8, జులై 2014, మంగళవారం

రైల్వే బడ్జెట్ఏ బడ్జెట్ అయినా అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహోబడ్జెట్ అయితే ప్రతిపక్షం వారికి అంకెల గారడీబడ్జెట్. కానీ ఈ రెండు కళ్ళే కాదు మూడో కన్నుమరోటి వుంది. అది ప్రజలది.బడ్జెట్ లోనే చార్జీలు పెంచే  పద్ధతికి అన్ని  ప్రభుత్వాలు ఏనాడో స్వస్తి చెప్పేశాయి కనుక, రైల్వే  బడ్జెట్ గురించి గతంలో వున్న ఆసక్తి ఈనాడు జనంలో లేనట్టే లెక్క. అయినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ తమ విద్యుక్త ధర్మానుసారం బడ్జెట్ మంచిచెడ్డలు గురించి వ్యాఖ్యానాలు గుప్పించారు.ముందే చెప్పినట్టు అధికార పక్షం వాళ్ళు బడ్జెట్ అద్భుతంఅన్నారు. విపక్షంవాళ్ళు కొత్త సీసాలో పాతసారావంటి పాతపల్లవులనే సరికొత్తగా వినిపించారు. ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ 'నిరాశా జనకం' అనే ఒక్క ముక్కతో సరిపెట్టుకోకుండా ఒక అడుగు ముందుకు వేసి ధర్నాలు, నిరసన ప్రదర్శనల వరకు వెళ్ళింది.
ఇక, లోకసభలో అటు ఆంధ్ర ప్రదేశ్ లో, ఇటు తెలంగాణాలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ రాష్ట్రాలకు  రైల్వే బడ్జెట్ లో దక్కించుకున్న వాటా ఎంత అని ఆలోచించుకుంటే, కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్డట్టయిందన్న చందానవుంది.
ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోక సభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు. ఇవి ఎక్కువగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు స్టాప్ఏర్పాటు చేయాలనో ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీయార్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. కానీ వాటిని కొత్త ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనబడడం లేదు.

ఏదిఏమయినా, ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వే మంత్రి పూర్తి న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రెండు స్పీడ్ రైళ్ళు మాత్రం టీవీ స్క్రోలింగులలో షికార్లు చేసాయి. అవి పట్టాలు ఎక్కినప్పుడే కాస్తంత జనాలకు వూరట. కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది.

ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. ఎందుకంటే ఆ పని ముందుగానే పూర్తయిపోయింది కాబట్టి. రిజర్వేషన్ వేగం పెంచడం, పోస్ట్ ఆఫీసుల్లో కూడా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఆహ్వానించదగ్గవే. పాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచడంవల్ల ప్రయోజనం పొందేది సామాన్యులే అన్నది కూడా ఇక్కడ గమనంలో వుంచుకోవాలి. ఎందుకంటె రైల్వే లకు మొదటి రూపాయి చెల్లించేది సాధారణ ప్రయాణీకులే.

ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటుప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క.

3 వ్యాఖ్యలు:

Jai Gottimukkala చెప్పారు...

తెలంగాణాలో కోచు ఫాక్టరీ ప్రతిపాదన అలాగే తెలంగాణాలో రైలు కనెక్టివిటీ పెంచడం అనే అంశాలపై ఆరు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చట్టంలో ఉంది. గడువు కాలం ఒక్టోబరు 2 వరకే.

Jai Gottimukkala చెప్పారు...

గడువు డిసెంబరు 2 వరకు. "అప్పుతచ్చు" మన్నించండి

అజ్ఞాత చెప్పారు...

అలాగే ఉమ్మడి రాజధానిలో గవర్నరే final అన్న పదం కూడా చట్టం లో ఉంది, అది మాత్రం మరచి కోచ్ ఫేక్టరీ చట్టం మాత్రమే కొందరికి గుర్తుకు వస్తూ..ఉంటాయి కొందరికి.