతాదేవి, ఆ  తరువాత  యెంత పరితపించివుంటే మాత్రం  ఏం లాభం? అయితే  సీతకు దొరకని ఆ బంగారు లేడి, దేశం కాని దేశంలో భాష కాని భాష మాట్లాడే ఓ 'లేడీ' రూపంలో  నాకు దొరికింది" అంది మా మేనకోడలు పలివెల జయ.
జయకు కబుర్ల పోగు అనే పేరుంది. గలగలా మాట్లాడుతుంది. అంతే కాదు విన్నంతసేపు ఇంకాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించేలా వుంటుందా వాక్ప్రవాహం.


(శ్రీమతి జయ పలివెల)(శ్రీ పలివెల సుబ్బారావు)


పిల్లలు ముగ్గురూ వివిధ దేశాల్లో వుండడం మూలాన అమెరికా, ఆస్త్రేలియాలే కాకుండా పనిలోపనిగా జయ ఆడపడుచు వాళ్ళుండే న్యూజిలాండ్ కూడా చుట్టబెట్టుకొచ్చారు జయ, సుబ్బారావు దంపతులు. ఆ  నానాదేశ సందర్శన సందర్భంలో న్యూజిలాండులోని ఆక్ లాండులో జరిగిందీ సంఘటన.
'ఎప్పుడూ విమానాలు కార్లేనా ఒక్కసారన్నా రైలెక్కకపోతే యెట్లా' అన్నది జయ మనసులోని మాట. మా మేనకోడలు పుట్టిపెరిగిన ఖమ్మం మామిళ్లగూడెంలోని వాళ్ల పుట్టిల్లు రైలుకట్ట పక్కనే వుంది. రైలు చూడకుండా, రైలు కూత వినకుండా వాళ్లకు పూటగడవదు. అందుకే కాబోలు న్యూజిలాండులో రైలెక్కి తిరగాలన్న కోరిక కలిగినట్టుంది.
'రైలేనా! అదెంత భాగ్యం' అన్నది వాళ్ల ఆడపడుచు రూప. అంతే. ఆరోజు కారెక్కించుకుని వూర్లోని  వింతలూ విశేషాలు చూపిస్తున్న రూపకు, జయ కోరిన కోరిక గుర్తొచ్చి కారును రయ్యిమని దగ్గర్లో వున్న రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి ఆపింది. కారును పార్కుచేయడం, దగ్గర్లో వున్న మరో స్టేషనుకు టిక్కెట్లు కొనుక్కోవడం, ప్లాటుఫారం మీద రైలుకోసం ఎదురుచూస్తూ వుండడం క్షణాల్లో జరిగిపోయింది. ఇంటినుంచి తెచ్చుకున్న పులిహార పొట్లం వున్న సంచిని భద్రంగా చేతుల్లో పట్టుకుని,  నగలు నాణ్యాలు (వెయ్యి డాలర్లు) వున్న చేతి సంచిని ప్లాటుఫారం మీదనే వుంచి ఆడపడుచుతో కబుర్లలో పడింది. ఇంతలో రైలు రావడం, ఆగీఆగనట్టుగా ఓ లిప్తపాటు ఆగిన రైల్లోకి గబగబా ఎక్కి సీట్లలో జారగిలబడడం కూడా క్షణాల్లో జరిగిపోయింది.  సీట్లు దొరకడంతో మళ్ళీ మాటలు మొదలయ్యాయి. మాటల మధ్యలో డబ్బూ, బంగారం వున్న తన చేతి సంచీ జ్ఞాపకం వచ్చింది. అది చేతిలో లేకపోవడం చూసి గుండెల్లో గాభరా మొదలయింది. ప్లాటుఫారం మీద మర్చిపోయి రైలెక్కిన సంగతి కూడా నెమ్మదిగా గుర్తుకు వచ్చింది. కానీ ఏం లాభం అప్పటికే రైలు రెండు మూడు స్టేషన్లు దాటివచ్చింది. అందరూ గబగబా పక్క స్టేషన్ లో దిగి, మళ్ళీ తిరుగు  రైలు పట్టుకుని మొదటి స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ స్టేషన్  మాదిరిగానే వుంది, ఒక్క చేతి సంచీ తప్ప. ప్లాటుఫారం మీద హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న వీళ్ళని చూసి ఓ న్యూజిలాండు లేడీ పలకరించింది. 'మీరు మరచిపోయిన చేతి సంచీ మీ పక్కన కూర్చున్న మరో ప్రయాణీకురాలు తీసుకుంది. ఆవిడ అర్జంటు పని మీద వెడుతున్నారల్లే వుంది. సాయంత్రం అయిదు లోపల మళ్ళీ ఇక్కడికి వస్తాను. సంచీ తాలూకు వాళ్లు వస్తే మీలో ఎవరయినా ఈ సంగతి చెప్పండి' అంటూ హడావిడిగా వెళ్ళిపోయిందం'టూ  చల్లటి కబురు వాళ్ల చెవిలో వేసింది.  ఈ కబురు తెలవడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. కాకపొతే మరికొన్ని గంటలు ప్లాటు ఫారం మీదే గడపాలి. జరిగిన దానినే నెమరు వేసుకుంటూ, తెచ్చిన పులిహారను అయిష్టంగానే లాగిస్తూ మొత్తం మీద ఏదోవిధంగా కాలక్షేపం చేస్తూ కాలం దొర్లించారు. చీకటి పడుతోంది కానీ ఆ బంగారు లేడీ జాడ లేదు. ఆ జాడ చెప్పిన మనిషీ లేదు. దాంతో  సద్దుమణిగిన గాభరా మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటున్న సమయంలో దూరంగా రైలు కూత వినబడింది. ఆగిన రైల్లోనుంచి తొందర తొందరగా దిగిన ఓ లేడీ బిగ్గరగా ఏదో మాట్లాడుతూ హాండ్ బ్యాగ్ వూపుతూ కనిపించింది. చేతి సంచీ కనబడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది జయకు. ఒక్క పెట్టున అటుగా పరిగెత్తుకు వెళ్ళింది. జయను చూడగానే, ఎవరూ ఏమిటి అని అడగకుండా చేతి  సంచీ జయ చేతిలో పెట్టి, 'గోల్డ్ గోల్డ్, కేర్ ఫుల్' అంటూ రైలెక్కి వెళ్ళిపోయింది. కలయా వైష్ణవమాయయా అనుకుంటూ గిల్లి చూసుకున్న జయ సంచీ తెరిచి చూసుకుంటే నగలతో సహా డబ్బూ దస్కం (డబ్బంటే పిల్లాడు ఇచ్చింది, దస్కం అంటే ఇల్లాళ్ళ బ్లాక్ మనీ) అన్నీ పదిలంగా వున్నాయి.
ఏదయితేనేం మొత్తం మీద కధ సుఖాంతం అయింది. ముక్కూమొహం తెలియని ఆ బంగారు 'లేడీ' పోగొట్టుకున్నవన్నీ భద్రంగా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది.
ఇంటికి చేరిన తరువాత జయను ఇంకో సందేహం పట్టి పీడించింది.
'ఈ న్యూజిలాండ్ ఆడవాళ్ళకు డబ్బంటే లెక్కలేదు సరే,  కానీ బంగారం లాంటి బంగారు నగలు కూడా వీళ్ళకు  పనికి రాకుండా యెలా పోయాయబ్బా!'      (30-06-2015)

29, జూన్ 2015, సోమవారం

రాముడు మంచి బాలుడు


ఓ చిన్న క్విజ్ (బహుమతులు గట్రా లేవన్నది టాగ్  లైన్)

