15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 5


ఎట్టకేలకు క్యూ కదిలింది. కదిలింది అనుకునే లోపు మళ్ళీ ఆగింది. ఆగి కదిలింది. కదిలి ఆగింది. అర్ధం అయింది ఏమిటంటే కదిలే వ్యవధానం కన్నా ఆగే సమయం ఎక్కువని. అల్లా కదిలి కదిలి ఆగి ఆగి చివరాఖరు ఘట్టానికి చేరింది. ఆడవాళ్ళని మగవాళ్ళనీ విడదీసి స్త్రీల హ్యాండ్ బ్యాగుల్నీ, మగవాళ్ళ మనీపర్సుల్నీ స్కానింగ్ యంత్రాల ద్వారా పరిశీలించి - ఇక మహాద్వారం పది అడుగుల దూరంలో వున్నదనగా గేటు వేసేశారు. 'ఎందుక'ని అడిగితె 'సీనియర్ సిటిజన్ల క్యూ వొదిలారు' అని జవాబు. 'ఎంతసేపు' అంటే 'ఓ గంట' అని జవాబు వస్తుండగానే కొంత దూరం నుంచి ఓ సీనియర్ కానిస్టేబు 'గంట కాదు ఓ పావుగంట' అని అరిచినట్టు చెప్పి,  'గంట అంటే మరీ డీలా పడతారు' అని చిన్నగా హితబోధ చేసాడు జూనియర్ కనిస్టీస్తీబుకు. 'ఔను కదా మల్లా!' అన్నాడు జూ.క.


మాకు పరిస్తితి అర్ధం అయింది. ఈసారి వెయిట్ చేయాల్సిన టైం తెలిసింది. అసలు జరిగింది కొంత వుంది. సరిగ్గా మహాద్వారం వైపు వెళ్లేముందు, ఆడవాళ్ళు పిల్లలతో ఒక కుటుంబం వస్తే మేమే దారి తొలిగి వారికి దారి ఇచ్చాము.ఇంతలో మాదారి మూసుకుపోయింది. 'యేది దారి' అని అడిగితె 'ఇవన్నీ పైవాడు యెలా అనుకుంటే అలా జరుగుతాయి' అన్నాడు జూ.క.  మా వెనుకవాళ్లకు మేము దారి ఇచ్చామని,  అదే సమయంలో గేటు వేశారని నచ్చచెప్పే ప్రయత్నం చేసాము. జూ.క. కి అవి నచ్చిన ఫలితంగా  మూసుకున్న గేట్లు తెరుచుకున్నాయి. జూ.క.  చెప్పినట్టు 'పైవాడు' కూడా గమనించాడు అన్నమాట. (అతడి పేరూ నా పేరే. శ్రీనివాసరావు)
ఆవిధంగా క్యూ లైన్ లో చేరిన మూడుగంటల తరువాత 'మహాద్వారం' నుంచి కాలు గుడిలో పెట్టాము.
ఇంతకీ టీడీడీ వారికి చెప్పేదేమిటంటే ఈరోజు మూడుగంటలు. ఇంకో రోజు నాలుగు అయిదు గంటలు పట్టొచ్చు. వారిలో ఎవరయినా ఇలా మూడు నాలుగు గంటలు ఏకబిగిన  నిలబడి వుండగలరా! అసలెప్పుడన్నా ఈరకమైన  పరిస్తితులను స్వయంగా గమనించారా! అలా చేసిన రోజు భక్తుల కోణం నుంచి సమస్యలను పరిశీలించి పరిష్కరించే వీలు దొరుకుతుంది.  (ఇంకా వుంది)