18, జూన్ 2011, శనివారం

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు


(18-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

బడుగులపై రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ప్రేమ కేవలం నీటి బుడగలేనా ? అగ్రవర్ణ పాలకుల వోటు బాంకు నిర్మాణానికి ఉపయోగపడే పునాది రాళ్ళా వాళ్లు ? స్తానిక సంస్తల ఎన్నికల్లో బీ సీ రిజర్వేషన్ లకు సంబంధించి ఆయా పార్టీలు ప్రదర్శిస్తున్న వైఖరులు గమనిస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది.


ఈ ఎన్నికల పట్ల వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీ ఆర్ ఎస్ వంటి పార్టీలకు తప్ప మిగిలిన వాటికి ఎలాటి ఆసక్తి లేదన్న సంగతి జగమెరిగిన విషయమే. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఊపులోవున్న జగన్ పార్టీ స్తానిక సంస్తల ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మరోసారి తన తడాఖా చూపించాలని వువ్విళ్ళూరుతోంది. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే తెలంగాణా అంశాన్ని కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని ఆశించి భంగపడిన టీ ఆర్ ఎస్, సహజంగానే స్తానిక సంస్తల ఎన్నికల్లో మరో సారి తన సత్తా ప్రదర్శించి పాలక పక్షం పై వొత్తిడి పెంచాలని అనుకోవడంలో విడ్డూరమేమీ లేదు. విజయం పై ధీమా ఈ రెండు పార్టీలకు వున్నట్టుగా మిగిలిన పార్టీలకు లేకపోవడంవల్లనే- ఈ ఎన్నికలు ఏదో విధంగా వాయిదా పడితే బాగుండు అన్న ధోరణితో అవి వున్నాయి. పాలక పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నట్టు కానవస్తోంది. స్తానిక పోరుకు ఏ నిమిషంలోనయినా తాము సిద్ధం అన్నట్టు ఈ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటె కడప ఉప ఎన్నికల్లో ఏమి జరిగిందో మరచిపోయేంత సమయం ఇంకా కాలగర్భంలో కలిసిపోలేదు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఈ పార్టీలకు కలసివచ్చింది. స్తానిక సంస్తల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన 34 శాతం రిజర్వేషన్లకు గండి కొట్టేందుకు ఆ రిజర్వేషన్లనే ఒక ఆయుధంగా వాడడానికి రంగం సిద్ధం అయిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు యాభయ్ శాతానికి మించకూడదన్న సర్వోన్నత న్యాయస్తానం తీర్పు నేపధ్యంలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టే కుట్రకు శ్రీకారం చుట్టారన్నది వారి అభిప్రాయం. సర్పంచుల సంఘం పేరుతొ న్యాయస్తానంలో కేసు వేయించడం వెనుక ప్రభుత్వ హస్తం వుందని, కర్నాటకకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మన రాష్ట్రానికి అన్వయించడం సరికాదని బీసీ నాయకుల వాదన.


రాష్ట్రంలో బీసీ జనాభాకు సంబంధించిన వివరాలు 2001 లో నిర్వహించిన మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు 43 శాతానికి మించి వున్నట్టు తేలింది. బహుశా కడచిన ఈ పదేళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఈ జనగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 43 శాతానికి పెంచాలన్నది ఆ సంఘాల నేతల అంతరంగంగా కానవస్తోంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలన్నది కూడా వారి అభిప్రాయంగా వుంది. ఇంత భారీగా కోరడంలో భావ్యత, సంభావ్యత అటుంచితే,
చావుకు  పెడితే లంఖణానికయినా వస్తుందన్న నానుడి ప్రకారం బీసీలకు ఏదో ఒక మేరకు లబ్ది చేకూరగలదన్నది వారి భావన కావచ్చు.


మరో విషయం ఏమిటంటే - కర్నాటకలో ఈ రకమయిన సర్వే అప్పట్లో జరగలేదు. ఆ కారణంగా సుప్రీం తీర్పు మన రాష్ట్రంలో చెల్లుబాటు కాదని చెప్పడానికి కూడా వీలుంది.


ఎన్నికలపట్ల ఆసక్తి లేకపోయినా బీసీల పట్ల లేని ప్రేమను ఒలకబోయడానికి సరయిన అదునుగా భావించి ఎస్టీలకు 8.2 శాతం, ఎస్సీలకు 18.30 శాతం,బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఒక జీవోను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ సర్పంచుల సంఘం తరపున రామ్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులు విచారణ జరిపిన హైకోర్ట్ సింగిల్ జడ్జి -రిజర్వేషన్ శాతాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ, ఆ పిటీషన్ ను తోసిపుచ్చారు. స్తానిక సంస్తల ఎన్నికలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎన్నికలకు మార్గం సుగమం అయినట్టేనని అంతా సంతోషించారు. తమ హక్కులకోసం పోరాడుతున్న బడుగులు ఆ తీర్పును తమ తొలి విజయంగా భావించారు. ఇది జరిగింది ఈ నెల 14 తేదీ మంగళ వారం నాడు. కోర్టు తీర్పు గురించి తెలియగానే, ఎన్నికల నిర్వహణకు తాము సంసిద్ధంగా వున్నామనీ, అయిదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ , జులై 21 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత రెడ్డి ప్రకటించారు కూడా.


ఇరవై నాలుగ్గంటలు గడవకముందే పరిస్తితి తలకిందులయింది. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ ఎదుట పిటీషన్ దాఖలు కాకముందే , ఆ మరునాడే అంటే బుధవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. పిర్యాది తరపు వాదనలు విన్న ధర్మాసనం జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎలాటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


న్యాయస్తానం ఉత్తర్వుల ధర్మమా అని స్తానిక సంస్తల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టయింది. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చినట్టయింది.


కోర్టు తీర్పు దరిమిలా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వైఖరిని సవరించుకుంది. ప్రభుత్వం రిజర్వేషన్ లు ప్రకటించే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం తలచుకుంటే నాలుగయిదు రోజుల్లో ఈ విషయంలో నోటిఫికేషన్ జారీచేయవచ్చంటూ రమాకాంతరెడ్డి బంతిని ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు.
ఏతావాతా ఏమయితేనేం మొత్తం మీద స్తానిక పోరుకు తెర పడిందనే అనుకోవాలి.
కోర్టు తీర్పులను పాలక పక్షాలు తమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నించడం కొత్తేమీ కాదు. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలయిన కారణాల అన్వేషణలో వున్న ప్రభుత్వానికి హై కోర్టు డివిజన్ బెంచి తీర్పు ఊరట ఇచ్చింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లితీరుతుందనీ, కోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదాపడే అవకాశం వుందని ఆలోచించే ఉభయతారకమయిన ఈ ఎత్తుగడకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రిజర్వేషన్ లపై ఎవరయినా కోర్టుకు వెళ్ళిన పక్షంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందని మంత్రి జానారెడ్డి అంతకు చాలా రోజులముందు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
కాకపొతే ఈ ఎన్నికలు సర్కారుకు అవసరం లేకపోయినా ఆ అవసరం జగన్ పార్టీకి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి ఒక సరికొత్త కోటా ప్రతిపాదన ముందుకు తెచ్చారు. సుప్రీం తీర్పుకు భంగం కలగకుండానే బీసీలకు 34 శాతం కోటా అమలు చేయవచ్చన్నది దాని సారాంశం. బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ లు కల్పించాలని వాదిస్తున్న రాజకీయ పార్టీలు – జనరల్ స్తానాల్లో సయితం బీసీ అభ్యర్ధులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ విధంగా చేస్తే సకాలంలో ఎన్నికలు జరుపుకోవచ్చనీ, ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని జగన్ మోహన రెడ్డి సలహా ఇచ్చారు. ఆయనకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన ఈ విధమయిన సూచన చేసి వుండవచ్చు. అన్ని పార్టీలు దీనికి కట్టుబడి నిర్దేశిత జనరల్ సీట్లలో బీసీ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టినప్పుడే బీసీలకు న్యాయం జరిగే వీలుంటుంది. అలాకాకుండా జనరల్ స్తానాల్లో కొన్ని పార్టీలు బీసీలను నిలబెట్టి, మరి కొన్ని పార్టీలు ఆర్ధిక,సామాజిక బలాలు దండిగావున్న అభ్యర్ధులను పోటీకి పెడితే ఉపయోగం వుండదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ బీసీల పట్ల సానుభూతి ఒలకబోస్తుంది. వారికి రాజకీయ అధికారం అప్పగించడమే తమ ధ్యేయమని బల్ల గుద్ది చెబుతుంది. తీరా సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి బీసీలకు మొండి చేయి చూపడం వాటికి మామూలయిపోయింది. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి కొరవడితే ప్రధాన పక్షాల పబ్బం గడవడం మినహా ఈ ప్రతిపాదన వల్ల బీసీలకు ఒరిగేదేమీ వుండదు. పైగా బీసీల ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం ఇది.
రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్స్సిన హక్కుని ఇతరుల దయాదాక్షిణ్యాల ద్వారా పొందడం వారికి రుచించక పోవచ్చు.
అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవడం మంచిది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకడుగు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు వేయాలని వామపక్షవాదులు తరచూ పేర్కొంటుంటారు. అంతిమ లక్ష్యమయిన రాజకీయాధికారాన్ని తద్వారా రాజ్యాధికారాన్ని అడ్డదోవలో సాధించుకోవాలా లేక నిర్విరామ పోరాట పద్ధతుల ద్వారా రాజ్యాంగ బద్ధంగా పొందాలా అన్నదే ఈ నాడు బీ సీ సంఘాలముందు నిలచిన సమాధానం లేని ప్రశ్న. (17-06-2011) 

కామెంట్‌లు లేవు: