1, ఆగస్టు 2010, ఆదివారం

అమెరికా అనుభవాలు – 25


అమెరికా అనుభవాలు – 25


ఇంటూ 45


ఇక్కడికి టూరిష్టులుగా వచ్చేవారిలో చాలా మంది ‘ఇంటూ 45’ ఫోబియాతో సతమవుతుంటారని ఒక జోక్ ప్రచారం లో వుంది. డాలర్ మారకం రేటు మన దేశంలో 44 రూపాయలో లేక 45 రూపాయలో వుండవచ్చు.కానీ, ఇక్కడ డాలర్ అంటే డాలరే!. అలా అనుకోకపోతే హోటళ్ళలో ఒక కప్పు కాఫీ కూడా తాగలేము. అనుకుంటే మాత్రం ‘ఇంత ధరా’ అనిపిస్తుంది .


డాలరు లోకం

‘ఏమిటి ఈ చొక్కా ఇంత ఖరీదా! అదే మన అమీర్ పేటలో అయితేనా!’ – అని అనుకునేవాళ్ళు ఇక్కడ చాలా మంది కనిపిస్తుంటారు.


ఈ తళతళ అంతా మనదగ్గరే

అమెరికా-చైనా భాయీ భాయీ


రెడ్ సాల్యూట్  


ప్రపంచీకరణ – నూతన భౌగోళిక సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల ఎక్కువ బాగుపడుతున్న దేశం చైనానే అనిపిస్తుంది. అమెరికాలో అమ్మే పిల్లల బొమ్మల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఎక్కువ భాగం చైనాలో తయారయినవే కానవస్తాయి. కొద్ది ప్రతిఫలానికి (చీప్ లేబర్ అంటారు – ఎందుకో ఆ మాట వాడాలనిపించడం లేదు) పనిచేసే పనివారు ఆ దేశంలో సమృద్ధిగా వుండడంవల్ల చౌకగా వస్తువులను ఉత్పత్తి చేయడానికి వీలుంది. వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడకుండా ఆజమాయిషీ చేయగలిగిన యంత్రాంగం వుండడం వారికి వున్న మరో అదనపు వీలు.


బొమ్మలమ్మ బొమ్మలూ- పీకింగు బొమ్మలూ

 చౌకగా వస్తువులను ఉత్పత్తి చేయగల కార్మిక సంపద మనకూ వుంది. కానీ ‘నాణ్యత’ అనే మరో పదం – అంతర్జాతీయ విపణి లో మనల్ని దూరంగా నెడుతోంది. చైనాలో పనిచేసేవారితో పాటు – వారి చేత నిబద్దతతగా ‘పనిచేయించగల’ యంత్రాంగం వుండడం వల్ల – అమెరికన్ కంపెనీలు నిర్దేశించే ప్రమాణాలకు అనుగుణంగా వస్తువుల ఉత్పత్తికి వీలవుతోంది. వస్తువు ధరతో పాటు నాణ్యతను కూడా పట్టించుకునే అమెరికన్ కార్పోరేట్ కంపెనీలు చైనా పట్ల మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడి ఇండియన్ స్టోర్లలో తప్పిస్తే – ‘మేడ్ ఇన్ ఇండియా’ సరకులు వేరే చోట కానరావు. ఆహార పదార్ధాలు, ఫాన్సీ వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు ఇక్కడ పుష్కలంగా వున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం మన దురదృష్టం.

ముక్తాయింపు


అమెరికా లో దాదాపు అయిదు మాసాలు గడిపి – తిరిగి వచ్చేముందు – చుట్టపక్కాలు, స్నేహితులకు గుర్తుగా ఇచ్చేందుకు వస్తువులు, కానుకలు కొనాలని ముమ్మరంగా షాపింగ్ చేసాము. కానీ ఇంటికి వచ్చిన తరవాత చూసుకుంటే ఎక్కువ భాగం ‘మేడ్ ఇన్ చైనా’ అనే లేబుళ్ళే కనిపించాయి. ఇదేమిట్రా అని ఆశ్చర్యపోతుంటే ఒక మిత్రుడిలా అన్నాడు.


‘నిరుడు అమెరికన్ దినోత్సవం కోసం నా స్నేహితుడొకడు అమెరికా జాతీయ పతాకం కొన్నాడు. దాని మీద మేడ్ ఇన్ చైనా అని రాసుంది.’


ఎడారిలో ఒంటె - గుడారం కధ గుర్తువస్తోందా!  


ఇది నవ్వులాటకు చెప్పిన విషయం కావచ్చేమో కానీ ఇందులో ఎంతో వాస్తవం వుంది.

అమెరికాలో నచ్చిన విషయం రోడ్లు అని చెప్పాను కదా. మరో సంగతితో ఈ అనుభవాల సమాహారాన్ని ముగిస్తాను.

“ఈ దేశంలో వున్న అయిదు మాసాలు శుద్ధమయిన గాలి పీల్చాను. పరిశుభ్రమయిన నీళ్ళు తాగాను”

అంకితంఅమెరికాని తొలిసారి సందర్శించే ‘తెలుగు’ తలిదండ్రులందరికీ ..................

-భండారు శ్రీనివాసరావు
302- మధుబన్,
యల్లారేడ్డిగూడా, శ్రీ నగర్ కాలనీ, హైదరాబాద్ – 500 073
ఫోన్: 040- 2373 1056
ఈమెయిలు:
bhandarusr@yahoo.co.in
bhandarusr@gmail.com

NOTE: All Images in this blog are copy righted to their respective owners

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ అమెరికా అనుభవాలు 25 భాగాలు ఆసక్తికరంగా మొదటి నుంచి తుది దాక ఏకబిగిన చదివించాయి. కధానుసారంగా మీరు ఎంపిక చేసిన బొమ్మలు చాలా ఆకట్టుకున్నాయి. మీరు చెప్పిన ‘ఇంటూ 45’ ఫోబియా ఇక్కడకు (అమెరికా) వచ్చే తల్లి తండ్రులు ల లో ఎక్కువ మంది లో కనిపిస్తుంది. చివరన మీరు ఉదహరించిన అమెరికా జాతీయ జండా -Made in china చదివి నవ్వకుండా ఉండలేకపోయాను. మీ ట్రావెలాగ్ లో Vancouver (Canada) గురించిన విశేషాలుండవచ్చని ఆశించాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

మీరు ఏకబిగిన చదివామన్నారు. చాలా సంతోషం. నేను కూడా ఇక్కడ సియాటిల్ లో మా వాడి ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఏకబిగిన పాతిక ఎపిసోడ్లు బ్లాగులోకి ఎక్కించేశాను. మరోసారి తిరిగి చూసుకునే ప్రయత్నం చేసే వ్యవధి కూడా లేదు. ఈ దేశంలో వుంటున్న మీ లాటివారే - తప్పొప్పులు వుంటే తెలియచేసి - ‘సరి చేసుకునే’ - వీలు కల్పిస్తారని భావిస్తున్నాను. కృతజ్ఞలతో – భండారు శ్రీనివాసరావు