31, ఆగస్టు 2010, మంగళవారం

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు


‘ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు  చీదరించుకునే ప్రాణి ఎవరు’ అని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే ‘బల్లి’ అని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు.

బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి – సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - ‘మడీతడీ’ అంటూ - ‘అంటూ సొంటూ’ అంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ – ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు.  ‘మడీ దడీ’ పేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ  అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం.  పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ  ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ  ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా ‘కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని  వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి – ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి  పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే – ఈ కధ కాని కధకు క్లైమాక్స్.

సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు  నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది.  కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే – ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా  వొడిలోకి తీసుకుంది. ‘అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూ’ ఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా – అమ్మమ్మ గారు – ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
 నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ  – మనసు పొరల్లో  కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్ని’ ఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ ‘అమ్మమ్మగారి’ ఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే  ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న
 (30-08-2010)

ఇలాటి ఉన్నత మనస్కుల ఫోటోలు కడిగి గాలించినా ఎక్కడా దొరకవు. అందుకే ఈ బ్లాగులో ఫోటోలు లేవు. 

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6 - భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6     - భండారు శ్రీనివాసరావు
“అంటరాని వాడు
అని నీవనుకుంటున్నవాడు
అంటుకున్నాడో
ఇక అది
ఆరని మంటే!”
వివక్ష అనేది ఏ రూపంలో ఎక్కడవున్నా అది సహించరానిది.

గాంధీ తో గోరా

అంతే కాదు వివక్షకు గురయ్యేవారు తిరగబడిన రోజున అది తిరుగులేని తిరుగుబాటే అవుతుందని –
గోరాగారి సాహచర్యంలో మసలిన మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారు చెబుతుండేవారు.
కానీ ఈ నాడు అమెరికాలో పరిణామాలను గమనిస్తూ - గతాన్నీ, వర్తమానాన్నీ  కలగలిపి ఆలోచిస్తుంటే - కులాలకూ, మతాలకూ యేవో గట్టి మూలాలే వున్నాయనిపిస్తోంది.
రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, వినబడ లేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టలేదు. సరికదా -
 పైపెచ్చు వాటికీ ఏటేటా రంగులూ, సున్నాలూ కొట్టి ముస్తాబుచేసి తాళాలు వేసి వుంచేవారు. గోర్భచెవ్ కాలంలో మేము అక్కడ వున్నప్పుడయితే - విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా.

లెనిన్ స్కీ ప్రాస్పెక్త్

 ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటే మరో విషయం ముచ్చటించుకోవాలి. మాస్కోలోని లెనిన్ స్కీ ప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో - పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చు బెట్టి ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

మాస్కో చర్చి

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి- భూగర్భం లోనే దానికింద చక్రాల ఉక్కు పలకను ఉంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చిని ఏమాత్రం దెబ్బతినకుండా వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డు పని పూర్తిచేశారని చెప్పుకునేవారు.

మాస్కో చర్చిలో పూర్వవైభవం
వారు అలా వాటిని ఎందుకు వుంచారో తెలియదుకానీ, ఇప్పుడు అవన్నీ పూర్వ వైభవంతో కళకళ లాడుతున్నాయని వింటున్నాము.

మాస్కో మసీదు

 డెబ్బయి ఎనభై సంవత్సరాలపాటు మతానికి సంబంధించిన పేర్లనుకూడా బహిష్కరించి, దాని తాలూకు సంప్రదాయాలను సమాధి చేసి, మతం గురించిన ప్రస్తావన కూడా లేకుండా చేసిన నాటి సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలయిన తరవాత, మళ్ళీ ఇన్నాళ్ళకు అక్కడ మతాలూ, మత సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయని కూడా వింటున్నాము.

మాస్కో మసీదులో ప్రార్ధనలు

మాస్కో జనాభాలో ఇప్పుడు ప్రతి అయిదుగురిలో ఒకరు ముస్లిం అని కూడా వింటున్నాము.

“మత మన్నది మన కంటికి మసకయితే – మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు” అని ప్రవచించిన కమ్యూనిష్టుల రాజ్యమే ఆ విధంగా అంతమయిన వైనం గమనించినప్పుడు – జనంలో మతానికి వున్న గట్టి పట్టు ఎలాటిదో బోధపడుతున్నది.
 ఈ నేపధ్యంలో - వర్తమానాన్ని ఓ మారు అవలోకిస్తే -

ప్రమాణస్వీకారం చేస్తున్న ఒబామా

శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది.

తిలకిస్తున్న అశేష జన సందోహం

వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. ఒబామాను అమెరికా అధ్యక్షుడిగా ఆ దేశ ప్రజలు ఎన్నుకుని ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే టీవీల్లో ఆయన మతం గురించిన చర్చ ప్రారంభమయింది. ఒబామా ఏ మతానికి చెందినవాడో తేల్చి చెప్పడానికి అన్ని చానళ్ళు శక్తివంచనలేకుండా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి.

ఇస్తాంబుల్ మసీదులో ఒబామా

నిరుడు ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే  ఏప్రిల్ లో టర్కీ వెళ్ళిన ఒబామా, అక్కడ ఒక మసీదుకు వెళ్లి ప్రార్ధనలు జరిపిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు.ఆయన  ఏదో ఒక మతానికి చెందినవాడయినా ప్రజలు ఆయనని ఎన్నుకున్నది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగానే.  కానీ,  గతంలో అధ్యక్షుడు బుష్  తరచుగా  చర్చికి వెళ్లినట్టు  ఒబామా వెళ్లడం లేదని, అందువల్ల ఆయన అసలు సిసలు క్రిష్టియన్ కాదనీ చర్చ మొదలయింది.  దైవ ప్రార్ధన అనేది వ్యక్తిగతమనీ, దానికోసం ప్రత్యేకంగా ప్రార్ధనాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదనే వాదన ఆయనను సమర్ధించే వారినుంచి వినబడుతోంది. ఇదంతా, నవంబర్లో జరగనున్న సెనేట్ ఎన్నికల్లో పైపట్టు సాధించడానికి ఒకరిపై మరొకరు రాజకీయంగా చల్లుకుంటున్న బురద అని కొందరు చెప్పారు.

నా బాధ అది కాదు. ఒబామా మతం పలానా అని  తేల్చగలిగినప్పుడు  - కులాల కట్టుబాట్లను కాలదన్ని, కావాల్సిన వాళ్ళను కాదనుకుని – ఎన్నో కడగండ్లనూ, కష్టాలను ఆహ్వానిస్తూ కులరహిత సమాజాన్ని కోరుకున్న అనేకమంది అభ్యుదయవాదులు  నమ్ముకున్న సిద్దాంతాల మాటేమిటి?
అప్పుడు-
కులమతాలకు అతీతంగా వాళ్ళు  ఇన్నాళ్ళుగా చేస్తూ వచ్చింది ఏమవుతుంది?
 ఏమవుతుంది?
రష్యాలో ఎనభై ఏళ్ళక్రితం ఏం జరిగిందో – తరవాత ఏం జరిగిందో అదే అవుతుంది. అంతే కదా! (30-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

30, ఆగస్టు 2010, సోమవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


రాసేవాళ్ళు చాలామంది వుంటారు. వాళ్ళల్లో మంచిగా రాసేవాళ్ళు కొద్దిమందయినా వుంటారు. కానీ వేసేవాళ్ళు వుండరు. ఇంతెందుకు- చాలా సంవత్సరాలక్రితం పురాణం గారు ఆంద్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా తన రచనకు అతీగతీ లేకపోవడంతో - ‘తన నవలను తనకు భద్రంగా ఒప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ’ అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో, పురాణం గారు - అప్పుడు అక్కడ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్నీ గాలించి, పాత కట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము. ఆ విషయం రచయితకు తెలియచేద్దామనుకుంటూనే - పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రచురించడం అన్నీ చక చకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు- వడ్డెర చండీదాస్ (అసలు పేరు చెరుకూరి బ్రహ్మేశ్వర రావు గారు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న –“హిమజ్వాల”-

కీర్తిశేషులు వడ్డెర చండీదాస్

స్వయంగా రచయిత అయిన పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకుడిగా మరెందరో రచయితలను వెలుగులోకి తెచ్చారు. తన సంపాదకత్వంలోని ఆంద్ర జ్యోతి వారపత్రికకు ఒక ప్రత్యేకతనూ, ప్రాముఖ్యాన్ని సమకూర్చిపెట్టారు. ఒక పక్క రచయితగా, మరో పక్క సంపాదకుడుగా రెండు భాధ్యతలను సమర్ధంగా నిర్వహించి పాఠకజనసామాన్యంచేతా, పత్రికాయాజమాన్యం చేతా సెహభాష్ అనిపించుకున్నారు.

కీర్తిశేషులు శ్రీ పురాణం


సంపాదకుడనే వాడు స్వయంగా సుప్రసిద్ధ రచయిత కావడం అనేది పత్రికకు ఎంతగానో మేలుచేస్తుందనడానికి పురాణం సుబ్రమణ్యశర్మగారే ఉదాహరణ. అయితే, కాస్తో కూస్తో అక్షరజ్ఞానం, అంతో ఇంతో భాషా పరిజ్ఞానం సంపాదకుడికి వుంటే చాలు, ఆ పత్రిక బతికి బట్టకట్టడమే కాదు అమ్మకాల్లో దిట్ట అనిపించుకోగలదని ప్రస్తుతం తెలుగు పత్రికారంగాన్ని ఏలుతున్న దినవారపత్రికలని చూస్తె తెలిసిపోతుంది. మంచి రచనలు చేసేవాడు, కొత్త రచయితలు చేసే మంచి రచనలని అంత తేలిగ్గా ఎంపిక చేసుకోలేడన్నది ఇక్కడి తాత్పర్యం. ఈగోలు, ఇతరత్రా కారణాలు పనిచేసి- తాము చేసే పనికి న్యాయం చేయలేరన్నది ఇందులోని ప్రతి పదార్ధం. (29-08-2010)

