31, జులై 2014, గురువారం

రాజకీయం ఒక రక్షరేఖ


దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ వున్నా రాజకీయ నాయకులతో పోలిస్తే  తీసికట్టే.లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బుసంచులూ  వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడంకోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే మాటలు కూడా  పొసగని వాళ్లు సయితం  డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో నీరాజనాలు. ఎక్కడకు వెళ్ళినా,  ఒక్కసారి పలకరిస్తే చాలు అనుకుని పులకరించిపోయే జనాలు. తమ అభిమాన నటుడు కరచాలనం చేసినా జన్మ ధన్యం అయిపోయినట్టు కలలు కనే అభిమాన జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చాలు ఆ నటుడికి దిగ చెమటలు పట్టడానికి.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండా కూడా   డబ్బు రాశులు రాశులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంతనే వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకుపోగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళి, పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు.  ముఖ్యమంత్రి పేషీలోకి అనుమతి లేకుండా జొరబడగలడు. చివరాఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సైతం సందేహించే పోలీసు ఠాణాల్లోకి  సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని దేవాలయాల్లోకి  పదిమందిని వెంటేసుకు పోగలడు.
అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం పని తీరు  తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే బాగు చేయిస్తాం రాఅని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే చాలు  అన్నీ వున్నట్టే లెక్క. అదే అధికార పార్టీ అయితే ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.

పొలిటికల్ పవర్ కు వున్న పవర్ అలాటిది. అందుకే ఈరోజుల్లో అందరి చూపూ   రాజకీయం మీదే!
NOTE: Courtesy Image Owner   

30, జులై 2014, బుధవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9                   
ఆ తరువాత ముఖ్యమంత్రులయిన శ్రీయుతులు అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు - తమ పేషీల్లో వ్యక్తిగత సిబ్బందిని తమకు ఇష్టం వున్నవారితో మార్పులు చేసుకున్నప్పటికీ పీ ఆర్ వొ గా మాత్రం, చెన్నా(రెడ్డి) నుంచి అన్నా(ఎన్టీయార్) వరకు మా అన్నయ్య పర్వతాలరావుగారే కొనసాగారు. ముఖ్యమంత్రులు, ఆఖరికి పాలించే పార్టీలు మారినా పీ ఆర్ వొ గా ఆయన కొనసాగడం అనేది ఇప్పటికీ ఒక రికార్డు.


తన అనుభవాలను ఏర్చి కూర్చి 'చెన్నా టు అన్నా' అనే గ్రంధాన్ని రాయాలనే తలంపు వున్నట్టు ఆయన అనేకసార్లు అనుకున్నారు. మా అన్నయ్య అని చెప్పడం కాదు కాని, పర్వతాలరావు గారు మంచి ధారణ కలిగిన వ్యక్తి. ఆంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి ప్రవీణుడు. చక్కని రాయసకాడు. గేయం రాసినా, వ్యాసం రాసినా సుబోధకంగా వుండేది. ప్రసంగ వ్యాసాలు  రాయడంలో దిట్ట. 'ఈ చీకటి గొందులలో, లేఖినీలాస్యం,చెప్పు తెగింది' అనే గేయ సంపుటాలు, ప్రకాశం గాధాశతి, జై భీమ్ కధలు, పరమాచార్య పావన గాధలు, Charaka - Redactor, par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts అనే రచనలు చేశారు.
పర్వతాలరావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర  అయిదేళ్లపాటు పనిచేసి, సమాచారశాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి,  పదవీ విరమణ చేశారు. మొదటి ఉద్యోగం నుంచి చివరి ఉద్యోగం వరకు ప్రభుత్వ వాహనం, డ్రైవర్ సదుపాయాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనుభవించి  రిటైర్ అయిన తరువాత హాయిగా సిటీ బస్సులు, ఆటోల్లో తిరగడం చూసి మాకే చిత్రమనిపించేది. రిటైర్ అయిన కొద్ది మాసాలకే నారసింహతత్వం అధ్యయనం నిమిత్తం దక్షిణ, ఉత్తర భారతంలోని అనేక నరసింహ దేవాలయాలను దర్శించి పరిశోధన చేసి 'నమో! నారసింహాయ!' అనే పేరుతొ ఆరు సంపుటాలను వెలువరించారు. చాప మీద కూర్చుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని వేల పేజీలు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఆయన రాసిన తీరు అమోఘం. అలా ఆధ్యాత్మిక రచనా వ్యాసంగంలో తుచ్చ రాజకీయ రచనల వాసన ఆయనకు రుచించినట్టు లేదు. అందుకే కాబోలు 'చెన్నా టు అన్నా' వెలుగు చూడలేదు.