ముగ్గురు వ్యక్తుల్ని గురించి చెప్పుకుందాం. వారిలో మొదటి వాడున్నాడే అతగాడికి ఇద్దరు భార్యలు. ఎంతో చెడ్డ పేరున్న రాజకీయనాయకులతో పూసుకురాసుకు తిరిగే  మాచెడ్డ స్నేహం. జ్యోతిష్యం అన్నా జ్యోతిష్కులన్నా యమ గురి. ఇక సిగరెట్లు తాగడం మొదలు పెట్టాడంటే ఇక అంతా నిర్ధూమధామమే. చైన్ స్మోకర్ అన్నమాట. ఇతడ్ని ఈ పొట్టి కధ అయ్యేదాకా 'ఏ' అని పిలుచుకుందాం.
పోతే రెండోవాడు 'బీ'. సరిగ్గా పనిచెయ్యడం లేదని రెండుమార్లు ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పారు. పడకేసాడంటే చాలు   మిట్ట మధ్యాన్నం అయ్యే దాకా పడక మీద నుంచి లేవడు. కాలేజీ రోజుల్లోనే భంగు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను  ఓ పట్టు పట్టిన ఘనకీర్తి వుంది. పోద్దుగూకడం ఆలశ్యం  'బుడ్డీదాసు' గా మారిపోతాడు. సీసాలకు సీసాలు తాగే పెద్ద  పీపా అనే పేరు కూడా వుంది.  అదీ ఈ 'బీ' గారి చరిత్ర.
ఇక మూడో పెద్దమనిషి 'సీ' అనుకుందాం. నిజంగా పెద్దమనిషే. దేశం కోసం యుద్ధాలు చేసి 'వార్ హీరో' అని పేరు తెచ్చుకున్నాడు. శుద్ధ శాకాహారి. మద్యం, మాంసం వేలేసి ముట్టడు. సిగరెట్ పొగకు ఆమడ దూరం. పరాయి ఆడదాన్ని పట్టుకుని, కట్టుకున్న భార్యను  మోసం చేయాలనే ఆలోచన ఏ కోశానా లేని అపర శ్రీరామచంద్రుడు.
ఈ ముగ్గురిలో 'జెంటిల్ మన్' ఎవరు అంటే  ఏం చెబుతారో చెప్పండి?
ఆగండాగండి. ముందు ఈ  'ఏ' బీ' సీ' ఎవరో తెలుసుకోండి.
మొదటాయన 'ఏ'. ఈయన  ఎవ్వరో కాదు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి గొప్పపేరు తెచ్చుకున్న ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్.
రెండో ఆయన అంటే మన 'బీ'గారు మరెవ్వరో కాదు, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఘన కీర్తి పొందిన విన్ స్టన్ చర్చిల్.
ఇక మూడో వ్యక్తి,  'సీ' గారు, అదే, రాముడు మంచి బాలుడు అనే లక్షణాలు అన్నీ పుణికి పుచ్చుకున్న ఈ వ్యక్తి ఎవ్వరూ అంటే .........
వరల్డ్ ఆల్ టైం రికార్డు నియంత ..... హిట్లర్ మహాశయులవారు.

పై పై లక్షణాలు చూసి స్వభావం అంచనా వేయడం సరికాదన్నది ఇందులోని నీతి.
NOTE: Courtesy Image Owner  

27, జూన్ 2015, శనివారం

పీవీ గారి జ్ఞాపకాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 28-06-2-15, SUNDAY)

(జూన్ ఇరవై ఎనిమిది పీవీ నరసింహారావు జయంతి)  
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!! అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలం అధికార పీఠంపై వుంచిన అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత,  పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్ల తోనే  ఆయన్ని  తెగడడం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవే సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  కేసరి భజనే సర్వస్వమయిపోయింది. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ పత్తిత్తులకు ఆయన చేసిన మేళ్ళు కానరాలేదు.


అయిదేళ్ళు తెలుగువాడి లోని వాడినీ  వేడినీ లోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త  న్యాయస్థానాలలో నిస్సహాయంగా బోనులో నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళు’, నోళ్ళు  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో జరిగిన తప్పులను  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞత, ‘విధేయత  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు  ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే,  రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో  రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని  ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా  హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.      

మాజీ ప్రధానిగా పీవీ  రాజ భవన్ లో వున్నప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా అని అక్కడవున్న భద్రతాదికారిని  అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత  మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు  ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది  కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత  కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా  నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. ఆతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. 'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
అలాటి మహానుభావుడు మరణించినప్పుడు ఆయన పార్టీ వాళ్లు ప్రవర్తించిన తీరు మరింత బాధాకరం.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పీవీ జయంతి, వర్ధంతి రెండింటినీ అధికారికంగా నిర్వహించాలని తలపెట్టడం ఓ వూరట.
పీవీ స్మృతికి నా నివాళి. (27-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

25, జూన్ 2015, గురువారం

అగ్నిమీళే పురోహితం .........
(కీర్తిశేషులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు)

(నిన్న కన్నుమూసిన ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారితో నాకు ముఖపరిచయం లేదు. అయిదేళ్ళ క్రితం ఈ వ్యాసం రాసే సమయంలో ఋగ్వేదంలోని మొదటి శ్లోకం గురించి వారిని ఫోనులో సంప్రదించాను. వారు ఎలాటి భేషజాలు లేకుండా ఎంతో అభిమానంతో ఫోనులోనే నా సందేహ నివృత్తి చేశారు. వారికి నా నివాళి - భండారు శ్రీనివాసరావు)  
     

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర  ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే  ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు  మందపాటి పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద పాటలు, వాటి రాగాలతో పాటు  గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు.  గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం  కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర  వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే.  ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.
పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.
రేడియోలో  చేరిన కొత్తల్లో ఓ రోజు  జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను  మొదట డైరెక్ట్ చేసిన ముద్దమందారం సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.
     
తన గొంతు తాను  వినాలని, తన మొహం తాను  చూసుకోవాలని ప్రతి మనిషికీ కొన్ని  బలహీనతలు  వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా.  రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు.   అలాటి వాళ్లకు వాళ్ళ  ఫోటో వాళ్ళకే  చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం  ఖాయం అనే చెప్పాలి.  ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో  దాగివున్న  వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.
ఈ రికార్డులకు హెచ్.ఎం.వి. (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం  కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.
పందొమ్మిదవ శతాబ్దంలో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త  గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.  


గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు  ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు

మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలనికోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు.  ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్,  ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర  శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.
తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం  సమావేశ మందిరానికి  తిరిగి  వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో  ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.


అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని  భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ  మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా  విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.
ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది. హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే  మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపుకు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను  వారెప్పుడూ వినివుండలేదు.
సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. గ్రామఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న  ఋగ్వేదంలోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

ఓం అగ్నిమీళే పురోహితమ్, యజ్ఞస్య దేవమృత్విజమ్, హోతారం రత్నధాతమమ్...."  – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో  మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - ఋగ్వేద శ్లోకానికి మాక్స్ ముల్లర్ ఆవిధంగా కలిగించారన్న విషయం తెలపడమే ఈ కధనంలోని విశేషం.
అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా  అన్నారు.

మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి  శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో-  వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా  లేకుండా,చెట్టుకొమ్మలపై  చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం  అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి  ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం  చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో   సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు.  ఎడిసన్ మహాశయులు  నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదేఅని ముగించారు మాక్స్ ముల్లర్.
(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞలతో భండారు శ్రీనివాసరావు)  

22, జూన్ 2015, సోమవారం

అంతయు మన మేలునకే


'అమ్మగారు ఈ రోజు ఇల్లూడ్చి వెళ్లిపోతా, నేనూ మా ఆయనా మార్నింగ్ షోకెడదామనుకున్నాం'
'ఓస్! అదెంత భాగ్యం, భాగ్యం! ఈ మాత్రానికే ఇంత ఇదయిపోయి అడగాలా ఏమిటి. ఇంట్లో  పనిదేముంది ? ఒక్క రోజు నడుం వంచి అంట్లు తోమితే నేనేమయినా అరిగి పోతానా, కరిగిపోతానా చెప్పు.  అలాగే వెళ్ళు. భాగ్యం.  అన్నట్టు ఓ  యాభయ్ ఇస్తా.  దగ్గరుంచు, సినిమా హాల్లో పనికొస్తాయి'
కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసుకుంటున్నాడు, ఏకాంబరం. దేవుడు చెవులకు  బిరడాలు పెట్టలేదు కదా! అందుకే, పనిమనిషి భాగ్యం, అతడి భార్య నీలాంబరి  నడుమ జరిగిన సంభాషణ పొల్లు పోకుండా అతగాడి చెవిన పడింది. 'ఇదేమిటి మా ఆవిడేనా అలా మాట్లాడింది' అంటూ ఓరకంట తేరిపారచూశాడు. యాభయ్ నోటు పనిమనిషి చేతిలో పెడుతూ కన్పించింది నీలాంబరి.  సందేహం లేదు కనిపించింది  ఆవిడే. విన్నది  ఆవిడ మాటలే.
అలా రోజంతా నీలాంబరిలో  ఆ మార్పు ఏమాత్రం మార్పులేకుండా  గంట గంటకూ వరదగోదారిలా పెరుగుతూ పోతోందే కాని ఏమాత్రం తగ్గేసూచనలు కానరావడం లేదు. పిల్లలు ఛానల్ మార్చి క్రికెట్ చూడాలని అంటే మామూలుగా అయితే సీరియల్ వస్తోంది  మార్చడానికి వీల్లేదంటే వీల్లేదని పట్టుబట్టే  శ్రీమతి నీలాంబరి ఆరోజు మాత్రం 'వెధవ సీరియల్ రోజూ వుండేదే,  ఒకరోజు చూడకపోతే కొంపలేమీ మునిగిపోవన్న'ట్టు  నీతులు చెబుతుంటే విని, పోతున్న ఏకాంబరం మతి మరికాస్త చక్కా పోయింది.
పనిమనిషితో, వాచ్ మన్ తో, పూలవాడితో, పాలవాడితో  నీలాంబరి  వ్యవహరించే తీరు, మాట్లాడే పధ్ధతి పూర్తిగా మారిపోవడంతో వూరువాడకు అదో టాపిక్ పాయింటు అయివుంటుంది. టీవీల్లో స్క్రోలింగు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో సందేహం లేదు. ఇంతగా ఇంత  మారిపోయిన మనిషిని కారణం అడుగుతే ఇంతెత్తున లేస్తుందేమో అన్న భయం పూర్తిగా తొలగిపోయాక, ఈ మార్పు శాశ్విత తాత్కాలికమనో, తాత్కాలిక శాశ్వితమనో నిర్ధారించుకున్నాక ఇక వుండబట్ట లేక అడిగేశాడు ఏకాంబరం, 'అసలీ ఆకస్మిక  మార్పుకి కారణం ఏమిట'ని.
ముందు మందహాసం. తరువాత ప్రశాంత వదనం. ఆ తదుపరి ఇల్లాలి  అనుగ్రహభాషణం ఇలా సాగిపోయాయి.
'ఎప్పుడూ ఆ ఫేసుబుక్కో మరో బుక్కో అంటూ ఆ కంప్యూటర్ ముందు మఠం వేసుకుని కూర్చోకండి మొర్రో అంటే నా మాట ఎప్పుడు  విన్నారు కనుక.  నేను చూడండి, సీరియల్ కోసం నిన్న టీవీ పెడితే ఒకటే యోగా గోల. ఎన్ని ఛానళ్లు మార్చి చూసినా యోగా మాత్రం మారలేదు. దాంతో దాని సంగతేమిటో చూద్దామని  ఇష్టం లేకపోయినా చూస్తూ పోయాను. బోలెడు మంది యోగా గొప్పతనం గురించి బోలెడు బోలెడు చెబుతూ పోయారు. యోగా చేస్తే కరెంటు పోయి మళ్ళీ వచ్చినట్టు మన శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రవహిస్తాయట. మంచి భావాలు, మంచి ఉద్దేశ్యాలు వాటంతట అవే కలుగుతాయట.'
'అది సరే! అవి యోగా చేసే వాళ్లకేమో. మరి నీ సంగతేమిటి? నువ్వెప్పుడు నేర్చుకున్నావు'
'నేర్చుకోవడమా నా బొందా! రోజంతా టీవీల్లో అదేపనిగా అవే చూపెడుతుంటే అవి చూసిన నా వొంట్లో  కూడా పాజిటివ్ ఎనర్జీ,  వానొచ్చినప్పుడు వూళ్ళో సైడు కాలవలో నీళ్ళ మాదిరిగా పొంగుతూ  ప్రవహిస్తోంది సుమా!'
'ఇదా! కధ! పోనీలే! అంతయు మనమంచికే అన్నారు' అనుకున్నాడు ఏకాంబరం దీర్ఘశ్వాస తీసుకుంటూ. 

   
(22-06-2015)
కార్టూనిస్ట్ అర్జున్ (గోతెలుగు డాట్ కామ్) కు కృతజ్ఞతలతో 

జన్మ ధన్యం


'పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి' పెళ్ళయిన జంటను పెద్దలు ఆశీర్వదించే తీరిది.
ఇలాటి ఆశీస్సు నిజంగా నిజమైన సందర్భం నిన్న తటస్థ పడింది.


(యువ దంపతులు వనం కోదండ రామారావు గారు, శ్రీమతి ఫణి రాజకుమారి గారు) 

ఒక కోదండరామారావు గారు, ఒక ఫణిరాజకుమారి గారు యాభయ్ ఏళ్ళక్రితం ఒకింటివారయ్యారు. నలుగురు అమ్మాయిలను కన్నారు. పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. పెళ్ళిళ్ళు చేసి వారి బాధ్యత నెరవేర్చుకున్నారు. నలుగురూ నాలుగు కుటుంబాల్లో కోడళ్ళు గా చేరి ఆఇంటి దీపాలుగా వెలుగులు పంచి పెడుతున్నారు. ఆ పిల్లలకు పిల్లలు. నిన్న అంతా కలిసి చూడ ముచ్చటగా ఆ పుణ్య దంపతుల యాభయ్యవ పెళ్లి వేడుకను కళ్ళు చెదిరేలా చేశారు. అల్లుళ్ళు సహకరించారు. అన్నేళ్ళ క్రితం వాళ్ల పెళ్ళికి హాజరయిన ఓ పెద్దమనిషి మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత పిల్లలు చేసిన పెద్దల పెళ్ళికి కూడా హాజరయి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. ఆ నాడు పెళ్లి చూడలేని ఈ తరం వాళ్లందరూ ఈ పెళ్లి వేడుకను కళ్ళారా చూసి ఆనందించారు. ఆశీస్సులు అందుకోవాల్సిన జంటను ఆశీర్వదించడానికి ఆ పెళ్లి మండపంలో ఆ జంటను మించిన పెద్దలు ఎవ్వరూ లేరు. అంచేత వాళ్ళే పెళ్ళికి వచ్చిన పిల్లా పాపలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
'పిల్లాపాపలతో ఆనందంగా జీవించండి' అని యాభయ్ ఏళ్ళనాడు వాళ్ల పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు నిజమైన సందర్భం నిన్న జరిగిన ఆ వేడుక. నలుగురు కుమార్తెలు, నలుగురు  అల్లుళ్ళు, వాళ్ల పిల్లలు ఆటా పాటలతో అలరిస్తే వేద పండితులు మంగళాక్షతలతో ఆశీర్వదించారు. అంత చక్కని వేడుక కళ్ళారా చూసిన వారికి భోజనాలు చేయకుండానే కడుపులు నిండిపోయాయి. ఆ తరువాత నిండయిన తెలుగు  భోజనంతో పొంగి పొర్లాయి.
అలా కన్నపిల్లల నడుమ, మనుమలు మనుమరాళ్ళ మధ్య ఇంత  చక్కటి వేడుక జరుపుకోవడం కంటే వేరే భాగ్యం ఏముంటుంది? ఇహపరమయిన ఇతర భోగభాగ్యాలన్నీ ఈ భాగ్యం ముందు దిగదుడుపు అనిపించింది.
జన్మధన్యం కావడం అంటే ఇదేనేమో!  (22-06-2015)