NOTE: All images in the blog are copy righted to respective owners

29, ఆగస్టు 2010, ఆదివారం

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

కారు గరాజు
కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళడానికి వీలుగా అమెరికాలో చాలామంది గరాజులోనుంచే ఒక ద్వారం పెట్టుకుంటారు. ఈ గరాజు తలుపులను కారులోనుంచే తెరవడానికీ, మూయడానికీ ఎలెక్ట్రానిక్ పరికరం వుంటుంది. దీనికి ప్రత్యేకమయిన కోడ్ వుంటుంది కాబట్టి ఒకరి గరాజు మరొకరు తెరవలేరు. కానీ దొంగలకు తెలివితేటలూ ఎక్కువ కదా.

గరాజును తెరిచే రిమోట్ 
 అంచేత ఓ దొంగ గారు బాగా కష్టపడి స్టడీ చేసి,ఒక ఇంటి గరాజు కోడ్ కు డీకోడ్ కనుక్కున్నాడు. ఆ తరవాత – ఆఇంటి ఆసామీ ఇంట్లో లేనప్పుడు ట్రక్కుతో సహావచ్చి గరాజు తెరిచి దర్జాగా ట్రక్కు అక్కడ పార్కు చేసుకున్నాడు. తాపీగా ఇంట్లోకి వెళ్లి అంతకంటే తాపీగా విలువైన సామానులన్నీసర్దుకుని  అలా సర్దుకున్నవన్నీ మళ్ళీ ట్రక్కులో సర్దేసుకుని దర్జాగా గరాజు తలుపులు మూసేసి మరింత దర్జాగా వెళ్లిపోయాడట. దొంగ దొంగలా కాకుండా దొరలా వచ్చి దొరలా పోవడం వల్ల చుట్టుపక్కలవాళ్ళకు కూడా ఎలాటి అనుమానం రాలేదట. కానీ ఇళ్ళల్లో  దొంగల్లా దూరేవాళ్ళని దొంగతనంగా ఫోటోలు తీసే పరికరాలు ఆ ఇంట్లో అమర్చివుండడం వల్ల ఆ దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఆట్టే కష్టపడాల్సిన అవసరం లేకపోయింది.

అదిగో! ఆ వెనక- సామాను సర్దుకుంటున్న దొంగ గారు
Photo Credit:John Myers

దొంగతనం చేయడానికి ఈ హైటెక్ దొంగగారు టెక్నాలజీ వాడుకుంటే న్యూ యార్క్ లో మరో దొంగ - దొంగతనం చేసిన గంటల్లోనే అదే టెక్నాలజీ పుణ్యమా అని పోలీసులకు దొరికిపోయాడు. ఆ వూళ్ళో పెళ్ళికి వెళ్ళిన ఓ పెద్దమనిషి పెళ్ళితంతు ముగిసిన తరవాత భార్యా పిల్లలతో కలసి వూరంతా తిరుగుతూ పోటోలు దిగుతూ కాలక్షేపం చేస్తున్న సమయంలో వెంట తెచ్చుకున్న బ్యాగ్ గల్లంతయిన సంగతి కాసేపటికి కానీ గమనించలేదు. ఇప్పుడు అమెరికాలో అంతా ముచ్చట పడడమే కాకుండా గంటలకు గంటలు క్యూలలో నిలబడి కొనుక్కుంటున్నయాపిల్ ఐ ప్యాడ్ , ఖరీదయిన ఇతర వస్తువులూ గట్రా ఆ సంచీలోనే వున్నాయి. పోలీసులదగ్గరికి వెడితే – పోయినవస్తువులు పోను- ఏమన్నా మిగిలి వుంటే అవి కూడా వూడలాక్కుంటారన్న భయం ఆదేశంలో లేనందువల్ల - అతగాడు పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. పోలీసులు కూడా ‘తీరిగ్గా విచారించి తీరిగ్గా పట్టుకుంటాం, అడ్రసిచ్చి వెళ్ళిరండి’ - అనకుండా కొంత బుర్ర పెట్టి ఆలోచించారు. ఫోటోలు తీస్తున్నప్పుడు దొంగతనం జరిగింది కాబట్టి ఆ కెమెరాతో తీసిన ఫోటోలను ఓసారి పరీక్షగా చూసారు. సంచీలో సామాను కొట్టేస్తున్న దొంగ ఓ ఫోటోలో స్పష్టంగా కనిపించాడు. పోజుపెట్టి మరీ ఫోటోలో పడ్డ ఆ దొంగ పోలీసులకు పట్టుబడడం తరవాత ఏమంత కష్టం కాలేదనుకోండి.

వృత్తి వ్యాపారం
సియాటిల్ లో ఈ మధ్య ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ చనిపోకపోవడం వల్ల వార్త కాదనుకున్నారేమో ఏమో మర్నాడు ‘తల్లి పత్రిక (మెయిన్ ఎడిషన్) లో కాదుకదా ‘పిల్ల పత్రిక’ (లోకల్ ఎడిషన్) లో కూడా ఏ పేపరు వాళ్ళు దాని జోలికి పోలేదు. పోలీసు వెబ్ సైట్ చూసేలోగా ఓ స్తానిక కుర్ర లాయరు గారి వెబ్ లో ఆ సంఘటన వివరాలన్నీ పూర్వాపరాలతో సహా కనిపించాయి. సమాచారం అంతా ఇచ్చిన ఆ లాయరు – ఇలాటి కేసుల్లో నష్ట పరిహారం ఇప్పించే అనుభవం తనకు పుష్కలంగా వుందనీ, అందువల్ల సంఘటనలో గాయపడ్డ వ్యక్తి తాలూకు వాళ్ళు తనని సంప్రదిస్తే తగిన ఫీజు తీసుకుని తగిన సాయం చేస్తాననీ చివర్లో ఒక ముక్తాయింపు ఇచ్చి వూరుకున్నారు. పరోపకారంలో వున్న పరమార్ధం ఇదన్న మాట.

(28-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

28, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5 -భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5         -భండారు శ్రీనివాసరావు

“చెబితే నమ్మరు కానీ - పిన్నిగారూ ఆ దేశంలో పనివాళ్ళు కూడా ఎంచక్కా ఇంగ్లీషే మాట్లాడుతారు”
కూతురు పురిటికోసం అమెరికా వెళ్ళివచ్చిన ఒకావిడ ఆ దేశపు విశేషాలు పొరుగావిడతో చెబుతూఅన్నమాటలివి.
నమ్మక పోవడానికి ఏమీ లేకపోయినా నమ్మలేని నిజం మరోటి వుంది. ఆ దేశంలో చాలామందికి ఇంగ్లీష్ అర్ధంకాదు. అంటే ఇంగ్లీష్ రాదని కాదు. మన ఇంగ్లీష్ ఉచ్చారణకు వాళ్ళు మాట్లాడేదానికీ తేడావుండడమే దీనికి కారణం. అయితే వాళ్ళు సంభాషించేటప్పుడు హావభావాలు కూడా ప్రదర్శిస్తారు కాబట్టి కాస్తో కూస్తో భావం అర్ధం అయ్యే అవకాశం వుంటుంది.

భాష సంగతి అటుంచి, అమెరికన్లు ‘అంటరానితనం’ పాటిస్తారేమోనని అనిపిస్తుంది
.

 బెల్ వ్యూ  స్క్వేర్ మాల్

 పార్కులు, సినిమా థియేటర్లు, షాపులు, మాల్స్ – ఎక్కడైనాసరే, యెంత రద్దీగా వున్న ప్రదేశాలలో అయినా సరే ఎక్కడా ఒకరిని ఒకరు తోసుకోకుండా, ఒకరిపై మరొకరు పడకుండా జాగ్రత్తపడతారు. సన్నిహితులయిన ఆడా మగా రాసుకుపూసుకు తిరగడం తప్పిస్తే, అమెరికన్లు కనీసం ఒకళ్ళనొకళ్ళు తాకను కూడా తాకరు.

డిస్నీలాండ్ లో సందర్శకులు

 డిస్నీలాండ్ లాటి కిటకిటలాడే టూరిస్ట్ కేంద్రాలలోలో సయితం వాళ్ళది ఇదే తీరు. తోసుకు పోవడం, రాసుకు తిరగడం వాళ్ళ దృష్టిలో అనాగరికం. క్యూలలో నిలబడేటప్పుడు కూడా ఒకరినొకరు తాకకుండా ఎడం వుండేలా చూసుకుంటారు. ఇతరులు కూడా తమ పట్ల ఇలాగే మసలుకోవాలని కోరుకుంటారు.

కార్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాగరీకం మరీ ముదిరిపోతుంది. పార్కింగ్ చేసే చోట మర్యాదలు చూసి తీరాలి. చాలాసేపు వేచివుండయినా ఎవరికీ అసౌకర్యం లేకుండా పార్క్ చేయడానికి ప్రయత్నిస్తారు.

వికలాంగుల కార్లకోసం రిజర్వ్ చేసిన పార్కింగ్

 పెద్ద పెద్ద మాల్స్ ప్రవేశ ద్వారాలకు దగ్గరగా వికలాంగుల కోసం పార్కింగ్ లాట్లు రిజర్వ్ చేసి వుంటాయి. అవి ఖాళీగా వున్నాసరే, దూరంగా వెళ్లి కారు నిలుపుకుంటారు కానీ అక్కడ పార్క్ చేయరు. ఇక, హారన్ మోగించడం అంటే అవతలవారిని అవమానించడమే అని వారి ప్రగాఢ నమ్మకం. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి, అటునుంచో ఇటునుంచో పక్కనుంచో వెనకనుంచో మరో వాహనం తెలియకుండా దూసుకు వచ్చేస్తుందన్న భయం వారికి వుండదు.

ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.

నడిచే వాడిదే రోడ్డు

మరో మంచి విషయం ఏమిటంటే కార్లలో వెళ్లేవాళ్ళు - కాలినడకన వెళ్ళేవారిని చిన్నచూపు చూడరు. సరికదా, వారిపట్ల ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. రోడ్డు దాటేవారిని చూసినప్పుడు ఈ మర్యాద కాసింత ముదిరి కూసింత భయంగా మారడం కద్దు. రోడ్డు కూడళ్ళ వద్ద – కాలినడకన వెళ్లే మనిషి కనిపిస్తే చాలు వేగంగా వెళ్లే వాహనాలు కూడా టక్కున ఆగిపోయి దారి ఇస్తాయి. ఏదన్నా జరగరానిది జరిగితే, ఆ నేరం మెడకు చుట్టుకుండేది వాహనాలు నడిపేవారికే.

NOTE:All images in the blog are copy righted to respective owners

26, ఆగస్టు 2010, గురువారం

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు


ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.


 ఇప్పుడు నవ్య వారపత్రిక (ఆంధ్రజ్యోతి) లో ఉద్యోగ విజయాలు వారం వారం ఆసక్తికరంగా రాస్తూవస్తున్న రావులపాటి సీతారామారావు గారు, తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరి - పరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ప్రస్తావించాను.
‘నేను ఇతరులు రాసిన కధలు చదవనండీ” అని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. ‘అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుంది’ అని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు.
ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు – నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.
‘ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారా’ అని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.
ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. “ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసాను” అన్నాడతగాడు.
“మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!” అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. రాసినవారికి రాసినంత – చదివేవారికి చదివినంత.
ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది ‘లక్ష వొత్తుల నోము’ నోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. ‘వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితే ‘ రోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడు’ అన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.
దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి – ఆ అమ్మడు చదివిన ‘న్యూస్ బులెటిన్ ను భద్రపరచమని’ చెప్పాడు. ‘అంతబాగా చదివిందా’ అని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుంద’ని ఆయనగారు వాకృచ్చారు.

 (25-08-2010)

25, ఆగస్టు 2010, బుధవారం

ట్రాఫిక్ జామ్ లో పది రోజులు - భండారు శ్రీనివాసరావు

హైదరాబాదులో కార్లమీద వెళ్లే వాళ్ళకీ – కాళ్ళీడ్చుకుంటూ వెళ్లే వాళ్ళకీ ట్రాఫిక్ జామ్ అనేది ఒకేరకమయిన సమస్య. ఆబిడ్స్ అయినా, అమీర్ పేట్ అయినా - రోడ్లమీద పరిస్తితి అదే . రాత్రయినా పగలయినా తేడా వుండదు. వీళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగించే ఒక సమాచారం మీడియా ద్వారా వెల్లడయింది.   బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు ఈ న్యూస్ బ్రేకయి చాలారోజులయింది. దీనివల్ల  - రాత్రికి  రాత్రే  ఏదో జరిగిపోయి ఈ  జటిల సమస్య పరిష్కారమై పోతుందని కాదు. ఈ విషయంలో మనల్ని మించిన నగరాలు వున్నాయని తెలియరావడమే ఆ శుభవార్త. మన ఇంట్లో కరెంట్ పొతే పక్క ఇంట్లోకి తొంగి చూసి అక్కడా లేకపోతె కలిగే పైశాచిక ఆనందంలాటిదని అనుకుందాం పోనీ. అయితే , అంతకు ముందు కొంత  వెనకా ముందూ చూద్దాం.

శ్రీమతి ఇందిరాగాంధీ

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో - ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమె రాజ్యమేలుతున్న రోజుల్లో – వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటిమీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష.

రాజీవ్ గాంధి

 ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు - అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ - మిహాయిల్ గోర్బచెవ్ – టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ ఆ కార్యక్రమాలు చూస్తూ ప్రశాంతంగా రోజులు గడుపుతున్న రోజుల్లో ఒకానొక రోజున ఇరాన్ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి – మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు  చూస్తూ  ఎంతగానో రిలీఫ్ ఫీలవడం చూసి  మాకు మతి పోయినంత పనయింది.

మిహాయిల్  గోర్భచెవ్ 

కదిలిస్తే అతగాడు చెప్పిన కధ – అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో టీవీ తెరపై - ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధనలు ఇస్తూ, సూక్తులూ ప్రవచిస్తూ ఒకేఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట.

 ఆ ప్రోగ్రాములు చూసి చూసి వచ్చిన ఆ పెద్దమనిషికి రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయిట. కాబట్టే  అన్నారు మనుషుల బాధలన్నీ సాపేక్షం (రిలెటివ్) అని.  అందుకే కాబోలు - ఇతరులతో పోల్చి చూసుకుంటే బాధ సగం తగ్గిపోతుందంటారు. ఇప్పుడు చెప్పబోతున్నది కూడా అదే.

అయతుల్లా ఖొమేని

చైనాలో ఆ మధ్య జరిగిన ఒక విషయం ఈ మధ్య వెలుగు చూసింది. మరి అక్కడ మన మాదిరిగా ‘ఏ టు జడ్’ టీవీ చానళ్ళు లేవుకదా. అదన్న మాట సంగతి.

బీజింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్

ఇంతకీ అసలు కధాకమామిషూ ఏమిటంటే – ఈ ఆగస్ట్ పదునాలుగో తేదీన బీజింగ్ సమీపంలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటారేమో. కానీ ఈ ట్రాఫిక్  జామ్ తరహానే వేరు.  రోడ్డు విస్తరణ కారణంగా బీజింగ్ – టిబెట్ ఎక్స్ ప్రెస్ వే మీద మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం   వందంటే వంద కిలోమీటర్ల మేర మాత్రమే  వాహనాలు నిలిచిపోయాయి.  గంటో రెండు గంటలో కాదు, పూటో రెండు పూటలో కాదు ఏకంగా పదిరోజుల పాటు ఈ జామ్ ‘ఝాం ఝాం ‘ గా కొనసాగింది. రోడ్డు నిర్మాణం పనులు సెప్టెంబర్ పదమూడుదాకా జరుగుతాయి కనుక  ప్రజలందరూ  ఎప్పటిమాదిరిగానే సంయమనంతో సహకరించాలనీ, వాహనాల రాకపోకలు మరికొద్ది రోజుల్లో సాధారణ స్తితికి చేరుకుండే అవకాశాలు లేకపోనూ లేవనీ – మొన్న ఆదివారం నాడు తొలిసారిగా ఈ అసాధారణ ట్రాఫిక్ జామ్ గురించి చైనా నేషనల్ రేడియో అతి సాధారణంగా ప్రజలకు తెలియచేసింది. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టు ఆ ట్రాఫిక్ జామ్ లో దారీతెన్నూ కానకుండా అన్నన్ని రోజులు చిక్కుకుపోయిన వాహనదారులు కూడా అదేమీ పట్టనట్టు -' నట్టిల్లు  అయితే యేమిరా! నడి రోడ్డు అయితే యేమిరా!' అని మిట్ట వేదాంత గీతాలు పాడుకుంటూ,  పేకాట  ఆడుకుంటూ కాలక్షేపం చేసారు. వారికి కోపం రాలేదని కాదు. వచ్చింది. అదీ దేనికటా! ఆ పది రోజులూ తమకు తిండీ తిప్పలు కనుక్కుని పెట్టిన ఇరుగు పొరుగు గ్రామాల వారు - తాము కొనుక్కుని తిన్న ఆ తినుబండారాలకు గాను ఒకటికి నాలుగు రెట్లు రేట్లు అదనంగా వసూలు చేసారన్నదే  వారి అభియోగం. ప్రభుత్వం మీదా అధికారుల మీదా వారు నోరు విప్పలేదు సరికదా అంతంత అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఇబ్బందులు సహజమే కదా అని సన్నాయి నొక్కులు నొక్కారు.

అంతటి సహనశీలులను చూసి నిజానికి  మనమూ మన మీడియా ఎంతో నేర్చుకోవాలి.  అలాగే-  అలా, అంతగా అడక్కుండానే సర్డుకుపోయే ప్రజలుండడం అక్కడి పాలకుల అదృష్టం కదా అని మన పాలకులు  మధన పడాలి.

ఇక - పనిలో పనిగా ‘నవ చైనా’ గురించిన మరికొన్ని విశేషాలు కూడా ముచ్చటించుకోవడం భావ్యంగా వుంటుందేమో.


బీజింగ్ నగరంపై 'కారు మేఘాలు' 

నిరుడు మొత్తం అమెరికాలో అమ్ముడుపోయిన కార్ల కంటే ఎక్కువ కార్లు చైనాలో అమ్ముడుపోయాయి. చైనా రాజధాని బీజింగ్ నగరవాసులు పోటీ పడి రోజూ రెండువేల కొత్త కార్లు కొంటున్నారు. ఈ లెక్కన ఒక్క బీజింగ్ లోనే కార్ల సంఖ్య మరో అయిదేళ్ళలో డెబ్భయి లక్షలకు చేరుకుంటుందని అంచనా. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి - ప్రైవేట్ కార్లు వారానికి ఒక్క రోజయినా రోడ్ల మీదకు రాకూడదన్న నిబంధనలు ఇప్పటికే అమలులో వున్నాయి. అయినా చైనా రాజధానిలో వాహనాల వేగం చాలా వేగంగా తగ్గిపోతూ వుండడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చాలా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్ల వెడల్పును భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వస్తున్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి పధంలో చైనా

వీటన్నిటి వల్ల - ముందు ముందు మంచి జరగబోతున్నదన్న నమ్మకం ప్రజల్లో అంతగా వుండడం వల్ల - తాత్కాలిక ఇబ్బందులను  శాశ్వితంగా  పట్టించుకోకుండా జనం అంతగా సర్డుకుపోతున్నారని ప్రభుత్వ వర్గాలవాళ్ళు నమ్మకంగా సెలవిస్తున్నారు. అయితే బీజింగ్ సమీపంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ పూర్తిగా తొలగించడానికీ, వాహనాల రాకపోకలను మునుపటి మాదిరిగా  పునరుద్ధరించడానికీ - యెట్లా లేదన్నా - మరో నెల రోజులు పట్టగలదని పేరు చెప్పడానికి ఇష్ట పడని మరో అధికారి వున్న విషయం చల్లగా బయట పెట్టాడు.
(24-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

24, ఆగస్టు 2010, మంగళవారం

విన్నంతలో - కన్నంతలో - అమెరికా - 4 - భండారు శ్రీనివాసరావు

శ్రావణ  త్రయోదశి మా అమ్మగారి ఆబ్దీకం. ఏటా హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి ‘అమ్మలగన్నమా అమ్మను’ మనసారా స్మరించుకోవడానికి ఆమె పిల్లలతో పాటు ఆ పిల్లల పిల్లలుకూడా వచ్చేవారు.

కానీ ఈసారి అమెరికాలో వున్నాము.
 ‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం కద్దు.( హైదరాబాదులో ‘బిర్లా టెంపుల్ మాదిరిగా )

ఎక్కడున్నా ఏడుకొండలవాడికి యెనలేని వైభోగమే

ఈ దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు నిలయంగా వుంది.

మనుషులను కలిపేదే దైవత్వం
 శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.

భజగోవిందం

మైక్రోసాఫ్ట్ హిందూ టెంపుల్ లో ఆబ్దీకం పెట్టుకోవడానికి యాభయి ఒక్క డాలర్లు తీసుకుని టెంపుల్ కమిటీ వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ ప్రాంగణంలోనే ఒక గదిలో మా కార్యక్రమం పూర్తిచేసుకున్నాము.

 అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేనిస్తితిలో  గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు  పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్ట పక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక ఆనవాయితీగా మార్చేసారు. ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ  వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.

తల్లీ నీకు వందనం

 ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత – ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను  గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి – అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో  కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.

చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.

ఇక పేరెందుకు - మన బజారే!

 శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కోసం ఈ స్టోర్ లో ఒక లారీ లోడ్ కొబ్బరికాయలు అమ్ముడుపోయాయంటే
ఇక్కడివారు సంప్రదాయ వేడుకలను యెంత శ్రద్ధగా జరుపుకుంటున్నారో అర్ధమవుతుంది.

ఏమిలేదో చెప్పండి?

 మొత్తం వ్రత కధను, పూజావిదానాన్ని ‘నెట్’ నుంచి డౌన్ లోడ్ చేసుకుని – నిర్దేశించిన పద్దతిలో వ్రతం ఆచరించి ముత్తయిదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించి సంప్రదాయాలపట్ల తమకున్న మక్కువను వ్యక్తం చేసారు. సియాటిల్ లో మాకు తెలిసిన తెలుగు లోగిళ్ళ వద్ద ఆ నాటి ఉదయం రంగురంగుల రంగవల్లులు కొలువుతీరాయి.

NOTE:All images in the blog are copy righted to respective owners

23, ఆగస్టు 2010, సోమవారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా - 3 భండారు శ్రీనివాసరావు


“అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.

ఓవల్ ఆఫీస్
 ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”
తెలియని విషయాలను గురించి మామూలుగా  మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ – సియాటిల్ లోని -  ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.

లేక్  వాషింగ్టన్ లో నౌకావిహారం

నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్ - చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ - “అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది “ అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.

సాఫ్ట్ గేట్స్

బిల్ గేట్స్ నెలసరి ఆదాయం – సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట – కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే - దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం – ఓస్ ఇంతేనా అనిపించింది.

దూరపు కొండలు నునుపు కాదు

 కానీ లేడీ గైడ్ చెప్పే విశేషాలు మాత్రం ఇన్నీ అన్నీ కాదు మరి
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.

పాత చింతకాయ కాదు - ఖరీదు చూస్తే కోట్లలోనే

సోఫాలు,కుర్చీలు,మంచాలు ఇలాటివన్నీ చాలా పాత కాలానికి చెందిన ‘యాంటిక్ ఫర్నిచర్’ గా కనిపిస్తాయి. ఇతర ఉపకరణాలన్నీ భవిష్యత్ తరానికి తగ్గట్టుగా రూపొందించారు. అవి చూసినా విన్నా ‘అదరహో’ అనాల్సిందే.
యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక ‘సాంకేతిక అద్భుతం’గా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ  కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.

మాయామహలుకు దారి
ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశ దేశాల్లోని వారెవరయినా వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ ’ కాల్’ ’ కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే- బయటనుంచి వచ్చిన అతిధి శరీర తత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.

