18, సెప్టెంబర్ 2010, శనివారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.

ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.

అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే -  తెలుగులోనే మాట్లాడుకోవాలని.

అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.

అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల - విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు  పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు - చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో - మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.

ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. (18-09-2010)

12 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

(వర) ప్రసాద్ గారు పరిచయం చేసిన అనేకమంది పెద్దల్లో గుర్తున్న కొందరు:
ఇందిరా గాంధి, ఎన్డీ తివారి, కమలాపతి త్రిపాఠి కొడుకు (పేరు గుర్తు లేదు). అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య సమావేశాని వచ్చిన ఇందిరా గాంధి ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు మనల్ని సరాసరి తీసుకుపోయి పరిచయం పరిచయం చేసినట్లి జ్ఞాపకం. జంధ్యాలతో సంభాషణ నిజంగా ఎన్నటికీ మరువ లేనిది.

భహుశా నీకు గుర్తుండే వుంటుంది. జేమ్స్ కాలహాన్ అని ఒక బ్రిటీష్ ప్రధాని అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీ హాల్ లో జరిగిన సమావేశంలో, కాలహాన్ సమక్షంలో అంజయ్య ఇంగ్లీష్ లో ప్రసంగించారు (రాసుకున్న ఉపన్యాసం). ఆయన ఇంగ్లీష్ ను విన్న ఒకరిద్దరు కొంచెం పరిహాసంగా నవ్వుకుంటున్నట్లు పసిగట్టిన (హాలులో వున్న) వర ప్రసాద్ గారు, లేచి నిలబడి బిగ్గరగా వాళ్లను మందలించారు.

చాలా కాలం క్రితం, ప్రసాద్ గారితో పరిచయమైన కొన్నేళ్లకు, ఒక రోజు వాళ్లింటికి ఫోన్ చేశానెందుకో. ఇంకా అప్పటికి సెల్ ఫోన్లు రాలేదు. ఆయన భార్య ప్రసాద్ గారి మరణ వార్త చెప్పగానే ఆశ్చర్య పోయాను. He was a great personolity...Great in all aspects. మంచి స్నేహితుడిని గుర్తు చేసుకున్నందుకు అభినందనలు.

ఆయనను మనకు పరిచయం చేసింది...నాకు గుర్తున్నంతవరకు..బీ.కె. రావు గారు?
జ్వాలా నరసింహారావు

Jwala's Musings చెప్పారు...

(వర) ప్రసాద్ గారు పరిచయం చేసిన అనేకమంది పెద్దల్లో గుర్తున్న కొందరు:
ఇందిరా గాంధి, ఎన్డీ తివారి, కమలాపతి త్రిపాఠి కొడుకు (పేరు గుర్తు లేదు). అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య సమావేశాని వచ్చిన ఇందిరా గాంధి ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు మనల్ని సరాసరి తీసుకుపోయి పరిచయం పరిచయం చేసినట్లి జ్ఞాపకం. జంధ్యాలతో సంభాషణ నిజంగా ఎన్నటికీ మరువ లేనిది.

భహుశా నీకు గుర్తుండే వుంటుంది. జేమ్స్ కాలహాన్ అని ఒక బ్రిటీష్ ప్రధాని అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీ హాల్ లో జరిగిన సమావేశంలో, కాలహాన్ సమక్షంలో అంజయ్య ఇంగ్లీష్ లో ప్రసంగించారు (రాసుకున్న ఉపన్యాసం). ఆయన ఇంగ్లీష్ ను విన్న ఒకరిద్దరు కొంచెం పరిహాసంగా నవ్వుకుంటున్నట్లు పసిగట్టిన (హాలులో వున్న) వర ప్రసాద్ గారు, లేచి నిలబడి బిగ్గరగా వాళ్లను మందలించారు.

చాలా కాలం క్రితం, ప్రసాద్ గారితో పరిచయమైన కొన్నేళ్లకు, ఒక రోజు వాళ్లింటికి ఫోన్ చేశానెందుకో. ఇంకా అప్పటికి సెల్ ఫోన్లు రాలేదు. ఆయన భార్య ప్రసాద్ గారి మరణ వార్త చెప్పగానే ఆశ్చర్య పోయాను. He was a great personolity...Great in all aspects. మంచి స్నేహితుడిని గుర్తు చేసుకున్నందుకు అభినందనలు.

ఆయనను మనకు పరిచయం చేసింది...నాకు గుర్తున్నంతవరకు..బీ.కె. రావు గారు?
జ్వాలా నరసింహారావు

Jwala's Musings చెప్పారు...

(వర) ప్రసాద్ గారు పరిచయం చేసిన అనేకమంది పెద్దల్లో గుర్తున్న కొందరు:
ఇందిరా గాంధి, ఎన్డీ తివారి, కమలాపతి త్రిపాఠి కొడుకు (పేరు గుర్తు లేదు). అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య సమావేశాని వచ్చిన ఇందిరా గాంధి ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు మనల్ని సరాసరి తీసుకుపోయి పరిచయం పరిచయం చేసినట్లి జ్ఞాపకం. జంధ్యాలతో సంభాషణ నిజంగా ఎన్నటికీ మరువ లేనిది.

జ్వాలా నరసింహారావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

థాంక్స్ జ్వాలా – బహుశా వరప్రసాద్ గారిని గురించి రాయాలంటే నువ్వే రాయాలని నేననుకుంటాను. నీ ద్వారానే ఆయన పరిచయం అని ఇప్పుడు గుర్తు వస్తోంది. ఇందిరాగాంధీని కలిపిన విషయం నాకు చప్పున స్పురణకు రాలేదు. జంధ్యాలకు, ఆయనకు మధ్య నడిచిన సంభాషణ బహుశా నీకు గుర్తుండే వుంటుంది. – భండారు శ్రీనివాసరావు

సుజాత వేల్పూరి చెప్పారు...

మీ బ్లాగును కొన్నాళ్ళయ్యాక ఒక పుస్తకంగా వేయాల్సిన అవసరం కనిపిస్తోందండీ నాకు! మాకు తెలీని ఎన్నో విషయాలను ఇక్కడ ఇలా చదవడం ఎంతో బావుంది.మెదడులో హోరు పుట్టించే FM మిరపకాయల్ని పక్కన పారేసి వెన్నెల్లో ఛాయాగీత్ వింటున్నట్లు ఉంది మీ బ్లాగు చదవడం!

జ్వాలా నరసింహారావు గారి వ్యాఖ్యలు మీరు మరిచిన అనుభవాల్ని గుర్తు చేస్తున్నాయి.

విజయవాడ,హైదరాబాదు రేడియో స్టేషన్లు ప్రసారం చేయగలిగే రేడియో సెట్లు ఇవాళ మార్కెట్లో ఒక ఫిలిప్స్ తప్ప ఇంకెవరూ తయారు చేయడం లేదు. ఏడాది క్రితం నాన్నగారికోసం ఒక రేడియో కొందామని మా వూర్లో(ఒక మామూలు టౌను నరసరావు పేట)అంతా తిరిగితే "ఈ రోజుల్లో రేడియోలు ఎవరు కొంటున్నారామ్మా"అని జాలిపడ్డాడు రేడియోల అమ్మకంతో తన వ్యాపారానికి శ్రీకారం చుట్టిన రాజేంద్ర రేడియో హౌస్ యజమాని!

ఇక పోతే జంధ్యాల గారిని గురించిన జ్ఞాపకాలు చాలా బావున్నాయి. ఆ రోజుల్లోనే కార్లో కాలేజీకి వచ్చిన ఆయన చరమాంకంలో దుర్భర దారిద్ర్యంలో మరణించినా,ఆయన్ని నిచ్చెనలా వాడుకుని మెట్లెక్కిన నటులెవ్వరూ కనీస సాయం కూడా అందించలేదని తెలిసి ఎంతో బాధ కలిగింది.

మీరు ఫాలోయర్స్ విడ్జెట్ పెట్టండి శ్రీనివాసరావు గారూ! అందులో చేరి మా లాంటి హార్డ్ కోర్ రేడియో అభిమానులు అగ్రిగేటర్ల దాకా రాకుండానే నా బ్లాగు ద్వారానే మీ కొత్త పోస్టులు ఎప్పటికప్పుడు చదివేయొచ్చు.

Saahitya Abhimaani చెప్పారు...

Great narration Srinivasa Rao garoo. Its news for me that Shri Jandhyala died in poverty! His father was one of the who is who in Vijayawada. Narayana garu was a Bush Radio Dealer when Radio was at its hey day. He lost everything in business and the family left Vijayawada. Later Shri Jandhyala earned back all the assets that were lost. But Jandhyala living in poverty in his last days is a surprising news to me. I cannot believe it.

In the same building Shri Jandhyala's father was running his Radio shot now SONOVISION is running.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

sujata gariki, siva gariki - i need your Emails to clarify a few issues you mentioned about the great director. Early the better. My Email: bhandarusr@gmail.com,bhandarusr@yahoo.co.in -BHANDARU SRINIVASRAO

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

సుజాత గారికి, శివ గారికి – జంధ్యాల దుర్భర దారిద్ర్యంలో చనిపోలేదు. తెలుగు సినిమా రంగాన్నిఒంటి చేత్తో ఏలుతున్న రోజుల్లో కూడా ఆయన డబ్బు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్మాతలే ఆయన ఇంటిముందు క్యూ కట్టేవారు. అడ్వాన్సులతో సరిపుచ్చి అసలు మొత్తాలు ఇవ్వనివాళ్ళు కూడా వున్నారు. ఎవరు యెంత ఇచ్చారు, ఇంకా యెంత ఇవ్వాలి అని పట్టించుకునే తీరిక లేకుండా పనిచేసిన మనిషి. పేరు,ప్రతిష్ట నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకున్నారు కానీ డబ్బులు ఇబ్బడిముబ్బడిగా పోగేసుకున్నదీ, నిలవేసుకున్నదీ లేదు. అలా అని పూటగడవని స్తితీ లేదు. చాలాచిన్నతనంలోనే శిఖరాగ్రానికి చేరుకోవడంవల్ల – తరవాత సహజంగా వచ్చే గ్యాప్ ని తట్టుకోవడం సున్నితమనస్కులయిన కళాకారులకు చాలా కష్టం. కవలలుగా పుట్టిన ఆడపిల్లలకు ‘సాహితీ-సంపద’ అని పేరు పెట్టుకున్నారు. చివరి రోజుల్లో కూడా నవ్వుల రేడుగానే జీవించారు. కానీ ముగింపు తోసుకువచ్చినట్టు త్వరగా వచ్చింది. ఒకరోజు రేడియో స్టేషన్లో బులెటిన్ తయారు చేసుకుంటూ వుంటే ‘రాంపా’ గారు ఫోన్ చేసి ‘జంధ్యాల ఇకలేరు అని చెప్పారు. రాజ్ భవన్ రోడ్డులో ఆయన అపార్ట్ మెంట్. చెన్నయ్ లో మరో ఇల్లు వుంది. నేను ఆయన్ని చివరిసారి చూసి రెండు మూడు నెలలవుతుందేమో. ఒంట్లో బాగాలేదని విన్నాను కానీ అంతట్లోనే మనిషి అంత తీసిపోతాడా అనిపించింది నట్టింట్లో పడుకోబెట్టిన ఆయన్ని చూస్తె. నాకంటే ఐదారేళ్ళు చిన్న. బెజవాడ మాంటిసరీ స్కూలులో మా ఆవిడ కూడా జంధ్యాలకు క్లాసుమేటు. మద్రాసులో చాలాసార్లు కలిసాము. హైదరాబాదులో మా ఇంటికి కూడా వచ్చేవారు. ఇంకా నాలుగు కాలాల పాటు నలుగురినీ నవ్విస్తూ నలుగురిమధ్యా తిరగాల్సిన మనిషి. బెజవాడ బీసెంట్ రోడ్డులో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారికి బుష్ రేడియో స్టోర్స్ వుండేది. ఆంద్ర ఏరియా మొత్తానికి ఆయనే డీలరు. మోడరన్ కేఫ్ ఎదురుగా దాన్ని మించిపోయే బిల్డింగ్ కట్టారు. జంధ్యాల చనిపోయిన కొన్నాళ్లకే ఆయనా చనిపోయారు.
మరో చిన్న జ్ఞాపకం.రేడియో స్టేషనులో నా బల్లమీద అద్దం కింద ఒక కాగితంపై “మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి” అని రాసిపెట్టుకున్నాను. అది ఆయనకు బాగా నచ్చింది. అప్పటికి అయన సినిమారంగంలో నిలదొక్కుకునే దశలో వున్నారు. నేను ప్రతివారం రేడియోలో “జీవనస్రవంతి” అనే ప్రోగ్రాం ప్రెజెంట్ చేసేవాడిని. దానికి స్పూర్తీ, దీప్తీ జంధ్యాలే.-ఆయన్ని ఇలా మరోమారు తలచుకునే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు.- భండారు శ్రీనివాసరావు

Saahitya Abhimaani చెప్పారు...

శ్రీనివాసరావుగారూ. మంచి విషయాలు చెప్పారు. అదే, నాకు కూడ జంధ్యాల గారు చివరి రోజులలో బీదరికంలోజీవించారు అన్న సమాచారం లేదు. ఆయన పెద్దగా సంపాయించుకోకపోయినా, తిండికి ఏమాత్రం సమస్య లేదు. అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయిలో వాళ్ళ కుటుంబం బతకటానికి కావలిసినంత సంపాయించారు. కాని చిన్నతనంలోనె అంటే 55వ ఏటనే వెళ్ళిపోయారు. అదే దురదృష్టం. కాని సుత్తి వీరభద్రరావు, ఉషశ్రీల లాగానే ఈయనకూ అదే అలవాటు ఆ అలవాటే ఆయన్ని కబళించింది.

Rao S Lakkaraju చెప్పారు...

జంధ్యాల గారి గురించి మీరు వ్రాసిన వ్యాఖ్య మనస్సుని కుదుట పరిచింది. థాంక్స్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

శివ గారికీ,లక్కరాజుగారికీ – వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా ఎవరినయినా బాధించే అవకాశం వుంది అనుకునే అంశాలను నా బ్లాగులోకానీ, ఇతరత్రాకానీ ప్రస్తావించడం నాకు ఇష్టం వుండదు. జర్నలజం మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధం. ఎవరిని గురించి ఎంతవరకు రాయాలో అంతవరకే రాయడం నా తత్వం. అంతకుమించిన సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడం బాగుండదు. మీ ఈ మెయిల్స్ ఇమ్మని కోరింది అందుకే. కానీ ఈ లోగానే ‘విషయం’ మరో మలుపు తిరుగుతున్న సూచనలు కనిపించి వెంటనే మరికొంత సమాచారాన్ని కలపడం జరిగింది. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు.-భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

సుజాత గారికి- మీరు సూచించిన ఫాలోయర్స్ విడ్జెట్ (Followers’ Gadget అనుకుంటాను) గురించి కొంత ప్రయత్నం చేసాను. ఈ బ్లాగులో దాన్ని జోడించడానికి సాంకేతికంగా కుదరకపోవచ్చని ఇందులో అనుభవం వున్న కొందరు చెప్పారు. ఎలా చేయవచ్చో తెలియపరుస్తే మరో ప్రయత్నం చేస్తాను. –భండారు శ్రీనివాసరావు