భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2013, శనివారం

నా గురించి నలుగురూ ......3

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి.వెంకట్రామయ్య)

“సుమారు పాతికేళ్ళక్రితం సకుటుంబంగా సోవియట్ రష్యా వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలపాటు అక్కడ వుండి  రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివొచ్చారు భండారు శ్రీనివాసరావు.  అప్పుడాయన కాకుండా నేను మాస్కో వెళ్ళవలసింది. రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదవడం కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను ఒకరి తరువాత ఒకరిని తీసుకువెళ్ళి రెండేళ్లో మూడేళ్లో  అక్కడ  వుంచుకునేవారప్పట్లో. నాకంటే సీనియర్లయిన  తిరుమలశెట్టి శ్రీరాములుగారు, కందుకూరి సూర్యనారాయణగారు ఏడిద గోపాలరావుగారు (గోపాల్రావుగారు రేడియో సర్వీసులో నాకంటే జూనియర్ కాని న్యూస్ రీడర్ గా  కాస్త సీనియర్) లాంటి వాళ్ళంతా రష్యా వెళ్ళివచ్చాక నా వంతు వచ్చింది. వ్యక్తిగతమైన కొన్ని ఇబ్బందులవల్ల నేను వెళ్ళలేకపోగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని,  తాను న్యూస్ రీడర్ కాకపోయినా ఆకాశవాణి, రేడియో మాస్కో అధికారుల ఆమోదంతో రష్యా వెళ్లివచ్చారు శ్రీనివాసరావు. వెళ్ళడమేనా,  తనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే రెండేళ్లు ఎక్కువగానే అక్కడవుండి  మాస్కో మహానగరంలో తన జెండా ఎగరేసి మరీ వచ్చారు శ్రీనివాసరావు. రేడియో  మాస్కోలో తెలుగులో వార్తలు చదివిన చివరి వ్యక్తి శ్రీనివాసరావే. ఆ తరువాత ఆ రేడియోలో తెలుగు వార్తల  ప్రసారాన్ని నిలిపివేశారు.
“శ్రీనివాసరావు మాస్కోలో వున్నంతకాలమూ అక్కడా ఆయన ఇల్లు ధర్మసత్రంగానే వుండేదట. అక్కడ వుండి  చదువుకునే తెలుగు విద్యార్ధులు, ఒంటరి ఉద్యోగులు, యాత్రీకులూ అందరికీ అన్నివేళలా తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికేవారు భండారు  దంపతులు. తన సరసోక్తులతో, మధురసాలతో శ్రీనివాసరావు ఆతిధ్యం ఇస్తే, తెలుగు తిండికి మొహం వాచిపోయి వున్న వాళ్ళందరికీ కమ్మటి భోజనం వండి వార్చేవారు నిర్మల గారు. తానూ, తన భార్యాబిడ్డలూ ఆ నాలుగేళ్ళూ మాస్కోలో గడిపిన జీవిత విశేషాలతో ‘మార్పు చూసిన కళ్ళు’ అన్న పేరుతొ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఒక చిరు గ్రంధాన్ని కూడా గత సంవత్సరాంతంలో రచించారు భండారు శ్రీనివాసరావు “
ఇంకా వుంది .........

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

21, ఏప్రిల్ 2011, గురువారం

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు




జాతి వైరం కుక్కలకు సహజం. ఒక కుక్కని చూస్తే మరో కుక్కకు గిట్టదు. కొంపలంటుకు పోయినట్టు మొరగడం మొదలు పెడతాయి. ఈ సంగతి తెలిసికూడా పంజాబులో ఇద్దరు సర్దార్జీలు కోరి తెచ్చుకున్న కొట్లాట పుణ్యమా అని పోలీసు కేసులో చిక్కుకున్నారు.

ఆ ఇద్దరూ ఇరుగుపొరుగూ వారే. కానీ వారి పెంపుడు కుక్కలకు మాత్రం ఏమాత్రం పొసగదు. కనబడగానే కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటాయి. గయ్యి గయ్యిమని మొరుగుతాయి. ఈ వ్యవహారం ఆ యజమానులకు సుతరామూ నచ్చలేదు. అక్కడితో ఆగితే పోయేది. ఎదురుపడగానే కుక్కల మొరుగుడు గుర్తుకువచ్చి గిల్లి కజ్జా పెట్టుకునేవారు. అంతటితో ఆగితే ఏ పేచీ లేదు. చేతులు లేపారు. చేతులు సరిపోక ఇనుప కమ్మీలతో దొమ్మీలకు దిగారు. అంతదాకా తీరిగ్గా అంతా చూసిన పోలీసులు సమయం చూసి రంగంలోకి దిగి ఇద్దర్నీ స్టేషనుకు పట్టుకుపోయి అక్కడ చేయాల్సిన సన్మానం చేశారు. అప్పటికి కానీ ఆ యజమానులిద్దరు శాంతించలేదు. వాళ్ళు తాత్కాలికంగా రాజీపడి చేతులు కలిపినా కుక్కలు మాత్రం ఇళ్ళల్లో కూర్చుని తాపీగా మొరుగుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నాయి.(17-02-1983 నాడు రేడియోలో ప్రసారితం)







వొండివార్చే పని లేకుండా వడ్డించే విధానాన్ని డాక్టర్ విగ్మూర్ అనే విదేశీ వనిత కనుక్కుంది. కాయగూరలను వొండకుండా ఎలావున్నవాటిని అలానే కొరుక్కుని తినాలన్నది ఆవిడ గారి థియరీ. నిజానికి ఇది కొత్త విద్యేమీ కాదు. వెనుక పురాణాల్లో విన్న కంద మూలాల కధే. కానీ చెప్పేది విదేశీ అమ్మడు కాబట్టి నమ్మినా నమ్మకపోయినా వినకతప్పదు కదా! ఇలా తింటే వంట తంటా తప్పడమే కాకుండా వొంటికి సరిపడే పుష్టి బ్రాండ్ ఆహారం దొరుకుతుందని ఆవిడ చెబుతోంది. వండడం వల్ల కూరగాయల్లో వుండే సహజమయిన విటమిన్లు తగ్గిపోతాయని హెచ్చరిస్తోంది. పచ్చి కూరగాయల్ని పచ్చి పచ్చిగా తినడం మొదట్లో కొంత కష్టంగా వున్నా పోను పోను అలవాటయి ఇష్టంగా మారుతుందని ఆవిడ ఢంకా బజాయించి చెబుతోంది.


విగ్మూర్ చెప్పే మాటలు కరక్టే అనే వ్యక్తి మనదేశంలోనే ఒకాయన వున్నారు. పచనం ప్రసక్తి లేకుండా పచ్చి కూరలు తింటూ, పళ్ళరసాలు తాగుతూ పెటపెటలాడుతూ తిరిగే ఆ ఆసామీ మామూలు మనిషేమీ కాదు. పేరుమోసిన క్రికెట్ వీరుడు విజయ్ మర్చంట్. వొండిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా పచ్చివాటినే భోంచేస్తున్న విజయ్ మర్చంట్ గురించి మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే గత పదిహేనేళ్ళుగా ఆయన చుక్క పచ్చి మంచినీళ్ళయినా ముట్టలేదట.

ఈ పచన రహిత భోజనాలవల్ల ఎంతో సమయం కలిసొస్తుందని, వంట ఖర్చు ఆదా అవుతుందనీ, వొంటింటిని వొదిలేస్తే ఎలాటి జబ్బులు వొంటి జోలికి రావనీ, పైపెచ్చు వొంటింటి కుందేళ్ళన్న అపప్రధ ఆడవాళ్ళకు తప్పుతుందనీ ఈ వాదనని సమర్ధించేవాళ్ళ ఉవాచ. గాస్ అయిపోయిందే అన్న దిగులు లేకుండా, నూనె ధర పెరిగిందే అన్న బెంగ లేకుండా రోజులు వెళ్లదీయవచ్చునట. (1983 జనవరిలో రేడియోలో ప్రసారితం)

  

16, జనవరి 2011, ఆదివారం

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు


ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని తెలుసు.

చుట్టూ చిమ్మ చీకటి. చుట్టూతా కీకారణ్యం.

మండల దీక్ష ముగించి, దైవదర్శనం చేసుకుని, మకర జ్యోతిని కళ్ళారా తిలకించి, ఆ తృప్తిని గుండెల్లో పదిలం చేసుకుని ఇంటి ముఖం పట్టిన వారందరికీ –

ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని మాత్రం తెలుసు.

లిప్త మాత్రంలో జరగరానిది జరిగిపోయింది. కాల యముడు పాశం విసిరాడు. వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిసాయి.

ఎక్కడివాళ్లో వాళ్ళు. ఎక్కడెక్కడి వాళ్లో వాళ్ళు. దేవుడి పేరుతొ అక్కడ కలిసారు. ఆ దేవుడిలోనే కలిసిపోయారు.

ఈ మరణాలకు ఎవరు కారణం? ఈ దారుణానికి ఎవరిది బాధ్యత?

ఈ ఏడాది శబరిమల సందర్శించిన అయ్యప్పలు అరవై లక్షలమంది అని అంచనా. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

అసలే క్లిష్టమయిన దీక్ష. అతి క్లిష్టమయిన యాత్ర. అయినా భక్తులకు ఇవేమీ అడ్డుకాదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు పాతిక ముప్పయ్యేళ్లనుంచి ప్రతియేటా ఈ దీక్షాధారణ చేస్తున్నవారు వేల సంఖ్యలో వుంటూ వస్తున్నారు. స్వామియే శరణమంటూ వివిధ రాష్ట్రాలనుంచి ఏటా శబరిమలకు ప్రయాణం కడుతున్నారు. దుర్గామారణ్యం నడుమ సాగే ఈ యాత్రలో ఎన్నో అవరోధాలు, వూహించని ప్రమాదాలు సహజం. రోడ్డు ప్రమాద ఘటనల్లో అయ్యప్పల మృతి గురించిన వార్తలు ప్రతి ఏటా వింటూనే వున్నాం. కానీ ఈసారి జరిగిన దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది. యాత్ర ముగించుకుని కొండవాలు మీదుగా సన్నటి కాలిబాటలో నడుచుకుంటూ వెడుతున్న భక్తుల బృందంపై వెనుకనుంచి ఒక వాహనం దూసుకురావడం, దానితో భీతావహులయిన యాత్రీకులు చెల్లాచెదరుగా పరుగులు తీయడం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఊపిరాడక కనుమూయడం అంతా కనుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. అంతవరకూ అయ్యప్ప నామస్మరణలతో మార్మోగిన లోయ యావత్తూ ఆ నిశీధిలో ఆందోళనకు గురయిన భక్తులు చేసే హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వందమందికి పైగా చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. తొక్కిసలాటలో లోయలోకి కొందరు పడిపోయివుంటారని వేస్తున్న అంచనాలు నిజమయిన పక్షంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఇక క్షతగాత్రుల సంఖ్య రెండువందలకు మించే వీలుందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో దాదాపు ఇరవై మంది మన రాష్ట్రానికి చెందినవారే వున్నారు.

దుర్ఘటన సమాచారం అందగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం సయితం స్పందించింది. జాతీయ విపత్తుగా పరిగణించింది. సైనిక దళాలను సహాయ కార్యక్రమాలకు నియోగించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్ధిక సాయం ప్రకటించింది.

ఇవన్నీ కంటి తుడుపు చర్యలని కొట్టి పారేయడం సబబు కాదు. అలాగని ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసాయని కూడా చెప్పలేము. జరిగినదానికి స్పందించిన మాట నిజమే. కానీ ఇలాటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచన చేసివుంటే మరింత బాగుండేది.

శబరిమలకు ఏటా ఒక నిర్ణీత సమయంలోనే యాత్రీకుల రద్దీ వుంటుంది. అందువల్ల మిగిలిన దేవాలయాల విషయంలో కంటే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. క్రమబద్ధమయిన ప్రణాళికా రచనకు, దాని అమలుకు అధికారులకు మరింత వెసులుబాటు వుంటుంది.

పర్యావరణానికి చేటు కలగకుండా కొండ వాలుల్లో కాలిబాటలను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి తగిన వ్యవధానం, అంటే మిగిలిన దేవస్తానాలతో పోలిస్తే ఏటిపొడుగునా భక్తుల రద్దీ లేని ప్రత్యేక పరిస్తితి ఈ క్షేత్రానికి వుంది. ఆదాయానికి కొదువ లేని దేవస్తానం కాబట్టి చేపట్టే పధకాలకు నిధుల కొరత వుండే అవకాశం లేదు. కావాల్సినదల్లా కాస్త చిత్తశుద్ధి. సాయపడాలనే మంచి బుద్ధి.

దీనికి చిన్న ఉదాహరణ నా అనుభవంలోనే వుంది. ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్నప్పుడు గమనించేవాడిని. పెద్ద పెద్ద ఆటలపోటీలు జరిగినప్పుడు, భారీ ఎత్తున జనాలు తరలివచ్చే వీలున్న కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, మిలీషియా (పోలీసులు) చక్కటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. స్టేడియంలనుంచి దాపునవున్న మెట్రో రైల్వే స్టేషన్ల వరకు కొన్ని వందలమంది పోలీసులు తాళ్ళు పట్టుకుని వచ్చిపోయేవారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, తోపులాటలకు అవకాశం లేకుండా, కొన్ని వేలమంది ప్రేక్షకుల రాకపోకలను క్రమబద్ధం చేసే తీరు ప్రసంశనీయంగా వుండేది.

మనదగ్గరో. జనసందోహాలను అదుపు చేయడం అంటే లాఠీలు ఝలిపించడమే. (16-01-2011)

8, జనవరి 2011, శనివారం

అయిదా? ఆరా? తేల్చాల్సింది ఎవరు? – భండారు శ్రీనివాసరావు

అయిదా? ఆరా? తేల్చాల్సింది ఎవరు? – భండారు శ్రీనివాసరావు


మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే అందులో కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ కమిటీ కూడా సరిగ్గా అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు ‘కృష్ణలీల’ను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.

పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు – స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్. పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో మొదటి మూడు ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం కష్ట సాధ్యం అనీ కమిటీ నివేదికలోనే సన్నాయి నొక్కులు నొక్కారు.

రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.

రెండో సిఫారసు – రాష్ట్రాన్ని రెండుగా విభజించడం – హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.

పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.

హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.

ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే –ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క చెబుతూనే, దీనివల్ల దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై ప్రతికూల ప్రభావం పడగల ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.

పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక కితాబును దానికి జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.

రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు – తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను తీసుకువచ్చి ‘భూమి గుండ్రం గా వుంది’ అన్న సామెతను నిజం చేసింది.

నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.

ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక సిఫారసు చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు ప్రాంతాలకు చెందినవాళ్ళు – అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బాహాటంగా ప్రకటిస్తున్నారు.

కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత వారి అధినాయకత్వంపైనే వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన –రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.

చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.(08—1-2011)

30, డిసెంబర్ 2010, గురువారం

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

రెండువేల పదో సంవత్సరం మౌనంగా వీడుకోలు తీసుకుంటున్న వేళ ఒక్కసారి మన రాష్ట్రాన్ని విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే దృశ్యం ఏమిటి?

వరుస తుపానులు, అకాల వర్షాలు, నీట మునిగిన పైర్లు, నిండా మునిగిన రైతులు, గుండె ఆగి కొందరు, గుండె చెదరి మరి కొందరు, ఊపిరి వొదిలిన పేదవాళ్ళు -

ముదిరిన ప్రాంతీయ ద్వేషాలు, పలచపడ్డ మానవ సంబంధాలు, నిన్న మొన్నటి దాకా పాలూ నీళ్ళలా కలగలసిపోయిన జనం తాలూకు కనబడని ఆనవాళ్ళు -

మింటికెగసిన ధరలు, వెన్ను విరిగిన ప్రజలు,

ఆందోళనలు, ఊరేగింపులు, హర్తాళ్ళు, రాస్తా రోఖోలు, బందులు, దేశాన్ని చీల్చే చెండుకుతినే రాబందులు,

నాయకుల నిరాహార దీక్షలు, అనుచరుల వీరావేశ ప్రదర్సనలు,

దిష్టి బొమ్మల దహనాలు, ముష్టి యుద్ధాలను మరిపించే బుల్లి తెరల గోష్టులు,

ఒక్కటంటే ఒక్కరోజు ప్రశాంతంగా గడిచిందా? ఏటిపొడుగునా ఇవే గొడవలు. ఏడాది మొత్తం ఇదే తీరు.

‘జనం గమనిస్తున్నారు జాగ్రత్త’ అని ఒకరినొకరు హెచ్చరించుకోవడమే కానీ ఆ జనం నిజంగానే గమనిస్తున్నారన్న సోయ లేకపోవడమే నేటి రాజకీయం లోని ఓ కొత్త కోణం.

సమాజం లోని అన్ని రకాల రుగ్మతలకు పరిష్కారం చూపవలసిన రాజకీయ పార్టీలే వీటికి మూలాధారాలు కావడం మరో విషాదం.

ఎన్ని పార్టీలు రాష్ట్రంలో వున్నప్పటికీ, ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ,టీ ఆర్ యస్ ల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు గిరికీలు కొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జగన్ పెట్టబోయే పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది.

ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యెక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. తొమ్మిది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు ఆ పార్టీకి అధినాయకుడు. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం తధ్యం అని మనసావాచా నమ్మి దెబ్బతిన్న పరిస్తితి ఆయనది. ఎన్నికలముందు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, తమ విజయావకాశాలను నీరు కార్చిందని కూడా నమ్ముతున్న వారు టీ డీ పీ లో అనేకులున్నారు. సరే. అది గతం. ముందు ముందు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని కాదని పట్టం కట్టడానికి వారి ముందు వున్న ఏకైక ప్రత్యామ్నాయం తమ పార్టీ మాత్రమె అని కూడా వారి నమ్మకాలు కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేడున్న పరిస్తితిని చూస్తే వారిది దురాశ అనుకోవడానికి కూడా వీలు లేదు. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి. ఈ నేపధ్యం లో- అకాల వర్షాలతో కుమిలిపోతున్న రైతుల దుస్తితి ఆ పార్టీకి ఒక రకంగా కలసి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక బలమయిన అంశం దొరికిందని ఆ పార్టీ ఉత్సాహ పడింది. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ అధినేతే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించడం, జాతీయ మీడియాను ఆకర్షించే స్తాయికి ఈ అంశం ఎదగడం ఆ పార్టీకి కొంత లాభించినట్టే కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో వ్యవసాయం గురించి ఆయన చేసిన కొన్ని ప్రస్తావనలను కొందరు పదేపదే పేర్కొనడం - రైతులపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను అదే పనిగా ప్రశ్నించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

పొతే, టీ ఆర్ యస్.

తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు. అందువల్ల కుష్టు రోగులెవరూ ఇలాటి ప్రకటనలను సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఉద్యమ పార్టీ కాబట్టి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా కలిగిన పార్టీ కాబట్టి, మిగిలిన ఏ రాజకీయ పార్టీకి లేని కొన్ని వెసులుబాట్లు ఈ పార్టీకి వున్నాయి. విద్యార్ధులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్న ఏకైక డిమాండ్ తో- రైతుల సమస్యను కూడా పక్కకునెట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేసినా ప్రశ్నించే వారు లేకుండా పోవడం, ప్రస్తుత తరుణంలో భావోద్వేగాలకున్న పటిమను తెలియచేస్తుంది. తీరా ఇంత చేసినా, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దీక్షకు పూనుకునేవరకు కేసుల విషయం పరిష్కారం కాని వైనం గమనిస్తే ఇందులోని మతలబు ఏమిటో ఎవరికీ అర్ధం కాని విషయం.

ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ కొందరు చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా అరంగేట్రం చేయబోతున్న ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది. వైఎస్ ఆర్ రాజకీయవారసుడిగా రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు గుర్తించకపోయినా, సామాన్య జనం గుర్తిస్తే చాలని మొండిగా ముందుకు సాగిపోతున్న జగన్ సాహసానికి కారణాలను అన్వేషించే పనిలో మరి కొందరు తలమునకలుగా వున్నారు.

పోతే, రాజశేఖరరెడ్డి జీవించి వున్నంత వరకు, ముఖ్య మంత్రుల విషయంలో పాత పోకడలను సమూలంగా మార్చుకున్నట్టు సంకేతాలు పంపి సాధారణ జనంలో మంచి మార్కులు కొట్టేసిన సోనియా, వై ఎస్ ఆర్ మరణానంతరం మళ్ళీ పాత పద్ధతులకు మళ్లిపోతున్నదన్న దురభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు విజయం సాధించడం జగన్ కు కలసి వచ్చింది. ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ద్వారా జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేసి అధిష్టానం మొదటి పొరబాటు చేసింది. ఆ తడబాటులో చేసిన మరి కొన్ని పొరబాట్లు జగన్ ని మాస్ హీరో గా మార్చివేశాయి. తిరుగులేని జనాదరణ కలిగిన నాయకుడిగా జనం లో గుర్తింపు పొందిన తరవాత కానీ అధిష్టానానికి తాను చేసిన తప్పు ఓ పట్టాన అర్ధం కాలేదు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆ దరిమిలా పన్నిన వ్యూహాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్న చందంగా అధిష్టానం వ్యవహారాన్ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నష్ట నివారణకోసం - విద్యార్ధులపై పెట్టిన కేసుల అంశాన్ని ఆలస్యంగానయినా చేతిలోకి తీసుకుని - కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల నిరాహార దీక్ష రూపంలో చూపించిన పరిష్కారం - పోయిన ప్రతిష్టను ఏమేరకు పూడ్చగలిగిందన్నది అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో నేడు నెలకొనివున్న పరిస్తితికి అన్ని పార్టీలకు అంతో ఇంతో బాధ్యత వున్నప్పటికీ – ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత మాత్రం అధికార పక్షానిది. ఇంకా సరిగా చెప్పాలంటే- ఢిల్లీ లో కొలువయివున్న ఆ పార్టీ అధిష్టానవర్గానిది. అంతే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్తితికి కూడా పూర్తి బాధ్యత అధిష్టానానిదే.

అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా ఏష్టత కలుగుతోందని బుల్లి తెరలపై జనం బల్ల గుద్ది చెబుతున్నారు. ఇలాటి వారికా మనం వోట్లు వేసి గెలిపించిందని చీదరించుకునే పరిస్తితి ఏర్పడుతోందని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నట్టు - రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి చందాన తయారయింది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వున్నప్పుడు ఇలాటి అంశాలన్నీ చాలా అత్యల్ప విషయాలుగా ఆ పార్టీ భావిస్తూ వుండవచ్చు. కానీ శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక వెలువడిన దరిమిలా రాష్ట్రం లో - భవిష్యత్ రాజకీయ స్వరూప స్వభావాలు నేడున్న విధంగానే వుంటాయని అనుకోవడానికి వీలు లేదు.
‘కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతరం ముంచుకు వస్తుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో టీ ఆర్ యస్, అటు సీమాంధ్ర లో జగన్ పెట్టబోయే పార్టీ - అన్ని స్తానాల్లో అద్భుత విజయాలను సాధిస్తాయనీ, ఆ ఉప్పెనలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందనీ టీ ఆర్ యస్ నేత చంద్రశేఖర రావు తాజాగా చెబుతున్న ‘రాజకీయ జోస్యం’ - కొత్త ఊహాగానాలకు రెక్కలు తొడుగుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలు పంపుతోంది.

‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోందని’ తరచూ పేర్కొనే కాంగ్రెస్ నాయకులు – ఇటీవలి కాలంలో అధిష్టానం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణివల్ల పార్టీ పరిస్తితి మరింతగా దిగజారి పోతున్నదన్న వాస్తవాన్ని ఎందుకు ఢిల్లీ కి చేరవేయలేక పోతున్నారన్నది మరో యక్ష ప్రశ్నగా మిగిలిపోతోంది. (29-12-2010)

17, డిసెంబర్ 2010, శుక్రవారం

నమ్మకం - భండారు శ్రీనివాసరావు

నమ్మకం - భండారు శ్రీనివాసరావు 


ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.

“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,

ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,

బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.

ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.

జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.

ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.

ఇప్పుడు చెప్పండి!

నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?

(17-12-2010)

19, నవంబర్ 2010, శుక్రవారం

అగ్నిమీళే పురోహితం ........ అను గ్రామఫోన్ రికార్డ్ కధ

చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.
కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.

లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోంలు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.

పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.

రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.

తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.

పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.

తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.

అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.

“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.

ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది.హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.

సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - రిగ్వేద శ్లోకానికి - మాక్స్ ముల్లర్ ఆవిధంగా అందించారన్న విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.

అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు.

“మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో- వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా లేకుండా,చెట్టుకొమ్మలపై చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు. ఎడిసన్ మహాశయులు నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే” అని ముగించారు మాక్స్ ముల్లర్.

(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞతలతో  –భండారు శ్రీనివాసరావు)

3, నవంబర్ 2010, బుధవారం

వచ్చిండన్నా, వచ్చాడన్నా- వరాల తెలుగు ఒకటేనన్నా – భండారు శ్రీనివాసరావు

శ్రీ కె. రామచంద్ర మూర్తి గారి సారధ్యం లోని హెచ్ ఎం టీవీ వారు “తెలుగుభాష –దశ దిశ” అనే పేరుతొ గతవారం ఒక కార్యక్రమం ప్రసారం చేసారు. తెలుగునేల నాలుగు చెరగులకు చెందిన అనేకమంది కవులు, రచయితలు, భాషా శాస్త్రవేత్తలు, భాషాభిమానులు ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఏకబిగిన కొన్ని గంటలపాటు సాగినప్పటికీ, ఆసాంతం చూడగలిగిన విధంగా ఈ ప్రసారం వీక్షకులను ఆకట్టుకోగలిగిందంటే, తెలుగు భాష పట్ల జనాలలో ఆసక్తి ఇంకా ఎంతో కొంత మిగిలే వుందనుకుని సంతోషపడాలి.

ఇందులో మరో రసవత్తరమయిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒక ప్రాంతం వారి భాషను, యాసను మరో ప్రాంతం వారు అణగదొక్కి తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోయారన్న అబిప్రాయం వ్యక్తమయింది. “బిడ్డ పోయి అమ్మాయి, కొడుకు పోయి అబ్బాయి, కక్కయ్య పోయి బాబాయి, చిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నా”యని సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు వెల్లడి చేసిన ఆవేదనతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితే, పరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించు కోవాల్సిన అవసరం వుంది.

నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలారాసేవారో గుర్తున్న వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇదేవిధమయిన ఆవేదనకు గురయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే ప్రకటనల్లో కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయి లో తయారయ్యేవి. హిందీలిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.

మా కుటుంబంలో మా బావ గార్లూ, వాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.

ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.

ఫలితంగా – గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకువస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగు వాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారం, ఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు, స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టి, ఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తె, వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.

భాష పట్ల మమకారం లేని వాడు వుండదు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడి పొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.

మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం.

మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.

భాషలో ‘తమవి’అనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయి పోతూవుండడం పట్ల నారాయణరెడ్డి గారు వ్యక్తం చేసిన ఆవేదనతో ఏకీభవించని వారు వుండరు.

భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ‘ఒరే’ అనడం – అమ్మను ‘ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని. (03-11-2010)

24, అక్టోబర్ 2010, ఆదివారం

రేడియో వార్తల వెనుక వ్యక్తులు - భండారు శ్రీనివాసరావు

మూన్నెళ్ల విదేశీ ప్రవాసం - హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్లాగుపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడూ రాసినా అవసరార్ధమే. ఎవరయినా పత్రికలవాళ్ళు అడిగినప్పుడు రాసినవే బ్లాగులో పెడుతూ వచ్చాను.

 ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన ‘ఆకాశవాణి’ వార్తలు చదువుతున్నది " కూడా నిజానికి మాగాయ సరుకే. అంటే, లోగడ ఎప్పుడో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులకోసం రాసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి తీసుకున్న 'ఎత్తిపోతల పధకం' అన్నమాట.  

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది - అని బ్లాగులో రాయగానే అనూహ్య స్పందన వచ్చింది. రేడియో మీద జనాలకువున్న అవ్యాజ ఆదరణ చూసి దానికి కొనసాగింపుగా మరికొన్ని వివరాలు అందిస్తే బాగుంటుందనిపించింది.

తెలుగు రేడియో న్యూస్ రీడర్లు గురించిన కొంత సమాచారం.

న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం), గోపరాజు లక్ష్మి.

ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.

పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ సయితం కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు అనౌన్స్సర్ల సంఘం ఇటీవల వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.

నిర్వహణ కారణాల రీత్యా న్యూ ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి

విజయవాడ కేంద్రం నుంచి – జ్యోత్స్నాదేవి (తరువాత హైదరాబాదుకు మారారు), ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు ఈ ముగ్గురు పర్మనెంట్ న్యూస్ రీడర్లు.  అప్పుడప్పుడు చదివినవారిలో రెంటాల కల్పన, ఓంకార్, సాధన వున్నారు.హైదరాబాద్ లో  కాజువల్ న్యూస్ రీడర్ గా వున్న జీడిగుంట నాగేశ్వర రావు  ప్రతివారం బస్సులో విజయవాడ వెళ్లి  ఆదివారం ఉదయం వార్తలు చదివేవారు.

హైదరాబాదు నుంచి – నళినీమోహన్, డి.రాధాకృష్ణారావు, మాడపాటి సత్యవతి, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు (అప్పుడప్పుడు – అసలు న్యూస్ రీడర్లు లభ్యం కాని రోజుల్లో అవసరార్థం – వార్తలు చదవాల్సి వచ్చేది. అలాగే అయిదేళ్ళు రేడియో మాస్కో- మాస్కో నుంచి తెలుగు వార్తలు)

నాకంటే ముందు కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు రేడియో మాస్కోలో పనిచేశారు. లిదా స్పిర్నోవా, విక్టర్ అనే తెలుగు తెలిసిన రష్యన్లు కూడా వార్తలు చదివేవారు. ఆ రోజుల్లో రాదుగ (విదేశీ భాషల రష్యన్ ప్రచురణ సంస్త) లో పనిచేసే ఆర్వీయార్ (ప్రముఖ రచయిత, రాళ్ళబండి వెంకటేశ్వరరావు) అప్పుడప్పుడు వార్తలు చదివేవారు)

పోతే, హైదరాబాద్ విషయానికి వస్తే -

రెగ్యులర్ న్యూస్ రీడర్లు కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన వార్తలు చదివిన వారు, ఇంకా చదువుతున్నవారు వున్నారు. సీనియర్ జర్నలిస్ట్, ఆంద్ర ప్రభ మాజీ సంపాదకులు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కొద్దికాలం చదివారు. అలాగే, ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు- రేడియోలో చేరక పూర్వం అతి కొద్దికాలం వార్తలు చదివారు)

కాజువల్ న్యూస్ రీడర్లలో మరికొందరు – పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి, పార్వతీ ప్రసాద్, వేదగిరి రాంబాబు, చంద్రమోహన్ (ప్రముఖ క్రీడా విశ్లేషకులు, ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధరబాబు వ్యక్తిగత కార్యదర్శి), కృష్ణమోహన్ ( పెళ్లి పత్రిక సంపాదకులు), జె. చెన్నయ్య, (ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన పౌర సంబంధ అధికారి), షర్ఫుద్దీన్, రామ్మోహన్ నాయుడు, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రసాదరెడ్డి, అయాచితుల రవికిషోర్ (ఆంద్ర జ్యోతి), పొణంగి బాల భాస్కర్, చుండూరి వెంకట రంగారావు, వెంపటి కామేశ్వరరావు, సీహెచ్ రామఫణి

(లబ్ధ ప్రతిష్టులు, తమ స్వరంతో రేడియో వార్తలకు జీవం పోసిన తెలుగు న్యూస్ రీడర్లలో ఎవరయినా ఈ జాబితాలో కనిపించకపోతే, నూటికి నూరుపాళ్ళు ఆ తప్పు - నాదే – భండారు శ్రీనివాసరావు)

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావు


ముప్పయ్యేళ్ళక్రితం రేడియోలో వార్తలు చదివే న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి – వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది పనికొస్తుందన్నది ఆయన భావన.

రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.

‘పది నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు’ అనుకోవడానికీ-
‘పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది’ అని సరిపెట్టుకోవడానికీ ఎంతో తేడా వుంది.

సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.

నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి – ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.

కాలం వేగంగా మారుతోంది. వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా – బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది. స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే – వార్తలు వింటున్న శ్రోతకు ‘కంటిన్యుటీ’ వున్న భావన కలుగుతుంది.

రేడియోకి వార్తలు పంపేటప్పుడు – సూటిగా, స్పష్టంగా, సరళంగా – అనే మూడు పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.


(చాలా సంవత్సరాలక్రితం ఆంద్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ – రేడియో విలేకరులకోసం నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయిన అభ్యర్ధుల నిమిత్తం తయారు చేసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి – రచయిత)

22, అక్టోబర్ 2010, శుక్రవారం

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

న్యూఢిల్లీ లో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం కాకమునుపే -

అనుమానపు మబ్బులు పట్టాయి.

ఆ మబ్బుల నడుమే పూజల్లులు కురిశాయి.

ఆ పూజల్లుల మధ్యనే హరివిల్లులు విరిశాయి.

ఆ హరివిల్లుల వెలుగులో బంగరు బిళ్లలు మెరిశాయి.

ఆ పుత్తడి కాంతుల జిలుగులో చిచ్చర పిడుగులు రాలాయి.

ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.

అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ,
అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.

ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంట కత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో – పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని ఆ బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హటాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

ఎట్టకేలకు పూర్తయిన ఏర్పాట్ల నడుమ, ఆతిధ్య దేశం భారత్ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొంటున్న డెబ్భయ్ ఒక్క దేశాల జట్లు - ప్రారంభోత్సవానికి సంసిద్ధమయిన మందిరంలో క్రీడా స్పూర్తితో కాలుమోపాయి. కామన్ వెల్త్ కు ఆధ్య దేశమయిన ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కామన్ వెల్త్ క్రీడలను లాంచనగా ప్రారంభించడంతో క్రీడా సంరంభం – ప్రతిష్టాత్మకంగా, కన్నుల పండుగగా, అందరి దృష్టిని ఆకట్టుకునేవిధంగా అట్టహాసంగా మొదలయింది. దాన్ని మరిపించేలా ముగింపు వేడుక మరింత శోభాయమానంగా కళ్ళు చెదిరే విధంగా జరిగింది.

అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో భారత్ శక్తి సామర్ధ్యాలను ఇంటా బయటా శంకించడంతో మొదలయిన కధ, క్రీడల ప్రారంభ సంరంభాలలోనే సమసిపోయింది. సాధించిన పతకాలతో మన క్రీడాకారుల సామర్ధ్యం, పొందిన మెచ్చుకోళ్ళతో మన నిర్వాహక ప్రతిభ – క్రీడల ప్రారంభానికి ముందు చెలరేగిన విమర్శలను దూదిపింజల్లా చెదరగొట్టాయి.

2014 లో జరిగే కామన్ వెల్త్ క్రీడోత్సవాలకు ఆతిధ్యదేశంగా ఎంపికయిన స్కాట్లాండ్ –భారత్ నిర్వహణ సామర్ధ్యాన్ని కీర్తించడం ఇందుకు చక్కని ఉదాహరణ. ‘న్యూఢిల్లీ ఒరవడిలో నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న పెను సవాల్’ అని ఆ దేశం పేర్కొనడం, అలాగే కామన్ వెల్త్ క్రీడా సమాఖ్య అధ్యక్షుడు మైఖేల్ ఫెన్నల్ – ‘భారత్ నిర్వహించిన తీరు అనితర సాధ్యం’ అని ప్రకటించడం మనకు దక్కిన చక్కని కితాబులు.

కామన్ వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. ‘భారత్ కు మరో స్వర్ణం’ అంటూ అనుదినం వెలువడిన టీవీ స్క్రోలింగ్ లు యావత్ జాతినీ ఉర్రూతలూగించాయి. మన వాళ్ళు రికార్డ్ స్తాయిలో మొత్తం నూటొక్క పతకాలను కైవసం చేసుకున్నారు. ముప్పయ్ ఎనిమిది స్వర్ణ పతకాలను, ఇరవై ఏడు రజిత పతకాలను, ముప్పయ్ ఆరు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకుని పతకాల పట్టికలో భారత్ ను రెండో స్తానంలో నిలబెట్టారు. గతంలో జరిగిన అంతర్జాతీయ క్రీడోత్సవాలతో పోలిస్తే ఈసారి భారత్ క్రీడాకారులు అంచనాలకు మించిన ఫలితాలను రాబట్టారనే చెప్పవచ్చు. ఇందులో మన రాష్ట్ర క్రీడాకారుల పాత్ర మరువలేనిది. పదిహేనుమందితో క్రీడల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టు ఆరు స్వర్ణాలు సాధించి మొత్తం పదిహేను పతకాలు గెలుచుకుంది. స్వర్ణాలు సాధించిన వారిలో కొందరి నేపధ్యం మట్టిలో దాగున్న మాణిక్యాలను తలపించింది. ఆర్ధిక,సాంఘిక అసమానతలను అధిగమించి వారు సాధిస్తున్న విజయాలు నిజంగా నిరుపమానం. పతకాల పంట పండించిన మన క్రీడాకారుల పంట సయితం పండింది. వారి శ్రమనూ, దీక్షా దక్షతలను గుర్తిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు నజరానాలతో వారిని ముంచెత్తుతున్నాయి. మరిన్ని విజయాల సాధన దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాయి.
విజయ దశమి పండుగకు ముందే పన్నెండు రోజుల ఆటల పండుగ ముగిసింది. భారతీయ ఆతిధ్య వైభవాన్ని మనసుల్లో పదిలం చేసుకుంటూ విదేశీ జట్లు ఇంటి దారి పట్టాయి.

కామన్ వెల్త్ గేమ్స్ విజయోత్సాహపు ఉద్విగ్న క్షణాలు నిమిషాలుగా, గంటలుగా మారుతుండగానే, కేంద్ర ప్రభుత్వం అసలు ఆటకు తెర తీసింది.

క్రీడోత్సవాలు ముగిసేవరకూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం, నిమిషం ఆలస్యం చేయకుండా నిర్వహణ కమిటీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా స్వయానా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వెలువడడం విశేషం.

ప్రతిపక్షాలు ఈ విషయంలో యాగీ చేయడం మొదలు పెట్టేలోగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రీడోత్సవాలకు ముందే ఈ నిర్ణయానికి వచ్చి, దేశం పరువు ప్రతిష్టల దృష్ట్యా అంతా సలక్షణంగా ముగిసిన తరువాత ప్రకటించివుండవచ్చని భావిస్తున్నారు.

కళ్ళు తిరిగే ఖర్చు

ఈ క్రీడలకు అయిన ఖర్చు వివరాలు ఇంకా పూర్తిగా అందాల్సివుంది. అయినా ప్రాధమిక అంచనాల ప్రకారం యిరవై ఎనిమిది వేలకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యాయని సమాచారం. ఇంత డబ్బు పోసి సాధించింది ఏమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. క్రీడా ప్రపంచంలో భారత దేశం తలెత్తుకు తిరగడానికి ఇటువంటి క్రీడోత్సవాల నిర్వహణ దోహదపడు తుందని, క్రీడాకారులకు అవసరమయిన దన్నూ ధీమా ఇవి కలిగిస్తాయని అనుకుంటే ఈ ఖర్చుని లెక్కలోకి తీసుకోకూడదనే వాళ్ళూ వున్నారు. ఇతర దేశాల్లో క్రీడలపై పెడుతున్న ఇబ్బడి ముబ్బడి పెట్టుబడులను ఈ ఈసందర్భంగా ఉదహరిస్తున్నారు. అభివృద్ధిచెందిన దేశాలలో ‘ఆడుకుంటూ చదువుకో, చదువుకుంటూ ఆడుకో’ అనే తరహాలో అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటున్నారు.

శారీరక,మానసిక వికాసానికి క్రీడలు ఉపకరిస్తాయనే నమ్మకంతో అక్కడి విద్యావిధానాలు రూపుదిద్దుకుంటూ వుండడం కూడా వారికి కలసి వస్తోంది. అయితే, విద్య వ్యాపారంగా మారిన మన దేశంలో మాత్రం ఆటలకు లభిస్తున్న ప్రాధాన్యం శూన్యం అనే చెప్పాలి. కోట్లు వెచ్చించి క్రీడోత్సవాలు నిర్వహించి అందరితో సెహభాష్ అనిపించుకుంటున్న మన ఏలికలు – క్రీడలను ప్రోత్సహించే పధకాలపై కూడా దృష్టి సారించాలనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడివున్న క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి ఆసరా అందివ్వాలి. అభిరుచి వున్నా అవసరాలు అడ్డం వచ్చి ఆటలకు దూరం అవుతున్న పేద యువతను వెతికి పట్టుకోవాలి. వారికి అవసరమయిన శిక్షణ ఇచ్చి వారి ప్రతిభకు పదును పెట్టాలి. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి కూపాలుగా మారుతున్న క్రీడా సంఘాలకు ముకుతాడు వేసి అదుపులో పెట్టాలి. జాతీయ స్తాయిలోనే కాకుండా, గ్రామ స్తాయినుంచి క్రీడలను ప్రోత్సహించే సమగ్ర క్రీడా విధానానికి రూపకల్పన చేయాలి. ఇరవై ఏళ్ళ క్రితం ఒలింపిక్స్ లో అట్టడుగున వున్న చైనా ఈనాడు అగ్రస్తానానికి ఎలా చేరుకుందో అధ్యయనం చేయాలి.

కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ఆ క్రీడోత్సవాలు బోధించిన పాఠాలను కూడా ఎప్పటికీ గమనంలో వుంచుకోవాలి. చైనాలోని గువాన్జ్ నగరంలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆసియా క్రీడోత్సవాలను ఇందుకు సవాలుగా తీసుకోవాలి. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అపూర్వ విజయాలు స్తానబలిమితో కాదన్న విషయాన్ని అక్కడ నిరూపించుకోవాలి.

ఈ దిశగా ఆలోచించినప్పుడు ప్రభుత్వం చేయాల్సింది కొండంత కనబడుతుంది. దేశంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదవ లేదు. కొరత వున్నదల్లా లక్ష్యాల సాధనకు అవసరమయిన చిత్తశుద్ధి మాత్రమే.

కొసవిరుపులు

“మహాత్మా గాంధీ జీవించివున్నట్టయితే, కామన్వెల్త్ క్రీడలను వ్యతిరేకించి వుండేవారు. దేశంలో నలభయ్ ఏడు శాతం బాలబాలికలు సరయిన పౌష్టికాహారం లేక రోగాలబారిన పడుతున్నారు. పది శాతం పేద గర్భిణులు రక్త హీనతతో కాలం గడుపుతున్నారు. అన్నార్తుల దేశంలో ఈ ఆటల పోటీలేమిటి?” – మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్

“దళితుల నిధులతో ఆటలా! కామన్వెల్త్ క్రీడల సన్నాహాల కోసం ఢిల్లీ సర్కారు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఏడువందల నలభయ్ కోట్ల రూపాయలు దారి మళ్ళించిందన్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఒకవేళ అలా బదిలీ చేసుంటే తక్షణం వాటిని వెనక్కు ఇవ్వాలి” – జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీ ఎల్ పునియా

“కామన్వెల్త్ క్రీడోత్సవాల ప్రారంభానికీ, ముగింపు వేడుకలకు మాజీ అథ్లెట్లకు ఆహ్వానాలు పంపకుండా అవమానపరిచారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మన దేశానికి తొట్టతొలి పతకం అందించింది నేను. అయినా నిర్వాహకులు నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే నిన్నటి తరం క్రీడా దిగ్గజాలు - పీటీ ఉష, గురుబచన్ సింగ్ రణధవా, శ్రీ రాం కుమార్, అశోక్ కుమార్ వంటి వారిని కూడా నిర్వాహక సంఘం చిన్నచూపు చూసింది. ఇది అత్యంత శోచనీయం.” - ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్

కొసమెరుపు

పన్నెండు రోజులపాటు జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడోత్సవాలలలో ఫోటోగ్రాఫర్ల కన్ను ఎవరిపై ఎక్కువ పడిందో తెలుసా? సాధారణ ప్రేక్షకుల మాదిరిగా వచ్చి హాకీ మాచ్ చూసి వెళ్లిన సోనియా,రాహుల్ గాంధీలు అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. ఈ గౌరవం దక్కింది ఒక మామూలు వృద్ధ వాలంటీర్ కు. “కామన్వెల్త్ గేమ్స్ 2010 విజయవంతం” అని ప్లకార్డ్ చేత ధరించి స్టేడియం నలుమూలల తిరుగుతున్న ఆ వృద్ధుడిని ఫోటో తీయడానికి ప్రెస్ ఫోటో గ్రాఫర్లు అదే పనిగా వెంబడి పడ్డారు.

 

19, అక్టోబర్ 2010, మంగళవారం

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

దృశ్యం ఒక్కటే.

చూసేవారికి రెండు రకాలుగా కనిపిస్తుంది.

వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో జనాలకు తెలవదు.

కానీ, ఒకే వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.

ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.

తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.

వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.

పోతే, టీవీ చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధలేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు ప్రశ్నిస్తున్నారు.

వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు పదం మాత్రం సదా సిద్ధం.

18, అక్టోబర్ 2010, సోమవారం

చర్చించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చర్చించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

ఈ మధ్య మా పక్క వాటా లోకి తెలుగు వచ్చీ రాని పొరుగు రాష్ట్ర కుటుంబం ఒకటి అద్దెకు దిగింది. వచ్చిన దగ్గరనుంచి వాళ్ళను ఒక సందేహం పీడిస్తున్నట్టుగా ఇటీవలే అర్ధం అయింది. మా ఇంట్లో వుండేది నేనూ మా ఆవిడా ఇద్దరమే. పిల్లలిద్దరూ వేరే వూళ్లలో కాపురాలు వుంటున్నారు. అటువంటప్పుడు ‘ఉదయం నుంచి రాత్రిదాకా అరుపులు, కేకలు వినవస్తాయేమిట’ని పొరుగింటావిడ, మా ఇంటావిడని అంటే మా ఆవిడని ఆరా తీసింది. అదంతా టీవీ చానళ్ళలో వస్తుండే చర్చలలోని రచ్చని తెలుసుకుని ఆశ్చర్య పోవడం పొరుగావిడ వంతయింది.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఉద్యోగి వుంటారు. మామూలుగా డ్యూటీ ఆఫీసర్ అని పిలిచే ఆ ఉద్యోగి డ్యూటీ ఏమిటంటే – రేడియోలో ప్రసారం అయ్యే లేదా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాములను ఆమూలాగ్రం శ్రద్ధగా విని, చూసి - తప్పొప్పులను పట్టుకుని, మంచి చెడులను గమనించి ఏరోజుకారోజు పై అధికారులకు రిపోర్ట్ చేయడం. రేడియో వినడానికి ప్రత్యేకంగా ఉద్యోగి అవసరమేమిటని కొందరు అడిగేవారు కూడా. బహుశా అలాటి ఏర్పాటు – ఈనాటి ప్రైవేట్ చానళ్ళలో లేకపోబట్టే ఇలాటి ‘చర్చలు’ రచ్చరచ్చగా తయారవుతున్నాయేమో!

ఇటీవల ఒక ఛానల్లో చర్చలో పాల్గొంటున్న ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయి. మాటల తూటాలు పేలాయి. అసభ్య పదజాలాలు జాలువారాయి. ఏతావాతా ఆ మహత్తర దృశ్యాలను పన్నుకట్టకుండా చూసి వినోదించగల అవకాశం వీక్షకులకు లభించింది. పోతే, ఈ కధ టీవీ సీరియల్ మాదిరిగా సాగిసాగి పోలీస్ స్టేషన్ వరకు చేరడం వేరే కధ. కాకపోతే, విషయం అర్ధం కాని మా పొరుగింటావిడ లాంటి వాళ్ళు – పక్కింట్లో యేవో గొడవలు జరుగుతున్నాయని అపోహపడే దుస్తితి దాపురించడం దీనికి పరాకాష్ట.

ఈ మధ్య ఓ శుభకార్యం లో తారసపడిన ఓ పెద్దమనిషి అడిగాడు ‘ఎందుకండీ ఇలా చానళ్ళ వాళ్ళు ‘ఉప్పూ నిప్పూ లాటి మనుషులను చర్చలకు పిలుస్తారు?’ అని. సుతీ మతీ కుదరని ఇలాటివాళ్ళ వల్ల చర్చ పక్కదారి పడుతుందన్నది ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం.

పైకి చెప్పలేకపోయినా, ఈ చర్చల్లో పాల్గొనే అనేకమంది జర్నలిష్టుల అభిప్రాయం కూడా ఇదే.

అసలే చిటపటలు. వీటికి ఆజ్యం పోయడానికి తయారుగా ఫోన్ ఇన్ లో మరికొందరు సిద్ధంగా వుంటారు. వీరందరినీ సర్డుబాటు చేయడానికీ, సముదాయించడానికీ యాంఖర్ సతమతమవుతుంటాడు. వాద ప్రతివాదాలు ముదిరి, ఖండన ముండనలుగా మారి, దుమ్మెత్తి పోసుకోవడాల్లోకి దిగి, వీధి కొళాయిల వద్ద తంతుని డ్రాయింగ్ రూముల్లో చూసే భాగ్యం వీక్షకులకు దొరుకుతోందని మరి కొందరి ఉవాచ.

‘ఇది ఇంతేనా? అంటే - ఇప్పటికింతే!’ అనుకోవాలి.

మెరుగయిన సమాజ నిర్మాణాలు స్క్రోలింగ్ లకే పరిమితమై పోయి, రేటింగులే ప్రధానమనుకున్నప్పుడు - ఇది ఇంతే!

ఎన్ని చానల్స్ వచ్చినా, వాటి నిర్వాహకులు యెంత లబ్ధ ప్రతిష్టులయినా – ఇది ఇంతే!

ఈ పోటా పోటీ ‘పోటీ యుగం’లో పోటీ తప్పనిసరి. పాట్లూ తప్పనిసరి. బోధి వృక్షాలు కూడా జ్ఞానోదయం కలిగించలేని విషమ పరిస్తితి. తప్పని సరి అనుకున్నప్పుడు ఆనందించమన్న సామెత మాదిరిగా చూసి తరించడమే వీక్షకులకు మిగిలింది.

‘చర్చించి వగచిన ఏమి ఫలము?’

6, అక్టోబర్ 2010, బుధవారం

Over estimating Gaddar!- Bhandaru Srinivas Rao (I.I.S.)

Over estimating Gaddar!- Bhandaru Srinivas Rao (I.I.S.)


With balladeer Gaddar of erstwhile left-wing CPI-ML group launching Telangana Praja Front, to intensify the struggle for separate statehood, likely to hot up state politics, especially in the region. After lying low for quite some time after his expulsion from the left-wing Maoist party, Gaddar quite often seen sharing with all and sundry political parties to express his solidarity to fight for separate state for Telangana.


But, what really surprised many was a hard-core ideologue of Maoist philosophy changed his ‘heart’ to believe parliamentary democracy. All through his career as head of Jana Natya Mandali, a cultural troupe of the erstwhile People’s War Group (PWG) of CPI-ML, carried on the campaign to dissuade electorate from participating in elections. Today, he says the separate statehood could only be achieved through an introduction of Bill in Parliament and his decision to fight elections, whenever they are held.



Had he set his eyes on the local bodies elections round the corner to float the TPF? Well, whatever may be the reasons for his ‘change of heart’, its good that a hardcore Maoist ideologue who till recently propagated to capture power only through barrel of a gun, now opting for democratic process. That’s a good sign in Indian politics as Gaddar is known all over the country as he propagate the left-wing ideology through singing and dancing to lure especially young tribal youth to join its ranks to wage wars against the concerned state governments – whether in Orissa or Jharkhand or Maharashtra or Bihar, besides West Bengal. He is a known face in left-wing extremists fight against political establishments.


While one welcomes his decision join the democratic process, yet one express doubt over the timing. That too when the Telangana Rashtra Samiti of K Chandrasekhara Rao, indeed managed to claim credit for pushing the movement for separate statehood to this far – forcing the Centre first to announce the beginning of process and then later constitution of Justice Sri Krishna Panel. Many feel bifurcation of the state is not far off as the emotive issue touched everyone in the region. The electorate of the region expressed their emotions so strongly in recent by-elections by re-electing all those who resigned to put pressure on the Centre.


Many wonder when the issue had come to a climax, why Gaddar had to launch the TPF. Had he done with some ulterior motives as KCR determined to take winds out of all parties’ sails on T-issue? One could find some logic in their genuine doubts over Gaddar’s real intentions? None can give guarantee that their fears may come true of Gaddar playing spoil sport. That too, enough confusion has been created with every major political party in the state virtually dividing on regional lines and staking claim that they are the real champions for the T-cause.


Gaddar’s TPF will become yet another ‘front’ to attack K Chandrasekhara Rao, who indeed virtually turned his party into a ‘family’ business. Those who justify Gaddar’s intentions, also reason how weaker sections in the region suffered at the hands of “Doras” in the region. In fact, the Maoists in the region mostly fought against these Doras as they exploited, especially the poor dalits. TRS Chief Rao belongs to “Velama” community and they hold huge chunks of lands in several Telangana districts like Karimnagar, Warangal, Khammam, Adilabad and Medak, besides Nizamabad.


Thus far, Gaddar as a Dalit justified in continuing the struggle against this predominant community which indeed created havoc in the lives of weaker in the region. And, Gaddar, who had mass appeal as an artiste, undoubtedly a ‘mass leader.’ Wherever he holds a programme, thousands of people throng to see and enjoy. His poetry is very attractive and sway away the poor masses. Some of his songs like “Bandenaka bandi katti, padaharu bandlu katti, nee gori kadatham koduko Nizamu sarkaroda" were great hits.


Yet, can he turn masses into votes is the million dollar question. One of my senior journalist friend told me that Gaddar many a time confessed that people may come in thousands to see and enjoy his programmes, but he cannot win an election, even as a councilor in a municipality. Having said that how come Gaddar now talks about fighting elections and accomplishing the separate statehood through movements? Doesn’t it sound strange? Moreover, doesn’t Gaddar aware of the fact that to fight an election today requires a lot of funds. Where from he expect the money to come from?


Hence, I for one feel his entry into state political arena may prove yet another ‘disaster’ like the one of yesteryear mega star Chiranjeevi. (06-10-2010)






  

23, సెప్టెంబర్ 2010, గురువారం

కేబీ తిలక్ ఇకలేరు -భండారు శ్రీనివాసరావు

కేబీ తిలక్ ఇకలేరు    -భండారు శ్రీనివాసరావు
హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విమానాశ్రయానికి  బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని.

శ్రీ కేబీ తిలక్  
నిజానికి ఇది రాసే వ్యవధానం లేదు. కానీ ఆయనతో నాకున్న పరిచయం నన్ను వుండబట్టనివ్వడం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. తిలక్ గారు మా ఇళ్లకువచ్చి పోతుండేపోయేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు. జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు తెలతెల వారుతూనే మార్నింగ్ వాక్ లాగా ఇంటికి వచ్చి కాఫీ తాగి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. టీవీ చానళ్ళు రాకపూర్వమే – ఏరోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా,నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రదారులం. నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు. మా ముందు కూర్చున్నది ఎవరో కాదు - ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా – మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు. అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన నా జన్మ ధన్యమని భావిస్తూ ఆయనకు నిండు నివాళి ఘటిస్తున్నాను. – సియాటిల్ నుంచి శ్రీనివాసరావు
 

విన్నంతలో కన్నంతలో అమెరికా - 10 - భండారు శ్రీనివాసరావు

అమెరికన్ ఆతిధ్యం

మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.

మరింబా వాయిస్తున్న  మిస్టర్ గోర్డన్ 

 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.

“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”

మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.

అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.

అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.

చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ – మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.

వెనక మేము మాస్కో వెళ్లి నప్పుడు – స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట – ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ - ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు. (22-09-2010)
 

22, సెప్టెంబర్ 2010, బుధవారం

విన్నంతలో కన్నంతలో - అమెరికా -9 – భండారు శ్రీనివాసరావు

కనిపించుటలేదు!

జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
సుజాతగారి బ్లాగులో (http://www.narasaraopet-bloggers.blogspot.com/) నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను.

నరసరావుపేట గూడు రిక్షా

ఒకానొక రోజుల్లో గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం ఆ బ్లాగు పై వచ్చిన ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలతో  పాతలోని మధురిమ మరోసారి అనుభవం లోకి వచ్చింది. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడవాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో అర్ధం అయింది.

అగ్నికీలల్లో నాటి సియాటిల్ 

1889 లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలుంతస్తుల సుందర భవనాలను నిర్మించుకున్నారు.

వీటి కిందనే భద్రపరచిన  పాతజ్ఞాపకాలు 

 అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు.

ఆ  కాలంనాటి  టాయిలెట్
  
 ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే – పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న మోజు అర్ధం చేసుకోవచ్చు.

అండర్ గ్రౌండ్  టూర్ లో ఒక దృశ్యం

అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను లాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు.

నాటి రైల్వే స్టేషన్

 ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

అలనాటి పాత బజారు

అంతరించి పోతున్న నరసారావుపేట గూడు రిక్షాలను గురించి చదివిన సమయంలోనే ఈ ప్రదేశాలకు వెళ్ళిరావడం కేవలం యాదృచ్చికం.
పోతే- గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న వస్తువుల జాబితా తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు – చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం. మొన్న జ్వాలనరసింహారావు ఏదో సందర్భంలో చెప్పాడు. ఈ మధ్య అవసరం పడి, ‘రేడియో కం టేప్ రికార్డర్’ కోసం హైదరాబాదంతా కారు టైర్లు అరిగేట్టు తిరిగాడట. రేడియోనా అదేమిటి అన్నట్టు అందరూ మొహం పెట్టారట.
ఇవి సరే! –
ఇవి కనబడకపోతే ఏదో సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రేమలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుబంధాలూ – వీటి సంగతేమిటి? అతివేగంగా అంతరించిపోతున్న వాటిలో వీటిదే ప్రధమ స్థానం.
వీటినెలా కాపాడుకునేటట్టు? కానరాకుండా పోతున్న వీటినెలా కనిపెట్టేటట్టు?
విచిత్రమేమిటంటే ఈ ప్రశ్నలకు జవాబు కూడా- “కనిపించుటలేదు”. (22-09-2010)
NOTE:All images in the blog are copyrighted to the respective owners

18, సెప్టెంబర్ 2010, శనివారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.

ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.

అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే -  తెలుగులోనే మాట్లాడుకోవాలని.

అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.

అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల - విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు  పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు - చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో - మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.

ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. (18-09-2010)

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! – భండారు శ్రీనివాసరావు

అందరి సంగతేమో కానీ దేవుడుతో నాకు కొన్ని పేచీలున్నాయి. నేను ఆయన్ని అడిగేవన్నీ చాలా అత్యల్ప స్వల్ప విషయాలని నా ధృఢనమ్మకం. ఆయన్నేమన్నా మణులడిగానా మాన్యాలడిగానా. పూర్వం కాలం రాక్షస భక్తుల మాదిరిగా కోరరాని వరాలేమన్నా  కోరానా!  లేదే!  ఏదో కొంచెం అహంకారం తగ్గించవయ్యా మగడా! అన్నాను.

పనిలో పనిగా, కాస్త  చేయి తీరిక చేసుకుని ఆ చేత్తోనే నా అజ్ఞానం కూడా కొంత తగ్గించమని మొక్కుకున్నాను. పట్టించుకున్న పాపాన పోతేగా! ఆయన లెక్కలు ఆయనకున్నట్టున్నాయి. దేవుడు కదా! కాళ్ళూ చేతుల మాదిరిగా తెలివితేటలు కూడా మనుషులకంటే  ఆయనగారికి ఎక్కువే కాబోలు.

అహంకారం తగ్గిస్తే తనకు ఇక బొత్తిగా పనివుండదన్న సందేహం వల్ల కావచ్చు. అజ్ఞానులు లేకపోతె తననిక నమ్మేవాళ్ళు కూడా వుండరన్న అనుమానం వల్ల కావచ్చు. మొత్తానికి ఏమయితేనేం దేవుడు నా గోడు పట్టించుకోలేదు. దానితో నా అహంకారం, అజ్ఞానం రెండూ ఒకటి నొకటి పెనవేసుకుని  - పాదు చేసి, నీరు పోసి పెంచిన పూలపొదలా నన్ను గట్టిగా అల్లుకుపోయాయి.

అలా అల్లుకుపోయిన ఆ రెండూ ఇప్పుడు ఈ బ్లాగులో మఠం వేసుక్కూర్చున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోకుండా  ఎడాపెడా రాసేస్తున్న ఈ  బ్లాగు పోస్టింగుల్లో నక్కి నక్కి చూస్తున్నాయి.

అందువల్ల మీ అందరికీ నా మనవేమిటంటే –
అలాటి అజ్ఞానపు ఆలోచనలు, దురహంకార  ధోరణులూ ఈ రాతల్లో ఎక్కడయినా పంటికింద రాయిలా తగిలితే  పెద్దమనసు చేసుకుని 
 నా అజ్ఞానాన్ని మన్నించండి. నా అహంకారాన్ని క్షమించండి.
ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!
(17-09-2010)

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రేడియో రోజులు -7 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు -7            - భండారు శ్రీనివాసరావు

ఒకరు - సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - ఎన్ టీ రామారావు గారి నాయకత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం - అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు గారు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేఖరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గ మధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలిపేరు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం - చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం - ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు కానీ ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది.

పైలట్ రాజీవ్

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది.నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంట పట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్తిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే -

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమవయిపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.
రాజీవ్ గాంధీ ఆయన కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు గారు, వెంగళరావు గారు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్(ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ ) - అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత - 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావు గారికి కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు - మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు గారు, వెంగళరావు గారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము- సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా.జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావుగారు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు గారు , సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్- అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అందరి ప్రాణాలు (అడవి) గాలిలో దీపాలు

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా - రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా - నిబ్బరం కోల్పోకుండా - సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టు  గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి - అన్నం మెతుకులను పట్టి చూసి - ఆ పేదరాలి భుజంపై చేయి వేసి - సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిధి - దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో!
తర్వాత షరా మామూలే.- రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.
ఒక ప్రధాని-ఒక ముఖ్య మంత్రి- ఒక మాజీ ముఖ్య మంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి - మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.