21, మార్చి 2014, శుక్రవారం

కలత పెట్టే జ్ఞాపకం


అంజయ్య గారి లాగే చనువుగా మసలిన ముఖ్యమంత్రులు మరో ఇద్దరు వున్నారు. ఒకరు చంద్ర బాబు, మరొకరు రాజశేఖరరెడ్డి. వీరిద్దరూ అంజయ్య గారి మంత్రివర్గంలో సభ్యులు. ముందు వై ఎస్ ఆర్ చేరారు. ఆతరువాత విస్తరణలో చంద్రబాబుకు చోటు దొరికింది. వీరిద్దరూ మంచి మిత్రులు. దానికి నేనే సాక్ష్యం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత  రాజకీయంగా వీరి దారులు వేరయ్యాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అఘాధం మరింత పెరిగింది. ఆ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చోటుచేకున్న వాదప్రతివాదాలు గమనించినప్పుడు - ఈ దూరం కేవలం రాజకీయం వల్లకాదు, వ్యక్తిగతం అనికూడా అనిపించింది. ఒకప్పుడు వీరిద్దరి నడుమ వున్న స్నేహాన్ని దగ్గరగా చూసిన వాడిగా 'ఆదూరం' నన్ను ఎంతో బాధ పెట్టింది. అయినా ఇద్దరితో నా పరిచయం అలాగే కొనసాగింది. ఒకరి సంగతులు మరొకరికి మోయడం అనే సద్గుణం లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి స్కూటరు నుంచి పడి కాలు విరిగి ఆసుపత్రిలో పడి వుంటే ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో తలమునకలై వుండి కూడా వీరు తమ స్నేహ వాత్సల్యాన్ని నాపై ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా వుంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరామర్శించాల్సిన అవసరం చంద్రబాబుకు వుందనుకోను. అలాగే ప్రతిపక్ష నేత వై ఎస్ ఆర్.


వెళ్ళి పిలవకపోయినా మా పిల్లవాడి పెళ్ళికి ఎస్ ఎం ఎస్ పిలుపుతో హాజరయిన గొప్పతనం వారిది. వారి దారులు వేరయి, వైరి పక్షాలుగా మారడం నన్ను ఎప్పుడూ కలత పెట్టే విషయం. వీరిలో ఒకరు లేకుండా పోయారు. మరొకరిని కలుసుకునే వీలు లేదు.విలేకరులు ఏమీ సంపాదించుకోకపోయినా ఇలాటి అనుభవాలు వారికే సొంతం.               

2 వ్యాఖ్యలు:

రాధిక చెప్పారు...

nice info

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రాధిక - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు