14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)
   

4 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

ముఖ్యమంత్రిగాఆయనను పదవీ బాధ్యతలనుంచి తప్పించినప్పుడు ఇంకా (యమదూతలిద్దరు) జికె మూపనార్, ఎన్డీ తివారి ఆయన అధికార నివాసం జయప్రజా భవన్ లో వుండగానే మనమంతా కుటుంబ సభ్యులతో వెళ్లి ఆయనను కలిసిన గుర్తు. అంతం క్రితం రోజు నీతో అంజయ్య, ఎవరికో సహాయం చేయమని (బహుశా ఆకాశవాణిలోనో, దూరదర్శన్ లోనో) అడగడం కూడా గుర్తుంది. ఆయన చేసుకోలేక కాదు. నీ లాంటి స్నేహితులపై ఆయనకున్న అభిమానం-నమ్మకం వల్ల అలా అడిగించింది. ఇంతెందుకు... మీ ఇంటికి రాలేదా...తన అధికారిక ముఖ్యమంత్రి వాహనాన్ని నడిరోడ్డు మీద ఆపి, నడిచి సచివాలయానికి వెళ్తున్న నిన్ను ఎక్కించుకోలేదా? "రాజధాని పేపర్" ఆదిరాజు జోక్ గుర్తుచేసుకోవడం బాగుండదు కదా!జి. కృష్ణ గారికి సహాయం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా, అప్పట్లో వెయ్యి నూట పదహార్లు ఇచ్చిందీ అయనే. ఆయనకు ఆయనే మానవత్వంలో, మంచితనంలో, అమాయకత్వంలో సాటి.- జ్వాలా

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అంజయ్య గారిని గురించి జ్ఞాపకం చేసుకునే ప్రతి సందర్భంలో దాదాపు మనమిద్దరం కలిసే వున్నాం. డిల్లీ గెస్ట్ హౌస్ లో, తెలతెలవారకముందే, జేబువున్న ముతక బనీను, గళ్ల లుంగీ వేసుకుని ఆయన తిరుగుతుంటే మనం వెళ్లి కలిసిన రోజులు కూడా గుర్తున్నాయి. అసలు ముఖ్య మంత్రిని అలా కలవచ్చు అంటే నమ్మేవాళ్ళు కూడా వుండరు. నీ స్పందనలో పేర్కొన్న విషయాలలో కొన్ని “వ్యాపకాల జ్ఞాపకాలలో “ రాసాను. పునరావృత దోషంగా భావించి తిరిగి రాయలేదు. అయితే, సందర్భానుసారంగా ఎప్పుడయినా స్పర్శా మాత్రంగా పేర్కొనే ప్రయత్నం చేస్తాను. –ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు

సుజాత వేల్పూరి చెప్పారు...

అంజయ్య గారి అమాయకత్వం మీద ఎన్నో జోకులు పుట్టాయి గానీ ఆయన్ని నిజంగా ద్వేషించిన ప్రజలెవ్వరూ లేరు. కారిమికుల సమస్యల గురించి నిజంగా ఆలోచించిన రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారా అంటే ఆయనేనేమో!

ఇందుకు ఉదాహరణ మీరు చెప్పిన కౌలాలంపూర్ సంఘటనే!

మీ జ్ఞాపకాలు చాలా బావున్నాయి. ఇలాంటివి నెమరేసుకోవడం,మాలాంటి వారికి పంచడం మీలాంటి వారంతా అలవాటు చేసుకోవాలి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

సుజాత గారికి – ధన్యవాదాలు. సమయాభావం, స్తలాభావం అనే ప్రింట్ మీడియా పరిమితులు గురించి వరదాచారి గారు మీకు చెప్పేవుంటారు. బ్లాగులకు ఈ సూత్రం వర్తించదనుకోండి. అయినా సంవత్సరాల తరబడి చేసుకున్న అలవాటు. క్లుప్తత అనేది రేడియోలో మొదటి పాఠం. అందుకే కొద్ది కొద్దిగా అనుభవాల తవ్వకం. – భండారు శ్రీనివాసరావు