30, ఆగస్టు 2010, సోమవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


రాసేవాళ్ళు చాలామంది వుంటారు. వాళ్ళల్లో మంచిగా రాసేవాళ్ళు కొద్దిమందయినా వుంటారు. కానీ వేసేవాళ్ళు వుండరు. ఇంతెందుకు- చాలా సంవత్సరాలక్రితం పురాణం గారు ఆంద్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా తన రచనకు అతీగతీ లేకపోవడంతో - ‘తన నవలను తనకు భద్రంగా ఒప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ’ అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో, పురాణం గారు - అప్పుడు అక్కడ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్నీ గాలించి, పాత కట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము. ఆ విషయం రచయితకు తెలియచేద్దామనుకుంటూనే - పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రచురించడం అన్నీ చక చకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు- వడ్డెర చండీదాస్ (అసలు పేరు చెరుకూరి బ్రహ్మేశ్వర రావు గారు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న –“హిమజ్వాల”-

కీర్తిశేషులు వడ్డెర చండీదాస్

స్వయంగా రచయిత అయిన పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకుడిగా మరెందరో రచయితలను వెలుగులోకి తెచ్చారు. తన సంపాదకత్వంలోని ఆంద్ర జ్యోతి వారపత్రికకు ఒక ప్రత్యేకతనూ, ప్రాముఖ్యాన్ని సమకూర్చిపెట్టారు. ఒక పక్క రచయితగా, మరో పక్క సంపాదకుడుగా రెండు భాధ్యతలను సమర్ధంగా నిర్వహించి పాఠకజనసామాన్యంచేతా, పత్రికాయాజమాన్యం చేతా సెహభాష్ అనిపించుకున్నారు.

కీర్తిశేషులు శ్రీ పురాణం


సంపాదకుడనే వాడు స్వయంగా సుప్రసిద్ధ రచయిత కావడం అనేది పత్రికకు ఎంతగానో మేలుచేస్తుందనడానికి పురాణం సుబ్రమణ్యశర్మగారే ఉదాహరణ. అయితే, కాస్తో కూస్తో అక్షరజ్ఞానం, అంతో ఇంతో భాషా పరిజ్ఞానం సంపాదకుడికి వుంటే చాలు, ఆ పత్రిక బతికి బట్టకట్టడమే కాదు అమ్మకాల్లో దిట్ట అనిపించుకోగలదని ప్రస్తుతం తెలుగు పత్రికారంగాన్ని ఏలుతున్న దినవారపత్రికలని చూస్తె తెలిసిపోతుంది. మంచి రచనలు చేసేవాడు, కొత్త రచయితలు చేసే మంచి రచనలని అంత తేలిగ్గా ఎంపిక చేసుకోలేడన్నది ఇక్కడి తాత్పర్యం. ఈగోలు, ఇతరత్రా కారణాలు పనిచేసి- తాము చేసే పనికి న్యాయం చేయలేరన్నది ఇందులోని ప్రతి పదార్ధం. (29-08-2010)

NOTE: All images in the blog are copy righted to respective owners

2 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

వడ్డెర చండీదాస్“హిమజ్వాల” ప్రచురణ గురించిన ఒక అపురూప విషయం మీ జ్ఞాపకాల ద్వారా తెలిసింది. నెనర్లు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

సీబీ రావు గారికి – ఆ రోజుల్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ అక్కడ వుండడమే నేను చేసుకున్న అదృష్టం. పెద్దవారినీ, వారి గొప్పదనాన్నీ ఏదో ఒక సందర్భం ముడిపెట్టి తలచుకోవడమే నేను చేస్తున్న పని – వినమ్రపూర్వక ధన్యవాదాలతో- భండారు శ్రీనివాసరావు