25, సెప్టెంబర్ 2022, ఆదివారం

జనారణ్య రోదనం – భండారు శ్రీనివాసరావు

దర్శనం అద్భుతం అనుభవం దుస్తరం

అందరి అనుభవాలు ఒకే రీతిన వుండవు. ఇది నా అనుభవం మాత్రమే.
సామాన్యులకు పెద్ద సమస్యలు అనిపించే వాటికి కూడా చిరు పరిష్కారాలు వుంటాయి. వాటిని వివరించడమే కాని విమర్శించడం కాదు ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
తిరుమల ప్రయాణం పెట్టుకునే చాలామంది సాధారణ భక్తులకు శ్రీవాణి (SRI VENKATESWARA AALAYA NIRMAANAM) ట్రస్ట్ టికెట్ కొనడం భారమే. ( Rs. 10000/- per head plus Rs 500/- for Darshanam). కాదనను. అయినా ఎవరి మీదా ఆధార పడకుండా, సిఫారసు లేఖల కోసం ఎవరిని దేబిరించకుండా హాయిగా స్వామి దర్శనం చేసుకుని రావాలని కోరుకునే వారికి ఈ పధకం బాగానే ఉపయోగపడుతుంది. ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే ఖామందులకు, డబ్బు లేకపోయినా దానిని మించిన పలుకుబడి కలిగినవారికి ఎటు తిరిగీ వాళ్ళ దర్శన మార్గాలు వేరేగా వుంటాయి. ( నేనూ ఉద్యోగపర్వంలో ఆ బాటన నడిచి దర్జాగా దర్శనం చేసుకుని వచ్చిన వాడినే) ఆ మాత్రం స్థాయిలో కాకపోయినా తగు స్థాయిలో సుఖప్రదమైన దర్శనం కోరుకునేవారికి మాత్రం శ్రీవాణి పధకం గొప్ప వరప్రసాదం అనే చెప్పాలి. ఇది పెద్ద ప్లస్ పాయింటు. విదేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ తలితండ్రులకు దైవ దర్శనం చేయించాలని కోరుకునేవారు చాలామంది వుంటారు. అలాటి వారికి కూడా ఇది ఉపయోగమే. ట్రస్ట్ పెట్టి నాలుగేళ్లు అయినా, పేరు చూసి ఇదేదో ప్రైవేటు వ్యవహారం అని సందేహిస్తున్న వాళ్ళు ఇంకా మిగిలి ఉండడానికి ప్రధాన కారణం కూడా ఈ కుశంకే. ఆది నుంచి ఈ పధకానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన మొదటి వంద రోజుల్లోనే నలభయ్ కోట్ల రూపాయలు టీటీడీ ఖజానాకు జమ పడ్డాయంటే జనాదరణ ఏ స్థాయిలో వుందో అంచనా వేసుకోవచ్చు. టీటీడీకి విరాళాల వరద, భక్తులకు సులభ దర్శనాల వెల్లువ. (బహుశా ఉభయతారకంగా వుంటుంది అనుకుని అధికారులు ఆలయ నిర్మాణ నిధి విరాళాలను సులభ దర్శనం టిక్కెట్టుతో ముడి పెట్టారేమో తెలియదు)
సరే! ఇంతకుముందు పోస్టులో చెప్పినట్టు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు కొనడానికి నాకున్న కారణం, సిఫారసు లేకుండా శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవాలనే ప్రగాఢమైన ఆకాంక్ష. అయితే ఈ ఆన్ లైన్ బుకింగ్ లో అకామడేషన్ విషయంలో మాత్రం యాత్రీకులకు చాయిస్ లేకుండా చేశారు. మాతృశ్రీ వకుళాదేవి గెస్ట్ హౌస్ ఒక్కటే చాయిస్ కంప్యూటర్ చూపెట్టింది. నాన్ ఏసీ, విత్ ఫాన్ అని వుంది. సరే హైదరాబాద్ వెదర్ ప్రకారం బేరీజు వేసుకుని ఒక్క రాత్రే కదా, సర్దుకుపోదాం మళ్ళీ దీనికోసం ఎవరినో ఆశ్రయించడం దేనికని అక్కడే బుక్ చేసుకున్నాం. అమ్మయ్య! ముఖ్యమైన పనులు రెండు పూర్తయ్యాయి. పోగానే ఉండడానికి రూమ్ వుంది, నేరుగా దర్శనం చేయించే టిక్కెట్టు చేతిలో వుంది అనుకుని చలో తిరుమల అంటూ వెళ్ళాము. సిఫారసు లేకుండా దర్శనం చేసుకు రావాలనే మా కోరికను స్వామి తీరుస్తున్నాడని సంబర పడ్డాము.
Report at ARP Counter , CRO, Tirumala అని కంప్యూటర్ రసీదులో వుంది. Internet Allotment Center అని కూడా అందులోనే వుంది. కొండ చేరుకున్న తర్వాత ఈ సదసంశయం తీర్చుకోవడానికి రెండు చోట్లకు ఉసూరుమంటూ వెళ్ళాము. చలిగా వుంటుంది అనుకుంటే ఎండ దంచుతోంది. అన్నీ పాత బిల్డింగులు. రంగులు వెలిసి వున్నాయి. కూచోడానికి జాగా లేదు. టోకెన్ పద్దతి లేదు. (ఏదో చిన్న చిన్న విషయాలు అని వదిలేయకుండా పెద్ద మనసుతో పట్టించుకుంటే టీటీడీకి శోభస్కరంగా వుంటుంది) మొత్తం మీద ఆధార్ లు అన్నీ సరి చూసుకుని గెస్ట్ హౌస్ కి పొమ్మన్నారు. మళ్ళీ చాలా దూరం పోవాలి. తప్పదు కదా! పోయాము. అక్కడ అన్నీ మళ్ళీ పరీక్షించి గది తాళం చెవి చేతిలో పెట్టారు. ఇక్కడే అధికారులు కొంచెం యాత్రీకుల కష్ట సుఖాలు గురించి ఆలోచించాలి. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించిన తర్వాత పలానా గెస్ట్ హౌస్ అని టీటీడీ వాళ్ళే నిర్ణయించిన తర్వాత కూడా ఇన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం ఏమిటి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో వున్నప్పుడు అలాట్ చేసిన చోటుకే నేరుగా వెళ్లి బస చేసే ఏర్పాటు చేయాలి అంటే ఏమైనా ఆడిట్ అభ్యంతరాలు ఉంటాయా! దీనివల్ల ప్రయాస, సమయం వృధా తప్పిస్తే వేరే ఉపయోగం ఏముంటుంది? ఈ మధ్య ముఖేష్ అంబానీ మహాశయులు శ్రీవారి దర్సనానికి తిరుమల వచ్చినప్పుడు ఈ విషయం ఆయన చెవిన వేసి వుంటే దేవస్థానం నెట్ వర్క్ యావత్తు గుప్పెట్లోకి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి ఉండేవాడు.
అందరూ శ్రీవాణి దర్శనం అని వాడుకగా అంటున్నారు కానీ దీని పేరు Beginning Break Darshan. ప్రోటోకాల్ దర్శన్ కు, వీ.ఐ.పీ బ్రేక్ దర్శన్ కు మధ్య అన్నమాట. Report at VQC 1 (Vaikuntham Q Complex) at 6 AM అని వుంది. పర్వాలేదు, మరీ హడావిడిగా తెల్లవారుఝామునే లేవనక్కరలేదు. వాళ్ళు ఆరు గంటలు అన్నారు కానీ, ఎందుకైనా మంచిదనుకుని స్నానాలు అవీ పూర్తి చేసుకుని, నిబంధనల ప్రకారం మొబైల్స్ తీసుకుపోకుండా, ఓ అరగంట ముందుగానే VQC చేరుకున్నాము. అటు కాదు మరో వైపు అన్నారు అక్కడి వారు. మరి టిక్కెట్టులో అలా లేదు కదా అంటే, వింటున్నారా ధర్మారెడ్డి గారు, ఇక్కడ రాత్రికి రాత్రి మార్పులు చేస్తూ పై నుంచి ఆర్డర్లు వస్తాయి, వాటిని చచ్చినట్టు మేము అమలు చేయాలి అని జవాబు. సహజంగా ప్రతి సంస్థలోను ఉండేదే. పై వారికీ కింది వారికీ మధ్య వుండే పొరపొచ్చాలు అప్పుడప్పుడూ ఇలా బయట పడుతుంటాయి. మార్పులు చేయాలి అనుకున్నప్పుడు trial and error method ప్రాతిపదిక మీద చేయడం అసహజం ఏమీ కాదు, కానీ ఆ మార్పు గురించి భక్తులకు ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేయడానికి టీటీడీ మీద పడే భారం ఎక్కువేమీ వుండదు.
అతడు చూపెట్టిన వైపుగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము. చాలాసేపటి తర్వాత మా క్యూ లైన్ ను రెండు వైపులా ఇనుప జాలీలు వున్న మరో క్యూ లైన్లో కలిపారు. గతంలో అనేక సార్లు తిరుమల వెళ్లాను కానీ ఆ మార్గంలో ఎన్నడూ వెళ్ళలేదు. కొంతదూరం పరుగులాంటి నడక. మరికొంత సేపు ఎందుకు ఆగామో తెలియకుండా ఆగి నిలబడడం. ఇలా ఎంతసేపో తెలియదు. అసలు మేము వెడుతున్నది శ్రీవాణి టిక్కెట్టు మార్గంలోనేనా అనే సందేహం కలిగింది కానీ మా ముందూ వెనకా వున్నవాళ్ళు సరైన తోవలోనే వెడుతున్నట్టు ధ్రువపరిచారు. మా ముందు వున్నవాళ్ళు బాగా వయసు మళ్ళిన దంపతులు. ఆ దారి మధ్యలో అక్కడక్కడా చెక్క స్పీడ్ బ్రేకర్లు. వాటిని మెట్లు అనుకోవాలి. మెట్టు వున్నది జాగ్రత్త అనే హెచ్చరిక సూచికలు లేవు. అనుకున్నట్టే మా ముందు వెడుతున్న ముసలమ్మ గారు తన ముందు వున్న మెట్టు గమనించక తూలిపడింది. ఆవిడ ఒడిలో పదిలంగా పెట్టుకున్న ముడుపుల మూట కూడా ఎగిరి పడింది. అదృష్టవశాత్తు అందులో నాణేలు చెల్లా చెదురుగా పడలేదు. వాళ్ల పిల్లలు అమెరికాలో వుంటారట. శ్రీవాణి ట్రస్ట్ గురించి తెలుసుకుని అక్కడినుంచే రానూపోనూ విమానం టిక్కెట్లు, వసతి, దర్శనం టిక్కెట్లు, స్థానికంగా తిరగడానికి వెహికిల్ బుకింగ్ అన్నీ చేశారట. అంతకు ముందు శ్రీవాణి దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్పిన విషయాలు విని ఈ ఏర్పాట్లు చేశారట. ‘కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వేరుగా వుంది, ఇంతంత దూరాలు నడవాల్సి వస్తుందని అనుకోలేదు’ అన్నది ఆవిడ. (టీటీడీ అధికారులు ఒక చిన్న పని చేయడం ద్వారా ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. ముందు ప్రోటోకాల్, తర్వాత శ్రీవాణి, ఆ తర్వాత వీఐపీ బ్రేక్. ఏరోజున ఎంతమంది అనేది ముందుగానే సమాచారం వుంటుంది. ఈ దర్శనాలకు వెళ్ళేవారిని పలానా టైముకు రిపోర్ట్ చేయమనే బదులు ఈ విభాగాల వాళ్లు, వాళ్లకు వీలైన సమయంలో ముందుగానే వచ్చి వేచి ఉండడానికి వీలుగా, గేలరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా కూర్చొన్న వారిని ఎవరి టైముకు వారిని అక్కడ నుంచి మహాద్వారం వైపు తీసుకువెళ్లవచ్చు. ఇదేమీ కొత్త పద్దతి కాదు. వీఐపి బ్రేక్ దర్శనానికి ఇలాంటి ఏర్పాట్లు ఇప్పటికే వున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా అన్ని వేళల్లో పనిచేసే సిబ్బందికి ఇబ్బంది కదా అనే వాదన ఈ కాలంలో వర్తించదు. అలా అనుకుంటే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు మూసేసుకోవాలి. ఎంతసేపో అన్నది తెలియకుండా బాగా వయసుమళ్ళిన వాళ్లు అంతసేపు క్యూ లైన్లో నిలబడే వుండాలి అంటే మహా దుస్తరంగా వుంటుంది. ఈ ఏర్పాటు కూడా పెద్ద ఖర్చులేని పనే. కావాల్సింది యాత్రీకులకు సాధ్యమైనంత ఎక్కువ సదుపాయాలు కల్పించాలనే సంకల్పం మాత్రమే.
మహాద్వారం దగ్గరనుంచి మా క్యూ కదలికలో పరిస్థితి వేగంగా మెరుగుపడింది. ధ్వజస్తంభాన్ని తాకి దణ్ణం పెట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళాము. ఎక్కడా తోపులాటలు లేవు. జరగండి జరగండి అనే అరుపులు లేవు. చక్కగా కోరుకున్నదానికంటే మిన్నగా దర్శనం చేసుకుని బత్తాయి పండు ప్రసాదంతో గుడి బయటకు వచ్చాము.
పదివేల అయిదు వందల రూపాయలు పెట్టి కొనే ఈ టిక్కెట్టుకు ఒక చిన్నయాభయ్ రూపాయల లడ్డు ఇస్తారు. ఇంకా కావాలి అంటే విడిగా కొనుక్కోవాలి. మంచిదే. అయితే ఆ ఒక్క లడ్డు కోసం పడే పాట్లు అధికారులు ఎవరైనా గమనిస్తే అయ్యో ఇన్నాళ్లు మనం ఇంతమందిని ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నామా అని వాళ్ళే జాలిపడతారు.
ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా పెద్ద వయసు వాళ్లు, (శ్రీవాణి పధకం కింద టిక్కెట్లు కొనే వారిలో వారి సంఖ్యే అధికం. వయో వృద్ధుల దర్శన పధకం వుంది కదా అనవచ్చు. వున్నా ఇటువంటి మంచి దర్శనం గేరంటీ ఇవ్వగలరా! లేరు.) కింద కాళ్ళు కాలుతూ పైన నెత్తి మాడుతూ త్వరత్వరగా పరుగెడుతున్నట్టు ఆ ముదుసలులు వెళ్ళే దృశ్యం ఇంతవరకూ ఎవరి కంటా పడలేదు అంటే ఆశ్చర్యమే మరి. పైన పై కప్పు శాశ్వతంగా వేయడానికి టీటీడీకి నిధుల కొరత ఉంటుందని అనుకోను.
ప్రసాదాల విక్రయ కేంద్రం విశాలంగా వుంది. ఉండడానికి అనేక కౌంటర్లు వున్నాయి. ఒక చోట నార సంచులు, ఒక చోట లడ్డూ ప్రసాదం, మరో చోట వడలు ఇలా బోర్డులు చాలా కనిపిస్తాయి. బ్యాగు కౌంటర్ లో సంచీ కొనుక్కుని వెళ్ళే లోపల లడ్డూ కౌంటర్ లో నో స్టాక్ బోర్డు కనపడుతుంది. విడివిడిగా ఇన్ని కౌంటర్ల బదులు అన్ని కౌంటర్లలో అన్నీ అమ్మే విధానం ఎందుకు అమలు చేయరూ అనేది ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాదు. పెద్ద పెద్ద మాల్స్ల్ లో మాదిరిగా కంప్యూటర్ కౌంటర్లు అనేకం పెట్టి ఎవరికీ కావాల్సింది (అందుబాటులో వున్నవి) వాళ్లకు సంచీల ఖరీదుతో సహా వసూలు చేసి మళ్ళీ అలాగే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఎవరు ఎంచుకున్న ప్రసాదం ఎవరిది వారికి పంపిణీ చేసే విధానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా స్తాకులో ఎన్ని లడ్డూలు వున్నాయి అనే డిస ప్లే బోర్డులు పెట్టవచ్చు. ఇక శ్రీవాణి టిక్కెట్టు మీద ఇచ్చే ఒక్క లడ్డూ కోసం ఖాళీగా జనం తక్కువగా వుండే కౌంటర్ కోసం అటూ ఇటూ పరిగెత్తుతూ వుండాలి. ఇది అవసరమా! ఏదో చేసి ఈ ఇబ్బందిని తొలగించలేరా! ఎందుకంటే భక్తులకు దైవ దర్శనం ఎంత ముఖ్యమూ లడ్డూ ప్రసాదం కూడా అంటే ప్రధానం. మరో పని కూడా చేయవచ్చు. శ్రీ వాణి టిక్కెట్టు కొనుక్కున్న వారు ఎక్కడ బస చేశారు అన్నది తెలిసిన విషయమే కనుక ఆ ఒక్క లడ్డు అక్కడే అందచేస్తే వాళ్లు సుఖపడుతూ సంతోషపడతారు. మనల్ని దేవస్థానం వారు గుర్తించి చక్కటి ఏర్పాట్లు చేశారు అని ముచ్చటపడతారు. తమ ఊళ్లలో నలుగురుకీ చెబుతారు. టీటీడీకి ఇది మంచిదేగా!
వీటిలో ఏ సలహా అమలు చేసినా దేవస్థానానికి పెద్దగా ఖర్చయ్యేది వుండదు. ఇక్కడ మరో విషయం గమనంలో వుంచుకోవాలి. ధర్మారెడ్డి గారు సమర్ధుడైన రెవెన్యూ సర్వీసు అధికారి. ఆ సర్వీసులో నేర్పే మొదటి పాఠం పన్నుల వసూళ్ళు ఎలా పెంచడం అనేది. కానీ తిరుమలలో ఆ అవసరం లేదు, రానే రాదు.
తిరుమల వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిధుల కొరత వుండదు. అప్పులు అవసరం పడవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తప్పని ఈ అప్పుల బెడద టీటీడీకి లేదు. ఓడీల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తాల్సిన పని లేదు. ఖర్చు చేయడం ఎలా ప్రశ్న తప్పిస్తే రాబడి గురించిన బెంగ లేదు. ఇలాంటి వెసులుబాటు కలిగి, ప్రభుత్వ అధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇదొక్కటే. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు సైతం ఆర్ధిక సమస్యలతో తల్లడిల్లిపోయాయి. తిరుమల ఆదాయం తగ్గిందేమో కానీ అప్పు చేసే అవసరం రాలేదు. అలా అని దుబారా వ్యయాన్ని సమర్థించడం లేదు. యాత్రీకుల సౌకర్యం కోసం ఏమి చేసినా, ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పు పట్టరు అని చెప్పడానికే ఈ మాటలు.
కాబట్టి శ్రీవాణి అనే కాదు, మొత్తం భక్తులకు మంచి దర్శనం, ఇబ్బందులు లేని, ఇబ్బంది పెట్టని ఏర్పాట్లు చేయండి. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా వుంది. సిఫారసు లేఖల బెడద సగానికి సగం తగ్గిపోతుంది. ఈ విషయం మీ చెవిన వేసేవారు వుండరు. ఎందుకంటే సామాన్య భక్తులు అందరూ అల్పసంతోషులు. గుడి నుంచి బయటకు వచ్చేవారిని కదిపి చూడండి. స్వామి దర్శనం చక్కగా జరిగిందనే చెబుతారు. మీ హయాములో మరిన్ని మంచి పనులు చేయండి. కానీ సామాన్య భక్తులకు ఏదైనా పనికొచ్చేది చేస్తే వాళ్లు దేవుడితో పాటు మిమ్మల్నీ గుర్తు పెట్టుకుంటారు.
ఉపశృతి: గతంలో టీటీడీ ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి ఇలా చెప్పారు.
‘రోజూ వేలమంది వస్తుంటారు. అందర్నీ కనిపెట్టి చూడడం సాధ్యం కాని పని. వారిలో ఓ అయిదు వందల మందిని ఓ మోస్తరుగా, ఓ వందమందిని జాగ్రత్తగా, ఓ ఇరవై మందిని దగ్గర వుండి చూసుకుంటే ఏ మాటా రాకుండా ఉద్యోగ కాలం పూర్తి చేసుకోవచ్చు. దర్సనాలకు ఇక్కడ ఎంత ప్రాధాన్యత వుందంటే ఓ పెద్ద అధికారే స్వయంగా ఈ పనులన్నీ పర్యవేక్షిస్తారు అంటే అర్ధం చేసుకోండి”
ఆయన మాటల్లో కొంత ఉత్ప్రేక్ష ఉండవచ్చు, కానీ నిజం లేకపోలేదు.
ఇదంతా కొండమీద సంగతులు. దిగితే మరింత దిగులు, బుగులు పుట్టే పరిస్థితులు..
ఇప్పటికి స్వస్తి.
(26-09-2022)

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ తీసుకొనే వారి సంఖ్య
పరిమితమే కాబట్టి వారికి ఇచ్చే లడ్డూ క్యూ లోనే లేదా దర్శనం అయి బయటికి రాగానే ఇస్తే బాగుంటుంది. కనీసం ఒక పెద్ద లడ్డూ ఒక వడ ఒక సంచీలో పెట్టి ఇస్తే బాగుంటుంది. పదివేల రూపాయల తిక్కేట్టుకు అలా ఇవ్వడం సముచితంగా ఉంటుంది.

అజ్ఞాత చెప్పారు...

వృద్దులకు చాల మంచి పధకం ఇది.

నేను మొన్నే 300 దర్శనానికి వెళ్లాను , మీరు నమ్మరు , ఇంకో 2 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది , నాకు మోకాలి నొప్పి కూడా. కొత్త ఈవో రావడం , అయన ప్రభావం/అధికారం చూపించడానికి , అంతకు ముందు ఉన్న పద్ధతులు మార్చేయడం. ఇది ప్రతీ శాఖ లో జరిగేదే కానీ, తిరుపతి లాంటి దగ్గర , ముసలివాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బాగున్న పద్ధతులు ఎందుకు మార్చుతారో, ఆ ఇగో ఏంటో దేవుడికే తెలియాలి .

300 టికెట్ పెట్టిన కొత్తలో, క్యూ లైన్ లోనే టికెట్ లు ఇచ్చేవారు, అలానే ఇస్తారేమో అనుకుని ఆ తరువాత సంవత్సరం మా అమ్మ నాన్న లతో వెళితే , కొండ క్రింద తీసుకోవాలి అని చెప్పారు . మాకు ఇంటర్నెట్ లో తీసిన టికెట్స్ ఉన్నాయి , వాళ్లేమో దర్సనం లేకుండా వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది , మొదటి సారి ఇలా జరగడం, చాలా పెద్ద అపశకునంగా భావించారు మా అమ్మ నాన్న .

తిరుపతి ఎప్పుడు వెళ్లినా ఎదో ఒకటి మారుతూనే ఉంటుంది . ఒక్క vip దర్శనాలు తప్పితే .

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అదివో అల్లదివో శ్రీహరివాసము …..

Chiru Dreams చెప్పారు...

జనాలంతా వెళ్ళడం మానేస్తే.. వాళ్ళే దిగివస్తారు.

అజ్ఞాత చెప్పారు...

వింటున్నారా ధర్మారెడ్డి గారు...

అబ్బే మాకు బెమ్మ చెవుడండీ ఏమీ వినపళ్లే :)

ఇంత కష్టాలు అపసోపాలు పడి పోవడానికి బదులు దర్జాగా రెకమెండేషన్ ( మీరు అడిగితే జ్వాలా గారి ద్వారా ఎంతసేపు ? ) తో వెళ్ళి వుండొచ్చు కదండీ ?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మరి రెకమెండేషన్ ద్వారా ఏదో పని చేయించుకోగలిగానని భండారు వారు మొన్నీమధ్యనే ఓ టపాలో వ్రాస్తే …. ఇలా అయితే ఎలాగండీ అంటూ వారిని ప్రశ్నించారే ఓ “అజ్ఞాత” వ్యాఖ్యాత గారు? 🤔🙂

అజ్ఞాత చెప్పారు...

సిఫార్సు అడిగేదెవరు ? ఇచ్చేదెవరండీ ? అంతా ఆ స్వామి వారే కదా ! సుబ్బరంగా రంగా అని సిఫార్సు తో వెళ్లి వుండాల్సింది నాహం కర్తా హరిః కర్తా అని.

ఆ పై ఆ రొక్కం నిజంగానే ఖర్చు చేయాలని అనుకొని వుంటే ఎవరికైనా ( మీ దగ్గర పని చేసే వారికెవరికైనా ) ఆ టిక్కెట్టు కొనిచ్చుంటే వాళ్లూ వెళ్లి గోవిందా గోవిందా అనేవారు కదుటండీ ?

మరో మారు వెళ్లేటప్పుడు ఈ పంథా ఫాలో అయిపోండి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

సిఫారసుతో వెళ్ళినవారు టికెట్ కొనక్కర లేదాండీ? టికెట్ కోసము, వసతి కోసము మాత్రమే సిఫారసు అనుకున్నానే 🤔.

(నిజంగానే నాకు తెలియక అడుగుతున్నాను. నేను తిరుపతికి బహు అరుదుగా వెళ్ళే రకం లెండి …. వెళ్ళొచ్చి కూడా “ఎన్నో యేండ్లు గతించి పోయినవి.”)

అజ్ఞాత చెప్పారు...

Good suggestions. Yes, a lot can be to make the whole experience an excellent one.