26, మార్చి 2014, బుధవారం

పాత కాగితాల్లో దొరికిన పాత గేయాలు


(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ   తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది.  కాలమహిమ కాబోలు. ఏ వొక్క మహిళ అభ్యంతరం చెప్పినా వీటిని నిరభ్యంతరంగా తొలగిస్తా అని హామీ ఇస్తున్నాను.  - రచయిత )

రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే

కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది

నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది

నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే

నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా

రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను

నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా

గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా

ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?

నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు

నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు

నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి

షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?

నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను

కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే

ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.

(చలం రాతలు పిచ్చిగా చదివి)

2 వ్యాఖ్యలు:

sr చెప్పారు...

గేయ౦ ప్రక్కన పెడితే మీరు, ఒక channel కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పట్నున్చో అడగాలను కు౦టున్నా

భండారు శ్రీనివాసరావు చెప్పారు...


@sr -

sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక చానలు కు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు.
ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఎనిమిది వరకు - హెచ్ ఎం టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ, గురువారం ఉదయం ఏడు గంటలనుంచి అటూ ఇటూగా ఎనిమిది వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడు గంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు (సాధారణంగా 10 టీవీ), ఆదివారం ఉదయం ఏడునుంచి ఏడు నలభై అయిదు వరకు - V 6 ఛానల్. ఇవికాక మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సందర్భాన్నిబట్టి చర్చాకార్యక్రమాలు వుంటాయి. గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత చానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"