15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 7 (ఆఖరి భాగం )వృద్ధులు వికలాంగులతో కలిసి మహా లఘు దర్శనం చేసుకున్న తరువాత మరునాడు వృద్ధుల కోటాలో దర్శనం చేసుకోవాలన్న అభిలాష కలిగింది. పది గంటలకు క్యూ లైన్ తెరుస్తారు. రెండు గంటలముందు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సీనియర్ల వయస్సు అరవై అయిదు వుండాలని, ధృవపత్రం తెచ్చుకోవాలని  నిబంధన. దాన్ని పాటిస్తూ ఉదయం ఎనిమిది లోపలే అక్కడికి చేరుకున్నాము. మహాద్వారానికి ఎదురుగా వున్న  విశాల ప్రాంగణంలో ఓ పక్కగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అది. వృద్ధులు, వికలాంగుల విషయంలో టీటీడీ తీసుకుంటున్న శ్రద్ధ చూసి మురిసిముక్కచెక్కలై గంటలు కూడా గడవలేదు. ఇప్పుడు అక్కడి దృశ్యం చూసిన తరువాత  వాళ్ళంటే ఇంత చులకనా అనిపించింది. కోట్లకు పడగెత్తిన దేవస్థానానికి కొన్ని కనీస సదుపాయాలు, అంటే వాళ్లు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడం అలవికి మించిన భారం కూడా కాదు. అన్ని గంటలసేపు వారిని  నిలబెట్టి వుంచడంలో హేతుబద్ధత శూన్యం. దేవస్థానం వారి నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఆ దృశ్యం కానవచ్చింది. ఇది ఎక్కడో మారుమూలన లేదు. ఉన్నతాధికారులు ఎల్లప్పుడు సంచరించే మహాద్వారానికి కూతవేటు దూరంలో వుంది.

అప్పటికే షెడ్డు నిండిపోయి క్యూ లైను బయట చాలా దూరానికి వచ్చింది. క్యూ నెమ్మదిగా కదులుతూ వచ్చి మేము షెడ్లో ప్రవేశించేసరికి గంటన్నర గడిచింది. అంతసేపూ,  ఆ తరువాత కూడా నిలువు జీతాలే. పేరుకు కొన్ని కుర్చీలు వున్నాయి కాని అవి నిండిపోయివున్నాయి.ధృవపత్ర పరిశీలన  అనంతరం ఫోటో తీసి ఓ పాసు చేతిలో పెట్టారు. తాగినవారికి పాలు ఇచ్చారు. ఇరవై రూపాయలు తీసుకుని లైన్లో వుండగానే రెండు లడ్లు తీసుకునే టోకెన్ ఇచ్చారు.  కొంతమంది పత్రాలు సరిగ్గా లేవని బయటకు పంపేశారు. ఈ పని క్యూ లైన్ మొదట్లోనే చేసివుంటే వారికి ఎంతో శ్రమ తప్పి వుండేది. కానీ శ్రమ పెట్టడమే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్న వాళ్ళాయే. కిందటి సారి వచ్చినప్పుడు ఓ ఉన్నతాధికారి మాటలమధ్య చెప్పారు. 'కొండకువచ్చేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వున్న వసతులు పరిమితం. ఇలా కొన్ని అగచాట్లు పెడితే వాళ్ళను రాకుండా చేయొచ్చు(ట).' ఇలా వుంటాయి అధికారుల ఆలోచనలు.
మహాద్వారం దాటేదాకా వైతరణిని  గుర్తుకు తెచ్చారు. ఆ తరువాత తొందరగా సాగినా ఆరోజు కూడా మహాలఘు దర్శనమే.

(మండుటెండలో వృద్ధులు,వికలాంగులు) 


బయటకు వచ్చిన తరువాత వృద్ధుల వికలాంగుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులు, వీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపులదాకా వస్తాయి. కానీ భక్తులు మాత్రం పాదరక్షలతో మాడ వీధులలో తిరుగాడరాదు. తప్పుపట్టేదేమీ లేదు. కానీ అక్కడ పరచిన బండలనండి, ఇంకోటి అనండి వాటిమీద నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి  సభ్యులు, అధికారులు ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!

(నాకు ఇచ్చిన సీనియర్ సిటిజన్ పాసు)

ఏడు బాగాలతో ఈ ఏడు కొండల యాత్ర సమాప్తం.
కాకపోతే చిన్న తల తోక:  

     
వెళ్ళిన రోజు సాయంత్రం వరాహ స్వామి గుడికి వెడితే 'తెప్పోత్సవం' అంగరంగ వైభోగంగా రంగురంగుల దీపాలతో జరుగుతోంది. విద్యుత్ దీప శోభితమైన నావలో స్వామివారు ఊరేగుతూ వస్తున్నారు. ఇది దగ్గర నుంచి చూడడానికి  టిక్కెట్టు కూడా  పెట్టారట. ఇంతలో పక్కనుంచి ఒకాయన అదిగో 'బాపిరాజు' అన్నాడు. చూస్తే దూరంగా పడవలో చాలామంది కూర్చునివున్నారు. ధర్మ సందేహాన్ని  లైవ్ టెలికాస్ట్ చేస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ వాళ్లు తీర్చారు. వాళ్లు  దగ్గర్లో ఏర్పాటుచేసిన పెద్ద టీవీ తెరపై  మీసాలు దువ్వుకుంటూ బాపిరాజు  కానవచ్చారు. అర్చకులు  హారతి అందిస్తున్నారు. ఇంతకీ తెప్పోత్సవంలో వూరేగుతున్నది స్వామి వారా! పాలక మండలి వారా! అన్నీ తెలిసిన ఆగమ పండితులే చెప్పాలి.
(సమాప్తం)