13, ఆగస్టు 2010, శుక్రవారం

సుత్తి ముక్తావళి - భండారు శ్రీనివాసరావు

సుత్తి ముక్తావళి
(కన్న వింతలూ- విన్న వింతలూ)'నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే - ఇంకా ఎంతవుందో అనుకుంటారు'

'మన బతుకు ఎలాంటిదో మన చావు చెబుతుంది. అయితే, మన బతుకు ఎలాంటిదో లోకానికి చెప్పడం కోసం కనీసం ఇద్దరు బతికుండాలి. అందులో ఒకడు మన స్నేహితుడయివుండాలి. ఇంకొకడు తప్పనిసరిగా మన శత్రువై వుండాలి. మన గురించి శత్రువు చెబుతున్నదానికీ- స్నేహితుడు చెబుతున్నదానికీ యెంత వ్యత్యాసం వుంటే - అంత నిత్యనూతనంగా చచ్చిన తర్వాత కూడా మనం బతికేవుంటాం.'

'ఒక మాట నిజం.
బతుక్కన్నా చావుకే  ఆయుష్షు ఎక్కువ.
గట్టిగా ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ప్రాణాలను కాచుకుంటూ, దాచుకుంటూ ఎన్నేళ్ళయినా బతుకు. నూరేళ్ళు- నూట యిరయై ఏళ్ళు- మహా అయితే నూట పాతికేళ్ళు.
కానీ, ఆ బతుక్కన్నా కూడా పొడవయినది చావు. ఎన్నేళ్ళు బతికి చచ్చినా- బతికినన్నాళ్ళకంటే ఎక్కువ ఏళ్ళు చచ్చినతర్వాత కూడా జనం జ్ఞాపకాల్లో బతికే వుంటాం.'"ఏ పని అయినా కష్టపడుతూ కాదు - ఇష్టపడుతూ చేయాలి"


'నేను చేయగలనని అనుకోవడం ఆత్మవిశ్వాసం-నేనే చేయగలనని అనుకోవడం అహంకారం.'


'నర మాంసం తినే క్రూర జంతువు కూడా తన మాంసం తినదు'
" పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.తరవాత్తరవాత మొగుడిమాట భార్య వింటుందట.ఆ తర్వాత యిరువురి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట.'


'భయం అనే పదానికి తప్ప దేనికీ భయపడాల్సిన పని లేదు.'
'మీరు అద్భుతాలను నమ్ముతారా?'
'ఎందుకలా అడుగుతున్నారు?'
'మీ జీవితంలో నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది తెలుసా?'
'నా జీవితంలోనా?'
'అవును. మీ చిన్నాన్న చనిపోయాడని చెప్పి నిన్న మీరు సెలవు పెట్టి వెళ్ళాక - మిమ్మల్ని చూడ్డానికి ఆయనే ఆఫీసుకి వచ్చారు.'


'దేవుడిని నమ్మి బాగుపడ్డామన్నవాళ్ళు తారసపడలేదు కానీ - దేవుడిని నమ్మేదిలేదంటూ లాభపడ్డవాళ్ళు బోలెడుమంది కనబడుతుంటారు.'

'ఉన్నతస్థానానికి చేరుకోవడం ఎంతో కష్టం. చేరుకున్న తరవాత ఆ స్థానాన్ని పదికాలాపాటు పదిలపరచుకోవడం మరింత కష్టం.'" ఎవరికయినా వారి అవసరానికి యెంత సాయం చేసినా వెంటనే మరచిపో - ఇతరులు చేసిన సాయం యెంత చిన్నదయినా జీవితాంతం గుర్తుంచుకో "
" మనిషి ఏడుస్తూ పుట్టింది - నవ్వుతూ చనిపోవడానికి "
-భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their  respective owners

కామెంట్‌లు లేవు: