22, అక్టోబర్ 2016, శనివారం

చెత్త పేపర్లు


అపార్ధం చేసుకోకండి. ఇక్కడ కవి హృదయం పత్రికలు అనికాదు.
పత్రికల ద్వారా అనునిత్యం ఇంటింటికీ చేరుతున్న చెత్త అని అర్ధం.
అదిగో మళ్ళీ అపార్ధం మొహం పెట్టారు. ఇదేమీ బాగాలేదు. దిన పత్రికలు రాసుకొస్తున్న చెత్త అని కాదు,  ఇళ్ళకు మోసుకొస్తున్న చెత్తాచెదారం అని.
పత్రికల్లో పేజీలను మించి ప్రకటన కరపత్రాలు వాటిల్లో ఉంటున్నాయి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేర్వేరు డబ్బాల్లో వేయమంటున్నారు సర్కారు వారు. ఆ పనికి ఇది అదనం. టమాటాలు కిలో కేవలం యాభయ్ రూపాయలు మాత్రమే అనే దగ్గర మొదలు పెడితే, కోట్లకు పడగలెత్తిన ఆసాములు సయితం ఓ కన్నేసి చూడడానికి సంశయించే రమ్యహర్మ్య భవంతుల వరకు ఈ ప్రకటనల కరపత్రాలు, పత్రిక తెరవగానే ముందు కంట్లో పది ఆ తరువాత  ఇల్లంతా పరచుకుంటాయి. పత్రిక కొంటే ఈ చెత్త అదనం అన్నమాట.
పత్రికల సర్క్యులేషన్ నిర్ధారించడానికి ఏవేవో లెక్కలు వుంటాయి. ఓ పత్రికా మిత్రుడు (ఆయన నా మిత్రుడు, పత్రికలకు కాదు) సరదాగా ఓ మాట అన్నాడు, ‘ఏ పత్రికలో ఈ రకం చెత్త యెంత ఎక్కువ వుంటే అది అంత గొప్ప ప్రజాదరణ కలిగిన పత్రిక’ అని.
ఇక కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఈ చెత్తను జాతీయం చేసుకుని ఏకంగా తమ పత్రికల పేజీల్లోకే జొప్పించి అదనపు రాబడి పెంచుకుంటున్నాయనే అపవాదు వుంది. అది వేరే విషయం.
పైన చెప్పిన మిత్రుడే మరో మాట చెప్పారు.
“అనవసరంగా ఇంతంత పెట్టుబడులు పెట్టి పత్రికలు పెట్టడం ఎందుకు, ఏదో ఒక చిన్న పత్రికను ఇంట్లోనే ముద్రించి (సాంకేతికత పుణ్యమా అని ఆ వెసులుబాటు వుంది), టీవీలు చూస్తూ వార్తలు గిలికేసి  పెద్ద పెద్ద సర్క్యులేషన్ కలిగిన  పెద్ద పత్రికల పొట్టలో కూరితే, కాణీ ఖర్చులేకుండా ఇంటింటికీ చేరుతుంది కదా!”
మంచి ఐడియానే! ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత టైం తప్ప.          

2 కామెంట్‌లు:

M KAMESWARA SARMA చెప్పారు...

'ఏ అక్షరాన్నైనా కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని అక్షరాలే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి ' అని మీకు తెలుసు కదా. మనకు పనికి వొచ్చేదయితే దాచుకోవడం లేకపోతే దాంట్లోకే చెత్త ఎత్తి బయట పడేయడం. పేపర్ కి (న్యూస్ పేపర్) పేపర్ లే (యాడ్ పేపర్) శత్రువులు

ఎంకే శర్మ

sarma చెప్పారు...

పల్లెలలో ఇలాటివాటితో పేపర్ వస్తుంది, మాకు మరీ ఎక్కువా!. మేమైతే చాలా ఓపికగా వీటిని ఒక చోట చేరుస్తాం,దాచిపెడతాం. వీటి ఉపయోగం ఉంది. :)