31, అక్టోబర్ 2016, సోమవారం

ఎంతచెట్టుకు అంత గాలి (కధానిక)


పది కోట్లు ఖరీదు చేసే రాజశేఖరం కారు ఎయిర్ పోర్ట్  ప్రైవేటు గేటు  దాటి టార్మాక్ మీద ఆగివున్న అతడి సొంత విమానం వద్దకు చేరుకుంది.  పైలట్  స్వయంగా వెంటబెట్టుకుని అతడ్ని లోపలకు తీసుకువెళ్ళాడు. కాసేపు తనని డిస్టర్బ్ చేయవద్దని సిబ్బందికి చెప్పి రాజశేఖరం  బెడ్ పై వాలిపోయాడు. ఆలోచనాలోచనాలకి నిద్ర ఎలా పడుతుంది.  ఒకటా రెండా! రెండే రెండు రోజుల్లో లక్షకోట్లు సిద్ధం చేయాలి? దేశదేశాల్లో విస్తరించివున్న తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి పోకుండా వుండాలంటే అంత మొత్తం వెంటనే కావాలి. ఎలా అన్నదే జవాబు దొరకని ప్రశ్న.
రాజశేఖరాన్ని విమానం ఎక్కించి తిరిగివస్తున్నాడు అతడి కంపెనీ సీయీఓ బెనర్జీ. నున్నటి రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోతోంది. కోటుజేబులో నుంచి తీసి చూసుకున్నాడు. కోటి రూపాయల చెక్కు. అవసరం అంటే బాసు మరో మాట అడ్డు చెప్పకుండా చెక్కు రాసి ఇచ్చాడు. అది సరే. మరో కోటి యెట్లా! వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఒక్కగానొక్క కూతురికి చక్కటి సంబంధం కుదిరింది. రెండు కోట్లు కట్నం. మరో మూడు  పెళ్లి ఖర్చులకి. పరపతి అంతా వాడితే,  మూడు కోట్లు సర్దుబాటు అయ్యాయి. మరో కోటి కావాలి. ఎల్లా అన్నదే కోటి రూపాయల ప్రశ్న.
బెనర్జీని ఇంట్లో దించి అటునుంచి అటే ఆఫీసుకు చేరుకున్నాడు అతడి పర్సనల్ అసిస్టెంట్ రామారావు. దారి మధ్యలో  బెనర్జీ ఇచ్చిన కోటి చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసాడు. తనకు అవసరం అని చెబితే ఏ కళన ఉన్నాడో మహానుభావుడు లక్ష రూపాయల కట్ట తన చేతిలో పెట్టాడు. ఆఫీసుకు వెళ్లి  కారు దిగుతుండగానే సెల్ మోగింది. చూడకుండానే అర్ధం అయిపొయింది ఆ ఫోను ఎవరు చేసారో. కుర్చీలో కూర్చుంటూ వుండగానే మరోసారి మోగింది. గతి లేక ఆన్సర్ చేసాడు.
“చూడండి రామారావు గారు, ఇప్పటికి ఆరు సార్లు డిఫాల్ట్ అయ్యారు. మంచి కంపెనీ అని మీ పర్సనల్ లోన్ విషయంలో ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాము. ఇక ఆగడం కష్టం. పైనుంచి  మాకు ప్రెషర్ పెరుగుతోంది. ఏం  చేస్తారో తెలవదు. రెండు రోజుల్లో ఆరు కిస్తీల బకాయిలు వడ్డీతో కలిపి ఒకేమాటు కట్టేయండి. ఇది ఫైనల్. వార్నింగు అనుకున్నా మేము చేయగలిగింది లేదు’        
అప్పు చేసి కొన్న కొత్త విల్లాలో గృహప్రవేశం చేసి ఏడాదికూడా కాలేదు. కొడుకూ, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారన్న  భరోసాతో అంత అప్పు చేశాడు. అయితే నెల తిరగకుండానే వాళ్ళని బెంచిలో పెట్టారు. విల్లా  చాలా పెద్దది. కానీ,  అప్పు అంతకంటే  పెద్దదిగా కనబడుతోంది. బాసు ఇచ్చిన లక్ష వడ్డీకి కూడా సరిపోదు. మరి మిగిలిన పాతిక లక్షలు ఎల్లా.
ఇంటికి వస్తూనే డ్రైవర్ పరంధాములుకి లక్ష ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో! రామారావుకు మనసులో ఏదో మూల అనుమానం.
స్కూటర్ నడుపుతున్నాడే కాని పరంధాములు మనసు మనసులో లేదు. పిల్లాడు ఇంజినీరింగు మూడో ఏడు చదువుతున్నాడు. ఇంటిల్లిపాదీ కడుపు కాల్చుకుని చదివిస్తున్నారు. ఒక్క ఏడాది ఎలాగో లాక్కువస్తే వాడి జీవితం ఒడ్డున పడుతుంది. చదివి ఉద్యోగం చేసి ఇంటి కష్టాలు తీర్చాలని అతడూ శ్రద్ధగా చదువుతున్నాడు.  కానీ శ్రద్ధ ఒక్కటే సరిపోదు కదా! కాలేజీ  వాళ్లకి ఫీజు కూడా కావాలి. పదివేలు ఫీజుకట్టమని, లేకపోతే పేరు తీసేస్తామని  కాలేజీలో చెప్పి పది రోజులు అవుతోంది. అమ్మగార్ని అడిగితే ‘అయ్య ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు, వచ్చిన తరువాత అడిగి చూడు’ అన్నది. దిగాలు పడ్డ తన మొహం చూసి ఏవనుకున్నదో లోపలకు వెళ్లి ఓ ఐదువేలు తెచ్చి ఇచ్చి, మిగిలింది ఎక్కడయినా తెచ్చి  పని గడుపుకో’ అంది. బ్యాంకులో కట్టమని యజమాని ఇచ్చిన లక్ష రూపాయలు జేబులో వున్నాయి. కానీ తనకు కావాల్సింది ఐదు వేలే! అవి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు?      
బ్యాంకులో డబ్బు కట్టి పరంధాములు ఇల్లు చేరేసరికి కధ వేరే విధంగా వుంది. పక్కింటి పిల్లాడికి  ప్రాణం మీదకు వచ్చింది. చిన్నాసుపత్రి నుంచి పెద్దాసుపత్రికి ఇలా తిప్పడంతోనే, అలా  తిరగడంతోనే ఆ పిల్లాడి తండ్రి చిక్కిపోయింది.  రోగం మాత్రం పెద్దది అయ్యింది.  'ఏవేవో పరీక్షలు జరూరుగా  చేయాలి, అయిదు వేలు కట్టమన్నారు. ఇల్లంతా వెతికినా యెర్ర ఏగానీ లేదు. చివరికి పరంధాములే వాళ్లపాలిట పరంధాముడు అయ్యాడు. అతడి పిల్లాడి ఫీజు డబ్బు ఆసుపత్రిలో ఫీజుగా మారింది.
అయిదు వేలు యెట్లా అన్న ప్రశ్న మళ్ళీ పదివేలకు రూపు మార్చుకుంది.
పిల్లాడి ఫీజు సమస్య కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. 

26, అక్టోబర్ 2016, బుధవారం

పనికొచ్చే ముక్క


నాకొక మంచి నాస్తిక మితృడు వున్నాడు. ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళే సరికి రేడియోలో ఆధ్యాత్మిక  ప్రవచనాలు వింటూ కనిపించాడు. నా మొహంలో ఆశ్చర్యం గమనించి అతడే చెప్పాడు.
ఆచార్యుల  బోధనల్లో దేవుళ్ళ ప్రసక్తి ఎలా వున్నప్పటికీ, మంచి జీవితం గడపడానికి పనికొచ్చే అనేక విషయాలు వుంటాయని, అంచేతే వాటిని క్రమం తప్పకుండా వింటుంటానని అన్నాడు.

భేషయిన మాట!   

24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ భోగం ఎన్నాళ్ళు?

రాత్రంతా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నట్టుగా చప్పుళ్ళు. తెల్లారి బాల్కానీనుంచి కిందికి చూస్తే నల్ల తివాచీ పరిచినట్టు కొత్త రోడ్డు. 


కాంట్రాక్టర్ ఎవడో మంచివాడులాగా వున్నాడు, ఎవరికీ ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో పని పూర్తిచేశాడు. మూడు పొరల్లో వేశాడు. పైకి దిట్టంగానే కానవస్తోంది.
‘అయినా ఈ భోగం ఎన్నాళ్ళులే, గట్టిగా ఒక వాన పడిందాకనే’ అంటున్నాడు పక్క పోర్షన్ ఆయన. ఎవరి అనుమానాలు వాళ్ళవి. అందుకే లోగడ చెప్పుకున్నట్టు ప్రతి రోడ్డు పూర్తి చేయగానే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు, పర్యవేక్షణ చేసిన అధికారి వివరాలు, ఫోను నెంబర్లు, రోడ్డు ఖర్చు, వేసిన తేదీలతో సహా అక్కడే రోడ్డు పక్కన బోర్డులు పెట్టిస్తే ఆ రోడ్డు మంచి చెడుల బాధ్యులను నిర్ణయించినట్టు అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు.

22, అక్టోబర్ 2016, శనివారం

చెత్త పేపర్లు


అపార్ధం చేసుకోకండి. ఇక్కడ కవి హృదయం పత్రికలు అనికాదు.
పత్రికల ద్వారా అనునిత్యం ఇంటింటికీ చేరుతున్న చెత్త అని అర్ధం.
అదిగో మళ్ళీ అపార్ధం మొహం పెట్టారు. ఇదేమీ బాగాలేదు. దిన పత్రికలు రాసుకొస్తున్న చెత్త అని కాదు,  ఇళ్ళకు మోసుకొస్తున్న చెత్తాచెదారం అని.
పత్రికల్లో పేజీలను మించి ప్రకటన కరపత్రాలు వాటిల్లో ఉంటున్నాయి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేర్వేరు డబ్బాల్లో వేయమంటున్నారు సర్కారు వారు. ఆ పనికి ఇది అదనం. టమాటాలు కిలో కేవలం యాభయ్ రూపాయలు మాత్రమే అనే దగ్గర మొదలు పెడితే, కోట్లకు పడగలెత్తిన ఆసాములు సయితం ఓ కన్నేసి చూడడానికి సంశయించే రమ్యహర్మ్య భవంతుల వరకు ఈ ప్రకటనల కరపత్రాలు, పత్రిక తెరవగానే ముందు కంట్లో పది ఆ తరువాత  ఇల్లంతా పరచుకుంటాయి. పత్రిక కొంటే ఈ చెత్త అదనం అన్నమాట.
పత్రికల సర్క్యులేషన్ నిర్ధారించడానికి ఏవేవో లెక్కలు వుంటాయి. ఓ పత్రికా మిత్రుడు (ఆయన నా మిత్రుడు, పత్రికలకు కాదు) సరదాగా ఓ మాట అన్నాడు, ‘ఏ పత్రికలో ఈ రకం చెత్త యెంత ఎక్కువ వుంటే అది అంత గొప్ప ప్రజాదరణ కలిగిన పత్రిక’ అని.
ఇక కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఈ చెత్తను జాతీయం చేసుకుని ఏకంగా తమ పత్రికల పేజీల్లోకే జొప్పించి అదనపు రాబడి పెంచుకుంటున్నాయనే అపవాదు వుంది. అది వేరే విషయం.
పైన చెప్పిన మిత్రుడే మరో మాట చెప్పారు.
“అనవసరంగా ఇంతంత పెట్టుబడులు పెట్టి పత్రికలు పెట్టడం ఎందుకు, ఏదో ఒక చిన్న పత్రికను ఇంట్లోనే ముద్రించి (సాంకేతికత పుణ్యమా అని ఆ వెసులుబాటు వుంది), టీవీలు చూస్తూ వార్తలు గిలికేసి  పెద్ద పెద్ద సర్క్యులేషన్ కలిగిన  పెద్ద పత్రికల పొట్టలో కూరితే, కాణీ ఖర్చులేకుండా ఇంటింటికీ చేరుతుంది కదా!”
మంచి ఐడియానే! ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత టైం తప్ప.          

21, అక్టోబర్ 2016, శుక్రవారం

రాజకీయ వారసులు, వారసత్వ రాజకీయాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-10-2016, SUNDAY)
అది సంపద కావచ్చు, అధికారం కావచ్చు.
వాటిని కూడబెట్టినవారికి ఒకటే సమస్య, తమ వారసులకు వాటిని భద్రంగా ఒప్పచెప్పడం ఎలా అన్నదే!
ఒకడు వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తూ పొలాలు కొంటూ పోతాడు. పిల్లలు ఉద్యోగాల పేరుతొ విదేశాలకు యెగిరి పోతుంటే ఆ భూముల్ని ఎవరు చూడాలి, ఎవరు కాపాడాలి, ఎవరు అనుభవించాలి?
పెద్దతనం మీద పడినప్పుడు అన్నేళ్ళుగా ఇంటి వ్యవహారాలపై పెత్తనం చేస్తూ వచ్చిన ఆ ఇంటి పెద్దమనిషికి పట్టుకునే పెద్ద బెంగ.
మరొకడు వైద్యం చేస్తూనో, ఇంకొకడు  వకీలుగా ప్రాక్టీసు చేస్తూనో పది తరాలకు సరిపడా పోగుచేస్తాడు. పోయేటప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలకే  ఆ ప్రాక్టీసు ఒప్పచెప్పాలని తెగ మధన పడతారు.
అలాగే నటీనటులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు అందరికీ ఒకే కోరిక, తమ సామ్రాజ్యాలకు తమ పిల్లలే వారసులు కావాలని.  ఈ విషయంలో వీళ్ళందర్నీ తలదన్నే వర్గం ఒకటుంది, అది రాజకీయం.  
పూర్వం రాజులు, మహారాజులకి వారసులే రాజ్యానికి వచ్చేవారు. వారసుల నడుమ పొరపొచ్చాలు వస్తే మహా భారత యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. రాజ్యాధికారం వారసత్వ హక్కు అని కొందరు, కాదు, రాజ్యం వీరబోధ్యం అంటూ మరికొందరూ చరిత్ర పుటల్ని రక్తసిక్తం చేసారు.
రాజకీయ వారసత్వం గురించి ముచ్చటించుకునే ముందు ఓ పూర్వకాలపు ముచ్చట చెప్పుకోవాలి.
ఒక రాజుగారికి వయసయిపోయింది. పేరుకు తొమ్మిదిమంది యువరాజులు వున్నారు కానీ వారందరూ పనికి పోతరాజులే కాని సింహాసనం మీద కూర్చోదగిన వాళ్ళు కాదు. తన వారసుడు ఎవరనే విషయంలో రాజుగారు తన ఆస్థాన గురువును సంప్రదించాడు. ‘తండ్రిగా అయితే నీకు ఇష్టం వచ్చిన వాడిని వారసుడిగా ఎంచుకో. రాజుగా అయితే రాజ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకో’ అని గురువు సలహా ఇస్తాడు.
రాజులు, రాచరికాల సంగతి సరే. ప్రస్తుతం ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అయినా రాజకీయాల్లో ఈ వారసుల మాట పదేపదే వినబడుతోంది. మొన్నటికి మొన్న తమిళనాడులో డీ ఎం కే కురువృద్ధుడు కరుణానిధి  తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు స్టాలిన్ పేరు ప్రకటించి, ఆ పార్టీలో, తన కుటుంబంలో ప్రకంపనలు సృష్టించారు. ప్రస్తుతం అధికారంలో లేని పార్టీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో తెలియదు.
ఈ పవిత్ర భారత దేశంలో ఒక విచిత్రమైన ద్వైదీభావం వుంది. ఇప్పటికీ ఎన్నికల్లో రాజకీయ వారసులే ఫలితాలను ప్రభావితం చేస్తారు. కానీ జనాన్ని విడిగా అడిగి చూడండి. తద్విరుద్ధంగా మాట్లాడతారు. నవతరం ఓటర్లలో  కొంత మార్పు కానవస్తోంది. కేజ్రీవాల్ పార్టీ పెట్టి ‘నేను భిన్నమైన వాడిని’ అంటే మురిసిపోయారు. ‘మా చుట్టూ పోలీసులు వుండరు, ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోము, అధికారానికి వచ్చినా నేనూ మా  మంత్రులు బుగ్గ కార్లు వాడము, పెద్ద భవంతుల్లో ఉండము, అంతేకాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయరు, అలాంటివాళ్ళకి టిక్కెట్లు ఇవ్వము’ అని తెగేసి చెబుతుంటే వినేవాళ్ళకు విచిత్రంగా అనిపించింది.
‘సెహభాష్, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే!’  అని జనం  క్యూలల్లో నిలబడి ఓట్లు వేసి గెలిపించారు.
అంటే, వారసత్వ రాజకీయాలతో, రాజకీయ వారసులతో జనాలు అంతగా విసుగెత్తి పోయారని అనుకోవాలా!
విసుగెత్తిపోయిన మాట నిజమే కానీ వారి  వరస పూర్తిగా మారలేదు.
ప్రస్తుతం వున్న లోక సభలో మూడింట రెండువంతుల మంది సభ్యులు నలభై ఏళ్ళ లోపువాళ్ళు. అయితే వారి దగ్గరి బంధువుల్లో చాలామంది రాజకీయాల్లో తలనెరిసినవాళ్ళే. ప్రస్తుత లోకసభలో ఇరవై మంది అత్యంత సంపన్నులయిన సభ్యుల్లో పదిహేనుమంది వారసత్వంగా  ఎన్నికల్లో గెలిచి వచ్చినవాళ్ళే కావడం గమనార్హం. మరో సంగతి ఏమిటంటే ఈ నలభై వసంతాల యువ పార్లమెంటు సభ్యులు పది మందిలో తొమ్మిది మంది రాజకీయ వారసులుగా కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచి సభలో అడుగుపెట్టారు.
దేశ రాజకీయాల తీరు తెన్నులు గమనించేవారికి తెలిసే వుంటుంది. అనేక నియోజకవర్గాల్లో ఒక కుటుంబం పెత్తనమే నడుస్తూ వుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో వుంటే జనాలు ఆ పార్టీకే ఓట్లు వేస్తుంటారు.  వీటికి ఏ పార్టీ మినహాయింపు కాదుకాని, వామపక్షాలు, బీజేపీ కొంత మెరుగు.
ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాజకీయ వారసులు వున్నారు. అయితే పార్టీలు వాళ్ళ కుటుంబాల పెత్తనంలో ఉండడానికి ఒప్పుకోవు. కానీ, మన దేశంలో, పొరుగున వున్న పాకీస్తాన్ లో, ఇంకా ఫిలిప్పీన్స్ లో పరిస్తితి ఇందుకు భిన్నం. మన దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనే కాకుండా, బిజూ జనతా దళ్, రాష్ట్రీయ లోక్  దళ్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్  పార్టీ  వంటి  ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ వారసత్వ సంస్కృతి వుంది.
వారసుల గొడవతో సంబంధంలేని రాజకీయ నాయకుల జాబితా తయారు చేసి అక్షర క్రమంలో  కుదిస్తే అదిలా వుంటుంది.
అహమద్ పటేల్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్, మాయావతి, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధి.   

17, అక్టోబర్ 2016, సోమవారం

పరమ రోత టీవీ ప్రోగ్రాం


పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తోంది. దాన్ని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం, పేరేమిటో తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను. రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది ఇది కొన్ని సెకన్లపాటు చూసిన తరువాత.

15, అక్టోబర్ 2016, శనివారం

యోగి వేమనను తప్పుగా అర్ధం చేసుకున్న ఏపీ పార్టీలు


పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!

తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ వేమన  పద్యం భావం.

అయితే  ఆంధ్రప్రదేశ్ లో పాలకపక్షం, ప్రధాన  ప్రతిపక్షం వేమన నీతిని  మరో విధంగా  అర్ధం చేసుకున్నట్టున్నాయి. ఒకే మాట పదిమంది  పదిసార్లు చెబితే అదే నిజమై పోతుందన్న నమ్మకం పెంచుకున్నట్టు వుంది, వాళ్ళ  తరహా  చూస్తుంటే. ఒకరు ఒకటంటే, దాన్ని ఖండఖండాలుగా ఖండిస్తూ  పది మంది పది అంటారు. వెరసి ఓ వేయి మంది లక్షసార్లు అన్న ఫీలింగు కలుగుతోంది టీవీలు  చూసేవారికి.

ఇల్లు అలికారు, పండగ జరగాలి


సూటిగా.....సుతిమెత్తగా.....
(Published in SURYA telugu daily on 16-10-2016, SUNDAY)

జూన్ 2 2014, అక్టోబర్ 11, 2016.
ఈ  రెండు తేదీలకు తెలంగాణా చరిత్ర పుటల్లో ప్రముఖ స్థానం వుంటుంది. చారిత్రిక సందర్భాలకు  ఆనవాళ్ళుగా  మిగిలివుంటాయి.   మొదటిది  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినం  కాగా,  రెండోది నూతన తెలంగాణా స్వరూపాన్ని మార్చిన కొత్త జిల్లాల ఆవిర్భావ దినోత్సవం.  
కొత్త జిల్లాల ఏర్పాటుతో  దసరా పండుగనాడు నవ  తెలంగాణా  నూతన  స్వరూపం  ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది. విజయదశమి పర్వదినం ఈ  వేడుకకు వేదిక అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం   బాహ్య సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే,  చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి నిజమైన సవాలు ఇప్పటినుంచే మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది. చేసి చూపెడతాం అంటున్నారు. అంతకంటే  కావాల్సింది  ఏముంటుంది  కనుక.  
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే కానీ ఆహ్వానించి, ఆదరించే  మంచితనం వారిలో పుష్కలంగా వుంది.
సరే! యధావిధిగా రాజకీయాలు కూడా ఇందులో చొరబడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం శాస్త్రీయ దృష్టి ప్రదర్శించలేదు అన్నది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. అంతా రూల్  బుక్  ప్రకారమే చేశామన్నది ప్రభుత్వ వాదన. ఈ రెండింటిలో వాస్తవం లేకపోలేదు.
విభజన పద్దతిగా జరగలేదని, ప్రజల సదుపాయం గమనంలో పెట్టుకోలేదనీ, మండలాల చేర్పులు,కూర్పులు సవ్యంగా జరగలేదని, కొన్ని జిల్లాలను ఎక్కువ జిల్లాలను చేయడం, మరి కొన్ని పెద్ద జిల్లాలను పెద్ద మార్పులు చేయకుండా అలాగే కొనసాగించడం ఇందుకు నిదర్శనమని ప్రతిపక్షాల ఆరోపణ.
అందర్నీ సంప్రదించే చేశామని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను అడిగామని, ప్రజలనుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరించామని, భారీ కసరత్తు చేసిన తరువాతనే నిర్ణయాలు తీసుకున్నామని సర్కారు ఉద్ఘాటన. ప్రతిపక్షాలు అడిగిన రీతిలో ముందు అనుకున్నదానికంటే అదనపు జిల్లాలు ఏర్పాటు చేయడం ఇందుకు దృష్టాంతం అన్నది ప్రభుత్వ వివరణ.
ఒక విషయంలో మాత్రం రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అదేమిటంటే కొత్త జిల్లాల అవసరాన్ని ఉభయులు కాదనడం లేదు. కొత్త  జిల్లాల ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదు. సమస్య అల్లా విభజన చేసిన తీరు పట్లనే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే  రాష్ట్ర  విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం. జిల్లాల ఏర్పాటుకు అంతటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు. తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవచ్చు. కాబట్టి నిర్ణయంలో మంచి చెడులే తప్పించి జరిగిన తీరు పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇక పెద్దగా తర్కవితర్కాలు అనవసరం.
పొతే, జిల్లాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం వల్ల పరిపాలనకు సంబంధించి వెసులుబాట్లు పెరుగుతాయి. జిల్లా, మండల కేంద్రాలు సుదూరంగా వుంటే, ప్రభుత్వంతో తమ పనులు చక్కబెట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు తమ రోజువారీ పనిపాట్లను పక్కన బెట్టి ఎక్కువ దూరాలకు వెళ్లి రావాల్సిన ప్రయాస తగ్గుతుంది. అలాగే  ప్రభుత్వ అధికారులు కూడా  ప్రజల అవసరాలను దగ్గర నుంచి గమనించి వ్యవహారాలను సరిదిద్దడానికి వీలుంటుంది. ప్రత్యేకించి, సంక్షేమ పధకాల అమలు తీరును సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి వీలుచిక్కుతుంది. అధికారులు అందుబాటులో వుండడం అనేది ప్రజలకు కలిసి వచ్చే విషయమే. శాంతి భద్రతల  పరిరక్షణ విషయంలో కూడా చిన్న జిల్లాల సూత్రం ప్రయోజనకారిగా వుంటుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయానికి అంతటి సానుకూల స్పందన రావడానికి ఈ కారణాలు దోహదం చేశాయని చెప్పవచ్చు.           
పది జిల్లాలను ముప్పయ్యొక్క జిల్లాలను చేస్తూ నిర్ణయం తీసుకోవడం సులభం కావచ్చేమో కాని, దాన్ని అమలుచేయడం అనేది అంత తేలిక కాదు. తగినంత మంది అధికారులు కావాలి, వారికి తగినంత మంది సిబ్బంది కావాలి,  అవసరమైన కార్యాలయ భవనాలు కావాలి, వసతులు కావాలి, వాహనాలు కావాలి. ఇలా ఈ ‘కావాలి’ అనే జాబితా చాలా పెద్దది. ఇందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముహూర్తం నిర్ణయించారు. అప్పటికల్లా విధుల్లో చేరడానికి జిల్లా కలెక్టర్లను ఎంపిక చేశారు. కొత్త కమీషనరేట్లకు పోలీసు కమీషనర్లు,  జిల్లా పోలీసు కార్యాలయాలకు ఎస్పీలు, జాయింటు కలెక్టర్లు, మండల స్థాయిలో  తహస్లిల్దారు స్థాయి అధికారులను   పోస్టింగులతో సహా సిద్ధం చేశారు. కార్యాలయ భవనాలు, వాహనాలు ఇతర సదుపాయాలు అనుకున్న ఘడియకు అనుకున్న చోట ఏర్పాటు చేసారు. ఇవన్నీ జరగాలంటే రాజకీయ సంకల్పానికి బ్యూరోకాట్ల సహకారం కావాలి. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ చక్కటి సమన్వయంతో చేసిన కృషి వల్లనే ఇది సాధ్యపడింది.  
అయితే, ఇల్లలుకగానే పండుగ కాదన్నట్టు, కొత్త జిల్లాల ఏర్పాటుతోనే సుపరిపాలన ప్రజల ముంగిట్లోకి వచ్చినట్టు కాదు. అధికారులు ప్రజలకు దగ్గరగా వుండడంతోటే సామాన్యుల  సమస్యలు తీరవు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలి. తగిన అధికారాలు లేని అధికారి యెంత దగ్గరగా వుంటేమాత్రం ప్రజలకు  ఏం లాభం?
ప్రజా ప్రభుత్వాలు, వాటి అధినేతలు గమనంలో వుంచుకోవాల్సిన కఠోర వాస్తవం ఇది. (15-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595


     11, అక్టోబర్ 2016, మంగళవారం

కొత్త రూపంలో కొత్త రాష్ట్రం


నవ  తెలంగాణా  నూతన  స్వరూపం  ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది. విజయదశమి పర్వదినం ఈ  వేడుకకు వేదిక అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం   బాహ్య సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే,  చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి నిజమైన సవాలు నేటి నుంచి మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది.
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే కానీ ఆహ్వానించి, ఆదరించే  మంచితనం వారిలో పుష్కలంగా వుంది.

శుభం భూయాత్! 

8, అక్టోబర్ 2016, శనివారం

ఈ ఆలోచన ఎలా వుంది?


1987లో రేడియో మాస్కోలో  పనిచేయడానికి నేను కుటుంబంతో కలిసి మాస్కో  వెళ్ళాను. అంటే దాదాపు 29 ఏళ్ళు. అప్పటికే ఆ నగరంలో అన్నీ  బహుళ అంతస్తుల భవనాలే. ఊలిత్స వావిలోవాలో మేమున్న నివాసం వున్నది పద్నాలుగు అంతస్తుల భవనం. ప్రతి ఫ్లోర్ లో వుండేవాళ్ళు ఎవ్వరూ ఇంట్లో చెత్త పారేయడానికి కిందికి వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు. పై నుంచి కింది వరకు లిఫ్ట్ ఏర్పాటుకు వుండే వెంట్ మాదిరిగా ఒక గొట్టం వుండేది. ఏ అంతస్తులో వాళ్ళు ఆ అంతస్తులోనే పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా బ్యాగుల్లో నింపి ఆ గొట్టానికి వున్న తలుపులాంటిది తెరిచి అందులో వేసేవాళ్ళు. ఆ చెత్తంతా భవనం అడుగు భాగంలో ఏర్పాటుచేసిన ట్రాలీల్లోకి చేరేది. చెత్తను తీసుకువెళ్ళే మునిసిపల్ వాహనం వాటిల్లోని చెత్త సంచులను యంత్రాలతో తీసి పట్టుకు వెళ్ళేది. ఈ మొత్తం వ్యవహారం అంతా తెల్లవారేసరికి జరిగిపోయేది.  రోడ్ల పక్కన చెత్త కుండీలు కనబడేవి కావు. బయట ఎక్కడా చెత్తాచదారం కంట పడేది కాదు.

మన దగ్గర కూడా భవన నిర్మాణ సమయంలోనే ఇటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి తీరాలని నిబంధన విధిస్తే ఎలా వుంటుంది? అధికారులూ ఆలోచించండి.        

3, అక్టోబర్ 2016, సోమవారం

మీడియా ఆత్మశోధన – చర్చ


(2010లో రాసిన వ్యాసం)
అంజయ్యగారు ముఖ్యమంత్రిగా  వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది  బహిరంగ సత్యం.  పత్రికల యజమానులే  కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో  కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన  హాస్యంతో  అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని  అమాయకంగా మురిసిపోయేవారు.  ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం,  కొత్త  బాణీ  కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే  కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం.  వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది. 

రాష్ట్ర రాజకీయ యవనికపై  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు  పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేరెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి యేవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే  వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము  బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది.ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి అదే వార్తను తామే మర్నాడు ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, తమ రాజకీయ ప్రత్యర్ధుల  పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి  మార్గం  వేసింది.

నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధ శక్తులు  చొరబడడానికి  కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగేరాజకీయ నిర్ణయాలను తమకు  అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి   చేస్తున్న ప్రయత్నాల  పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి. 

మీడియా విశ్వసనీయతపై  ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు  ఇటీవలి కాలంలో  కారుమబ్బులుగా మారి ఒక  పెద్ద ప్రశ్నను  మీడియా ముందుకు తెచ్చాయి. 

ఫలితంగా,  మంచికో చెడుకో  మీడియాపై  ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితులగురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళను మూసివేయాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం  చేయాల్సిన   మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. 

అందుకేమీడియా  ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర  తప్పు ఎక్కడ జరుగుతున్నదోఎలా జరుగుతున్నదో  తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి.  పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై  చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి  భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లుస్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు  శిధిలమవుతున్నప్పుడు  సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీవెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి. 
కానీఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?


1, అక్టోబర్ 2016, శనివారం

పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు మెరుస్తాయా కురుస్తాయా

  
గత శుక్రవారం తెల్లవారినప్పటినుంచి  జాతి వ్యాప్తంగా  జనులు మాట్లాడుకుంటోంది ఒకే  విషయం. పాక్ ఆక్రమిత  కాశ్మీర్  భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్త్రైక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి  చేయడం గురించే. కుల,మత, ప్రాంత, రాజకీయ విబేధాలు పక్కనబెట్టి ప్రజానీకం యావత్తూ  భారత సైనికులపై  ప్రశంసలు కురిపిస్తూ వుండడం అనేది  భారతీయుల్లో జీర్ణించుకుని వున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని ప్రస్పుటంగా ఎత్తిచూపుతోంది. మనల్ని మనం భుజం చరుచుకుని పరస్పరం అభినందించుకోవాల్సిన శుభ తరుణం ఇది. అలాగే ఒప్పజెప్పిన బృహత్తర లక్ష్యాన్ని అనుకున్న వ్యవధిలో, అనుకున్న విధంగా జయప్రదంగా సాధించిన  భారత సైనిక కమాండోలకు జాతి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఈ  విజయానికి ఇటువంటి అపూర్వ స్పందన రావడానికి ఓ నేపధ్యం వుంది.
ఇటీవలే పాక్  ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి జొరబడి భారత సైనిక శిబిరంపై దొంగదెబ్బ తీశారు. పందొమ్మిదిమంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే  ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడమే, అలా ఆ స్థాయిలో తెగించినవారిపై గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ  ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పక్షం రోజుల్లోనే భారత సైనికులు ఈ మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయిలో  నిలబెట్టారు.  కాశ్మీర్ లోని ఉరీలో ఉగ్రవాదుల చర్యకూ, శుక్రవారం రాత్రి భారత్ కమాండోల చర్యకూ ఒక స్థూలమైన బేధం వుంది. ఉరీ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. వాళ్ళు దొంగచాటుగా మన దేశంలోకి చొరబడి పందొమ్మిదిమంది సైనికులను బలితీసుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను దెబ్బతీయడానికే వ్యూహ రచన చేసింది. మూలంపై దెబ్బ కొట్టడం ద్వారా ఉగ్రవాదులకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. వారికి మద్దతు ఇస్తున్న పాకీస్తాన్ కు కూడా ఈ విధంగా గట్టి హెచ్చరికతో కూడిన సంకేతం ఇచ్చింది. అదే సమయంలో అక్కడి సాధారణ పౌరులకు ఈ మెరుపుదాడుల వల్ల హాని కలగకుండా కేవలం లక్ష్యబేధనే గురిగా ఎంచుకుంది. ఇలా చేయడానికి ఎన్నో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి  తగిన  శిక్షణ పొందిన, అనుభవం కలిగిన  కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. శత్రువు స్థావరాన్ని ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విషయంలో  భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే,  అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.                
భారత సైన్యం జరిపిన మెరుపుదాడి పూర్వాపరాలను గురించి అనేక ఆసక్తి కరమైన కధనాలు వెలువడుతున్నాయి. సైన్యం ఎంతవరకు చేయాలో అంతవరకే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఆ కర్తవ్య పాలన గురించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే అధికారులు చెబుతారు. అంచేత జరిగినదాన్ని గురించి పలు కధనాలు మీడియాలో, ప్రత్యేకించి  సోషల్ మీడియాలో  వస్తున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా ఆధార రహితం అని చెప్పేందుకు కూడా వీలులేదు.
ఆ శుక్రవారం రాత్రి జరిగిన దాన్ని గురించి, ముఖ్యంగా ఆంగ్ల పత్రికల్లో వస్తున్న వార్తలు వింటుంటే, యుద్ధ నేపధ్యం కలిగిన  ఒక అద్భుతమైన చలన చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.   
ఈ సందర్భంలోనే సర్జికల్ స్త్రైక్స్ అనే అంశం గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మీడియాలో సాగుతోంది. ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు.
సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధి కారకమైన కణం ఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్త్రైక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని,  పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా,  బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోక నాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.  
ఇక ప్రస్తుత కాలానికి సంబంధించి కూడా  ఓ చక్కటి ఉదాహరణ వుంది.
1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు దారి మళ్ళించి దాన్ని ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో బలవంతంగా దింపేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీ ప్రయాణీకులందరినీ చంపేస్తామని బెదరించారు. నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ ఆ హైజాకర్లకు వత్తాసు పలకడంతో బందీలను కాపాడడం అన్నది ఒక  పెద్ద ప్రశ్నార్ధకమైంది. అప్పుడు ఇజ్రాయెలీ సైన్యాధికారులు ఇప్పటి భారత సైన్యం  మాదిరిగానే పకడ్బందీ వ్యూహం రచించి, రెండు రవాణా విమానాల్లో కమాండోలను తరలించారు. ఆ విమానాలు దాదాపు రెండువేల మైళ్ళు ప్రయాణించి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి, మెరుపు దాడి చేసి, ఉగాండా సైనికులను, విమానం దారిమళ్లించిన హైజాకర్లను వధించి, బందీలను విడిపించి తమ దేశానికి తీసుకువెళ్ళారు. థందర్ బోల్ట్ అనే గుప్త నామం కలిగిన ఈ యావత్తు ఆపరేషన్ ప్రక్రియను ఇజ్రాయెలీ కమాండోలు తొంభయ్ నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేసారు. పాలస్తీనా హైజాకర్లను, ఉగాండా సైనికులను తప్ప వాళ్ళు ఎవ్వరికీ హాని చేయలేదు.
పొతే, భారత పాకీస్తాన్ సరిహద్దుల్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి మెరుస్తున్నాయి. అవి కురుస్తాయా లేదా అనేది కాలమే చెప్పాలి. (01-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్ : 98491 30595