6, మార్చి 2014, గురువారం

పాతికేళ్ళనాటి మాస్కో - 16




మెట్రో
మన దేశంలో యెంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో- ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియనివాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు.



 అక్కడికి వెళ్లాలని యెంతో మంది టాక్సీ డ్రైవర్ లను అడిగిచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ(ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితె కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.





ఒక మెట్రో స్టేషన్ - అయిదు పైసల టిక్కెట్టుతో నూటయాభయి స్టేషన్లు

మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు-
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటు తో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు-
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలురిక్కించి చూస్తున్నప్పుడు-
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే -
మాస్కో మెట్రో గురించి తెలియనివాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.
సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే- జార్ చక్రవర్తుల కాలంలోనే - మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దం చేసారని చెబుతారు. అయితే ఈలోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ నిర్మాణం జరిగిన తరవాత ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం - మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు- ఎటునుంచి ఎటువైపయినా- ఎన్నిసార్లయినా సరే-స్టేషన్లతో నిమిత్తం లేకుండా  ప్రయాణం చేయవచ్చు. నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల - అనేకవైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషను కు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు.అంటే, భూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట.ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే- దానికి కిందా పైనా వున్న మార్గాలలోమరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.


 ఈ  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని - అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే - ఒక రైలు వెనుకనే మరో రైలు వెంటవెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం - దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం- తలుపులు మూసుకోవడం - రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది.రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు.   అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా - ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా - రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషను ను ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


(రెడ్ స్క్వేర్ లెనిన్ సమాధి వద్ద పొడుగుపాటి క్యూలు - కన్నడ న్యూస్ రీడర్ శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సరోజతో కలసి మా ఆవిడ నిర్మల)


 మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు సయితం తమకు సమకూర్చిన చయికా కార్లను ( యద్దనపూడి నవలల్లో కధానాయకులు వాడే పడవ లాంటి కార్లు - ఈ ఆరు డోర్ల కార్లు అత్యున్నత స్తాయి విదేశీ అతిధులకి మాత్రమే అందుబాటులో వుంటాయి) పక్కన పెట్టేసి మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి వెలిబుచ్చుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తిని అర్ధం చేసుకోవచ్చు.

(స్టాలిన్ తాగిన కాఫీ కప్పుతో మారిన మెట్రో డిజైన్ - ఈ వయినం గురించి మరో సారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు: