12, డిసెంబర్ 2017, మంగళవారం

దొరకని పుస్తకంలో విజయవాడ – భండారు శ్రీనివాసరావు (మూడో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. ఇందులో బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్  కధ ప్రధానమైనది. అదిలా సాగింది.
“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. చిందించిన స్వేదం వుంది. కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించి ఇచ్చాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల  తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా  పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి  134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణ మూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలని,  సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగి పోతుందనీ ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది.
అరవై ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం.

(ఇంకా వుంది)      

దొరకని పుస్తకంలో విజయవాడ – (రెండో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
“బోధిసత్వ మైత్రేయుడు  బెజవాడ దగ్గర ఒక కొండపై జ్ఞానోదయం కోసం తపస్సుచేసి, అక్కడే శరీరం వదలివేసాడని రాబర్ట్ సువెల్, రాయల్ ఏషియాటిక్ సొసైటీ (లండన్) 1884 పత్రికలో రాశాడు.
బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత మంజుశ్రీ గా జన్మించాడని, మైసోలియా (నేటి మచిలీపట్నం) నగరానికి త్రిపిటకాలు సంపాదించడం కోసం వెళ్లి తిరిగివస్తూ, దారిలో కొండ మీద గొప్ప తేజస్సు చూసాడని మంజుశ్రీ మూలకల్పంలో వుంది. శిష్యులు కనుగొనలేని ఆ రహస్యాన్ని చేధించేందుకు మంజుశ్రీ యోగమార్గంలో ఆ కొండ మీద వెలుగు వచ్చిన ప్రదేశానికి వెడతాడు.
ఆ క్రమంలో ఇంద్రకీలం మీద కొలువున్న కనకదుర్గాదేవి అంతరాలయం చేరతాడు. అక్కడ ఆ మహాపురుషుడికి తారాదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ తల్లిని చూడగానే ధ్యానం మొదలుపెడతాడు. కానీ, మనసు నిలవదు. మన్మధ ప్రకోపం మొదలవుతుంది. ధ్యాన యోగులకు ఇటువంటి అవక్షేపం సహజమే! మహాయోగి అయిన మంజుశ్రీ మన్మధ లీలను చూసి మార దమన మంత్రాన్ని చదువుతాడు. మన్మధుడు కనబడగానే ‘ఈ కొండ మీద ధ్యానం చేసుకునే యోగుల మనస్సులను వికారం చేయకుండా ఈ కొండలోనే బందీవై పోవాల’ని శపిస్తాడు. నిజానికి ఇది హిందూ పురాణాలలోని ఇంద్రనీలుని కధను పోలివుంది. ఆ సంగతి ఎలా వున్నా మంజుశ్రీ తన ధ్యానాన్ని ముగించుకుని పోతాడు. ఈ వృత్తాంతం మంజుశ్రీ మూలకల్పంలోని మార దమన సూత్రాలలో వుంది. ఆచార్య నాగార్జునుడు కూడా బెజవాడ వచ్చి ఈ కొండ మీద తారాదేవిని దర్శించాడని లంకావతార సూత్రాలకు వ్యాఖ్యానం చేసిన మహాయాన ఆచార్యులు తమ కారికల్లో పేర్కొన్నారు.
ఏతావాతా తేలేదేమిటంటే, 1300 సంవత్సరాలకు పూర్వం బెజవాడలో బౌద్దుల ప్రాబల్యం బాగా వుండేది. దుర్గామాత తారాదేవిగా పూజలు అందుకునేది.
ఏ పండితుడు ఏమన్నా, బెజవాడ నగరాన్ని హువాన్ చాంగ్ సందర్శించి అద్భుతమైన భావావేశం పొందాడు. ‘తారా తారా తత్తారా తారం తారం తత్తారం తారం’ అంటే ఏమిటో మంత్రోపదేశం పొందిన వారికి తెలుస్తుంది. ఎవరి నుంచి ఎప్పుడు ఆయన ఆ ఉపదేశం పొందాడో తెలియదు కాని, బెజవాడ మాత్రం హువాన్  చాంగ్  ని మరిచిపోయింది.
ఈ సందర్భంలోనే నేటి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభించిన నాగార్జునాచార్యుని శాసనం గురించి, ఘంటసాల శాసనం గురించీ చెప్పుకోవాలి. ఈ రెండింటి లోను భదంత నాగార్జునుడి ప్రస్తావన వుంది. ‘స్వస్తి భదంత నాగార్జునా చార్యస్య’ అంటూ ప్రారంభం అయ్యే ఈ శాసనం ద్వారా ఆయన బౌద్ధ మతాచార్యుడని స్పష్టమౌతున్నది.”
(ఇంకా వుంది)

11, డిసెంబర్ 2017, సోమవారం

దొరకని పుస్తకంలో విజయవాడ


నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే  నా భోజనం. ఆయన అక్కడే చాప మీద  వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని  అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.
ఆఫీసులో గుర్రపు నాడా ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో  ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే ఓ యాభయ్ నోటు వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.


Image may contain: 1 person

ఇక అసలు విషయానికి వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.
ఈ మధ్య ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలో  ‘భారతి’ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్ సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో వారి ప్రస్తావన వుంది)
ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.
“హువాన్ చాంగ్ చూసిన బెజవాడ”
చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి  తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.  
ఇంకో విచిత్రమైన విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.
ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా  మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.
హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు.

(షేర్ చేసే వారికి ఒక ప్రగాఢ విజ్ఞప్తి. రమణ గారు ఎంతో కష్టపడి శ్రమించి, తన శక్తికి మించిన కార్యం నెత్తికెత్తుకుని పూర్తి చేసారు. ఆయన ఏమీ కలిగిన వాడు కాదు. ఇది చెప్పడానికే   ముందు ఉపోద్ఘాతం రాశాను. రమణ గారు ఇప్పుడు ఎలాగూ లేరు, కనీసం ‘కీర్తి’ అయినా ఆయనకు దక్కనివ్వండి)       

సత్సంగంలో సమస్యాపూరణం

  
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”
(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నల్లుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ యాభయ్ అరవై ఏళ్ళు వెనక్కి పోవాలి.


(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)

నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు గుర్తులేదు, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మినహా.
నిన్న మా మేనల్లుడు రామచంద్రం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గుర్తున్న ఆ ఒకటి  రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం...... చతుర్విధం...) గురించి అడిగాను. అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవని చెప్పి టీకాతాత్పర్యాలు వివరించాడు.

అరవైఏళ్ళుగా నా మనసును తొలుస్తున్న సమస్యకు పరిష్కారం దొరికింది.                     

7, డిసెంబర్ 2017, గురువారం

జర్నలిష్టులకు మొదటి పాఠం


1970. అంటే నలభయ్ ఏడేళ్ళ నాటి ముచ్చట.
బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరిన తొలి రోజులు. ఎడిటర్ నార్ల గారు హైదరాబాదుకు మకాం మార్చడంతో నండూరి రామమోహన రావు గారే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు.
“ఏం రాయమంటారు?”
నండూరి వారికి నా ప్రశ్న.
“ఏదైనా రాయండి, ఏమి రాసినా అది  మీకు  ముందు అర్ధం అయిందా లేదా చూసుకోండి”

నండూరి వారి జవాబు.