24, జూన్ 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

(24-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)


- కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‘సంస్కృతి’

- మళ్ళీ మొదలైన అధిష్ఠానం పట్టు

- వై.ఎస్‌. వ్యతిరేకులకు వరం!

- తెలంగాణలో విశ్వసనీయత ప్రశ్నార్ధకం

- కోస్త, సీమల్లోనూ దయనీయ స్థితి

- పక్కలో బల్లెంలా జగన్‌ సవాళ్ళుబహుశా రాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్‌ వాదులు నేడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌ ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. మువ్వ న్నెల కాంగ్రెస్‌ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మడం కష్టం. రాష్ట్ర మంత్రి శంకరరావు, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇదేమాదిరి మరో అంకానికి తెరలేపారు.హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ ప్రచురణార్హం కాని భాషలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని ఈ సన్నివేశాన్ని ఇంటిల్లిపాదీ ఇళ్ళల్లో కూర్చుని వీక్షించగలిగారు. కాకపొతే, ఈ రకమయిన దూషణ ఘట్టాలు తరచు సాగిపోవడానికి కాంగ్రెస్‌ నాయకులు గత రెండేళ్లుగా శక్తివంచన లేకుండా సాయపడుతూ వస్తున్నారు. జగన్‌ పార్టీని విమర్శించే క్రమంలో కొందరు, ప్రాంతీయ తత్వంతో మరికొందరు, పదవులపై ఆశ పెంచుకుని అది తీరేదారి దొరకక ఇంకొందరు- ఈ మార్గాన్నే ఎంచుకుని బుల్లితెరలకు అవసరమయిన ముడి సరుకుని పంచిపెట్టడంలో తలమునకలుగా ఉన్నారు.గతంలో కూడా రాష్టక్రాంగ్రెస్‌ నాయకులు తమ పొరపొచ్చాలను దాచిపెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాజకీయాలలో ఈ విధమయిన ధోరణికి ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ అనే ముద్దు పేరు కూడా జత పడింది. అలనాటి కాంగ్రెస్‌ కురువృద్ధులు ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదాదిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ అసమ్మతిని పెంచిపోషించిన వారే. ముఠా సంస్కృతిని అక్కున చేర్చుకున్నవారే. అరవయ్యవ దశకం చివర్లో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక సందర్భంలో కాకాని వెంకటరత్నం, మూర్తిరాజుల నడుమ జరిగిన భీకర పోరు కాంగ్రెస్‌లోని ముఠా తగాదాలను బట్టబయలు చేసింది.ఆ తరువాతి తరంలో రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో శాసించిన చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ఘనాపాఠీలు కూడా తమ పూర్వీకుల బాటలోనే మరికొంత ముందుకు సాగారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు వారికి కలసి వచ్చాయి. అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటూనే రాష్ట్రంలో తమ మాటకు ఎదురులేకుండా చూసుకోగలిగారు. ఈ విషయలో చెన్నారెడ్డి కంటే రాజశేఖరెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఆయన వైపు కన్నెత్తి చూడలేని స్థితి, పన్నెత్తి ఎదిరించలేని పరిస్థితి.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తలకిందులైంది. వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర పార్టీపై ఆజమాయిషీ చేయలేకపోయిన అధిష్ఠానం మళ్ళీ తన పట్టు బిగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలోని వైఎస్‌ వ్యతిరేకులకు ఇది కలసివచ్చింది. మూసుకుపోయిన నోళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీలో ముసలం పుట్టింది. దీనికి తోడు వైఎస్‌ మరణానంతరం ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్ళింది.శ్రీకృష్ణ కమిటీ వంటి కంటి తుడుపు చర్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను మార్చలేకపోగా ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోపక్క వైఎస్‌ఆర్‌ సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి తన కొత్త పార్టీతో కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంగా తయారవడంతో కోస్త, సీమల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కడప ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితిని తెచ్చి పెట్టింది.నాయకుల బలహీనత, చోటా నాయకులకు బలంగా మారింది. పట్టుమని నలుగురు అనుచరులు కూడా లేని చిన్ననాయకులు ముఠా సంస్కృతి పుణ్యమా అని బడానాయకుల అవతారం ఎత్తారు. పదవికి అర్హత సంపాదించుకోవడం కంటే పదవిని అడ్డదార్లలో సంపాదించుకునే క్రమంలో ఆరితేరారు. నాకళ్ళముందు రాజకీయాల్లోకి వచ్చినవాడు అంత పెద్ద పదవిని అందుకోగాలేనిది నేనేనా తక్కువతిన్నదన్న పోటీ మొదలై, అర్హత అనే పదం రాజకీయ పరమ పద సోపా నపఠంలో పెద్దపాము నోట్లోపడి అట్టడుక్కు చేరింది.ఈ నేపథ్యం కొందరికయినా ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్‌ రోజులను గుర్తుకు తేవడం సహజం. ఆమె శకం మొదలయిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకులని లేశమాత్రం అనుమానం కలిగినా సరే, ఇందిర వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసేవారు. చదరంగం బల్లపై పావులను కదిపినట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చివేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇలాటి ప్రయోగం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, దరిమిలా కాంగ్రెస్‌ అవిచ్ఛిన్న పాలనకు ప్రజలు మంగళం పాడడానికి దారితీసింది. ఇందిర హయాంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమలో తాము ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకుని ఎంత రచ్చ చేసుకున్నా ఢిల్లీలోని అధినాయకుల జోలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు.అధిష్ఠానం అంటే బెరుకూ, భయం పైనుంచి కిందిదాకా పాకిపోయాయి. కానీ ఇప్పుడలా కాదు, ఏకంగా అధినేత్రి సోనియా గాంధీ జాతీయతనే ఎత్తిచూపే విధంగా మీడియా ముందు మాట్లాడినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడాలేకుండా వరసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే విస్తుపోవడం జనంవంతవుతోంది. పార్టీలోని ప్రత్యర్ధులను విమర్శించడానికి వాడుతున్న భాష వెగటుకలిగిస్తోంది. నిజంగా మనసులో మాట చెబుతున్నారా లేక మీడియా దృష్టిని ఆకర్షించడానికా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.పైపెచ్చు ఈ అపభ్రంశపు పదప్రయోగాలకు అసెంబ్లీ ఆవరణనో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్నో వేదికగా చేసుకుంటున్న తీరు మరీ విడ్డూరంగా ఉంది. ఇక బుల్లితెరలపై అనునిత్యం జరిగే చర్చల్లో పాల్గొనే కాంగ్రెస్‌ నాయకులు అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని ఇందుకోసం చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వెనుకబడి లేదు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం అగ్రతాంబూలం ఇవ్వకతప్పదు. ఎందుకంటె తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికంటే ఎక్కువ అని తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ, ఆ ముసుగులో మరిన్ని గుద్దులాటలకు దిగే వీలూ చాలూ వారికే ఎక్కువ కనుక.అలాగని రాష్ట్ర పార్టీపై ఢిల్లీ నాయకులకు పూర్తిగా అదుపు లేకుండా పోయిందని చెప్పలేము. ఇందుకు తాజా ఉదాహరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం ముందు మరోమారు బలంగా వినిపించే ఉద్దేశంతో జరిపిన ఢిల్లీ యాత్ర. దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠాన దేవతలను కలుసుకుని తమ గోడు వినిపించుకోవడానికి వాళ్లు పడ్డ పాట్లు వర్ణనాతీతం. చివరికి ఢిల్లీ దొరలకు మరో గడువు పెట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలు వారికి కూడా కొరుకుడు పడడంలేదు. వారి స్వరం పెరుగుతోంది. ఆవేదన స్తానంలో ఆక్రోశం చోటుచేసుకుంటోంది. అది ఆగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య అలాటిది. అట్టడుగునుంచి వారిపై నానాటికీ ఒత్తిడి ఎక్కువవుతోంది.తిరిగి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇచ్చినా గెలిచి చట్టసభల్లో కాలుమోపుతామన్న ఆశ అడుగంటుతోంది. ఇక టీవీ చర్చల సంగతి సరేసరి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ముక్కలనే ముక్కున పెట్టుకుని తిరిగి మీడియా ఎదుట వల్లెవేయడానికి నానా అవస్థ పడుతున్నారు. తాము చేస్తున్న ప్రతి ఢిల్లీయాత్రా మరో డెడ్‌ లైన్‌ ప్రక టించడానికి తప్ప విషయం తేల్చడానికి ఉపయోగపడడం లేదన్న అబిప్రా యం వారిలో కలుగుతున్నట్టుంది. ఇప్పుడు కోస్త, సీమ కాంగ్రెస్‌ నాయకు లదీ అదే పరిస్థితి. మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పగల మొనగాళ్ళం తామేఅని పెంచుకున్న నమ్మకం వారిలో సైతం సడలుతున్న ట్టుంది. మంత్రి శైలజానాథ్‌ నాయకత్వంలో ఢిల్లీ వెడదామని అనుకుంటు న్నట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతోంది.మరో వారం పది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలను విస్తరిస్తారన్న సమాచారం ఒక్కటే వారిలో కొందరిని అధిష్ఠానం ముందు అదిమి పెడుతోంది. కానీ ఢిల్లీనుంచి తాజాగా అందుతున్న వార్తలు వారిని మళ్ళీ నిరాశలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 2014 ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు మొండి చేయి చూపడం ఖాయమన్న అంచనాలకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదన్నది ఆ వార్తల సారాంశం. భావిభారత ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిష్ఠించాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన దేవత గెలుపోటముల బేరీజులో ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపుచూసే ప్రమాదం ఉందని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.రాహుల్‌ గాంధీ ఆలోచనలు సైతం ఇదే క్రమంలో సాగుతున్నాయన్న వార్తలు నిజమయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఖాయం. ఎందుకంటె, పందెం కాసేవాడు గెలుపు గుర్రాన్నే ఎంచుకుంటాడు. కొడిగడుతున్న కాంగ్రెస్‌ ఆశలకు అధిష్ఠానం తలపెట్టిన కాయకల్ప చికిత్స ఏమేరకు పనికి వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలసికట్టుగా పనిచేయడం మీదనే పార్టీ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీరిద్దరూ విభిన్న అధికారకేంద్రాలుగా మారిపోకుండా పార్టీ తలరాతను మారుస్తారా లేక తమనే అధిష్ఠానం మార్చే పరిస్థితి కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.18, జూన్ 2011, శనివారం

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు


(18-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

బడుగులపై రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ప్రేమ కేవలం నీటి బుడగలేనా ? అగ్రవర్ణ పాలకుల వోటు బాంకు నిర్మాణానికి ఉపయోగపడే పునాది రాళ్ళా వాళ్లు ? స్తానిక సంస్తల ఎన్నికల్లో బీ సీ రిజర్వేషన్ లకు సంబంధించి ఆయా పార్టీలు ప్రదర్శిస్తున్న వైఖరులు గమనిస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది.


ఈ ఎన్నికల పట్ల వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీ ఆర్ ఎస్ వంటి పార్టీలకు తప్ప మిగిలిన వాటికి ఎలాటి ఆసక్తి లేదన్న సంగతి జగమెరిగిన విషయమే. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఊపులోవున్న జగన్ పార్టీ స్తానిక సంస్తల ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మరోసారి తన తడాఖా చూపించాలని వువ్విళ్ళూరుతోంది. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే తెలంగాణా అంశాన్ని కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని ఆశించి భంగపడిన టీ ఆర్ ఎస్, సహజంగానే స్తానిక సంస్తల ఎన్నికల్లో మరో సారి తన సత్తా ప్రదర్శించి పాలక పక్షం పై వొత్తిడి పెంచాలని అనుకోవడంలో విడ్డూరమేమీ లేదు. విజయం పై ధీమా ఈ రెండు పార్టీలకు వున్నట్టుగా మిగిలిన పార్టీలకు లేకపోవడంవల్లనే- ఈ ఎన్నికలు ఏదో విధంగా వాయిదా పడితే బాగుండు అన్న ధోరణితో అవి వున్నాయి. పాలక పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నట్టు కానవస్తోంది. స్తానిక పోరుకు ఏ నిమిషంలోనయినా తాము సిద్ధం అన్నట్టు ఈ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటె కడప ఉప ఎన్నికల్లో ఏమి జరిగిందో మరచిపోయేంత సమయం ఇంకా కాలగర్భంలో కలిసిపోలేదు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఈ పార్టీలకు కలసివచ్చింది. స్తానిక సంస్తల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన 34 శాతం రిజర్వేషన్లకు గండి కొట్టేందుకు ఆ రిజర్వేషన్లనే ఒక ఆయుధంగా వాడడానికి రంగం సిద్ధం అయిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు యాభయ్ శాతానికి మించకూడదన్న సర్వోన్నత న్యాయస్తానం తీర్పు నేపధ్యంలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టే కుట్రకు శ్రీకారం చుట్టారన్నది వారి అభిప్రాయం. సర్పంచుల సంఘం పేరుతొ న్యాయస్తానంలో కేసు వేయించడం వెనుక ప్రభుత్వ హస్తం వుందని, కర్నాటకకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మన రాష్ట్రానికి అన్వయించడం సరికాదని బీసీ నాయకుల వాదన.


రాష్ట్రంలో బీసీ జనాభాకు సంబంధించిన వివరాలు 2001 లో నిర్వహించిన మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు 43 శాతానికి మించి వున్నట్టు తేలింది. బహుశా కడచిన ఈ పదేళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఈ జనగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 43 శాతానికి పెంచాలన్నది ఆ సంఘాల నేతల అంతరంగంగా కానవస్తోంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలన్నది కూడా వారి అభిప్రాయంగా వుంది. ఇంత భారీగా కోరడంలో భావ్యత, సంభావ్యత అటుంచితే,
చావుకు  పెడితే లంఖణానికయినా వస్తుందన్న నానుడి ప్రకారం బీసీలకు ఏదో ఒక మేరకు లబ్ది చేకూరగలదన్నది వారి భావన కావచ్చు.


మరో విషయం ఏమిటంటే - కర్నాటకలో ఈ రకమయిన సర్వే అప్పట్లో జరగలేదు. ఆ కారణంగా సుప్రీం తీర్పు మన రాష్ట్రంలో చెల్లుబాటు కాదని చెప్పడానికి కూడా వీలుంది.


ఎన్నికలపట్ల ఆసక్తి లేకపోయినా బీసీల పట్ల లేని ప్రేమను ఒలకబోయడానికి సరయిన అదునుగా భావించి ఎస్టీలకు 8.2 శాతం, ఎస్సీలకు 18.30 శాతం,బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఒక జీవోను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ సర్పంచుల సంఘం తరపున రామ్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులు విచారణ జరిపిన హైకోర్ట్ సింగిల్ జడ్జి -రిజర్వేషన్ శాతాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ, ఆ పిటీషన్ ను తోసిపుచ్చారు. స్తానిక సంస్తల ఎన్నికలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎన్నికలకు మార్గం సుగమం అయినట్టేనని అంతా సంతోషించారు. తమ హక్కులకోసం పోరాడుతున్న బడుగులు ఆ తీర్పును తమ తొలి విజయంగా భావించారు. ఇది జరిగింది ఈ నెల 14 తేదీ మంగళ వారం నాడు. కోర్టు తీర్పు గురించి తెలియగానే, ఎన్నికల నిర్వహణకు తాము సంసిద్ధంగా వున్నామనీ, అయిదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ , జులై 21 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత రెడ్డి ప్రకటించారు కూడా.


ఇరవై నాలుగ్గంటలు గడవకముందే పరిస్తితి తలకిందులయింది. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ ఎదుట పిటీషన్ దాఖలు కాకముందే , ఆ మరునాడే అంటే బుధవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. పిర్యాది తరపు వాదనలు విన్న ధర్మాసనం జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎలాటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


న్యాయస్తానం ఉత్తర్వుల ధర్మమా అని స్తానిక సంస్తల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టయింది. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చినట్టయింది.


కోర్టు తీర్పు దరిమిలా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వైఖరిని సవరించుకుంది. ప్రభుత్వం రిజర్వేషన్ లు ప్రకటించే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం తలచుకుంటే నాలుగయిదు రోజుల్లో ఈ విషయంలో నోటిఫికేషన్ జారీచేయవచ్చంటూ రమాకాంతరెడ్డి బంతిని ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు.
ఏతావాతా ఏమయితేనేం మొత్తం మీద స్తానిక పోరుకు తెర పడిందనే అనుకోవాలి.
కోర్టు తీర్పులను పాలక పక్షాలు తమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నించడం కొత్తేమీ కాదు. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలయిన కారణాల అన్వేషణలో వున్న ప్రభుత్వానికి హై కోర్టు డివిజన్ బెంచి తీర్పు ఊరట ఇచ్చింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లితీరుతుందనీ, కోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదాపడే అవకాశం వుందని ఆలోచించే ఉభయతారకమయిన ఈ ఎత్తుగడకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రిజర్వేషన్ లపై ఎవరయినా కోర్టుకు వెళ్ళిన పక్షంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందని మంత్రి జానారెడ్డి అంతకు చాలా రోజులముందు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
కాకపొతే ఈ ఎన్నికలు సర్కారుకు అవసరం లేకపోయినా ఆ అవసరం జగన్ పార్టీకి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి ఒక సరికొత్త కోటా ప్రతిపాదన ముందుకు తెచ్చారు. సుప్రీం తీర్పుకు భంగం కలగకుండానే బీసీలకు 34 శాతం కోటా అమలు చేయవచ్చన్నది దాని సారాంశం. బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ లు కల్పించాలని వాదిస్తున్న రాజకీయ పార్టీలు – జనరల్ స్తానాల్లో సయితం బీసీ అభ్యర్ధులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ విధంగా చేస్తే సకాలంలో ఎన్నికలు జరుపుకోవచ్చనీ, ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని జగన్ మోహన రెడ్డి సలహా ఇచ్చారు. ఆయనకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన ఈ విధమయిన సూచన చేసి వుండవచ్చు. అన్ని పార్టీలు దీనికి కట్టుబడి నిర్దేశిత జనరల్ సీట్లలో బీసీ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టినప్పుడే బీసీలకు న్యాయం జరిగే వీలుంటుంది. అలాకాకుండా జనరల్ స్తానాల్లో కొన్ని పార్టీలు బీసీలను నిలబెట్టి, మరి కొన్ని పార్టీలు ఆర్ధిక,సామాజిక బలాలు దండిగావున్న అభ్యర్ధులను పోటీకి పెడితే ఉపయోగం వుండదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ బీసీల పట్ల సానుభూతి ఒలకబోస్తుంది. వారికి రాజకీయ అధికారం అప్పగించడమే తమ ధ్యేయమని బల్ల గుద్ది చెబుతుంది. తీరా సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి బీసీలకు మొండి చేయి చూపడం వాటికి మామూలయిపోయింది. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి కొరవడితే ప్రధాన పక్షాల పబ్బం గడవడం మినహా ఈ ప్రతిపాదన వల్ల బీసీలకు ఒరిగేదేమీ వుండదు. పైగా బీసీల ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం ఇది.
రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్స్సిన హక్కుని ఇతరుల దయాదాక్షిణ్యాల ద్వారా పొందడం వారికి రుచించక పోవచ్చు.
అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవడం మంచిది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకడుగు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు వేయాలని వామపక్షవాదులు తరచూ పేర్కొంటుంటారు. అంతిమ లక్ష్యమయిన రాజకీయాధికారాన్ని తద్వారా రాజ్యాధికారాన్ని అడ్డదోవలో సాధించుకోవాలా లేక నిర్విరామ పోరాట పద్ధతుల ద్వారా రాజ్యాంగ బద్ధంగా పొందాలా అన్నదే ఈ నాడు బీ సీ సంఘాలముందు నిలచిన సమాధానం లేని ప్రశ్న. (17-06-2011) 

12, జూన్ 2011, ఆదివారం

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావుస్నేహం అనేది నీటి మీద రాత కాదు రాతి మీద గీత.


ఇద్దరు మిత్రులు అడవి మార్గం లో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఓ నది దాటుతుండగా వారి నడుమ ఏదో విషయంలో వాదప్రతివాదాలు మొదలయ్యాయి.


మాటామాటా పెరిగింది. వాటిలో తీవ్రత పెరిగింది. అందులో ఒకడు కోపం పట్టలేక రెండో వాడిని చాచి లెంపకాయ కొట్టాడు.


దెబ్బతిన్నవాడు ఖిన్నుడయ్యాడు. కానీ స్నేహితుడుపై తిరిగి చేయిచేసుకోలేదు.మౌనంగా తల దించుకుని చేతి వేళ్ళతో నీటిమీద ఓ వాక్యం రాసాడు.


“ఈ రోజు నాకు చాలా దుర్దినం. మంచి స్నేహితుడు అనుకుంటున్న వ్యక్తి నా చెంప పగలగొట్టాడు”


దెబ్బకొట్టినవాడికి స్నేహితుడు రాసినదేమిటో అర్ధం అయింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రయాణం సాగుతోంది. కానీ వారి నడుమ మాటలే నిలచిపోయాయి. నీటిలో నడుస్తుండగానే ఉన్నట్టుండి ఓ అల విసురుగా వచ్చింది. దాని తాకిడికి దెబ్బతిన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. రెండోవాడు ప్రమాదాన్ని పసికట్టి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న స్నేహితుడ్ని కాపాడి వొడ్డుకు చేర్చాడు.


త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నవాడికి, ప్రాణం కాపాడిన వాడికి కృతజ్ఞతలు యెలా చెప్పాలో తెలియలేదు. తీరం చేరగానే కనిపించిన ఓ రాతిపై తన మనసులోని భావాన్ని చెక్కాడు.


“ఈ రోజు నా జీవితంలో మరవలేని రోజు. నా స్నేహితుడు తన ప్రాణాన్ని సయితం లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఈ రోజునూ, అతడు నాకు చేసిన సాయాన్నీ ఎన్నటికీ మరువలేను.”


అది చదివి ఆశ్చర్యపోవడం రెండోవాడి వంతయింది.


‘ఇదేమిటి? దెబ్బ కొట్టినప్పుడు నీటి మీద గెలికాడు. ఇప్పుడేమో రాతి మీద చెక్కాడు.’


మనసులో మెదిలిన సందేహాన్ని మనసులోనే దాచుకోకుండా స్నేహితుడి ముందు బయట పెట్టాడు.


‘చెప్పు మిత్రమా! నాతో దెబ్బతిన్నప్పుడేమో నీటిమీద రాశావు. ఇప్పడేమో రాతిమీద రాశావు. ఏమిటి ఇందులోని మర్మం.’


రెండోవాడు ఇలా జవాబు ఇచ్చాడు.


“ఎవరయినా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. నీటి మీద రాసిన రాత ఎంతమాత్రం నిలవదు. మరచిపోవాల్సిన విషయం కనుక అలా రాసాను. పోతే నీవు చేసిన సాయం అంటావా. ఒకరోజుతో మరచిపోయేది కాదు. జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాతి మీద గీతలా కలకాలం గుర్తుండిపోవాలి. అందుకే అలా రాశాను”


అందుకే పెద్దలంటారు.


జీవితంలో ఓ విశిష్ట వ్యక్తిని కలుసుకోవడానికి ఓ క్షణం పట్టకపోవచ్చు. వారిని గురించి ఓ అవగాహనకు వచ్చి మెచ్చుకోవడానికి మరో గంట పట్టవచ్చు. వారిని అర్ధం చేసుకుని ఆరాధించడానికి ఓ రోజు తీసుకోవచ్చు. కానీ అలాటి వారిని మరచిపోవడానికి మాత్రం మొత్తం జీవిత కాలం చాలదు.


జీవితమనేది మనకు ఒక్కసారిమాత్రమే భగవంతుడు ప్రసాదించే వరం. దాన్ని వృధా చేయకుండా జీవిత సారాన్ని పూర్తిగా అనుభవించాలి.జీవితంలో తారసపడిన వైభోగాలకు విలువ ఇవ్వవద్దు. మీ అనుకున్నవారికి, నా అనుకున్నవారికి విలువ ఇవ్వండి.


ఇతరులని ద్వేషిస్తూ కూర్చుంటే జీవితం సరిపోదు. ఎందుకంటే –


‘ఎంతో చిన్నది జీవితం!’10, జూన్ 2011, శుక్రవారం

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు
రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.


చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.


పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.


రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.


రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక. (10-06-2011)

ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు


ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు

(10-06-2011 నాటి ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)


తిరుపతి మొక్కు తీర్చుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సజావుగా జరిగిపోవడం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల సాకుతో సోదిలో లేకుండా పోవడం - ఇవన్నీ ముఖ్యమంత్రికి సానుకూల పరిణామాలే. స్పీకర్ ఎన్నిక ద్వారా ‘రుజువయిన విశ్వాసం’ ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా ఆయనతో అడుగులు వేయిస్తోంది. రైతు సదస్సుల పేరుతొ జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనిలో పైగా పార్టీ కార్యకర్తల సమావేశాల్లో స్వరం పెంచి మాట్లాడేలా చేస్తోంది. దీనికి ఉదాహరణ శ్రీకాకుళంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో జగన్ అనుకూల కాంగ్రెస్ నాయకులను గురించి ఆయన చేసిన ప్రత్యేక ప్రస్తావన. పార్టీలో జగన్ కోవర్టులుగా అభివర్ణిస్తున్న వారికి ముఖ్యమంత్రి కొత్తగా ఇంటి దొంగలని నామకరణం చేశారు. ‘ఇంటి దొంగల్ని ఈశ్వరుడయినా పట్టలేడు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లు దయచేసి వెళ్ళిపొండి. లేని పక్షంలో మీ పాత స్తానాలకు మేమే పంపిస్తాం.’ అన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు కూడా శ్రీకాకుళం లో ఆయన చూపిన తెగువను చూసి ఆశ్చర్య పోయివుంటారు. బహుశా, ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తరువాత పార్టీ లోని జగన్ అనుకూల వర్గం వారిపై ఈ విధంగా విరుచుక పడడం ఇదే మొదటి సారి. పైగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణ దాస్, కొర్ల భారతి ముఖ్యమంత్రి ప్రసంగించిన రైతు సదస్సుకు హాజరయిన వారిలో వున్నారు. ఆ తరువాత జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ముఖ్యమంత్రి తన విమర్శల ప్రస్తావనకు వేదికగా చేసుకోవడం విశేషం.


అయితే, ముఖ్యమంత్రి హెచ్చరికలను ‘నిస్పృహతో చేసిన వ్యాఖ్యలు’ గా రాజకీయపరిశీలకులు పరిగణిస్తున్నారు. స్పీకర్ ఎన్నికతో తన ప్రభుత్వం పట్ల శాసన సభ ‘విశ్వాసం’ రుజువయిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, అదే నోటితో పార్టీలో ‘ఇంటి దొంగల’ ప్రస్తావన తీసుకురావడం ఆయనలోని ద్వైదీభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియామకం ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పైపెచ్చు అధిష్టానం ఎంపిక చేసిన బొత్స సత్యనారాయణ సాదా సీదాగా కనబడే అసాధారణ రాజకీయ నాయకుడు. సామాజిక కోణం నుంచి చూసినా లేక ఈనాటి రాజకీయాలకు అవసరమయిన ఇతర కోణాలనుంచి చూసినా బొత్స సత్యనారాయణ అన్ని విధాల ముఖ్యమంత్రికి సమ ఉజ్జీ అనే చెప్పాలి. జగన్ మోహన రెడ్డిని దీటుగా ఎదుర్కొనగల సత్తా వున్న మనిషిగా పార్టీ అధిష్టానం బొత్సను గుర్తించి పీసీసీ పీఠం అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయే బొత్స తత్వం పార్టీ పటిష్టానికి ఉపయోగపడవచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు పట్ల ఆయన గతంలో వెల్లడించిన సానుకూల భావాలే పార్టీ కొత్త అధ్యక్షుడు కావడానికి సానుకూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క వి.హనుమంతరావును మినహాయిస్తే తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు ఆయన ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే టీ ఆర్ ఎస్ కూడా. ఇవన్నీ ముందు ముందు బొత్సకు కలిసొచ్చే అంశాలే. దానికి తోడు, పదవి రాగానే, ఢిల్లీ నుంచి తిరిగొస్తూనే, అస్వస్తత నుంచి కోలుకుంటున్న కాకా మొదలుకుని సొంత పార్టీ – ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కొంగొత్త భ్రమలతో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి కలిసి తనతో కలుపుకోగల కలుపుగోలుతనం బొత్స సొంతం.


సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాంధ్రకు చెందిన బొత్సకు అధిష్టానం పీ సీ సీ అధ్యక్ష పీఠం అప్పగించడానికి ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలవరపెడుతున్న అంశాలలో తెలంగాణాతో పాటు అంతటి ప్రాధాన్యం కలిగింది జగన్ మోహన రెడ్డి స్తాపించిన కొత్త పార్టీ. ఈ పార్టీవల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ భవితవ్యానికి ఎదురుకాగల ముప్పు ఎలాటిదన్నది కడప ఉప ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో దానికి అర్ధం అయింది. పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు పెనుసవాలే అన్నది ఆ పార్టీ నాయకులే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్న సత్యం. అందుకే, కడప ప్రభావాన్ని కనీసం ఉత్తరాంధ్రలోనయినా నిలువరించగలిగితే రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ పడవను వొడ్డు ఎక్కించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కానవస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న బొత్స ద్వారా కొంత మేరకయినా నష్టాన్ని పూడ్చుకోవడం అన్నది ఆ పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తోస్తోంది. వై ఎస్ జగన్ హవాకు అడ్డుకట్ట వేయడం ప్రధాన కర్తవ్యంగా మారిన కాంగ్రెస్ అధిష్టానం కంటికి బొత్స అవసరానికి పనికి వచ్చే తురుపు ముక్కగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.


రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ పట్ల బొత్స అనుసరిస్తున్న వైఖరి కూడా బొత్సకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడి వుంటుంది. రాజశేఖరరెడ్డికి అనుంగు శిష్యుడయిన బొత్స- తన విధేయతను కానీ, విశ్వాసాన్ని కానీ ఆయనవరకే పరిమితం చేసి, ఆయన అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ఎడంగా వుంచి వ్యవహరించడం అప్పట్లో వై ఎస్ అభిమానులకు కొరుకుడు పడలేదు కూడా. కానీ, ఇప్పుడదే అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడానికి బొత్సకు ఉపయోగపడిందని అనుకోవాలి.


అయితే, ఆయనలోని చొరవా చురుకుదనం ఎలాటి ముఖ్యమంత్రికయినా ఇబ్బంది కలిగించే లక్షణాలే. క్రమంగా బలపడుతున్నానన్న ఆశలు కదలాడుతున్న తరుణంలో జరిగిన బొత్స నియామకం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధమయిన బలమిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటె, సహజంగా మాటకారి అయిన బొత్సను, ముభావంగా ముక్తసరిగా మాట్లాడే ముఖ్యమంత్రితో పోల్చిచూసుకోవడం మొదలవుతుంది. పైపెచ్చు, రాజకీయ పరమపద సోపానపఠంలో నిచ్చెనలన్నీ త్వరత్వరగా ఎక్కేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలన్న కాంక్ష బలంగా వున్న బొత్స తదనుగుణంగానే రాజకీయ ఎత్తులకు పూనుకుంటే ఆశ్చర పడాల్సింది ఏమీ వుండదు. పీ సీ సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వుండాలని బొత్స పట్టుబట్టడం వెనుక ఏదయినా ముందు చూపు కూడా వుండివుండవచ్చు. సీ ఎం కావాలన్న కోరికను కూడా దాచుకోని నైజం ఆయనది.


మామూలు పరిస్థితుల్లో అయితే పీసీసీ అధ్యక్ష పీఠం అన్నది అలంకారప్రాయమే. ఎన్నికల సమయంలో మాత్రం ఈ పదవికి ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో కొందరి విషయంలో నయినా పీసీసీ అధినేత మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వుంటుంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వుంది. పోనీ, స్తానిక సంస్తల ఎన్నికలయినా కనుచూపు మేరలో వున్నాయనుకుంటే, ఆ ఆశ కూడా కనబడడం లేదు. కడప ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో స్తానిక సంస్తల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంటుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. పాలక వర్గాలు రద్దయిన స్తానిక సంస్తలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే ఆర్డినెన్స్ ఇవ్వాళో రేపో జారీ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అనుభవంలోకి వచ్చిన ఉద్రిక్త క్షణాలు ముఖ్యమంత్రిని ఇంకా కలవరపెడుతూనే వుండి వుండవచ్చు. ఆ ఎన్నికలో సాధించిన విజయం కేవలం సాంకేతిక మైనదే అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. ప్రజారాజ్యం విలీనంతో పెరిగిన బలం, మజ్లిస్ పార్టీ మద్దతు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో జగన్ అనుకూల వర్గీయులయిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వత్తాసు పలకడం – అధికార పార్టీ అభ్యర్ధుల గెలుపుకు దోహదం చేసాయి. అయినా కూడా రావాల్సిన వోట్లకన్న అత్తెసరు వోట్ల ఆధిక్యం మాత్రమే లభించడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతానికి బయటపడినా ముందు ముందు మరోసారి ఇదే పరీక్ష ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అవిశ్వాసం అనే కత్తి ముఖ్యమంత్రి నెత్తిమీద వేలాడుతూనే వుంటుంది. మరో అగ్ని పరీక్ష తెలంగాణా రూపంలో తయారుగా వుంది. (09-06-2011)


7, జూన్ 2011, మంగళవారం

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)


During last one week two major political developments took place. One

is the ‘no confidence’ motion moved by Telugu Desam in the Assembly

convened to elect Speaker and Deputy Speaker, while the second being

the Congress high command’s decision to appoint one of their senior

member hailing from north coastal Andhra (Vizianagaram), Botsa

Satyanarayana, as APCC Chief. Added to these two is the state party

in-charge and Union Minister Ghulam Nabi Azad’s statement on

pot-boiling Telangana issue, generated enough heat.

First, let us look at the no-confidence motion moved by the main

Opposition Telugu Desam. The way it has been moved, in fact, raised

many eyebrows. Aware of the legislature rules, the TDP made light of

the issue, by handing over the letter two days in advance, only to

face Opposition wrath. Perhaps, my media colleague and MLC, Prof

Nageshwar, was right saying it was for media conception. While

finding fault with technicalities, he said in the same breadth that

the TDP may as well handover another ‘no-confidence’ letter an hour

before the session begins to the Secretary. As expected, the TDP has

given on the day when Speaker and Deputy Speaker of the Assembly being

convened last Saturday.


As expected the government conveniently ‘ignored’ it by the Speaker

adjourning the House sine die. But as per Rules, Prof Nageshwar,

argues that the ‘no-confidence motion’ should have been entertained by

even the Pro-tem Speaker. The main Opposition had also come under

fire for not pressing for it, though its leader, Nara Chandrababu

Naidu, got opportunities twice. However, the TDP realizing the fact

that they got exposed, rushed to Raj Bhavan to lodge a complain as

well request the Governor ESL Narasimhan to reconvene the assembly.


Meanwhile, the newly-elected Speaker Nadendla Manohar’s tacit denial

that the ‘no confidence’ motion moved by the TDP had not come to his

notice, not only sounds ridiculous, but absurd. On Speaker’s remarks,

Prof Nageshwar, also made it clear ruling out legal remedy to it. As

per rules, the Speaker cannot shirk his responsibility, but if he does

by quoting earlier parliament precedents or practices, none can help.


Whether Speaker acted on government’s directions or not, the message

is clear and loud – neither the ruling Congress nor Telugu Desam – are

willing to face electorate as of today. They fear, total rout and

lack confidence. The Congress and Telugu Desam combine, in fact, yet

again succeeded to restrain their common enemy “Jagan” at bay for some

more time.

Coming to PCC chief election, optimists of separate Telangana see the

Congress high command’s move to appoint Botsa Satyanarayana as APCC

chief, as yet another major step closer to consider the state

bifurcation favorably. Whether this argument holds any water, one has

to wait and see. But, pessimists look at it, adding Azad’s remarks, as

a move to further dilute the T-issue.

To me it appears, the Centre reluctant to spell out its decision

either way, as it wanted to further consolidate lost ground,

especially after the sudden demise of its most popular leader YS

Rajasekhara Reddy, two years ago. The Congress high command treading

cautiously, giving ‘hope’ to optimists as well pessimists and willing

to drag on still it completely come to grips with its own problems at

the Centre, especially the scams that almost wreck the UPA boat.


For Congress, the Telangana issue is certainly not in its priority

list, as it had to protect government’s survival with coalition

partners like DMK holding out threats on either 2G scam or ‘war

against corruption’ unleashed by the civic society leaders like Anna

Hazare and Baba Ramdev.


As I argued in my last article “T-issue: Is it fizzling out”, the

Congress bound to find some excuse or the other to drag on the issue,

till its MPs and MLAs dare to resign en masse, which is more unlikely,

than to become a realty. (07-06-2011)

3, జూన్ 2011, శుక్రవారం

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు


(04-06-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


ప్రజలు గమనిస్తున్నారు అన్నది రాజకీయనాయకులు తరచుగా వాడే ఊతపదం.


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వారు భావిస్తున్నట్టు లేదు. బహుశా ఆ అవసరం వారికి లేదేమో కూడా. ఎందుకంటె మన దేశంలో రూపొందించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాటిది మరి.


ఈ వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికలు. రాజ్యాంగం ధర్మమా అని కుల,మత,వర్ణ,లింగ,వయో వివక్ష లేకుండా ప్రజలందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే వోటు హక్కు వినియోగించుకోవడంతో పౌరుల ప్రజాస్వామ్య ధర్మం పూర్తవుతుంది. అంతటితో వారి పని సరి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ప్రజలతో పని లేదన్న సంగతి రాజకీయులందరికీ తెలుసు. పోతే, ఇక అక్కడనుంచి ప్రజాస్వామ్య రధం ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది. సంఖ్యలు, అంకెలు లెక్కలోకి వస్తాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కోరలనుంచి తప్పించుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం సాగుతుంది. అంకెల గారడీలు, టక్కు టమార విద్యలు రంగప్రవేశం చేస్తాయి. ప్రజల విశ్వాసంతో ఎవరికీ నిమిత్తం వుండదు. ప్రజాప్రతినిధుల విశ్వాసం వుంటే చాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది.


గత ఇరవై నాలుగ్గంటల్లో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమయిన మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యాంగంలోని సాంకేతికతలను అడ్డం పెట్టుకుని తమదే పై చేయి అనిపించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ పాచికలాటలో ఇంతవరకు ముందంజలో వుంది.


దాదాపు రెండేళ్లుగా నిష్క్రియాపియత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన పాలక పక్షం లోని వ్యూహకర్తలు, తాము పదిలంగా దాచిపెట్టిన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైరి పక్షం వూహలకు అందని వేగంతో పావులు కదుపుతున్నారు. ఎన్నాళ్ళబట్టో అటకెక్కించి వుంచిన పదవుల పందేరానికి వున్నట్టుండి తెర తీసారు. అదీ ఎంతో వ్యూహాత్మకంగా. స్పీకర్ ఎన్నిక పేరుతొ హడావిడిగా శాసన సభ సమావేశాలను ఏర్పాటుచేసారు. డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ తో ఒక రోజు ముందుగానే రాజీనామా చేయించారు. దానితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేని పరిస్తితి ఏర్పడింది. గవర్నర్ తో ప్రమేయం లేని రీతిలో, గత శాసన సభ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా జాగ్రత్త పడడాన్ని బట్టి చూస్తే చాలా ముందుగానే కాంగ్రెస్ తన వ్యూహరచన చేసుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ సమయంలోనే, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపులో చేసిన ప్రకటనకు అనుగుణంగా కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కానీ అలా ఇచ్చే సమయానికి దాన్ని తీసుకోవాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీ. నోటీసు ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్ళిన తెలుగుదేశం శాసన సభ్యులు చాలాసేపు వేచి చూసి, ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి వెనుదిరగాల్సివచ్చింది. దానితో ఆ నోటీసు సాంకేతికంగా చెల్లుబాటు కాదన్న వాదన బయలుదేరింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కు ఇచ్చిన నోటీసునే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎన్నిక అనంతరం తిరిగి అదే నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. దానిని పరిశీలించి అనుమతించడానికి కొత్త స్పీకర్ పది రోజులు వ్యవధి తీసుకోవచ్చని మరో సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే శాసన సభ మరో సారి సమావేశం అయ్యేదాకా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అసెంబ్లీ అలమరా లోనే వుండిపోయే అవకాశం వుంది.


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తంతు ముగిసిన తరువాత వారిద్దరినీ శాసన సభ అభినందించే కార్యక్రమం మొదలవుతుంది. సభావ్యవహారాల సలహా సంఘం సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన ఒకరోజు సమావేశంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నాయి. ఈ విషయం పూర్తిగా కొత్త స్పీకర్ విచక్షనాధికారానికి లోబడి వుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, జగన్ బలం ఎంతో లెక్కలు తేల్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కోరుకున్న పక్షంలో కొత్త స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టే అవకాశం వుంటుంది. అలా జరగని పక్షంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి వున్న ప్రస్తుత నిబంధనలను అడ్డం పెట్టుకుని శనివారం సభ ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసి ప్రోరోగ్ చేస్తే మళ్ళీ అవకాశం లభించేది వర్షాకాల సమావేశాల్లోనే. బీరాలు పలికిన పార్టీలన్నీ అప్పటిదాకా వేచిచూడాల్సిందే.


రెండు రోజులుగా నిబంధనల పేరుతొ నడుస్తున్న ఈ తంతును పరికిస్తున్నవారికి ఒక విషయం ఇట్టే అర్ధం అవుతుంది. ఇదంతా జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పన్నిన పధకంగా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టూ అవుతుంది. సాంకేతిక కారణాలతో దాన్ని అనుమతించనట్టు అవుతుంది. రోగి కోరిందే వైద్యుడు ఇవ్వడం అంటే ఇదే కాబోలు.


మహానాడుతో కొత్త జవసత్వాలు పుంజుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, చాలినంత బలం లేకపోయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పెట్టాలని రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించారు. అనుకున్నదే తడవుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి కేఈ కృష్ణ మూర్తినీ, డిప్యూటీ స్పీకర్ పదవికి మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యను
అభ్యర్ధులుగా ప్రకటించి ఆటలో తానూ వెనకబడిలేనన్న సంకేతాలను ఇచ్చారు. బీసీ, ఎస్సీలపట్ల తమ పార్టీకి వున్న చిత్తశుద్ధిని ఈ విధంగా వెల్లడించుకున్నారు. ఈ పరిణామం సహజంగానే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. పాలక పక్షం తన ధోరణి మార్చుకోకుండా సీమాంధ్ర వారికే పదవుల పందేరంలో పెద్ద పీట వేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలకు దిగారు కూడా. పార్టీలోని సొంత శాసన సభ్యులు కొందరు సయితం ఈ ఆరోపణలతో గొంతుకలిపారు. వీటికి తోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో శాసన సభకు ఎన్నికయిన వైఎస్ సతీమణి విజయమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఆవిడ వెంట తరలి రావడం కూడా పాలకవర్గం లొ చర్చనీయాంశం అయింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం కొత్త కాకపోయినా, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, అంతమంది శాసన సభ్యులు కట్టగట్టుకుని బాహాటంగా వైరి పక్షం నేత వెంట నడవడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి అందరూ కలసి రావాలని పాలక పక్షం తరపున ఇతర పార్టీలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది.


తగినంత బలం వున్నప్పటికీ, ఒకేసారి, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం ఎడుర్కొవాల్సిరావడంతో, చేతిలో వున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకునే స్తితిలో ఆ పార్టీ వున్నట్టు కనబడడం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులలో వున్న జగన్ సానుభూతిపరులతో కలసి మరికొందరు చేయి కలిపి అనర్హత వేటుకు సిద్ధపడితే, పరిస్థితులు మరోరకంగా మారే అవకాశాలు వుంటాయన్న భయం దాన్ని వేధిస్తూ వుండవచ్చు.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నిలబెట్టే అభ్యర్ధులకు జగన్ పార్టీ లేదా ఆయనతో వున్న శాసన సభ్యులు మద్దతు ఇవ్వాలనేది కూడా వ్యూహాత్మక ప్రతిపాదనే. ఎందుకంటె ఓడిపోతే జగన్ వర్గంపై అనర్హత వేటు పడుతుంది. తెలుగుదేశానికి ఓడిపోయామన్న నామర్దా తప్ప వేరే నష్టం లేదు. జగన్ ఇంతవరకు తనకుందని చెప్పుకుంటున్న బలం ఏపాటిదో జనాలకు తెలిసిపోతుంది. గెలిస్తే మాత్రం పాలక పక్షం సభావిశ్వాసం కోల్పోయినట్టు అవుతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ వెనువెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చే వీలు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సభ్యుల మద్దతు వుందని ముందుకు వచ్చే నాయకుడికి గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చు. కానీ, దరిమిలా శాసన సభ రద్దయినా, దానిని సుప్తచేతనావస్థలో వుంచినా – తెలుగు దేశం తరపున గెలిచిన వ్యక్తే శాసన సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. బహుశా ఇదే కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని భావించాలి.


కడప ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలను మళ్ళీ ఏదో ఒక మేరకు పూరించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిబంధనలను అడ్డం పెట్టుకుని ఆడే ఈ ‘నెంబర్ గేమ్’ కు తెర తీసిందని అనుకోవాలి.

అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో రాదో తెలియని స్తితిలో సభలో పార్టీల బలాబలాలనుగురించీ, తీర్మానం గెలుపోటములు గురించీ చర్చించుకోవడం - జరగని పెళ్ళికి బాజాలు వాయించిన చందమే కాగలదు. (03-06-2011)