10, ఆగస్టు 2010, మంగళవారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు


దంచూ దంచూ ఇంకా దంచు


ఢిల్లీ లోని వివేక్ నగర్ స్కూల్ లో మాష్టారు ఒకరు ఓ రోజు క్లాసు లోని పిల్లలని బెత్తంతో తలా నాలుగు తగిలించాడు.ఈ  సంగతి తెలుసుకున్న పేరెంట్స్ కమిటీ ప్రతినిధి - ఎంత అల్లరి చేస్తే మాత్రం ఇంతగా చావగొట్టాలా అని స్కూల్ మాష్టర్లపై ఎగిరెగిరి పడ్డాడు. కానీ, మా స్కూల్ లో ఇది మామూలే అని చాలా మామూలు విషయంగా వాళ్ళు తేల్చివేయడంతో ఆ పెద్దమనిషికి వొళ్ళు మండి యెకాయెకిన పోలీసు స్టేషన్ కి వెళ్లి , పిల్లలని కొట్టిన మాష్టారిపై కేసు పెట్టబోయారట. " పిల్లలని కొట్టినదెవరు ? ఎందుకు కొట్టారు ? ఈ కొట్లాటలో ఎంతమంది గాయపడ్డారు ? గాయాలు బాగా తగిలాయా ? " అంటూ పోలీసులాయన్ని ప్రశ్నలతో బాదడం మొదలు పెట్టి - గాయాలు తగలని 'కొట్టుడు' కేసులను నమోదు చేసుకోమని - ఆయన మొహం మీదే కొట్టినట్టు చెప్పేశారట. పోలీసు బాదుడుకన్నా టీచర్ల బెత్తమే బెటరనుకుని ఆ పెద్దమనిషి - మనసు చిన్నబుచ్చుకుని స్టేషన్ నుంచి బయటపడ్డాడట.



జీవనస్రవంతి



పెళ్ళంటే వెయ్యేళ్ళ 'వంట'


విందుకు వెళ్ళే ముందు - ముందే భోజనం చేసి పొమ్మనే ఇంగ్లీష్ సామెత ఒకటి వుంది. ఇంగ్లీష్ వాళ్ళ విందుల్లో మర్యాదలని తుచ తప్పకుండా పాటించడం రివాజు. గౌరవ క్రమంలో- ఎవరికీ ముందు పెద్ద పీట వెయ్యాలి అనే విషయంలో - అంటే వారి భాషలో చెప్పాలంటే పెద్ద కుర్చీ వెయ్యాలి అనే దగ్గర ఓ సారి పేచీ వచ్చి - విందుకు వచ్చిన వాళ్ళల్లో ఒక శిశుపాలుడు ఆ కుర్చీ తనకే దక్కాలని గొడవ పెట్టుకున్నాడట. ఈ తగవులాట తెగకుండానే తెల్లారి పోవడంతో - అతిధులు భోజనాలు చేయకుండానే ఇంటి దోవ పట్టారట. అందుకే- విందుకు వెళ్ళే ముందు భోజనం ముందస్తుగా చేసి వెళ్ళాలన్న సామెత ఆ విధంగా పుట్టిందని అంటారు.

పెళ్ళిళ్ళ సీజన్లో పెద్ద పెద్ద ఊళ్ళల్లో వీధికి రెండేసి పెళ్లి పందిళ్ళు కనిపిస్తుంటాయి. వెళ్ళాల్సిన పెళ్లిల్లు కనుక్కుని వెళ్లేలోగానే - పడాల్సిన మూడు ముళ్ళు పడిపోయి పెళ్లి తంతు ముగిసిపోవడం కద్దు. ఈ మధ్య పోరుగూరిలో పెళ్లి కెళ్ళిన ఒక పెద్ద మనిషి అడ్రసు వాకబు చేసుకుని వెళ్ళేలోగా - పెళ్లి పూర్తి కావడం - పెళ్లి వాళ్ళు డేరా ఎత్తేయడం జరిగిపోయాయి. హోటళ్లు వున్న పెద్ద వూరు కాబట్టి- ఏదో ఇంత కడుపు చలవ చేసుకుని ఇంటికి చేరాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే- ఇంగ్లీష్ సామెత తెలుగు పెళ్ళిళ్ళకి కూడా అన్వయించేలా వుంది.



జీవనస్రవంతి



 ఎదగడానికెందుకురా తొందరా ?  ఎదర బతుకంతా చిందరవందర

బాగా నడిచే స్కూళ్ళు , నడవని స్కూళ్ళు అని స్కూళ్ళలో లో రెండు రకాలని గీతలో కృష్ణుడు చెప్పాడనే వాళ్ళున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు - విద్యార్ధులు ఏకమై పోయి - స్కూల్ సరిగ్గా నడవకుండా తరగతులు ఎగ్గొట్టి మరీ ప్రయత్నాలు చేస్తుంటారు. జమ్మూ కాశ్మీరు సర్కారు మాత్రం ఈ గొడవ ఎందుకనుకుందో ఏమో , ఏకంగా నడిచే స్కూళ్ళనే ప్రవేశ పెట్టింది. కొండల్లో, కోనల్లో నివసించే పిల్లలకోసం బళ్ళు తెరిచినా అక్కడ పనిచేయడానికి ఉపాధ్యాయులెవరూ ముందుకు రాకపోవడంతో ఈ రకమైన స్కూళ్ళకి శ్రీకారం చుట్టింది. ఈ సంచార బళ్ళు - బళ్ళల్లో మాష్టార్లను ఎక్కించుకుని విధ్యార్దులున్న చోటికే వెళ్లి పోయి ఎంచక్కా పాఠాలు చెప్పేస్తుంటాయి. పిల్లలు కూడా ఈ తిరిగే బళ్ళల్లో తిరుగుతూ అక్షరాలు దిద్దుకుంటున్నారట. దానితో, 'తిన్నదరిగేలా తిరగకుండా బుద్దిగా చదువుకోకూడదా ? ' అని పెద్దలు పిల్లలను మందలించే ఛాన్స్ అక్కడ లేకుండాపోయింది.

(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All Images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: