18, జులై 2014, శుక్రవారం

అందని ద్రాక్ష తీయన
మేము హైదరాబాదు వచ్చిన కొత్తల్లో మాఇంటికి అయిదారిళ్ళ అవతల ఓ పెంకుటిల్లు అమ్మకానికి వచ్చింది. మూడొందల గజాల స్థలం. చుట్టూ జాగా మధ్యలో ఇల్లు, ప్రహరీ గోడ. నలభయ్ వేలు అన్నారు. అప్పట్లో మూడుగదులున్న మా ఇంటి అద్దె నూటయాభయ్ రూపాయలు. నలభయ్ వేలున్న ఇంటి ఖరీదు  నలభయ్ లక్షలు అవుతుందని తెలియదు.  మా ఇంటి ఓనరు అద్దె పెంచకుండా వుంటాడని తెలియదు. అంచేత ఓ ఇరవై ఏళ్ళు అలా అద్దె కట్టుకుంటూ అద్దె ఇంట్లోనే కాలక్షేపం చేయొచ్చనుకుని  సొంత ఇంటి కల కనకుండా కలల లోకం లోనే  వుండిపోయాము.


అయితే ఒక విషయం చెప్పుకోవాలి.  తరువాత హైదరాబాదులో  అద్దెలు పెరిగిన మాట నిజమే కాని భరించలేనంతగా కాదు.  ఇళ్ళ ఖరీదులు పెరిగాయి కాని కొనలేనంతగా కాదు. బంజారా హిల్స్ దాటిన  తరువాత బజార్లే లేవు. అన్నీ పంట పొలాలు. ఎక్కువగా బంజరు నేలలు. అదేం చిత్రమో, 1987 లో మేము మాస్కో పోయి అయిదేళ్ళ తరువాత తిరిగొచ్చేసరికి  సీను సితారా అయిపోయింది. ఏళ్లతరబడి మన్నుతిన్న పాములా పడివున్న ఇళ్ళ ధరలు, ఖాళీ స్థలాల ధరలు వామనుడు శరీరం పెంచి ముల్లోకాలకు వ్యాపించినట్టు  ఆకాశం అంచులు తాకాయి. అక్కడినుంచి అవి రోజురోజుకూ పెరుక్కుంటూ పోవడం తప్ప కిందికి  దిగివచ్చిందీ లేదు. దిగివస్తాయన్న నమ్మకమూ లేదు. మా ఎకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు చెప్పినట్టు ' I did not have when I could have, I cant have when I want to have"       

  NOTE: Courtesy Image Owner 

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

Chivari vaakyam nijam.