జీవిత చరమాంకంలో పుట్టపర్తిలో మా వొదినె సరోజినీదేవి  గారితో కలిసి ఓ చిన్నగదిలో వుంటూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, 2006 ఆగస్టు 21 వ తేదీన, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా  ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.  మనిషి అనేవాడు మనీషిగా యెలా జీవించవచ్చో నిజం చేసి చూపాడు కాబట్టే ఆ సర్వేశ్వరుడు ఆయనకు అలాటి ఆనాయాస మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.         

దేశానికి పనికొచ్చిన సలహా

ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటి మాటో.
పారిశ్రామికవేత్త జె.ఎన్.టాటా ఓసారి జర్మనీ ప్రయాణం పెట్టుకున్నారు. ఓడలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఆయనతో పాటు అనేక గోనె  సంచులు. వాటిల్లో దేశంలో వివిధ ప్రాంతాలనుంచి సేకరించి తెచ్చిన మట్టి నమూనాలు.  వాటిని జర్మనీలో శాస్త్రవేత్తలకు చూపించి వాటిల్లో  ఇనుము లేదా ఇతర లోహాలు వుంటే  కనుగొని ఆయా ఖనిజాల తవ్వకం చేపట్టాలన్నది టాటా మహాశయుల ప్రయత్నం.


అదే ఓడలో కింద భాగంలో స్వామీ వివేకానంద   ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ని గురించి అప్పటికే కర్ణాకర్ణిగా విన్న టాటా, తనకు తానుగా కిందికి దిగి వెళ్ళి స్వామిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. మాటల్లో తన ప్రయాణం లక్ష్యాన్ని కూడా స్వామికి వివరించారు.
స్వామి వెలిబుచ్చిన ఓ అనుమానం టాటాని ఆలోచనలో పడవేసింది. దేశం నుంచి తీసుకు వెళ్ళిన మట్టి నమూనాల్లో నిజంగా ఖనిజాలు వున్నట్టు కనుగొన్నా, విదేశీ శాస్త్రవేత్తలు నిజాయితీగా ఆ విషయం తెలియచెప్పకపోవచ్చన్నది స్వామికి కలిగిన సందేహం.
"ఒక పని చేయండి. భారత దేశంలో మేధావులయిన యువకులకు కొదవ లేదు. దురదృష్టం ఏమిటంటే వారికి సరయిన అవకాశాలు లేక వారి ప్రజ్ఞాపాటవాలన్నీ నివురుగప్పిన నిప్పులా వుండిపోతున్నాయి. మీరు దేశానికి తిరిగివచ్చిన తరువాత మైసూరు మహారాజు చామరాజ వడయారును కలవండి. ఆయన బ్రిటిష్ పాలకులకి విధేయుడే. కానీ దేశం అంటే ప్రేమ కలిగినవాడు. చక్కటి పరిశోధనాసంస్థను ఏర్పాటు చేయడంలో మీకు తోడ్పడుతాడు' అని సలహా ఇచ్చారు.
టాటా జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామి వివేకానంద సలహా ప్రకారం వెళ్ళి మైసూరు మహారాజును కలుసుకున్నారు. పరిశోధనాసంస్థ ఏర్పాటు గురించిన తన ప్రతిపాదన గురించి చెప్పారు. చామరాజ వడయార్ ఎలాటి సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే 370 ఎకరాల భూమిని సంస్థ ఏర్పాటుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఆవిధంగా ఏర్పాటయిందే దేశంలో తొలి పరిశోధనాసంస్థ - "The Indian Institute Of Science".
మహానీయుల సంకల్పబలం ఆవిధంగా వుంటుంది.

(మిత్రులు దేవినేని మధుసూదన రావు గారు అమెరికా నుంచి పంపిన మెయిల్ సమాచారం ఆధారంగా)

29, జులై 2014, మంగళవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు  తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో,  కారణం ఏదయినా, 1980  అక్టోబర్ 10 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జీ.వెంకటరామారావు ఆ వుదంతం గురించి  చేసిన వ్యాఖ్యానం ఇక్కడ పేర్కొనడం సముచితంగా వుంటుంది.  

    
"పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో, పదవీ విరమణ చేసే అవకాశం కాంగ్రెస్(ఐ) అధిస్థానం ముఖ్యమంత్రులకు ఏనాడు ఇవ్వలేదు. మర్రి చెన్నారెడ్డిని మూడు  నెలలు ముప్పుతిప్పలు పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదులను ప్రోత్సహించారు. గవర్నరుకు రాజీనామా లేఖ పంపమన్నారు. అంతలోనే ఇప్పుడు వద్దు అన్నారు"            
చెన్నారెడ్డి 1989 లో రెండోమారు ముఖ్యమంత్రి అయ్యారు కాని, నేను అప్పుడు మాస్కోలో వున్నాను. అప్పుడు కూడా ఇదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీయార్ నాయకత్వంలోని  అధికార తెలుగుదేశం పార్టీని వోడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలో చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గురించిన అధ్యాయం ముగించేముందు ఆయనతో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.

ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే అనిపించి,  సీ.ఎం. చెన్నారెడ్డి గారి  దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫేసు చిరునామాతో నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి,  ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి.  ఆ జీవోలో  నా పేరు కూడా వుంది. 'పలానా శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తు పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది.       (ఇంకా వుంది)                    

శనగల మంగళవారం


'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం - వేయించిన  శనగలతో తప్పనిసరి పలహారం.'


వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 8ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. చెన్నారెడ్డి వ్యతిరేకులు  ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగెట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే  చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ   విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది.


(సంజయ్ గాంధీ నడిపిన విమానం ఢిల్లీలో  కూలిన దృశ్యం)

సంజయ్  అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన  అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి  రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. ఆశ్చర్యపోతూనే కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా....)

ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.

28, జులై 2014, సోమవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 7


చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.


పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి  పని పూర్తి  చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖ పట్నమో వెళ్ళాల్సి వస్తే,  ఫైళ్ళు వెంటబెట్టుకుని రైల్లో  ప్రయాణం చేసే వారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి  అక్కడ స్టేషన్లో  సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం,  విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని  సచివాలయానికి చేరేవి.

చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే చెన్నారెడ్డి  మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు"

అదే కాకి, అదే పిచ్చుక, కాకపొతే కధే కొత్తది


(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం- భండారు శ్రీనివాసరావు)
అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక.


వచ్చేది వర్షాకాలం కాబట్టి పిచ్చుక ముందు జాగ్రత్తగా  అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు వెతుక్కొచ్చి ఎత్తుకొచ్చి వెచ్చగా వుండే  ఓ గూడు కట్టుకుంది. కాకి బద్ధకస్తురాలు. 'వర్షాలు పడ్డప్పుడు చూసుకుందాములే' అనే దిలాసాతో వుండిపోయింది.  చూస్తుండగానే వర్షాలు మొదలయ్యాయి.  కష్టపడి ముందు చూపుతో కట్టుకున్న కొత్త గూడులో పిచ్చుక వెచ్చగా పడుకుంది.  తలదాచుకునే  గూడు లేక కాకి 'కావ్వో కావ్వో' అంటూ అరచుకుంటూ  పోయి, అర్జంటుగా మీడియా  సమావేశం పెట్టి తన కష్టాలు ఏకరవు పెట్టుకుంది.
'నేనూ పిచ్చుకా ఇద్దరం పక్షులమే. పిచ్చుకేమో హాయిగా వెచ్చగా గూట్లో పడుకుంటే నేనేమో ఇల్లా ఇల్లూ వాకిలీ లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అఘోరిస్తున్నాను. ఇంత అన్యాయం ఎక్కడయినా వుందా అవ్వా' అంటూ దవడలు నొక్కుకుంది. కాకి పిచ్చుకల వ్యవహారం మీడియాకు విందు భోజనంగా మారింది. పిచ్చుక గూట్లో అనుభవిస్తున్న వైభోగాలు, బయట కాకి పడుతున్న కష్టాలు,  అన్నింటినీ  గ్రాఫిక్కులు జోడించి  రంగు రంగుల విజువల్స్ తో కధనాలు వండి వార్చాయి.
'ఈ అన్యాయాన్ని సహించేది లేదు. కాకికి న్యాయం చేయాలి' అంటూ కాకిహక్కుల సంఘాలు పిచ్చుక గూడు ఎదుట ధర్నా చేశాయి.  'కాకులకూ  పిచ్చుక కట్టుకున్నలాంటి గూళ్ళు కావాలంటూ నిరసన దీక్షలు నిర్వహించాయి. గూడుకు కూడా నోచుకోని కాకులకు న్యాయం జరిగేదాకా విశ్రమించేది లేదం'టూ హెచ్చరించాయి.
ఈ కాకిగోల ప్రాంతీయ చానళ్ళ నుండి జాతీయ ఛానల్లకూ అక్కడినుండి అంతర్జాతీయ ఛానల్లకూ విస్తరించింది. దాంతో,  ఆ పల్లవి అందుకున్న అంతర్జాతీయ  వాయసహక్కుల సంఘం - ఈ విషయంలో భారత ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ఆరోపించింది.
ఇక ఇంటర్ నెట్ లో సరేసరి. కాకికి మద్దతుగా అభిప్రాయ సేకరణ ఉవ్వెత్తున ఒక ఉద్యమం మాదిరిగా మొదలయింది.
పార్ల మెంటులో ప్రతిపక్షాలు కాకులకు మద్దతుగా  వాకవుట్ చేసాయి. ప్రతిపక్షాలు బలంగా వున్నరాష్ట్రాల్లో బందులు జరిగాయి.
విషయం ఇంతగా ముదిరిపోయిన తర్వాత  ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాకులకు న్యాయం చేసేందుకు ఒక అత్యున్నతే స్తాయి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ కాలయాపన చేయకుండా నివేదిక ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 'పోటా' తరహాలో 'కాకులపై ఉగ్రచర్యల నిరోధక చట్టం - 'కాటా' తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కాకితో అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగి,  కాకితో మాట మాత్రం  చెప్పాపెట్టకుండా గూడు కట్టుకున్న పిచ్చుకకు మూడేళ్ళు జైలు శిక్ష విధించి అది కట్టుకున్న గూడును కాకికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆ సిఫారసులను 'ఇన్ టోటో'  అమలు చేసింది. జాతీయ ఛానల్లతో సహా దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ చానళ్ళు  ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి.
ఏతావాతా జరిగింది ఏమిటంటే-  
కష్టపడి గూడు కట్టుకున్న పిచ్చుకకు గూడంటూ లేకుండా పోయింది. గూడు కట్టుకోవడానికి బద్ధకించిన కాకి మాత్రం గూడు సంపాదించుకుంది.

(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం)    
NOTE : Courtesy Image Owner  

26, జులై 2014, శనివారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 6


వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి  పరిపాలనాదక్షుడు అనే మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐ..ఎస్. అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి,  గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు చాలామంది పనిచేసినా,  వారిలో ఎక్కువకాలం చెన్నారెడ్డి గారితో  వున్నది పరమహంస గారే.  రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్  ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ.ఆర్.వొ. గా,   సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. చెన్నారెడ్డి గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు - హషీం, సరోజినీ పుల్లారెడ్డి, రోడామిస్త్రీ వీరిలో ముఖ్యులు -  మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన్ని అంటిపెట్టుకునే తిరిగేవారు.  దాంతో,  సీఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది.


(మర్రి  చెన్నారెడ్డి) 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే  రెండోసారి పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు. (ఇంకావుంది)

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 5


వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (ఇంకా వుంది)25, జులై 2014, శుక్రవారం

నేనేరా! గోపీని !

"సాయంత్రాలు నాది 'మద్యే మార్గం'
"బ్లాగు రాతల్లో  మాత్రం 'మధ్యేమార్గం'


(Photo Courtesy Image Owner)

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 4


వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.


(జలగం వెంగళరావు, రోశయ్య, మదన్ మోహన్ పాల్గొన్న సమావేశంలో ప్రసంగిస్తున్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి)

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

నేతల హామీలు పునరావృతం కారాదు


(27-07-2014 -   ఆదివారం సూర్య పత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
మెదక్ జిల్లాలో  గురువారం ఉదయం  జరగరాని ఘోరం జరిగిపోయింది. మూసాయిపేట రైల్వే క్రాసింగు వద్ద పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును వేగంగా దూసుకొచ్చిన నాందేడ్ పాసింజరు రైలు డీకొట్టింది. నాలుగు వూళ్ళు తిరిగి తమని రోజూ బడికి చేర్చే స్కూలు బస్సు ఆరోజు తమ పాలిట మృత్యు శకటంగా మారుతుందని తెలియని అందులోని చిన్నారులకు అసలు ఏమి జరుగుతున్నదో అర్ధం అయ్యేలోగా బస్సును వున్నపలాన రైలు  ముందుకు లాక్కుపోయింది. ఈ క్రమంలో బస్సు నుజ్జునుజ్జయింది. డ్రైవరు, పన్నెండు మంది పిల్లలు అక్కడికక్కడే కన్నుమూశారు.  మరో ఇద్దరు  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే  మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇరవై ఒక్కమందిని హైదరాబాదు  యశోదా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో పదకొండుమంది పరిస్తితి విషమంగా వుందని కడపటి వార్తలు తెలుపుతున్నాయి.


సమాచారం తెలియగానే తెలంగాణా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అయిదు లక్షల చొప్పున ఆర్ధిక సాయం  ప్రకటించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను, వారి తలితండ్రులను  పరామర్శించారు. ఖర్చుకు వెనకాడకుండా వారికి అవసరమైన వైద్య సాయం అందించాల్సిందని అక్కడి వైద్యులను కోరారు. మంత్రి హరీష్ రావు హుటా హుటిన బయలుదేరి దుర్ఘటన ప్రదేశానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇరవై అంబులెన్సులను రప్పించారు. గాయపడిన వారిని హైదరాబాదు తరలించారు. కాగా, ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే రైల్వే మంత్రి సదానంద్ గౌడ్ లోకసభలో ప్రకటన చేశారు. తక్షణ సాయంగా రైల్వే తరపున మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడినవారికి ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోందని అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని కూడా దుర్ఘటనపై సంతాప ప్రకటనలు చేశారు. ఆయా పార్టీలకు చెందిన  రాష్ట్ర స్థాయి నాయకులు సరే. అంతా యశోదా  ఆసుపత్రికి క్యూ కట్టారు. బాధితులను పరామర్శించి వారికి తక్షణ సాయం అందేలా తాము శక్తివంచన లేకుండా పాటుపడతామని పాత పల్లవినే అందుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు. సరే. ఇవన్నీ కూడా ఒక  పద్దతి ప్రకారం జరిగిపోతుంటాయి. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా పాలక పక్షం వారు షరా మామూలు ప్రకటనలు చేస్తుంటారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మొక్కుబడి హామీలు ఇస్తుంటారు. ప్రతిపక్షాల సంగతి  చెప్పేదేముంది. ప్రభుత్వ అసమర్ధత వల్లనే ఇలాటివి జరుగుతున్నాయని ఆరోపిస్తుంటారు.        
కానీ ఈ ప్రకటనలతో పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఈ హామీలతో మళ్ళీ ఇటువంటి దుర్ఘటనలు జరగవన్న  పూచీ కూడా  లేదు.
అసలు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి?
చక్కగా చదువుకుని జీవితంలో ఎదిగివద్దామనుకున్న చిన్నారుల బతుకు దీపాలు ఈ దుర్ఘటనలో అర్ధాంతరంగా కొండెక్కాయి. ఎవరో చేసిన పొరబాటుకు అన్నం పున్నెం ఎరుగని పసివారు  దారుణంగా మూల్యం చెల్లించారు. బస్సు పట్టాలు దాటే సమయంలో డ్రైవరు సెల్ ఫోనులో మాట్లాడుతున్నాడని కొన్ని వార్తలు తెలుపుతున్నాయి. ఇదే నిజమయితే ఇంతకంటే నిర్లక్ష్యం మరోటి వుండదు.  పొద్దున్నే తయారై , బడికి పోయొద్దామని బయలుదేరిన వాళ్ళలో చాలామంది, తమ కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని  లోకాలకు తరలిపోయారు. పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయించి, ప్రేమగా  గోరుముద్దలు తినిపించి, పుస్తకాల సంచీ, టిఫిన్ బాక్సులూ చేతికందించి దగ్గరుండి బస్సెక్కించిన తలితండ్రులకు ఈ ప్రమాద వార్త ఆశనిపాతంగా మారింది. వారి ఘోష వర్ణనాతీతం.
కాపలా లేని రైలు క్రాసింగు వద్ద జరిగిన దుర్ఘటన మెదక్ జిల్లా లోని నాలుగు గ్రామాల్లో అనేక కుటుంబాల ఇళ్లలో ఆరని శోకం రగిల్చింది. వీళ్ళందరూ కలిగినవాళ్ళు కాదు. పూట కూలీలు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలతో కాపురాలు నెట్టుకొస్తూ, ఆటోలతో   బతుకు బండి లాగిస్తూ, వున్నంతలో తమ  పిల్లల్ని   మంచి చదువులు చదివించి,  వారికయినా తమకు దక్కని మంచి జీవితం లభించేలా చూడాలని  చిరు ఆశలు పెంచుకున్న బడుగు జీవులు వాళ్లు. చక్కగా తలదువ్వుకుని, యూనిఫారాలు వేసుకుని, భుజాలపై పుస్తకాల సంచీలు వేలాడేసుకుని 'అమ్మా టాటా! నాన్న టాటా! 'అంటూ స్కూలు  బస్సెక్కి పోతున్న పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోయే వాళ్లు వారు. చక్కగా మంచి స్కూళ్ళల్లో చదువుకుంటే,  వారి భవిష్యత్తు బంగారం అవుతుందనీ కమ్మని కలలు కనే వాళ్లు వారు. అలాటి వాళ్ల కన్నుల్లో ఇవాళ కనబడుతోంది కన్నీళ్ళే. ఇవి తుడిచినా ఆరేవి కావు. కానీ తుడిచేవాళ్ళే లేరు. అందరూ హామీలు ఇచ్చేవాళ్ళే. ఇదొక విషాదం.
ఈ సందర్భంలో మరో కోణం గురించి కూడా విశ్లేషించుకోవడం సముచితంగా వుంటుంది. ఏ దేశంలో అయినా డ్రైవరు పని అంటే మామూలు కాదు. డ్రైవింగు లైసెన్సు సంపాదించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ మనదగ్గర మాత్రం  పైసా వున్నా,  పలుకుబడి వున్నా  లైసెన్సు ఎగురుకుంటూ వచ్చి వల్లో పడుతుంది. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. చదువుకున్నా లేకపోయినా డ్రైవింగ్ తెలిస్తే పొట్టపోసుకోవచ్చు అనే అభిప్రాయం పల్లె పట్టుల్లో పెరిగిపోతోంది. లక్షలు పోసి బస్సులు కొనే స్కూలు యాజమాన్యాలు కూడా నైపుణ్యం  కలిగిన డ్రైవర్లకు మంచి జీతాలు ఇవ్వడానికి వెనుకాడతాయి. గీసి గీసి బేరమాడుతాయి. ఫలితం. అనుభవం లేని డ్రైవర్లు. డబ్బులు అదనంగా వస్తాయనుకుంటే నిద్రమానుకుని అదనపు పని గంటలు పనిచేసే డ్రైవర్లు స్కూలు బస్సులు నడుపుతుంటారు.  యజమానులకి కావాల్సింది అదే. ఏదో విధంగా పని నడిచిపోతే చాలు. మరి ప్రమాదాలు జరుగుతున్నాయంటే జరగవా. జరక్కపోతేనే ఆశ్చర్యపడాలి.
విలువలకు ప్రాణం ఇచ్చే ఈ పుణ్య భూమిలో ప్రాణాలకు విలువలేకుండా పోవడం మరో విషాదం.
పోతే, ప్రస్తుతానికి వస్తే,  కాపలాలేని రైలు క్రాసింగులు దేశంలో వేలకొద్దీ, రాష్ట్రంలో వందలకొద్దీ వున్నాయి. గేట్లు పెట్టి కాపలా సిబ్బందిని నియమించాలంటే ఒక్కొక్కదానికీ ఏటా ముప్పయి, నలభయ్ లక్షల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, లక్షల్లో  జీతాలు తీసుకుంటూ  అప్పనంగా లెక్కలు చెప్పే అధికారులు వందల సంఖ్యలో ఎప్పుడూ  సిద్దంగానే వుంటారు. వారి దృష్టిలో ఇది  అనవసరపు వ్యయం. మరోపక్క, పర్తి రైల్వే మంత్రీ   ఇన్నేళ్ళ వ్యవధిలో కాపలా లేని రైల్వే క్రాసింగులు అసలు వూసులోకి లేకుండా చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీలు ఇస్తూనే వుంటారు. అవన్నీ రికార్డుల్లో భద్రంగా వుండిపోతాయి.
అనకూడదు కానీ, ఈ లోగా ఇంకో సంఘటన చోటుచేసుకుంటుంది. మరికొందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మళ్ళీ యధావిదిగా ఎక్స్ గ్రేషియా ప్రకటనలు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కానిచ్చేది లేదని  షరామామూలు హామీలు. ఇదో విష చక్ర భ్రమణం.
పునరావృతం కానివ్వమనే ప్రకటనలు,  పునరావృతం కాని మంచి రోజులకోసం వేచి వుండడమే సాధారణ  ప్రజలకు మిగిలింది.   (25-07-2014)

సానియా విషయంలో కేసేయార్ చేసిన తప్పేమిటి?


మన దేశానికి స్వాతంత్రం ఇవ్వాళా వద్దా అని బ్రిటిష్ పాలకులు మల్లగుల్లాలు పడిన సందర్భంలో వాళ్లకు వచ్చిన అనుమానాల్లో ఒకటి - ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వున్న భారత దేశానికి స్వతంత్రం ఇవ్వడం అంత మంచిది కాదేమో అని.
అదే ఇప్పుడు స్వతంత్రం ఇవ్వాల్సి వస్తే వారికి పూర్తిగా విభిన్నమైన సందేహం కలిగేదేది, ఇంతమంది చదువుకున్నవాళ్ళు వున్న దేశంలో ఎక్కువ స్వతంత్రం అనేది కూడా అంత  మంచి చేయదేమో అని.
సానియా మీర్జా వ్యవహారంపై సాగుతున్న చర్చ, జరుగుతున్న రచ్చ చూసిన తరువాత ఇది నిజమేమో అని అనిపిస్తోంది.


ఎవరు అవునన్నా కాదన్నా సానియా మీర్జా అంతర్జాతీయంగా పేరున్న టెన్నిస్ స్టార్. ఏ ప్రభుత్వం అయినా 'బ్రాండ్ అంబాసిడర్' ని నియమించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాటి పేరు ప్రఖ్యాతులు వున్నవాళ్లనే ఎంపిక చేసుకుంటుంది. అలాటి  వాళ్లు తమ రాష్ట్రానికే చెందినవారై వుండాలన్న నిబంధన ఏమీ వుండదు. అంచేతనే కేసీయార్ ఆమెను ఎంపిక చేసి వుంటారు.
ఇక ఆమె జాతీయత గురించి. టెన్నిస్ తార అయిన తరువాతనే ఆమె పెళ్లి జరిగింది. అంతర్జాతీయ క్రీడారంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆ స్థాయి కలిగిన క్రీడాకారులని పెళ్లి చేసుకోవడం చాలా సహజమైన విషయం. పెళ్ళాడినంత మాత్రాన జాతీయత మార్చుకున్నట్టు కాదు. ఆ మాటకు వస్తే, రాజీవ్ గాంధీని పెళ్ళాడిన చాలా ఏళ్ళ వరకు సోనియా తన ఇటలీ పౌరసత్వం మార్చుకోలేదని చెబుతారు. ఈ ఉదాహరణలు కోకొల్లలు.
ఇక కోటి  రూపాయల సంగతా! సాధారణంగా ఈ పారితోషికాలు అనండి, గౌరవ పురస్కారాలు అనండి, ఇవన్నీ ఆయా వ్యక్తుల స్థాయికి తగ్గట్టుగా వుంటాయి. సచిన్ టెండూల్కర్ వంటి మేటి క్రీడాకారుడికి భారతరత్న ఇచ్చారు. అంతే కాని,  చిన్నవాటితో సరిపుచ్చరు కదా!
అయితే ఒక విషయం. సానియా మీర్జా గతంలో యేమో కాని ఇప్పుడు సంపన్నురాలు. ప్రభుత్వం గౌరవంగా ఇచ్చిన మొత్తాన్ని మళ్ళీ సర్కారుకే ఇచ్చి క్రీడల్లో చురుకుదనం కలిగిన బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం ఖర్చుపెట్టమని కోరివుంటే ఆమెకూ గౌరవంగా వుండేది.
అనవసర విషయాలపట్ల రాద్ధాంతం చేయడం అంటే, అత్యవసర  విషయాల నుంచి దృష్టి మళ్ళించడం అనే అపోహ ఇప్పటికే జనంలో వుంది. దాన్ని నిజం చేయడం మంచిది కాదేమో! కాస్త ఆలోచించుకోవాలి.

పునరుద్ఘాటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి

పునరుద్ఘాటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి
'ఇలాటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం' అనే నాయకుల షరా మామూలు ప్రకటనలు 'పునరావృతం' కాకుండా వుంటే బాగుండు. లేదా (పాపము శమించుగాక) మళ్ళీ మరో సందర్భంలో వాళ్ళే  ఈ ప్రకటన చేస్తే పాత క్లిప్పింగును  కూడా జత చేసి  టీవీల్లో చూపిస్తే మరీ బాగుంటుంది.


వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 3ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారికి సమర్దుడయిన పాలకుడిగా పేరొచ్చింది.  ఎమర్జెన్సీ కాలం  ఆయనకు కొంత  కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు అందివచ్చిన  అంశాలు.


(జలగం వెంగళరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వున్నప్పుడు పాల్గొన్న అధికారిక సమావేశం. మాట్లాడుతున్నది అప్పట్లో డీపీఆర్ఓ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు)   


వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. (ఇంకావుంది)

24, జులై 2014, గురువారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 2


నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి.
సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో, అప్పటివరకు బెజవాడ ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న  నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు

వ్యాపకాల జ్ఞాపకాలు - 1   
1975 లో నేను ఆకాశవాణి విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని  కూడా  వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు  ఒక్కరే ఆయన పేషీలో  ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఒ మోస్తరు  ఉద్యోగులే.  ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి.  మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ  స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు  సీఎం ప్రధాన  భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు.


నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక  వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే!  సీ ఎం కాన్వాయ్. సచివాలయంలో ఆయన   కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది.  ఓ గదిలో ముఖ్యమంత్రి. పక్క గదిలో ఆయన సిబ్బంది. ముఖ్యమంత్రితో సహా ఓ పది పేము కుర్చీలు వుండేవి. తనను కలుసుకోవడానికి వచ్చేవారితోనే కాదు,  చివరకు విలేకరులతో  కూడా ఫైళ్ళు చూస్తూనే మాట్లాడుతుండేవారు. సమయపాలనకు బాగా విలువ ఇచ్చేవారు. చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి, 'మంచిది వెళ్ళి రండి'  అనేవారు.
ఇప్పుడు శిధిలావస్థలో వున్న (కూలగొట్టారేమో తెలియదు, సచివాలయానికి పోక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి) పాత భవనం మొదటి అంతస్తులో సీఎం  పేషీ వుండేది.  ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న మెట్ల వరుస కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.