1, మార్చి 2014, శనివారం

పాతికేళ్ళనాటి మాస్కో - 7


స్త్రీ బాలవృద్దులదే హవా!

అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది. 


సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా  ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే - మాస్కోలో వున్నన్ని రోజులు మా పిల్లలే మాకు దుబాసీలు.