10, మార్చి 2014, సోమవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 19

లక్ష రూపాయల పాల సీసా

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగిన నా జర్నలిస్టు జీవితం  1971  ఆగష్టులో విజయవాడ ఆంద్ర జ్యోతిలో మొదలయింది.


 అసందర్భంగా అనిపించినా మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు ఆ నాటి రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి అని అనుకుంటున్నాను. అప్పుడు నా నెల జీతం యాభయి రూపాయలతో ఆరంభమయి వంద రూపాయలకు పెరిగి- 1975  లో జ్యోతిని వొదిలిపెట్టేనాటికి నూట యాభయి రూపాయలకు చేరింది. జీతానికీ, జీవితానికీ పొంతన లేని రోజుల్లో- మా పెద్ద పిల్లవాడికి పాలపొడి టిన్నులు కొనడం అనేది గగనంగా వుండేది. ఆ గడ్డు రోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు.ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక గడ్డు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా యెర్ర ఏగాని దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు.ఆ వచ్చిన అతడి చేతిలో పాల సీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో - దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.
_---------------------------------------------------------------------------------------------------------_
 అన్ని రోజులుగా అతడు నన్నడుగుతున్నది ఒక్కటే. సొంతంగా హోర్డింగుల వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. పది వేలు లోను కావాలి. జామీను ఇచ్చే వాళ్ళుంటే బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నారుట. ఆ రోజు అడగకుండా అతడు చేసిన సాయానికి ఏదయినా చేసి ఋణం తీర్చుకోవాలనిపించింది. నా అంతట నేనే వెళ్లి బ్యాంకు లో అతడి రుణానికి జామీను పత్రంపై సంతకం చేసాను. ఆ తరువాత హైదరాబాద్ ఆకాశవాణి లో ఉద్యోగం రావడం , నేను విజయవాడ వొదిలిపెట్టడం జరిగిపోయాయి .ఆ తరవాత అతడు ఏమయ్యాడో తెలియదు . పదేళ్ళ అనంతరం - మాస్కోలో వున్నప్పుడు , ఇండియన్ ఎంబసీ ద్వారా నాకొక లీగల్ నోటీసు అందింది.. ఆ పదిహేనేళ్ళలో ఆనాటి ఆ అప్పు పాపం లా పెరిగి లక్ష రూపాయలకు డిక్రీ అయింది. అదే నేనందుకున్న కోర్టువారి శ్రీముఖం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- మాస్కోలో ప్రోదుక్తిలో లీటర్లకు లీటర్లు పాలను - డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తూ కొంటున్నప్పుడు - నడిచి వచ్చిన దారిలో తొక్కుకుంటూ వచ్చిన ముళ్ళ బాటలు కళ్ళల్లో మెదిలేవి. ఆనాటి దృశ్యాలు సినిమా రీలులా గిర్రున తిరిగేవి. అందాల రాముడు సినిమాలో డబ్బున్న ఖామందు గారు సెక్రటరీని పిలిచి ' నేను ఎక్కే రైలుకు థర్డ్ క్లాసు బోగీలు తగిలించింది ఎవరు' అని గద్దిస్తాడు. ఆ సెక్రటరీ తెలివిగా - 'థర్డ్ క్లాసు వుంటేనే ఫస్ట్ క్లాసు విలువ తెలుస్తుందని తానే తగిలించా'నంటాడు. నిజమేకదా. కష్టాలు లేకపోతె సుఖాలకున్న విలువేమిటి?

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

1 వ్యాఖ్య:

hari.S.babu చెప్పారు...

అందాల రాముడు సినిమాలో ఇలాంటి తమాషా అయిన రియలిస్టిక్ సీనులు చాలా ఉన్నాయి.నాకు బాగా నచ్చిన సినిమా అది.