29, మార్చి 2014, శనివారం

నేనెవర్ని అనే గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ


మీరెవరు మీ కధా కమామిషూ ఏమిటని ఫేస్ బుక్ మిత్రబృందంలో కొందరికి డౌటేహం. అది తీర్చేందుకే ఈ ప్రయత్నం. సుదీర్ఘ సుత్తి అనిపిస్తే మన్నించండి.
పందొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.
విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్రజ్యోతికి వెళ్ళేవాడిని. అన్నయ్య పర్వతాలరావుగారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతిలో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసుకు ఎదురుగా వున్న  టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ముప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నాదగ్గరకు వచ్చి ఎక్కవుంటెంటుని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది - పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని  నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో పిల్లలకోసం ప్రత్యేక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పందొమ్మిదివందల డెబ్బయి ఒకటి,  ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ.వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఆ  మధ్య కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ (ఇటీవలే చనిపోయారు) వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి, రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాదృచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహనరావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూకు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్రజ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్రజ్యోతి ద్వారా లభిస్తే - సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు,  రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్లి వార్తలు చదివేయడం, వారానికి రెండు మార్లు వార్తావాహిని (న్యూస్ రీల్) - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యేక వార్తలు) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్యమంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల -వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపడాల్సిరావడం వల్లా  రేడియో విలేకరిగా నా ప్రాధాన్యత కొంత పెరిగింది. అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన.
ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్లో  కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్లో  ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీటుకి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియోస్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.
పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమానయానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్
చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.
అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- 'అమ్మవొడి'ని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.
ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర  దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.
వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు.
అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.
నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీలు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.




పాలకులు తీర్చలేని చిరు కోరిక


'ప్రజల మేనిఫెస్టో పేరుతొ ప్రోగ్రాం చేస్తున్నాం మీ అభిప్రాయం చెప్పండ'ని ఇప్పుడే ఒక ఛానల్ వాళ్లు ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్లారు.
అందులో చెప్పిన సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే.....

"సాధారణ జన జీవితంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని. అది చేస్తే మా నెత్తిన పాలుపోసినట్టేనని"  

వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమి?

వార్త - వ్యాఖ్య
News item in Deccan Chronicle today: " A total of 88 MLAs have defected to various political parties. The candidates are the same, the constituencies are the same but the parties have changed"

కొత్త జెండాలతో, కొత్త ఎజెండాలతో, కొత్త కండువాలతో వోట్లకోసం ఇళ్లకు వచ్చే అభ్యర్ధులకు  పాత కండువాలతో వున్న వాళ్ల పాత ఫోటోలను చూపిస్తే కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. ఏ స్వచ్చంద సంస్థ అయినా ఈ పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కాని వాటికి కూడా ఈ మధ్య సొంత ఎజెండాలు ఏర్పడుతున్నాయి. 

ఓటర్ల మేనిఫెస్టో



‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్


ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతే,  ఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
 ‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో.  ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.
      
1.  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.  (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా  రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే  లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని  మనవి.

28, మార్చి 2014, శుక్రవారం

టీవీ సూపర్ ఫైన్ ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక


“2014 లో ‘యుగాంతం’ కాబోతోందని గతంలో మేము ప్రసారం చేశాము. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల యుగాంతం 3014 సంవత్సరానికి వాయిదా పడిందని తెలపడానికి విచారిస్తున్నాము. అంతవరకూ చూస్తూ వుండండి టీవీ సూపర్  ఫైన్.”

27, మార్చి 2014, గురువారం

"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"




sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై  ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక చానలు కు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు  తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు.
ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఎనిమిది వరకు - హెచ్ ఎం టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ, గురువారం ఉదయం ఏడు గంటలనుంచి అటూ ఇటూగా ఎనిమిది వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడు గంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు (సాధారణంగా 10 టీవీ), ఆదివారం ఉదయం ఏడునుంచి ఏడు నలభై అయిదు వరకు - V 6 ఛానల్. ఇవికాక మధ్యాహ్నం, రాత్రి వేళల్లో  సందర్భాన్నిబట్టి చర్చాకార్యక్రమాలు వుంటాయి. గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత చానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"
    

              

26, మార్చి 2014, బుధవారం

పాత కాగితాల్లో దొరికిన పాత గేయాలు


(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ   తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది.  కాలమహిమ కాబోలు. ఏ వొక్క మహిళ అభ్యంతరం చెప్పినా వీటిని నిరభ్యంతరంగా తొలగిస్తా అని హామీ ఇస్తున్నాను.  - రచయిత )

రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే

కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది

నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది

నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే

నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా

రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను

నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా

గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా

ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?

నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు

నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు

నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి

షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?

నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను

కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే

ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.

(చలం రాతలు పిచ్చిగా చదివి)

25, మార్చి 2014, మంగళవారం

నీదా నాదా పైచేయి


రష్యన్లు హాస్య ప్రియులని ప్రతీతి. తమమీద తామే జోక్ వేసుకుని ఆనందించగల సంస్కారం వారిలో పుష్కలంగా వుంది.
గోర్భచెవ్ ఇచ్చిన వాక్స్వాతంత్ర్యం పుణ్యమా అని ఈ హాస్య ప్రియత్వం మరింత వెలుగులోకి వచ్చింది. అలా వారిలో వారు చెప్పుకునే కొన్ని జోకులను శౌనకాదిమునుల్లో ఒకరు విని సూతునికి చెప్పగా తెలియవచ్చిన ఒక జోకు కధాక్రమంబెట్టిదనిన:
సోవియట్ చరిత్రలో నికితా కృశ్చేవ్ ది ఒక ప్రత్యేక స్తానం. ఆయన ఒకసారి ప్రత్యేక విమానంలో అధికారిక పర్యటనపై అమెరికా బయలుదేరారు. ఆ రోజుల్లో అమెరికా గూఢచారి సంస్త ‘సీఐయే’, సోవియట్ గూఢచారి సంస్త ‘కేజీబీ’ – ఈ రెండింటి నడుమ ‘నీదా నాదా పై చేయి’ అనే రీతిలో అభిజాత్య ప్రదర్శన జరిగేది. ప్రతివిషయంలో ఏదోవిధంగా తమ ఆధిక్యతను చూపే అవకాశాన్ని దొరకబుచ్చుకోవడానికి ఈ రెండు సంస్తల అధికారులు అనుక్షణం శ్రమిస్తూ వుండేవారు.
ఆ రోజు కృశ్చేవ్ ప్రయాణిస్తున్న విమానం మరికొద్ది గంటల్లో వాషింగ్టన్ చేరుకోబోతున్నదనగా కేజీబీ అధికారి ఒకరు తనకు తెలియవచ్చిన సమాచారాన్ని సోవియట్ అధినాయకుడి చెవిలో వేశారు.
అంతకు కొన్ని గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పనిచేసుకుంటూ తూలిపోయి ఓ పక్కకు వొరిగిపోయారట. ఆ వైనాన్ని క్షణం ఆలశ్యం చేయకుండా రష్యన్ టెలివిజన్లో ప్రసారం చేసిన సంగతి అది. అది విన్న కృశ్చేవ్ అమందానందకందాళభరితుడై, తన గూఢచారి విభాగం పనిచేస్తున్న విధానానికి హర్షం తెలియచేసారట. వారికి అభినందనలు అందచేసి ఆ పిమ్మట బాతు రూముకుపోయి లఘుశంక తీర్చుకుని వస్తూ వోడ్కా మత్తులో ఆయన తన ప్యాంటు బొత్తాములు పెట్టుకోవడం మరచిన విషయాన్ని అదేసమయంలో వాయిస్ ఆఫ్ అమెరికా ప్రసారం చేస్తోంది.(ట)

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు .......


