16, జులై 2014, బుధవారం

భార్యతో మాట్లాడ్డం యెలా?


(నిఝంగా వొట్టు నాకూ తెలవదు. కానీ రాయడానికి తెలవక్కరలేదు అని మాత్రం తెలుసు)

ఓప్పుడు అంటే చాలా చాలా కాలం  కిందట - ఓ సినిమాలో చెప్పినట్టు 'లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో' అన్నమాట. అంతకాలం క్రితం నేను మా ఆవిడతో బోలెడు బోలెడు మాట్లాడేవాడిని. పెళ్ళికి ముందు మాట్లాడడానికి వీలుండేది కాదు కాబట్టి ఎక్సర్ సైజ్ పుస్తకాల్లో  ఉత్తరాలు రాసేవాడిని. అవన్నీ మా ఆవిడ పుట్టింటి అరణంగా ఇప్పటికీ అపురూపంగా దాచి పెట్టుకుంది. అలాటివాడిని ఏమైందో ఏమిటో అసలు మాట్లాడడమే మానేసాను. ప్రపంచం పెరిగిపోయి పెళ్ళాంతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోవడం పెద్ద అబ్బురమేం కాదు. కానీ బొత్తిగా మాటలు లేకపోతే ఎల్లా. అల్లా ఆలోచించి ఆలోచించి ఎల్లాగైనా సరే మళ్ళీ పాతకాలం మాటా ముచ్చట్ల కాలంలోకి వెళ్లాలని టైం మిషన్ ఎక్కాను. దిగి చూసేసరికి మొత్తం సీనే మారిపోయింది. అరవ తెలుగు సీరియల్ చూస్తూ మా ఆవిడా సమస్త ప్రపంచాన్ని మరచిపోయి అందులో లీనమై వుంది. కల్పించుకుని మాట్లాడబోతే, 'వుండండి అత్త కోడలికి విషం కలిపిన కాఫీ ఇచ్చి ఇప్పటికి మూడు వారాలయింది ఇంతవరకు తాగి చావలేదు. మీ ముచ్చట్లు ఏవో మధ్యలో ప్రకటనలు వస్తున్నప్పుడు చెప్పండి' అనేసింది. ఓహో! మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో దాక్కున్న చిలకలో వున్నట్టు మా  ఆవిడ వీక్ నెస్ ఎక్కడ వుందో తెలిసిపోయింది. అక్కణ్ణించి వరసపెట్టి రెండో గదిలో వున్న రెండో టీవీలో అరవ తెలుగు హిందీ సీరియళ్లన్నీ ఏకధాటిగా చూడ్డం మొదలు పెట్టి, మా  ఆవిడతో మాటలు కలిపి చూసాను. ఈ చిట్కా అమోఘంగా పనిచేసింది. జీడిపాకం కధలే కాబట్టి తోచినట్టు  కధ అల్లి,  జరిగిందీ జరగబోయేది వూహించి చెబుతుంటే  మా ఆవిడ చెవులొప్పగించి వినడం మొదలెట్టింది. ఆ తరువాత నేను ఏ కబుర్లు చెప్పినా తల వూపడం ఆవిడ వొంతయింది.
చట్టబద్ధ హెచ్చరిక: ఇలాటి చిట్కాలు ఎల్లకాలం ఎల్లరు భార్యల దగ్గర పనిచేయకపోవచ్చు. అందరూ మా ఆవిడ లాంటి గంగి గోవు రకాలు కాకపోవచ్చు కదా!

7 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


వామ్మో, వామ్మో ఇంత మోసమా !!

జిలేబి

jvrao చెప్పారు...

Bhale vaare......inka edo kotha chitkaalu cheptharanukunna....
maa daggara ivannee paathabadipoyaayi.....memu koncham muduru..anthe.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ మధ్యనే ఎక్కడో ఆన్లైన్లోనే చదివాను - భార్య గూగుల్ లాంటిదిట, ఒక్కటి అడిగితే పది చెప్తుందిట. అటువంటి పరిస్ధితుల్లో భర్తకి నోరు తెరవటానికి అసలు అవకాశం ఎక్కడ దొరుకుతుంది సర్ :)
అయినా భార్యతో తీరిగ్గా మాట్లాడుకునే అవకాశం అనే మహత్తర లక్ష్యం కోసమైనా సరే టీవీ సీరియల్సు చూడటం అలవాటు చేసుకోవడం ఏమిటండి బాబూ? ఆ మాట వింటేనే ఒళ్ళు జలదరిస్తోంది. అవేం కధలు, అవేం సంభాషణలు, అవేం కౄరమైన చూపులు, అవేం కుట్రలు, ఇంట్లో దగ్గుమందు సీసా పెట్టుకున్నట్లుగా టీవీ సీరియళ్ళలో ఆడవాళ్ళు విషం సీసా రెడీగా వంటగది అల్మైరాలో పెట్టుంచటమేమిటి, పైగా సీరియల్ జరిగే అరగంట సేపూ ఆపు లేకుండా చెవులు చిల్లులు పడేటట్లు ఆ భయంకరమైన చప్పుళ్ళు ఏమిటి (నేపధ్య సంగీతం అనాలేమో), అంతూ దరీ లేకుండా నెలల / సంవత్సరాల తరబడి వందల సంఖ్యలో సాగే ఆ జీడిపాకం ఎపిసోడ్లు ఏమిటి?
బాబోయ్ ఆ సీరియళ్ళు చూస్తే మనకి ఈపాటి బుద్ధిస్ధిరత (sanity) కూడా మిగలదు. దానికన్నా బలుసాకు తిని బతకటం మేలు. నాలాంటి వాళ్ళు బ్లాగుల్లో కామెంట్లు వ్రాసుకుంటూ కాలక్షేపం చెయ్యచ్చు :)
("Disclaimer" :- టీవీ సీరియళ్ళు నేను చూడను. పైన వ్రాసినది ఇంట్లో ఆడవాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు చెవిలో పడుతుండే ముక్కల ద్వారా అబ్బిన "విజ్ఞానం". సీరియళ్ళు ప్రసారమయ్యే టైం పగలైతే ఎండ, రాత్రయితే బయట తిరగటం కష్టం - అందుకని ఇంట్లోనే కూర్చుని బలి అవటం. పోనీ నాకు రెండో టీవీ సెట్ అయినా లేదు.)

Rao S Lakkaraju చెప్పారు...

ఈ మధ్యనే ఎక్కడో ఆన్లైన్లోనే చదివాను - భార్య గూగుల్ లాంటిదిట, ఒక్కటి అడిగితే పది చెప్తుందిట. అటువంటి పరిస్ధితుల్లో భర్తకి నోరు తెరవటానికి అసలు అవకాశం ఎక్కడ దొరుకుతుంది సర్ :)
------------------------
విన్నకోట నరసింహా రావు గారూ, ప్రాకృతమైన దానికి జుట్టు పీక్కో వలసిన అవసరం లేదని మీరు నాకు ఇప్పుడే జ్ఞానోదయం చేశారు.

jvrao చెప్పారు...

Bhalevaare lakkaraaju garuuuu....inka juttu migile vundaa meeku peekkovadaniki?
Nannu choodandi saar.....andaram oke badilo kadaa chaduvuthunnaamu.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నా వ్యాఖ్య ఒకరికి ఉపయోగపడిందంటే చాలా సంతోషం లక్కరాజు వారూ.

Rao S Lakkaraju చెప్పారు...

jvrao గారూ నా జుట్టు ఎలా మాయమయిందో ఇప్పుడు అర్ధమయింది. ఏళ్ళ కాపరం,భర్త జుట్టు సాంద్రత లకి ఒక చిన్న గ్రాఫ్ గీసేస్తే తెలిసిపోయె.