గోడలా అవి కావు   రసరమ్య కుడ్యాలు

 అక్కడి పెయింటింగులు కూడా వచ్చినవారి అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పికాసా పెయింటింగులు కోరుకునేవారికి అవే కనిపిస్తాయి. అదే సమయంలో రవివర్మ చిత్రాలు ఇష్టపడేవారికి అవే కనువిందు చేస్తాయి. మాయాబజారు సినిమా చూస్తున్నట్టు వుంది కదూ ఇవన్నీ వింటుంటే.

యద్దనపూడి సులోచనారాణి నవలలలో  కలల హీరో కారు ఇతడి స్వంతం

బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం.  అతగాడెవరో కాదు,  ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా!  గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం  అతగాడికి ఇది ఎలా సాధ్యమయిందంటే-  బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ సంస్త పెట్టిన కొత్తల్లో అందులో  కొన్ని షేర్లు కొన్నాడు.  కాలక్రమేణా  ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా  పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా- కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద  ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి  బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు..
అంతేకాదు – బిల్ గేట్స్   మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై  అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్ జీవితంలో  ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షం లోకి వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.

 కాకపొతే గత రెండు మూడేళ్లుగా ఆ షేర్లలో పెద్ద ఎదుగుదల కనబడడం లేదని షేర్ సింగ్ లు అంటుంటారు. అయితే, దానితో మీ లాటి వారికీ, నాలాటి వారికీ ఎంతమాత్రం సంబంధం లేదనుకోండి. – భండారు శ్రీనివాసరావు

NOTE : Images in the blog are copy righted to respective owners

22, ఆగస్టు 2010, ఆదివారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా –2 - భండారు శ్రీనివాసరావు

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే  'తొమ్మిదివేల'ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి -  ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల  ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట  తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ  చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.

లీవెన్  వర్త్ లో కుటుంబ సభ్యులతో రచయిత (ఎడమనుంచి రెండో వ్యక్తి)   

వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.

బవేరియన్ సంస్కృతి ఉట్టిపడే నిర్మాణాలు

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
ఆహ్లాద వీధులు
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం ‘సాస్’ (మిరపకాయల రసం తో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ – ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు ‘గుంటూరు మిరప ఘాటు’ మించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు.

డిసెప్షన్ ఫాల్స్

సియాటిల్ తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.

NOTE:All images in the blog are copy righted to the respective owners

21, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో - కన్నంతలో అమెరికా - 1 - భండారు శ్రీనివాసరావు

  
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.

పసిఫిక్ తీరంలో

వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్  నుంచి  ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు  చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల – కార్లో వున్న జీ పీ ఎస్  సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని  ఇంటి ముందువున్న  ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి  తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.

'ఏ హోం ఎవే ఫ్రం హోం'  

 మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది.  పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్,  అతి పెద్ద ప్లాస్మా టీవీ,  ఫైర్ ప్లేస్,  సోఫాలు వున్నాయి.  పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.

నిజం కాదు బొమ్మ షార్క్

 పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హటాత్తుగా పైనబడే అవకాశం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. వున్న మూడు రోజులూ ఈ వూళ్ళన్నీ చూసాము. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.

ఆక్వేరియంలో మాత్రం నిజం షార్కే

 ప్రతిచోట ఏదో ఒక ప్రత్యెక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలావుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్  ఆక్వేరియం చూసాము.

కొండంత ఆనకొండ

 షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.


జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. కారు ఎక్కగానే వూరి పేరు, వీధి నెంబరు, ఇంటి నెంబరు, లేదా షాపు, రెస్టారెంట్ వివరాలు ఫీడ్ చేస్తే చాలు - ఎక్కడికక్కడే అది గైడ్ చేస్తూ దారి చూపుతుంటుంది. మాటల్లో పడి, దారి తప్పినా అది వెంటనే హెచ్చరికలు వినిపిస్తూ మరో ప్రత్యామ్నాయ మార్గం చెప్పి మళ్ళీ సరయిన దోవకు చేరేలా సూచనలు ఇస్తుంది. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు. అంతేకాదు, మార్గమధ్యంలో మరమ్మతుల నిమిత్తం కానీ మరో అవసరం కోసం కానీ ఎక్కడయినా రహదారులు మూసివేసినా లేక వాహనాలను దారి మళ్ళించాల్సివచ్చినా - ఆ తాజా సమాచారం కూడా అది గ్రహించి అప్పటికప్పుడు కొత్త దోవలను సూచించడం ఇందులోని మరో సౌలభ్యం.
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.


అతి చిన్న నదిని చూద్దాం రండి

‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రం లో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు  కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది దేనిలో?  సముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో.  అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డ కట్టెంత చల్లగా వుంటాయి.

మహా సంగమం

సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు.  మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.

హేస్టాక్  రాక్

 అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్  రోడ్డు ఎక్కాము.

(భండారు శ్రీనివాసరావు, 10-08-2010)

NOTE:All the images in the blog are copy righted to the respective owners.