రెండేళ్ళ క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ సంస్థ పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది.



"Wherever you go
"NO ONE WILL EVER KNOW "
ఇప్పుడదే జరిగింది.

(అమెరికా నుంచి మిత్రుడు ఒకరు ఈ చిత్రాన్ని మెయిల్ చేశారు. వారికి కృతజ్ఞతలతో)   

ఐడియా

ఐడియా
అమెరికన్లు సరదాగా చెప్పుకునే ఓ కధ ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చింది. దాన్ని తెలుగులో చెక్కితే .....

(ఇదో గొప్ప ఐడియా - రెండింటిని ఒకటిగా చూపడం) 

'అనగనగా ఓ అమెరికన్ వూళ్ళో ఓ వృద్ధుడు నివసిస్తూ వుండేవాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు. ఆ మనాదితో భార్య మంచానపడి కన్ను మూసింది. వృద్ధుడికి పెద్దతనం మరింత ముసురుకు వచ్చింది. జైల్లో వున్న కొడుక్కు ఉత్తరం రాసాడు.
'నాయనా. అమ్మ పోయినదగ్గర నుంచి నాకేమీ చేతకాకుండా పోతోంది. వున్న ఎకరం (?) బంగాళా దుంపల తోట దున్ని పంట వేయడం నాకు అలివి కావడం లేదు. నువ్వా జైల్లో వున్నావు. ఏం చెయ్యాలో తోచడం లేదు' అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
కొడుకు నుంచి తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.
'నాన్నా . ఆ తోట జోలికి వెళ్ళకు. నేను దొంగతనంగా ఎత్తుకొచ్చిన తుపాకులను మన తోటలోనే పాతిపెట్టాను. నేను వచ్చిన తరువాత దాని సంగతి చూసుకుందాం.'
ఆ ఉత్తరం వచ్చిన మర్నాడే బిలబిలమంటూ పోలీసు పటాలం దిగింది. ఆ వృద్దుడిని వెంటబెట్టుకుని తోటకు వెళ్లారు. అతడు కళ్ళప్పగించి చూస్తుండగానే మొత్తం ఆ తోటనంతా గడ్డపారలు తీసుకుని కుళ్లబొడిచారు. సెంటు జాగా వొదలకుండా తవ్వేశారు. అక్కడ తుపాకులు గట్రా ఏమీ దొరకకపోవడంతో వెనక్కు మళ్ళారు. కాగల కార్యం  గంధర్వులు తీర్చినట్టు తోటను సాగుకు అనువుగా చేసిపోయారు.
ఇంతకీ జరిగినదేమిటంటే ..తండ్రి రాసిన ఉత్తరం కొడుక్కు బాధ కలిగించింది. తానా జైల్లో వున్నాడు. వెళ్ళి తండ్రికి సాయం చేసె వీలు లేదు.  కానీ మనసుంటే మార్గం వుంటుంది. ఆ క్రమంలో   ఆ జైలుపక్షికి  ఒక  'ఐడియా' తట్టింది.  తుపాకులు, దొంగతనం అంటూ  తండ్రికి ఉత్తరం రాసాడు. అతడు వూహించినట్టే  దాన్ని పోలీసులు పొల్లుపోకుండా చదివారు. తోటలో దాచిన తుపాకులను స్వాధీనం చేసుకోవాలని వెళ్లారు.  తోటనంతా తవ్విపోసారు. ఏమైతేనేం చేతకాని తండ్రికి చేతనైన సాయం చేయగలిగాడు. 
NOTE: Courtesy image owner 

24, మార్చి 2014, సోమవారం

రేడియో జోకులు


నిజంగా రేడియోలో వచ్చిన జోకులే. పీ ఎస్.  గోపాల కృష్ణ గారు, ఆకాశవాణి హైదరాబాదు  కేంద్రం పూర్వ సంచాలకులు, లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సె హౌ లాంగ్ ఎగో, సంచాలకులు కాకపూర్వమే రేడియోలో 'నవ్వకండి' అనే కార్యక్రమం చేస్తుండేవారు. నేనో జోకు చెప్పనా అనే తరహాలో కాకుండా జోకు  చెప్పి నవ్వించే జోకులు చెబుతుండేవారు, అందులో ఒకటి.
"రేడియో ఏం రిపేరు చేసినట్టయ్యా! ఇంకా అన్నీ చెత్త ప్రోగ్రాములే వస్తున్నాయి" అందొకావిడ రిపేరీ చేసిన ఆసామితో.
నవ్వుకు నా పూచీ ఏం లేదు.
అల్లాగే ఇంకోటి.
"పదేపదే పార్టీలు మారుతున్నాను అని నేనంటే గిట్టనివారు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతమాత్రం లేదు. కావాలంటే నా గత చరిత్ర ఒకసారి తిరగేయండి. నేను ఎప్పుడూ ఏదో ఒక అధికారపక్షంలోనే వుంటున్న సంగతి బోధపడుతుంది." 

ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారి వ్యవహారశైలి

నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలుఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.


(జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సభలో మాట్లాడుతున్న వై ఎస్ ఆర్)  
అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.
వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.
వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.
రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన డెడ్ లైన్లువుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - మంచిది వెళ్ళిరండిఅనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.
వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ఆహా ఏమి అదృష్టంఅనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరదన్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ఇల్లు వసతిగా వుంది కదా!అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (09-09-2010)

22, మార్చి 2014, శనివారం

ఆకాశమే హద్దురా!

 
"ప్రియమైన వోటరు దేవుళ్ళలారా! ఈరోజు నుంచి లెక్కపెట్టుకోండి. (గుర్తుపెట్టుకోకండి). ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు రోజుకో కొత్త వాగ్దానం చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను"




NOTE: COURTESY CARTOONIST
 

జగన్ - బాబు

ఇది నా అభిప్రాయం కాదు ఓ అంచనా మాత్రమే.
దీనితో ఏకీభవించనక్కర లేదు. విభేదించనక్కరలేదు.
అయినా ఎవరిష్టం వారిది.

చంద్రబాబు నాయుడికి 'విశ్వసనీయత' యెంత సమస్యో, అదే ఆయనకు ఒక రకంగా శ్రీరామరక్ష. చంద్రబాబు విషయంలో సోషల్ మీడియాలో  ఏమాత్రం అనుకూలంగా ఎవరు రాసినా హర్షించేవారు, ప్రతికూలంగా ఏమి రాసినా ఆహ్వానించేవారు దాదాపు సరిసమానంగా కనిపిస్తున్నారు. కొంతమందిలో ఆయనపట్ల అపనమ్మకం ఎంతగా పేరుకుపోయిందో, మరికొందరికి చంద్రబాబు శక్తి సామర్ధ్యాల పట్ల అంతకుమించిన నమ్మకం అంతే గట్టిగా వుంది. ఇక ఈ మీడియా  అందుబాటులో లేని జనాలను దృష్టిలో పెట్టుకుంటే సీమాంధ్రలో తెలుగు దేశంతో పోటీపడుతున్న జగన్ పార్టీ గురించి వీటి ఆధారంగా  ఓ అంచనాకు రావడం సహేతుకంగా వుండదు కాని మొత్తం మీద అక్కడ 'జగన్ లేదా  నో జగన్' అనే నినాదమే వినబడుతోంది. బాబు విషయంలో, జగన్ విషయంలో కూడా 'ఈ రెండు విభాగాల మధ్య వ్యత్యాసమే' వారి తల రాతలను మారుస్తుంది. కొత్త పార్టీలు, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు, సరికొత్త పాత పార్టీలు ఈ సమీకరణాల మార్పులో కొంత పాత్ర పోషిస్తాయి.

21, మార్చి 2014, శుక్రవారం

"నో వర్రీ మేడం! మోడీ వచ్చే చాన్స్ లేదు"


(గుంటూరి నాగేశ్వరరావు గారు షేర్ చేసిన ఇంగ్లీష్ జోక్కి అనువాదం, వారికి కృతజ్ఞతలతో)
పాడు ప్రపంచాన్ని చూసి చూసి దేవుడికి వొళ్ళు మండిపోయింది. దీన్ని దేవుడు కూడా మార్చలేడు  అవటా అనుకుని ఏమైనా సరే ఈ  ప్రపంచానికి  భరత వాక్యం పలకాలని నిర్ణయించేశాడు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేసేముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలా ఓ సమావేశం ఏర్పాటుచేసి తాను ముఖ్యులు అనుకున్న ఓ ముగ్గురు దేశాధినేతలను దానికి రమ్మని ఆహ్వానించాడు. పిలుపుల మేరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లారు. దేవుడు ఆట్టే సమయం వృధా చేయకుండా ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ప్రకటించి 'పోయి మీ వాళ్లకు చెప్పుకోండ'ని ఆదేశించాడు.
ఒబామా వెంటనే టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి తన దేశప్రజలతో చెప్పాడు.
'మీ అందరికీ ఓ శుభ వార్త. ఓ చెడు వార్త. మంచి వార్త ఏమిటంటే మనం అందరం విశ్వసిస్తున్న దేవుడు నిజంగానే వున్నాడు. దుర్వార్త  ఏమిటంటే ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ఆయనే నాతొ స్వయంగా చెప్పాడు'
చైనా అధ్యక్షుడు తన దేశపౌరులను ఉద్దేశించి మాట్లాడాడు.
'ప్రియమైన కామ్రేడ్స్! ఒక దుర్వార్త ఏమిటంటే మనం దేవుడు లేడని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాం. అది నిజం కాదు. ఆయన్ని ఇప్పుడే కలుసుకున్నాను. దానికంటే మించిన చెడు వార్త ఒకటి వుంది. ఈ యావత్ ప్రపంచాన్ని కమ్యూనిస్ట్ ప్రపంచంగా మార్చాలనే మన ఆశయం నెరవేరేటట్టులేదు. ఎందుకంటే ఆ పాడు దేవుడు దీన్ని అంతం చేయాలని ఓ నియంతలా  ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు"
మన్ మోహన్ సింగ్ దేశ ప్రజల జోలికి పోలేదు. ముందు మేడం సోనియాకు ఫోను చేసాడు.
'మేడం. ఓ శుభవార్త. దానికితోడు దాన్ని మించిన మరో మంచి వార్త. ఇన్నాళ్ళు నేనొక పనికి రానివాడినని పేపర్లలో కార్టూన్లు వేస్తుంటే నిజమే కాబోసు అని బాధపడేవాడిని. కాని మేడం ! ఆ దేవుడు నా ప్రతిభని గుర్తించాడు. అమెరికా, చైనా అధ్యక్షులతో పాటు నన్ను కూడా ఆహ్వానించాడు' అన్నాడు గడ్డం మాటున  ముసి ముసి నవ్వులు దాచుకుంటూ.
'మీ  సంగతి సరే! ఇంతకీ  ఆ మంచి వార్త ఏమిటో చెప్పండి'
'అదా మేడం. దేవుడు ఈ లోకానికి తక్షణం చరమగీతం పాడాలని నిర్ణయించేసాడు. మోడీ ప్రధాని అయిపోతాడేమోనన్న  భయం అక్కరలేదు మేడం'

కలత పెట్టే జ్ఞాపకం


అంజయ్య గారి లాగే చనువుగా మసలిన ముఖ్యమంత్రులు మరో ఇద్దరు వున్నారు. ఒకరు చంద్ర బాబు, మరొకరు రాజశేఖరరెడ్డి. వీరిద్దరూ అంజయ్య గారి మంత్రివర్గంలో సభ్యులు. ముందు వై ఎస్ ఆర్ చేరారు. ఆతరువాత విస్తరణలో చంద్రబాబుకు చోటు దొరికింది. వీరిద్దరూ మంచి మిత్రులు. దానికి నేనే సాక్ష్యం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత  రాజకీయంగా వీరి దారులు వేరయ్యాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అఘాధం మరింత పెరిగింది. ఆ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చోటుచేకున్న వాదప్రతివాదాలు గమనించినప్పుడు - ఈ దూరం కేవలం రాజకీయం వల్లకాదు, వ్యక్తిగతం అనికూడా అనిపించింది. ఒకప్పుడు వీరిద్దరి నడుమ వున్న స్నేహాన్ని దగ్గరగా చూసిన వాడిగా 'ఆదూరం' నన్ను ఎంతో బాధ పెట్టింది. అయినా ఇద్దరితో నా పరిచయం అలాగే కొనసాగింది. ఒకరి సంగతులు మరొకరికి మోయడం అనే సద్గుణం లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి స్కూటరు నుంచి పడి కాలు విరిగి ఆసుపత్రిలో పడి వుంటే ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో తలమునకలై వుండి కూడా వీరు తమ స్నేహ వాత్సల్యాన్ని నాపై ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా వుంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరామర్శించాల్సిన అవసరం చంద్రబాబుకు వుందనుకోను. అలాగే ప్రతిపక్ష నేత వై ఎస్ ఆర్.


వెళ్ళి పిలవకపోయినా మా పిల్లవాడి పెళ్ళికి ఎస్ ఎం ఎస్ పిలుపుతో హాజరయిన గొప్పతనం వారిది. వారి దారులు వేరయి, వైరి పక్షాలుగా మారడం నన్ను ఎప్పుడూ కలత పెట్టే విషయం. వీరిలో ఒకరు లేకుండా పోయారు. మరొకరిని కలుసుకునే వీలు లేదు.



విలేకరులు ఏమీ సంపాదించుకోకపోయినా ఇలాటి అనుభవాలు వారికే సొంతం.               

20, మార్చి 2014, గురువారం

సోల్డ్ అవుట్


ఇంట్లో వొంట్లో బాగా బలిసిన ఓ అరబ్  షేక్ గారు విమానంలో ఎయిర్ హోస్టెస్  చూసి మనసు పారేసుకున్నారు. వెంటనే క్యాబిన్ లో కెప్టెన్ ని కలిసి ఆ ఆమ్మడ్ని కొనుక్కుంటాను ధర ఎంతో చెప్పమన్నాడు.
అక్కడినుంచి వారిద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది.
"కుదరదు. ఎయిర్ హోస్టెస్ మా విమాన సిబ్బందిలో ఒకరు. అలా కొనేసుకుంటాను అంటే అసలు కుదరదు."
"ఐయితే విమానమే  కొంటాను దాని ధర  ఎంతో చెప్పండి"
"ఈ విమానం ఎయిర్ ఇండియాది.'
"అలా అయితే ఎయిర్ ఇండియాని కొంటాను."
"మీరిలా ఎయిర్ ఇండియాలు, ఇండియన్ ఎయిర్ లైన్స్ లూ కొంటానంటే మా దేశంలో వీలుండదు. అవి భారత ప్రభుత్వానివి."
"అలానా. అయితే ఆ ప్రభుత్వం ఎంతకు అమ్ముడవుతుందో చెప్పు. ఇప్పుడే చెక్కు రాసిస్తాను"
"మీరు చాలా ఆలస్యం చేశారు. మా ప్రభుత్వం అంబానీలకు అమ్ముడుపోయి చాలా కాలం అయ్యింది."
(నెట్లో సంచారం చేసే ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

సంస్కారం


సంస్కారం అనేది జన్మతః రావాలని అంటారు. కానీ, చూసి నేర్చుకోవడం, నేర్పించడం ద్వారా కూడా సంస్కారం అలవడుతుంది అనడానికి అనేక దృష్టాంతాలు వున్నాయి.
సంస్కారం మన పొరుగున వున్న కన్నడిగుల్లో ఎక్కువేమో అనే అభిప్రాయం కూడా వుంది. కన్నడ సాహిత్యానికి చక్కటి గుర్తింపు తెచ్చిన యు.ఆర్. అనంతమూర్తి ఏకంగా 'సంస్కార' పేరుతొ ఒక నవల రాశారు కూడా.
సంస్కారం గురించిన ముచ్చట పాత్రికేయ మిత్రుడు సత్యమూర్తి దగ్గర వచ్చింది.
వాళ్ళబ్బాయి కన్నడ దేశంలోని ఒకానొక వైద్య కళాశాలలో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. ఓ జర్నలిస్టు కొడుకు చదువులో ఇలా ఎదిగిరావడమే  అదృష్టం అనుకుంటే సత్యమూర్తి డబల్ ధమాకా కొట్టాడు. వాళ్ల అమ్మాయి కూడా రేపోమాపో డాక్టర్ కాబోతోంది.
అది సరే. సంస్కారం గురించికదా చెప్పుకుంటున్నాం.


(పుత్రోత్సాహము)

కాన్వొకేషన్ కు రమ్మని ఆ వైద్య కళాశాల నుంచి సత్యమూర్తి దంపతులకు ఆహ్వానం అందింది. భార్యను, డాక్టర్ తనయుడినీ, కాబోయే దాక్టరమ్మను  అందర్నీ వెంటబెట్టుకుని 'చిత్ర  దుర్గం' కాబోలు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లు వారికి దిగ్భ్రాంతిని కలిగించాయి. పట్టా పుచ్చుకునే పట్టభద్రుల తలిదండ్రులందరికీ ముందు వరసల్లో వాళ్ల పేర్లు రాసి  మరీ సీట్లు రిజర్వ్ చేశారు. పట్టా ప్రదానం సమయంలో పలానా వారి తలితండ్రులని అందరికీ పరిచయం చేశారు. పట్టాలపై కూడా 'పలానా వారి అబ్బాయి' అని తండ్రి పేరుతో బాటు తల్లిపేరు కూడా ముద్రించారు. 'ఈ తలిదండ్రుల కడుపున  పుట్టడం వల్లనే మీరు ఇలా సమాజంలో నలుగురికీ సేవ చేసే భాగ్యం పొందగలిగార'ని పిల్లలకు  చెప్పారు. తలిదండ్రుల గొప్పతనం గురించి తెలియచేసే రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించారు.ఇక సంస్కారం అలవాడక ఏం చేస్తుంది చెప్పండి.అందుకే చెప్పింది. సంస్కారం జన్మతః అబ్బుతుంది. అలాగే నేర్పడం ద్వారా అలవడుతుంది.
ఆవిధంగా సత్యమూర్తి దంపతులది 'ట్రిపిల్ ధమాకా!'

19, మార్చి 2014, బుధవారం

ఇప్పుడు - అప్పుడు


చూశారా! ఇటీవల రాష్ట్రపతి హైదరాబాదు వచ్చినప్పుడు స్థానిక జర్నలిస్టులను బొలారం లోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. జర్నలిస్టులకు వారికీ మధ్యవున్న 'వేరు బంధం' గమనించారా?



గతంలో నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అదే భవనంలో విలేకరులను కలుసుకున్నారు. మేమందరం హాయిగా ఆయనతో కరచాలనం చేయగలిగాము.



అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా!

చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారా?


ఇదేమీ టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపొతే నవ్వించాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!


(చంద్రబాబునాయుడు ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు మా వూరునుంచి మా అన్నయ్య కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు వచ్చి బాబుగారిని చూడాలంటే సచివాలయానికి తీసుకువెళ్ళాను. ఆ సమయంలో అక్కడ వున్న విలేకరులతో కలిపి తీసిన  ఫోటో. ఇందులో నేను లేకపోవడానికి కారణం ఫోటో తీసింది నేను కావడమే) 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పనిలో పనిగా 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ  హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర  పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈలోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, సీఎం బయలుదేరి రావచ్చా అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని.
అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.