7, జులై 2014, సోమవారం

మనవాడే అయ్యుంటాడుఅంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - 'ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు.


ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. పార్టీలు మారిన వాళ్లకు  పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. అధవా తిట్టినా పొగిడినా  ఆ సంగతి కండువా కప్పి పార్టీ తీర్ధం ఇప్పించి ఫోటోలు దిగిన ఆయా పార్టీల పెద్దలకు అర్ధం కాదు. చేరిన వాళ్లు, చేర్చుకున్నవాళ్ళు ఎన్నాళ్ళు కుదురుగా అంటి పెట్టుకుని వుంటారో అసలు తెలియదు.వెంటవున్నవాడు, వెనక వున్నవాడు  మనవాడో కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య సాగిపోతున్న రాజకీయాల్ని నేడు మనం చూస్తున్నాం. కానీ ఖర్చులేని వినోదం అంటే ఇదేనేమో!
NOTE: Courtesy Cartoonist 

2 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

>కానీ ఖర్చులేని వినోదం అంటే ఇదేనేమో!

కాదండీ.

రాజకీయనాయకుల పుణ్యమా అని పరిపాలనలు లోపభూయిష్టంగా ఉన్నాయి అన్ని చోట్లా.

అన్నింటి ధరలూ పెరిగిపోతున్నాయి - అదుపు చేయగల దమ్మున్న నాయకత్వాలు లేక.

ప్రజలకు అనవసరంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి.

అందుచేత రాజకీయనాయకుల కుర్చీలాటలు ప్రజలకు భారీఖర్చుల వినోదమే.

Jai Gottimukkala చెప్పారు...

ప్రజల మనిషి గరీబోళ్ల బంధువు అంజయ్య గారి జ్ఞాపకాలకు థాంక్సండీ. అందరికీ అందుబాటులో ఉండి ఎవరనయినా కలిసి ఆప్యాయంగా మాట్లాడి కుదిరినంత సాయం చేసే నాయకులు అరుదు. అట్లాంటి అంజయ్య, హాషీం, పీజేఆర్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నందుకు షహర్ కొంతలో కొంత బాగుపడింది.