25, సెప్టెంబర్ 2022, ఆదివారం

జనారణ్య రోదనం – భండారు శ్రీనివాసరావు

దర్శనం అద్భుతం అనుభవం దుస్తరం

అందరి అనుభవాలు ఒకే రీతిన వుండవు. ఇది నా అనుభవం మాత్రమే.
సామాన్యులకు పెద్ద సమస్యలు అనిపించే వాటికి కూడా చిరు పరిష్కారాలు వుంటాయి. వాటిని వివరించడమే కాని విమర్శించడం కాదు ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
తిరుమల ప్రయాణం పెట్టుకునే చాలామంది సాధారణ భక్తులకు శ్రీవాణి (SRI VENKATESWARA AALAYA NIRMAANAM) ట్రస్ట్ టికెట్ కొనడం భారమే. ( Rs. 10000/- per head plus Rs 500/- for Darshanam). కాదనను. అయినా ఎవరి మీదా ఆధార పడకుండా, సిఫారసు లేఖల కోసం ఎవరిని దేబిరించకుండా హాయిగా స్వామి దర్శనం చేసుకుని రావాలని కోరుకునే వారికి ఈ పధకం బాగానే ఉపయోగపడుతుంది. ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే ఖామందులకు, డబ్బు లేకపోయినా దానిని మించిన పలుకుబడి కలిగినవారికి ఎటు తిరిగీ వాళ్ళ దర్శన మార్గాలు వేరేగా వుంటాయి. ( నేనూ ఉద్యోగపర్వంలో ఆ బాటన నడిచి దర్జాగా దర్శనం చేసుకుని వచ్చిన వాడినే) ఆ మాత్రం స్థాయిలో కాకపోయినా తగు స్థాయిలో సుఖప్రదమైన దర్శనం కోరుకునేవారికి మాత్రం శ్రీవాణి పధకం గొప్ప వరప్రసాదం అనే చెప్పాలి. ఇది పెద్ద ప్లస్ పాయింటు. విదేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ తలితండ్రులకు దైవ దర్శనం చేయించాలని కోరుకునేవారు చాలామంది వుంటారు. అలాటి వారికి కూడా ఇది ఉపయోగమే. ట్రస్ట్ పెట్టి నాలుగేళ్లు అయినా, పేరు చూసి ఇదేదో ప్రైవేటు వ్యవహారం అని సందేహిస్తున్న వాళ్ళు ఇంకా మిగిలి ఉండడానికి ప్రధాన కారణం కూడా ఈ కుశంకే. ఆది నుంచి ఈ పధకానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన మొదటి వంద రోజుల్లోనే నలభయ్ కోట్ల రూపాయలు టీటీడీ ఖజానాకు జమ పడ్డాయంటే జనాదరణ ఏ స్థాయిలో వుందో అంచనా వేసుకోవచ్చు. టీటీడీకి విరాళాల వరద, భక్తులకు సులభ దర్శనాల వెల్లువ. (బహుశా ఉభయతారకంగా వుంటుంది అనుకుని అధికారులు ఆలయ నిర్మాణ నిధి విరాళాలను సులభ దర్శనం టిక్కెట్టుతో ముడి పెట్టారేమో తెలియదు)
సరే! ఇంతకుముందు పోస్టులో చెప్పినట్టు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు కొనడానికి నాకున్న కారణం, సిఫారసు లేకుండా శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవాలనే ప్రగాఢమైన ఆకాంక్ష. అయితే ఈ ఆన్ లైన్ బుకింగ్ లో అకామడేషన్ విషయంలో మాత్రం యాత్రీకులకు చాయిస్ లేకుండా చేశారు. మాతృశ్రీ వకుళాదేవి గెస్ట్ హౌస్ ఒక్కటే చాయిస్ కంప్యూటర్ చూపెట్టింది. నాన్ ఏసీ, విత్ ఫాన్ అని వుంది. సరే హైదరాబాద్ వెదర్ ప్రకారం బేరీజు వేసుకుని ఒక్క రాత్రే కదా, సర్దుకుపోదాం మళ్ళీ దీనికోసం ఎవరినో ఆశ్రయించడం దేనికని అక్కడే బుక్ చేసుకున్నాం. అమ్మయ్య! ముఖ్యమైన పనులు రెండు పూర్తయ్యాయి. పోగానే ఉండడానికి రూమ్ వుంది, నేరుగా దర్శనం చేయించే టిక్కెట్టు చేతిలో వుంది అనుకుని చలో తిరుమల అంటూ వెళ్ళాము. సిఫారసు లేకుండా దర్శనం చేసుకు రావాలనే మా కోరికను స్వామి తీరుస్తున్నాడని సంబర పడ్డాము.
Report at ARP Counter , CRO, Tirumala అని కంప్యూటర్ రసీదులో వుంది. Internet Allotment Center అని కూడా అందులోనే వుంది. కొండ చేరుకున్న తర్వాత ఈ సదసంశయం తీర్చుకోవడానికి రెండు చోట్లకు ఉసూరుమంటూ వెళ్ళాము. చలిగా వుంటుంది అనుకుంటే ఎండ దంచుతోంది. అన్నీ పాత బిల్డింగులు. రంగులు వెలిసి వున్నాయి. కూచోడానికి జాగా లేదు. టోకెన్ పద్దతి లేదు. (ఏదో చిన్న చిన్న విషయాలు అని వదిలేయకుండా పెద్ద మనసుతో పట్టించుకుంటే టీటీడీకి శోభస్కరంగా వుంటుంది) మొత్తం మీద ఆధార్ లు అన్నీ సరి చూసుకుని గెస్ట్ హౌస్ కి పొమ్మన్నారు. మళ్ళీ చాలా దూరం పోవాలి. తప్పదు కదా! పోయాము. అక్కడ అన్నీ మళ్ళీ పరీక్షించి గది తాళం చెవి చేతిలో పెట్టారు. ఇక్కడే అధికారులు కొంచెం యాత్రీకుల కష్ట సుఖాలు గురించి ఆలోచించాలి. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించిన తర్వాత పలానా గెస్ట్ హౌస్ అని టీటీడీ వాళ్ళే నిర్ణయించిన తర్వాత కూడా ఇన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం ఏమిటి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో వున్నప్పుడు అలాట్ చేసిన చోటుకే నేరుగా వెళ్లి బస చేసే ఏర్పాటు చేయాలి అంటే ఏమైనా ఆడిట్ అభ్యంతరాలు ఉంటాయా! దీనివల్ల ప్రయాస, సమయం వృధా తప్పిస్తే వేరే ఉపయోగం ఏముంటుంది? ఈ మధ్య ముఖేష్ అంబానీ మహాశయులు శ్రీవారి దర్సనానికి తిరుమల వచ్చినప్పుడు ఈ విషయం ఆయన చెవిన వేసి వుంటే దేవస్థానం నెట్ వర్క్ యావత్తు గుప్పెట్లోకి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి ఉండేవాడు.
అందరూ శ్రీవాణి దర్శనం అని వాడుకగా అంటున్నారు కానీ దీని పేరు Beginning Break Darshan. ప్రోటోకాల్ దర్శన్ కు, వీ.ఐ.పీ బ్రేక్ దర్శన్ కు మధ్య అన్నమాట. Report at VQC 1 (Vaikuntham Q Complex) at 6 AM అని వుంది. పర్వాలేదు, మరీ హడావిడిగా తెల్లవారుఝామునే లేవనక్కరలేదు. వాళ్ళు ఆరు గంటలు అన్నారు కానీ, ఎందుకైనా మంచిదనుకుని స్నానాలు అవీ పూర్తి చేసుకుని, నిబంధనల ప్రకారం మొబైల్స్ తీసుకుపోకుండా, ఓ అరగంట ముందుగానే VQC చేరుకున్నాము. అటు కాదు మరో వైపు అన్నారు అక్కడి వారు. మరి టిక్కెట్టులో అలా లేదు కదా అంటే, వింటున్నారా ధర్మారెడ్డి గారు, ఇక్కడ రాత్రికి రాత్రి మార్పులు చేస్తూ పై నుంచి ఆర్డర్లు వస్తాయి, వాటిని చచ్చినట్టు మేము అమలు చేయాలి అని జవాబు. సహజంగా ప్రతి సంస్థలోను ఉండేదే. పై వారికీ కింది వారికీ మధ్య వుండే పొరపొచ్చాలు అప్పుడప్పుడూ ఇలా బయట పడుతుంటాయి. మార్పులు చేయాలి అనుకున్నప్పుడు trial and error method ప్రాతిపదిక మీద చేయడం అసహజం ఏమీ కాదు, కానీ ఆ మార్పు గురించి భక్తులకు ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేయడానికి టీటీడీ మీద పడే భారం ఎక్కువేమీ వుండదు.
అతడు చూపెట్టిన వైపుగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము. చాలాసేపటి తర్వాత మా క్యూ లైన్ ను రెండు వైపులా ఇనుప జాలీలు వున్న మరో క్యూ లైన్లో కలిపారు. గతంలో అనేక సార్లు తిరుమల వెళ్లాను కానీ ఆ మార్గంలో ఎన్నడూ వెళ్ళలేదు. కొంతదూరం పరుగులాంటి నడక. మరికొంత సేపు ఎందుకు ఆగామో తెలియకుండా ఆగి నిలబడడం. ఇలా ఎంతసేపో తెలియదు. అసలు మేము వెడుతున్నది శ్రీవాణి టిక్కెట్టు మార్గంలోనేనా అనే సందేహం కలిగింది కానీ మా ముందూ వెనకా వున్నవాళ్ళు సరైన తోవలోనే వెడుతున్నట్టు ధ్రువపరిచారు. మా ముందు వున్నవాళ్ళు బాగా వయసు మళ్ళిన దంపతులు. ఆ దారి మధ్యలో అక్కడక్కడా చెక్క స్పీడ్ బ్రేకర్లు. వాటిని మెట్లు అనుకోవాలి. మెట్టు వున్నది జాగ్రత్త అనే హెచ్చరిక సూచికలు లేవు. అనుకున్నట్టే మా ముందు వెడుతున్న ముసలమ్మ గారు తన ముందు వున్న మెట్టు గమనించక తూలిపడింది. ఆవిడ ఒడిలో పదిలంగా పెట్టుకున్న ముడుపుల మూట కూడా ఎగిరి పడింది. అదృష్టవశాత్తు అందులో నాణేలు చెల్లా చెదురుగా పడలేదు. వాళ్ల పిల్లలు అమెరికాలో వుంటారట. శ్రీవాణి ట్రస్ట్ గురించి తెలుసుకుని అక్కడినుంచే రానూపోనూ విమానం టిక్కెట్లు, వసతి, దర్శనం టిక్కెట్లు, స్థానికంగా తిరగడానికి వెహికిల్ బుకింగ్ అన్నీ చేశారట. అంతకు ముందు శ్రీవాణి దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్పిన విషయాలు విని ఈ ఏర్పాట్లు చేశారట. ‘కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వేరుగా వుంది, ఇంతంత దూరాలు నడవాల్సి వస్తుందని అనుకోలేదు’ అన్నది ఆవిడ. (టీటీడీ అధికారులు ఒక చిన్న పని చేయడం ద్వారా ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. ముందు ప్రోటోకాల్, తర్వాత శ్రీవాణి, ఆ తర్వాత వీఐపీ బ్రేక్. ఏరోజున ఎంతమంది అనేది ముందుగానే సమాచారం వుంటుంది. ఈ దర్శనాలకు వెళ్ళేవారిని పలానా టైముకు రిపోర్ట్ చేయమనే బదులు ఈ విభాగాల వాళ్లు, వాళ్లకు వీలైన సమయంలో ముందుగానే వచ్చి వేచి ఉండడానికి వీలుగా, గేలరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా కూర్చొన్న వారిని ఎవరి టైముకు వారిని అక్కడ నుంచి మహాద్వారం వైపు తీసుకువెళ్లవచ్చు. ఇదేమీ కొత్త పద్దతి కాదు. వీఐపి బ్రేక్ దర్శనానికి ఇలాంటి ఏర్పాట్లు ఇప్పటికే వున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా అన్ని వేళల్లో పనిచేసే సిబ్బందికి ఇబ్బంది కదా అనే వాదన ఈ కాలంలో వర్తించదు. అలా అనుకుంటే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు మూసేసుకోవాలి. ఎంతసేపో అన్నది తెలియకుండా బాగా వయసుమళ్ళిన వాళ్లు అంతసేపు క్యూ లైన్లో నిలబడే వుండాలి అంటే మహా దుస్తరంగా వుంటుంది. ఈ ఏర్పాటు కూడా పెద్ద ఖర్చులేని పనే. కావాల్సింది యాత్రీకులకు సాధ్యమైనంత ఎక్కువ సదుపాయాలు కల్పించాలనే సంకల్పం మాత్రమే.
మహాద్వారం దగ్గరనుంచి మా క్యూ కదలికలో పరిస్థితి వేగంగా మెరుగుపడింది. ధ్వజస్తంభాన్ని తాకి దణ్ణం పెట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళాము. ఎక్కడా తోపులాటలు లేవు. జరగండి జరగండి అనే అరుపులు లేవు. చక్కగా కోరుకున్నదానికంటే మిన్నగా దర్శనం చేసుకుని బత్తాయి పండు ప్రసాదంతో గుడి బయటకు వచ్చాము.
పదివేల అయిదు వందల రూపాయలు పెట్టి కొనే ఈ టిక్కెట్టుకు ఒక చిన్నయాభయ్ రూపాయల లడ్డు ఇస్తారు. ఇంకా కావాలి అంటే విడిగా కొనుక్కోవాలి. మంచిదే. అయితే ఆ ఒక్క లడ్డు కోసం పడే పాట్లు అధికారులు ఎవరైనా గమనిస్తే అయ్యో ఇన్నాళ్లు మనం ఇంతమందిని ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నామా అని వాళ్ళే జాలిపడతారు.
ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా పెద్ద వయసు వాళ్లు, (శ్రీవాణి పధకం కింద టిక్కెట్లు కొనే వారిలో వారి సంఖ్యే అధికం. వయో వృద్ధుల దర్శన పధకం వుంది కదా అనవచ్చు. వున్నా ఇటువంటి మంచి దర్శనం గేరంటీ ఇవ్వగలరా! లేరు.) కింద కాళ్ళు కాలుతూ పైన నెత్తి మాడుతూ త్వరత్వరగా పరుగెడుతున్నట్టు ఆ ముదుసలులు వెళ్ళే దృశ్యం ఇంతవరకూ ఎవరి కంటా పడలేదు అంటే ఆశ్చర్యమే మరి. పైన పై కప్పు శాశ్వతంగా వేయడానికి టీటీడీకి నిధుల కొరత ఉంటుందని అనుకోను.
ప్రసాదాల విక్రయ కేంద్రం విశాలంగా వుంది. ఉండడానికి అనేక కౌంటర్లు వున్నాయి. ఒక చోట నార సంచులు, ఒక చోట లడ్డూ ప్రసాదం, మరో చోట వడలు ఇలా బోర్డులు చాలా కనిపిస్తాయి. బ్యాగు కౌంటర్ లో సంచీ కొనుక్కుని వెళ్ళే లోపల లడ్డూ కౌంటర్ లో నో స్టాక్ బోర్డు కనపడుతుంది. విడివిడిగా ఇన్ని కౌంటర్ల బదులు అన్ని కౌంటర్లలో అన్నీ అమ్మే విధానం ఎందుకు అమలు చేయరూ అనేది ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాదు. పెద్ద పెద్ద మాల్స్ల్ లో మాదిరిగా కంప్యూటర్ కౌంటర్లు అనేకం పెట్టి ఎవరికీ కావాల్సింది (అందుబాటులో వున్నవి) వాళ్లకు సంచీల ఖరీదుతో సహా వసూలు చేసి మళ్ళీ అలాగే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఎవరు ఎంచుకున్న ప్రసాదం ఎవరిది వారికి పంపిణీ చేసే విధానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా స్తాకులో ఎన్ని లడ్డూలు వున్నాయి అనే డిస ప్లే బోర్డులు పెట్టవచ్చు. ఇక శ్రీవాణి టిక్కెట్టు మీద ఇచ్చే ఒక్క లడ్డూ కోసం ఖాళీగా జనం తక్కువగా వుండే కౌంటర్ కోసం అటూ ఇటూ పరిగెత్తుతూ వుండాలి. ఇది అవసరమా! ఏదో చేసి ఈ ఇబ్బందిని తొలగించలేరా! ఎందుకంటే భక్తులకు దైవ దర్శనం ఎంత ముఖ్యమూ లడ్డూ ప్రసాదం కూడా అంటే ప్రధానం. మరో పని కూడా చేయవచ్చు. శ్రీ వాణి టిక్కెట్టు కొనుక్కున్న వారు ఎక్కడ బస చేశారు అన్నది తెలిసిన విషయమే కనుక ఆ ఒక్క లడ్డు అక్కడే అందచేస్తే వాళ్లు సుఖపడుతూ సంతోషపడతారు. మనల్ని దేవస్థానం వారు గుర్తించి చక్కటి ఏర్పాట్లు చేశారు అని ముచ్చటపడతారు. తమ ఊళ్లలో నలుగురుకీ చెబుతారు. టీటీడీకి ఇది మంచిదేగా!
వీటిలో ఏ సలహా అమలు చేసినా దేవస్థానానికి పెద్దగా ఖర్చయ్యేది వుండదు. ఇక్కడ మరో విషయం గమనంలో వుంచుకోవాలి. ధర్మారెడ్డి గారు సమర్ధుడైన రెవెన్యూ సర్వీసు అధికారి. ఆ సర్వీసులో నేర్పే మొదటి పాఠం పన్నుల వసూళ్ళు ఎలా పెంచడం అనేది. కానీ తిరుమలలో ఆ అవసరం లేదు, రానే రాదు.
తిరుమల వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిధుల కొరత వుండదు. అప్పులు అవసరం పడవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తప్పని ఈ అప్పుల బెడద టీటీడీకి లేదు. ఓడీల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తాల్సిన పని లేదు. ఖర్చు చేయడం ఎలా ప్రశ్న తప్పిస్తే రాబడి గురించిన బెంగ లేదు. ఇలాంటి వెసులుబాటు కలిగి, ప్రభుత్వ అధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇదొక్కటే. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు సైతం ఆర్ధిక సమస్యలతో తల్లడిల్లిపోయాయి. తిరుమల ఆదాయం తగ్గిందేమో కానీ అప్పు చేసే అవసరం రాలేదు. అలా అని దుబారా వ్యయాన్ని సమర్థించడం లేదు. యాత్రీకుల సౌకర్యం కోసం ఏమి చేసినా, ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పు పట్టరు అని చెప్పడానికే ఈ మాటలు.
కాబట్టి శ్రీవాణి అనే కాదు, మొత్తం భక్తులకు మంచి దర్శనం, ఇబ్బందులు లేని, ఇబ్బంది పెట్టని ఏర్పాట్లు చేయండి. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా వుంది. సిఫారసు లేఖల బెడద సగానికి సగం తగ్గిపోతుంది. ఈ విషయం మీ చెవిన వేసేవారు వుండరు. ఎందుకంటే సామాన్య భక్తులు అందరూ అల్పసంతోషులు. గుడి నుంచి బయటకు వచ్చేవారిని కదిపి చూడండి. స్వామి దర్శనం చక్కగా జరిగిందనే చెబుతారు. మీ హయాములో మరిన్ని మంచి పనులు చేయండి. కానీ సామాన్య భక్తులకు ఏదైనా పనికొచ్చేది చేస్తే వాళ్లు దేవుడితో పాటు మిమ్మల్నీ గుర్తు పెట్టుకుంటారు.
ఉపశృతి: గతంలో టీటీడీ ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి ఇలా చెప్పారు.
‘రోజూ వేలమంది వస్తుంటారు. అందర్నీ కనిపెట్టి చూడడం సాధ్యం కాని పని. వారిలో ఓ అయిదు వందల మందిని ఓ మోస్తరుగా, ఓ వందమందిని జాగ్రత్తగా, ఓ ఇరవై మందిని దగ్గర వుండి చూసుకుంటే ఏ మాటా రాకుండా ఉద్యోగ కాలం పూర్తి చేసుకోవచ్చు. దర్సనాలకు ఇక్కడ ఎంత ప్రాధాన్యత వుందంటే ఓ పెద్ద అధికారే స్వయంగా ఈ పనులన్నీ పర్యవేక్షిస్తారు అంటే అర్ధం చేసుకోండి”
ఆయన మాటల్లో కొంత ఉత్ప్రేక్ష ఉండవచ్చు, కానీ నిజం లేకపోలేదు.
ఇదంతా కొండమీద సంగతులు. దిగితే మరింత దిగులు, బుగులు పుట్టే పరిస్థితులు..
ఇప్పటికి స్వస్తి.
(26-09-2022)

24, సెప్టెంబర్ 2022, శనివారం

సిఫారసు లేని దర్శనం మహా భేషుగ్గా జరిగింది. అయితే....

 


మనం ఎన్ని పాట్లుపడి ముందస్తు ఏర్పాట్లు చేసుకుని తిరుమల వెళ్ళినా మనకు ఎలాంటి  దర్శనం రాసిపెట్టి వుందో అదే  స్వామి అనుగ్రహిస్తాడని పీవీ ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో రాసారు.  అంచేత తిరుపతి విమానం ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకుంది అదే సులభతరమైన మంచి దర్శన భాగ్యం కలిగించమని. గత బుధవారం నాడు మిత్రుడు సూర్య కలిసినప్పుడు తిరుపతి అంశం ప్రస్తావనకు వచ్చింది.

మీరు వస్తాను అంటే నేను రెడీ. అయితే ఒకే ఒక్క షరతు.

దర్శనం, వసతి ఇలా ఏ విషయంలోనూ ఎవరి సిఫారసు కోరవద్దు. ఆడవాళ్ళతో ప్రయాణం కాదు కాబట్టి ఎలాగో సర్దుకుపోదాం

ఈ మధ్య ఎవరో చెప్పారు. ఆన్ లైన్లో శ్రీ వాణి ట్రస్టు టిక్కెట్లు కొంటే దర్శనం అకామడేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారని.

ఇదేదో బాగుందనుకుని  మర్నాడే చెరి పదివేల అయిదు వందలు, వసతి కోసం వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ కింద మరో వెయ్యి చెల్లించి యాత్రకు కావాల్సిన రెండు ప్రధాన అంశాలపై ఎవరి మీద దేనికి ఆధారపడే అవకాశం లేకుండా చూసుకున్నాము.  

శ్రీ వాణి (Sri Venkateswara Aalaya Nirmana) ట్రస్టు టిక్కెట్లు కనుక స్వామివారి మూల విరాట్ వున్న గర్భాలయం గడప వరకు వెళ్లి దర్శనం చేసుకున్నాము. తోపులాటలు, నెట్టడాలు, వగైరాలు లేవు.  విగ్రహం ముందు నిలబెట్టి శఠారి ఇచ్చారు. స్వామి ప్రసాదం అంటూ ఒక పండు చేతిలో పెట్టారు. బయటకి వచ్చి వెలుతురులో చూస్తే అదో చిన్న సైజు  బత్తాయి కాయ. మహా ప్రసాదం అనుకున్నాము. ఆ దేవదేవుడు నా  వేడుకోలు చెవిన పెట్టాడు అని సంతోష పడ్డాను.




సులభంగా చక్కటి దర్శనం అయితే అయింది కానీ, ఆ తర్వాత పట్టపగలే చుక్కలు చూపించారు దేవస్థానం వారు. ఆ ప్రయాస ఇంతా అంతా కాదు. ఆ దెబ్బకు హైదరాబాదు వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు మంచానికి అంటుకు పోయాను. కరోనా ముమ్మరంగా ఉన్నరోజుల్లో కూడా జిర్రున చీది ఎరుగని నేను ఈ తిరుపతి యాత్రలో పడిన ప్రయాసకు వడదెబ్బ తగిలి అడ్డం పడ్డాను. అందుకే రోజూ పోస్టుల మీద పోస్టులు పెట్టే వాడిని రెండు మూడు రోజులుగా కంప్యూటర్ ముందు కూచోలేక పోయాను.

“దర్శనం భేషుగ్గా జరిగింది, అయితే....” అని శీర్షిక పెట్టడానికి కారణం ఏమిటన్నది  మరో పోస్టు పెడతాను.

అయితే ఆ చెప్పబోయేది అంతా దేవస్థానం ఉన్నతాధికారుల కోసం. వాళ్ళు చూస్తారా లేదా అనేది నాకు అనవసరం.

“మంచి దర్శనం ఇప్పించు స్వామి” అనే నా మొర ఆ దేవదేవుడే విన్నాడు.  అధికారులు పట్టించుకున్నా లేకపోయినా నేను పట్టించుకోను.

ధర్మారెడ్డి గారు! ఓసారి నాతొ వస్తారా అక్కడ పరిస్త్తితులు ఎలా వున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ పోస్టు ద్వారా.

(24-09-2022)  

   

      

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)

 


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

కొన్నేళ్ళ క్రితం ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.



(NOTE: Image Courtesy: RotteneCARDS)

 

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

 

“ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!
“ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
“నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
“నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
“ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
"మూడేళ్ళుగా చూస్తున్నా నీ పిచ్చిరాతలు. ఇప్పుడు చెబుతున్నా విను.
“నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
“పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు. గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు. ఏ ప్యాంటుపై ఏ కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
“ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
“ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ బాధ క్రమంగా తగ్గిపోతోంది.
“మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”


(భండారు నిర్మలాదేవి)


నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

అందరు చేస్తున్నది అదే! - భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha daily today Sunday 18-09-2022)

కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్ శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగరాసిన రాజాజీ మహాభారతంలో కృష్ణ భగవానుడి నోటివెంట వెలువడిన మాటల్లో మంచివాళ్ల మౌనం గురించిన ప్రసక్తి వుంది.
(“Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence”)
స్వేచ్చానువాదం చేస్తే, రాజాజీ రాసిన ఆంగ్ల వాక్యాలకు తెలుగులో భావం దగ్గర దగ్గరగా ఇలా వుంటుంది.
“అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒక రకంగా లాలూచీనే.
లాలూచీ అంటే దగా
దగా అంటే పాపం
పాపం శిక్షార్హం”
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధనుంజయ ధనుర్విముక్త శస్త్రాలతో తీవ్రంగా గాయపడి, మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప, ఇచ్చామరణం అనే వరం ఉన్న కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపిన భీష్ముడు ఎనలేని మనోవేదనతో కుమిలిపోయిన సందర్భాన్ని రాజాజీ ఇలా అభివర్ణిస్తారు.
“తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
“ఇలాంటి నాకేల ఈ దుస్తితి?
“పగలల్లా రణన్నినాదాలు. చతురంగబలాల ప్రళయ భీకర గర్జనలు. పొద్దువాలే సమయంకల్లా నాటి యుద్ధ పరిసమాప్తి. వల్లకాడులా మారిన రణభూమిలో ఎల్లెడలా శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు, తమ ప్రాణాలు కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. అసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
ఒళ్ళు జలదరించే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ, నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
“కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధివీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?”
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే పైన రాసిన వాక్యాలు.
“ధృతరాష్ట్రుడి నిండుకొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో, తనను కాపాడమని ఆ అబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే మీరు సర్వధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచిదో, ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వశక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
సరే! ఇది మహాభారత కాలం నాటి కృష్ణ ఉవాచ.
ఈనాడు కూడా సమాజంలోని అనేక వర్గాల్లో ఈ విషయంపై విస్తృత చర్చే జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ముఖ్యంగా మేధావులు అనే బుద్ధిజీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించక పోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే వారు సమాజంలో చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ విమర్శలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం అధికారులకు, సిబ్బందికి సమకూర్చే ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
తప్పును తప్పు అని చెప్పాలి అంటే అలాంటి తప్పు చేయనివాడు అయివుంటేనే ఆ చెప్పినదానికి సాధికారికత, విశ్వసనీయత వుంటాయి. అందరూ అవే తప్పులు చేసేవారే అయితే ఇక తప్పొప్పులు చెప్పేదెవరు?
గతంలో పత్రికలు కొంతవరకు ఈ తీర్పరి పాత్ర పోషించేవి. సంపాదకీయ వ్యాఖ్యలకు చాలా విలువ వుండేది. ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు సయితం పత్రికల వార్తలకు, సలహాలకు, సూచనలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చేవారు.
మీడియా రంగప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్తలకు కూడా రంగూ రుచీ వాసనా వచ్చేసాయి.
వార్తకు ప్రాణం పొయ్యడం కంటే తమ మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు, మీడియా ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు, స్వేచ్చకు అర్ధమే పూర్తిగా మారిపోతుంది. అదే జరుగుతోంది.
మేధావులు, బుద్ధిజీవులు, మంచివాళ్ళు ఏ పేరుతో పిలిస్తేనేమి, అయితేనేం, వాళ్ళు వర్తమాన సామాజిక అంశాల పట్ల తగు విధంగా స్పందించకపోవడానికి ప్రధాన కారణం వారిలో ఎంతోకొంత నైతిక బలం కొరవడడం ఒక కారణం అయితే, మంచి చెప్పి మాటలు పడడం కంటే, నాడు కురుసభలో భీష్మాదుల మాదిరిగా మౌనాన్ని ఆశ్రయించడం మంచిదనే భావన ప్రబలడం మరో కారణం.
ఉపశృతి:
పక్కవారు చేస్తేనే దుర్వినియోగం అనడానికి ఓ చిన్న జోక్ చెప్పుకుందాం.
గుండె గుభిల్లుమనేలా ఫోను బిల్లు వచ్చింది. నెలనెలా పెరిగిపోతున్న ఫోను బిల్లు గురించి మాట్లాడడానికి ఇంట్లోవున్న నలుగుర్నీ పిలిచాడు ఇంటి యజమాని.
తండ్రి: ఇంతంత బిల్లులు వస్తే ఎలా? నన్ను చూడండి. నేను ఆఫీసులో ఫోను తప్ప ఇంట్లో ఫోనే వాడను. మరి ఇది ఎవరి పని?
భార్య: పగలల్లా నేనూ ఆఫీసులోనే కదా వుండేది. నేనూ మీలాగే అక్కడకిపోయే ఫోన్లు చేస్తుంటాను.
కొడుకు: ఇంటి ఫోను ముట్టుకునే అవసరం నాకేమిటి? నాకు కంపెనీ ఇచ్చిన మొబైల్ వుంది.
పనిపిల్ల: అందరం చేస్తున్నది అదే కదా. ఇక గొడవెందుకు?
(పనిపిల్లకు పనిచేసే ఇల్లే ఆఫీసు కదా!)





(18-09-2022)

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇదో కళ.....

 ఇందులో నిష్ణాతులకు ఆస్కార్ ఇవ్వాలి. ఒకరు రాసినదానిని తమ పేరుతొ తిరిగి పోస్ట్ చేసుకోవడం ఒక తీరయితే, తమ భావాలకు పెద్దల పేరు తగిలించి వారి కొటేషన్లుగా పోస్ట్ చేయడం ఇంకో తంతు.

దీనికి పేరడీ ఈ కింది చిత్రం. అబ్రహంలింకన్ కాలం నాటికి ఇంటర్నెట్ లేదు. అయినా దాన్ని గురించి ఆయన గారు చెప్పారంటూ ఒక కొటేషన్ ఇవ్వడం నేటి పెడ ధోరణులకు అద్దం పడుతోంది. దీన్ని చూసయినా 'కాపీ, పేస్టు, ఫార్వార్డ్ ' బాపతు వాళ్ళ తీరు మారుతుందా అంటే అనుమానమే.



 

చెయ్యి తీస్తాను అన్ననోటితో క్షమాపణ చెప్పిన రోశయ్య

 

 

ఉప్పూ కారం తినే వాడికి కోపం రావడం సహజం. అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి వాడు అలిగితే ఏమి జరుగుతుందో కృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. అలాగే ఒకసారి రోశయ్య గారెకి కూడా కోపం వచ్చింది. అదీ నిండు శాసన సభలో. ఎప్పుడూ చమత్కారాలు రాలుతుండే ఆయన నోటి వెంట పరుష పదజాలాలు దొర్లడం చూసి ప్రెస్ గేలరీలో ఉన్న పాత్రికేయులు సయితం అవాక్కయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీడీపీ సభ్యుడు శ్రీ గాలి ముద్దు కృష్ణమ నాయుడి వైఖరి పట్ల .రోశయ్య గారెకి అసహనం కలిగింది. అది ఆగ్రహంగా మారింది. తీవ్ర పదజాలం వాడారు. బహుశా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శ్రీ రోశయ్య సంయమనం కోల్పోయి మాట్లాడడం ఇదే ప్రధమం కావచ్చు. ఆ రోజు సభలో ముద్దుకృష్ణమ నాయుడిని ఉద్దేశించి ఆవేశంతో ఊగిపోతూ ఆయన ఇలా అన్నారు:

“ఏమిటా గద్దింపులు? నువ్వు పెద్ద మగాడివా!  ఏమిటా చెయ్యి? చెయ్యి తీస్తాను జాగ్రత్త! ఏమనుకుంటున్నావో!”

తర్వాత తాను అన్న మాటలకు ఆయనే సభలో క్షమాపణ చెప్పారు.

“నా కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం తగ్గిపోతుందని నాక్కూడా భావన కలిగింది. నేను ఇరవై ఎనిమిదో తారీకున మాట్లాడుతూ, గౌరవనీయులు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్ డ్రా చేసుకుంటున్నాను. నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను”      

ఒకప్పుడు ఇలా ఉండేవి శాసన సభలు


శ్రీ రోశయ్యతో రచయిత)


(15-09-2022)

 

Video LINK:

https://youtu.be/hC9GdIctEKE

 


12, సెప్టెంబర్ 2022, సోమవారం

యాదాద్రి నిర్మాణం ఓ అద్భుతం

 ఆధునిక హంగులతో పురాతన నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న యాదాద్రి దేవాలయం నిజంగా ఒక అద్భుతం.

పునర్నిర్మించిన ఈ గుడి గురించి పత్రికల్లో చదవడం, టీవీల్లో చూడడం తప్పిస్తే కళ్ళారా చూసింది లేదు. గతంలో ఎన్నోసార్లు దర్శించుకున్న యాదగిరిగుట్ట దేవాలయమే మనసులో ముద్ర పడిపోయిన కారణం కావచ్చు,  ఈరోజు ఆ దేవళం  ముందు నిలబడి చూస్తుంటే ఇంత గొప్ప గుడిని ఇంత స్వల్ప కాలంలో ఎలా కట్టారా అని ఆశ్చర్యం వేసింది.

మా మనుమరాలు జీవిక పుట్టు వెంట్రులకు తీయించడం కోసం ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట  వెళ్ళాము. మిత్రుడు జ్వాలా మాట సాయం బాగా అక్కరకు వచ్చింది. ఏ గుడికి పోయేవారు అయినా మనసులో  బలంగా కోరుకునే మంచి దైవ  దర్శనం లభించింది. ఈ విషయంలో సహకరించిన దేవాలయం అధికారులు శ్రీయుతులు రాజు, రామప్రసాదరెడ్డి, మహేష్, శంకర్ లకు ధన్యవాదాలు.   

ఎనిమిది నెలల పిల్లకు వెంట్రుకలు తీయించడం ఎలా అని మధన పడిన మాట వాస్తవం. అయితే దేవస్థానం వారి క్షురకుడు ఎంతో నైపుణ్యంగా ఆ పని ఇట్టే పూర్తి చేశాడు. ఏడ్చి గోల చేస్తుందేమో అనుకుంటే ఆ యావత్తు కార్యక్రమాన్ని జీవిక ఆనందంగా ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించింది.

పీవీఆర్కే గారు అన్నట్టు నాహం కర్తా. అంతా ఆ భగవంతుడి లీలావిలాసం.   














(12-09-2022)

11, సెప్టెంబర్ 2022, ఆదివారం

అమెరికా ఉలిక్కిపడ్డ రోజు – భండారు శ్రీనివాసరావు

 

(Published in Mana Telangana today 11-09-2022, Sunday)


భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001 సెప్టెంబర్ పదకొండవ తేదీన, భయంతో బివ్వేరపోవడం యావత్ ప్రపంచం తొలిసారిగా ఆశ్చర్యపోతూ గమనించింది. 

అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధి చెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ, ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.

అలాంటి దేశంపై ఇటీవలి కాలంలో మొట్టమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన జరిగింది. అమెరికాకు గర్వకారణంగా నిలచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో డీకొట్టి కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి. 

ఈ దాడితో బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు తీసుకుంది. ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు కూడా.

కాగా, అమెరికన్ ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని సముద్ర జలాల్లో ముంచేసి, అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న దృశ్యాలను ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.

అప్పటిదాకా ప్రపంచంలో అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం ఎంత ప్రమాదకరమో అన్నది అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది. 

అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంత గోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపు, లేదా చచ్చిపో’ అనే రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.

ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం ఉగ్రవాదులకు ఉన్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం. అధిక సంఖ్యలో వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం.

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.

కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.

వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు




తలకెక్కని చరిత్ర పాఠాలు – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Jyothi today, 11-09-2022, SUNDAY)


9-11

తొమ్మిదో నెల, పదకొండో తేదీని సూచించే ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే  రెండు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా 2001 సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచి పోలేకుండా వున్నారు. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు ఈనాటికీ కదలాడుతూనేవున్నాయి. 

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబసభ్యులు, ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి, తమనే కబళించడానికి వచ్చిన తరువాత కానీ ఆ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కానీ ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే వుంది. ఉగ్రవాద భూతపు వికృత పోకడలు అడ్డుకట్ట లేకుండా అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే వున్నాయి. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.

సెప్టెంబర్ దాడి గురించి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని తాను ప్రయాణిస్తున్న విమానంతోనే డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. 1968 సెప్టెంబర్ లో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి బహుశా ఆ నెలలోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు. 

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు. విడుదల అవుతానన్న ఆశ ఏకోశానా లేకుండా ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్న అత్తా, అమెరికా పూనిక కారణంగానే విడుదల అయ్యాడు. అలా బయట పడ్డవాడే తదనంతర కాలంలో అమెరికా కలలో ఊహించని విధ్వంసానికి కారకుడయ్యాడు. చరిత్రలో అప్పుడప్పుడూ ఇలాటి విడ్డూరాలు నమోదవుతూవుంటాయి. 

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

2001లో అమెరికాలో ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ దేశంతో పాటు, ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ వ్యవధిలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

గతంలో హైదరాబాదులో, ముంబైలో, ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతోనే సరిపుచ్చుకోరు.

సెప్టెంబరు తొమ్మిదో తేదీని గుర్తుంచుకుని ఆ దుర్ఘటనను తలచుకోవడం ఒక్కటే కాదు, మళ్ళీ అలాంటి దుర్దినాలు పునరావృతం కాకుండా ఏం చేయాలో కూడా ఆలోచించుకుంటారు.

అటువంటి రాజకీయ నాయకులు ఈనాడు క్రమంగా కనుమరుగవుతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటూ తొడగొట్టేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది మరో విషాదం




ఎట్టకేలకు జనం మధ్యకు రాహుల్ గాంధి

 (Published in Andhra Prabha today. 11-09-2022, Sunday)

 

‘ఈ యాత్ర వల్ల రాహుల్ గాంధీకి వ్యక్తిగతమైన లబ్ది చేకూరుతుందా?’

ఒక టీవీ విలేకరి నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఈ ప్రశ్న కొంత ఆలోచింప చేసింది. ఇలాంటి పాదయాత్రల వల్ల ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చి లాభపడిన సందర్భాలు గతంలో వున్నాయి. అయితే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి  లభించే లాభం ఏమిటి?

సాధారణంగా కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేది వాడుక. అయితే, ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు. అంటే ఏమిటన్న మాట. కింది నుంచి పైకి.

జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం చాలా దిగజారివుంది.  ఆ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధి ప్రతిష్ఠ కూడా అధమాధమంగానే  వుందని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. అనడమే కాదు, గులాం నబి ఆజాద్ వంటి సీనియర్లు కూడా పార్టీ విడిచి వెడుతూ కొంత  బురదను రాహుల్ గాంధీపై చల్లి వెడుతున్నారు. అందుకే కాబోలు అడుగంటుతున్న వ్యక్తిగత ప్రతిష్టను అట్టడుగునుంచి పైకి తెచ్చుకుంటున్నసంగతి తెలియచెప్పే సంకేతంలా కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు ఈ యాత్ర తలపెట్టారని అనుకోవాలి. యాత్రాఫలం సిద్ధిస్తే అది రాహుల్ కు వ్యక్తిగత లబ్ది కిందికే వస్తుంది కదా!  యాత్రాఫలం అంటే కేంద్రంలో అధికార అందలం దక్కడం అనే అర్ధం కాదు. ఒక నాయకుడిగా తన ప్రతిష్టను పెంచుకోవడం, సమర్థతను నిరూపించుకోవడం.  

కాంగ్రెస్ పార్టీలో మేధావులకు కొరత లేదు. వాళ్ళ మేధాశక్తి పట్ల సందేహాలు పెట్టుకోనక్కరలేదు కానీ వారికి  అట్టడుగు గ్రామ స్థాయిలో పరిస్థితులు, వాస్తవాలు తెలియవన్న సంగతి ఇప్పటికే అనేకసార్లు రుజువయింది. అయితే ఈ భారత్ జోడో యాత్ర అనే ఆయుధాన్ని రాహుల్ చేతిలో పెట్ట్డడం మాత్రం వారి మేధస్సుకు మచ్చుతునక అనే  చెప్పాలి.

ఈ యాత్ర సందర్భంగా రాహుల్ 3570 కిలోమీటర్లు నడుస్తారు. పన్నెండు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో  రాహుల్ కాలినడకన తిరుగుతారు. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలని కలుసుకుంటారు. ఈ నెల ఏడో తేదీన కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర   సుమారు అయిదు మాసాలు కొనసాగుతుందని చెబుతున్నారు. అన్ని రోజులు దేశంలోని ఆయా ప్రాంతాల్లో రాహుల్ వార్తల లోని వ్యక్తిగా వుంటారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి  ఒక రకంగా ఇది రాజకీయంగా లాభదాయకమే.

కాంగ్రెస్ పార్టీది అనువంశిక పాలన అనేది ప్రత్యర్థులు చేసే ప్రధాన అభియోగం. అలాగే నెహ్రూ గాంధి వారసులుగా దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి  ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఒక పావులా వాడుకుంటోందని అంటుంటారు. అయితే సోనియా, రాహుల్ వీరిద్దరికీ తీరని అధికారదాహం ఉందనే  ఆరోపణలు నిజానికి నిజం కావు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని పదవిని సోనియా వదులుకున్నారు. అవకాశం రాకపోయినా, అవకాశం కల్పించుకుని  ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని అవకాశాలు సిద్ధాన్నంలా ఎదురుగా ఉన్నప్పటికీ  రాహుల్ అప్పట్లో అందుకు సుముఖత చూపలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఆయనది అదే తీరు. వచ్చే అక్టోబరులో కాంగ్రెస్ అధక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర తలపెట్టడం ద్వారా, పార్టీ అధ్యక్ష పదవిపై తనకు మక్కువ లేదని  మరోసారి పరోక్షంగా చెప్పదలచుకున్నారేమో తెలియదు. లేదా సమర్ధత నిరూపించుకున్న తర్వాతనే పదవిని కోరుకోవాలనే బలమైన పట్టుదల ఆయన చేత ఈ యాత్ర చేయిస్తున్నదేమో తెలియదు.      

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే,  చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది. 


ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. యువకుడు కాబట్టి కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించగలుగుతారని భావించవచ్చు. 

ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. 

ప్రజల ఇబ్బందులను, కడగండ్లను దగ్గరనుంచి కళ్ళారా చూడగలిగే అరుదైన  అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే యాత్రా ఫలసిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. 

2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు పూర్వం చంద్రబాబు ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి శ్ర్రీకాకుళం జిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగిసింది. ఆ ఊరు పేరుకు తగ్గట్టే, మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం,  ఏ పేరుతొ అయితేనేం, నాయకులు తమ  రమ్య హర్మ్య భవనాలు  ఒదిలి, కొద్ది కాలం అయినా సాధారణ ప్రజలతో మమేకం అయ్యే వీలు వీటితో  ఏర్పడింది.

రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. ప్రజలు అల్పసంతోషులు కదా!


ఉపశృతి:

‘పులి పులే. మేక మేకే. అయితే..’ ఆగాడు  ఏకాంబరం.

‘ఈ మాట చెప్పడానికి,  అయితే అంటూ ఆ సన్నాయినొక్కులు ఎందుకు? పులి పులే కదా!’ అన్నాడు పీతాంబరం. 

‘తొందరపడకు పీతాంబరం. కొన్ని సందర్భాలలో ఇలా అంటే కుదరదు. పులి మేకలకు నాయకత్వం వహించాలి అంటే మేకలకు ముందు నడవాలి. మేకలను ఎత్తుకుపోదామని చూసేవాళ్ళు పులిని చూసి బెదిరి పారిపోతారు. అదే పులి మేకలకు వెనక నడిస్తే, ఆ మేకల మందను చూసి ఎవరూ భయపడరు. కాబట్టి నాయకుడు అన్నవాడు పులి మాదిరిగా అనుచరులకు ముందు నడవాలి. ముందుండి నడపాలి.  వెనక వుంటానంటే కుదరదు. వెనక వుంటే పులి కూడా మేక మాదిరే.’