12, ఏప్రిల్ 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (290): భండారు శ్రీనివాసరావు

 పిలవకుండా మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్ళిన ముఖ్యమంత్రి

నాలుగున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.
ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?) లో మా ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు.
నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అసలే నాలుగు వాటాల ఇంట్లో ఓ రెండు గదుల ఇల్లు. అదీ ఏ పరిస్తితిలో వుందో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే, అక్కడినుంచి నాలుగో ఇల్లే మాది, మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము.
అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా బాగా వెనగ్గా వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో ఎక్కడ గుంట వుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము.
అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది.
గోడకు ఆనించి పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు భవనం వెంకట్రాం గారు కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు.
మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరి కొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు.
మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్.
అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాధికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
ఏవయినా అవి బంగారు రోజులు.



(ఇంకా వుంది)

10, ఏప్రిల్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (289): భండారు శ్రీనివాసరావు

 

అమ్మ ఇచ్చిన ఉద్యోగం ఈ ముఖ్యమంత్రి పదవి

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి అంజయ్య ఆ స్వింగ్ చైర్ లో కూర్చుని అటూ ఇటూ కదులుతూ.
అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.
చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.
ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు.
ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారు వుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.
ఆంధ్రప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు రాజీవ్ గాంధి విమానాల పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది.
ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. (మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన అదే ఇంట్లో వున్నారు ) ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ.
రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని, తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నారు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే, రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు.
రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
రాజకీయాల్లో ఇదొక వైచిత్రి.
కింది ఫోటో :
ముఖ్యమంత్రి అంజయ్య గారు, టేప్ రికార్డర్ సమేతంగా నేను, మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ మూర్తి గారు



(ఇంకా వుంది)

9, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (288) : భండారు శ్రీనివాసరావు

నేనొక సింహాన్ని.

అప్పటికి అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో కట్టలేదు. తగిన భూమి కేటాయింపు కోసం, ఆ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుమ చర్చలు జరుగుతున్నాయి. ఆ నాటికి అపోలో హాస్పిటల్ ఒక్క మద్రాసు (చెన్నై) లోనే వుండేది. దాని బ్రాంచి ఒకటి హైదరాబాదు హైదర్ గూడాలో పెట్టిన రెడ్డి గారికి దాన్ని మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించాలని ఆలోచన. అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య, అప్పటికి హైదరాబాదులో అన్నీ నర్సింగ్ హోం లే తప్ప కార్పొరేట్ తరహా హాస్పిటల్స్ లేవు. ఆ మొట్టమొదటిది తనది కావాలని ప్రతాప సి రెడ్డి గారి ఆకాంక్ష. దాన్ని నెరవేర్చుకోవడం కోసం విశాలమైన ప్రభుత్వ భూమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే సమయంలో గన్నవరం రాయుడు గారు అనే ఒక పెద్ద భూస్వామితో కలిసి మా మామగారు పెనుమర్తి గోపాల రావు గారు గుంటూరులో ఏదో పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకుంది అనే ఒక బాధ ఆయన అంతరాంతాల్లో గూడుకట్టుకుని వుంది. ఆ కారణంగా మా మధ్య పెద్దగా రాకపోకలు లేవు.
ఆ రోజుల్లో ఎవరైనా మా ఆఫీసుకు ( న్యూస్ రూమ్, రేడియో) వచ్చి మా న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారిని నా గురించి వాకబు చేస్తే ఆయన అనే మాట చాలామంది తర్వాత నాకు చెప్పేవారు. అదేమిటంటే, ‘శ్రీనివాసరావు ఇక్కడ ఎందుకు ఉంటాడు, అంజయ్య (ముఖ్యమంత్రి) జేబులో వుంటాడు’ అని. ఆయన హాస్యోక్తిగా అన్నప్పటికీ అది కొంత నిజం. రోజులో చాలా భాగం నా మకాం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే. ఓ గంట నేను కనబడకపోతే శ్రీనివాస్ ఎక్కడ అని ఆరా తీసేవారు.
ఆ విధంగా ఆ రోజుల్లో నేను అంజయ్య గారి ఆఫీసులో, ఆయనతో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో సూటూ బూటూ వేసుకున్న పెద్దాయన ఒకరు లోపలకు వచ్చారు. అప్పటికే ఆయన్ని చాలా సార్లు లోగడ కలిశారేమో తెలియదు, ముఖ్యమంత్రి ఆయన్ని గుర్తుపట్టి ‘రండి కూర్చోండి రెడ్డి గారు’ అని మర్యాద చేశారు. నేను లేచి బయటకు వెళ్లబోతుంటే ఆయన కూచోమని సైగ చేస్తూ, అంతకుముందు మాటామంతీలో నేను ప్రస్తావించిన విషయం గుర్తు పెట్టుకున్నారల్లె వుంది, అంజయ్య గారు ఆయనతో మరో మాట లేకుండా, ‘చూడండి రెడ్డి సాబ్, ఈయన శ్రీనివాస్. ఆలిండియా రేడియో మనిషి, నాకు బాగా కావాల్సిన వాడు, ఏదైనా మీనుంచి అయ్యే సాయం తప్పకుండా చేయండి’ అనేశారు. అంజయ్య గారి సహృదయత అలాంటిది.
అసలు విషయం ఏమిటంటే గుంటూరులో వ్యాపారం నిమిత్తం వుంటున్న మా మామగారికి కేన్సర్ వ్యాధి సోకింది. హైదరాబాదు రెడ్ హిల్స్ లో ఉన్న కేన్సర్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలి.
ఆ రోజు ఎదురుగా డాక్టరు ప్రతాపరెడ్డి గారు కనిపించేసరికి అంజయ్య గారికి ఈ విషయం గుర్తుకు వచ్చి ఆయనతో అనేసారు. నిజానికి రెడ్డి గారికి మద్రాసులో సొంత హాస్పిటల్ వుంది కాని అందులో కేన్సర్ విభాగం లేదు. అయినా ప్రతాప రెడ్డి గారు ‘మీరు పేషెంట్ ని తీసుకుని మద్రాసు వచ్చి నన్ను కలవండి, అడయార్ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తాను’ అన్నారు తన విజిటింగ్ కార్డు తీసి నాకు ఇస్తూ.
ఆ మాట ప్రకారమే, నేను మా ఆవిడ పిల్లలను తీసుకుని రైల్లో మద్రాసు వెళ్లాను. మా మామగారి చిన్న తమ్ముడు లక్ష్మీపతి గారు, పిన్నివసుంధర గారు మద్రాసులో వుంటున్నారు. వారి ఇంట్లోనే దిగాము.
మర్నాడు వెళ్లి ప్రతాప్ రెడ్డి గారిని కలిస్తే ఆయన గుర్తుపట్టి, వెంటనే అడయారు ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడి, అక్కడ అడ్మిషన్ ఇప్పించారు. అదీ ఆయనతో నా మొదటి పరిచయం.
అడయార్ ఆసుపత్రి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోయింది. కొద్ది రోజుల తర్వాత ‘లాభం లేదు, తీసుకు వెళ్ళండి’ అనేసారు.
అమ్మఒడిని, పిల్లల్ని వదిలేసి వచ్చినందువల్ల అప్పటికే మా ఆవిడ హైదరాబాదు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో కేన్సర్ రోగులకు, సహాయకుడికి విమానాల్లో సగం రాయితీ వుండేది. రైలు చార్జీ కంటే తక్కువలోనే మేమిద్దరం విమానంలో హైదరాబాదు చేరాము.
‘సరైన చదువు సంధ్యాలేదు, ఒక మాదిరి ఉద్యోగం సద్యోగం లేదు ఇలాంటి వాడికి పిల్లను ఎలా ఇవ్వాలి?’ అనే భావన ఆయనలో వుందో లేదో తెలియదు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత జీవితపు మలి సంధ్య వేళ ఆయన మోములో ‘పర్వాలేదు, అల్లుడు గట్టివాడే' అనే తెరిపిడి కనిపించింది. ఇదంతా నేను పనిచేస్తున్న రేడియో మహత్యం అని ఆయనకు తెలియదు కదా!
ఇది సరే! సింహం మాట ఏమిటి?
అదే చెబుతాను. నేనొక సింహాన్ని. నాది సింహ రాశి. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు.
కాలం గడుస్తున్న కొద్దీ ఎంత గొప్పఅడవికి రాజు అయినా, ముసలిది కాక తప్పదు, వయసులో వున్న వగరు పొగరు తగ్గుతాయి. దంతాలలో పటుత్వం పోతుంది. వేటాడంలో బిగువు సడలుతుంది.
అదీ నా ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు ‘నేను అలా ఇలా, నేనే మోనార్క్ ను’ అంటే నమ్మే వారు వుండరు.
బోనులో ముసలి సింహం బలహీనంగా గాండ్రిస్తూ బతుకు వెళ్లదీస్తుంది. జూ సిబ్బంది పెట్టింది తిని ఈ పూట గడిచింది అనుకుంటుంది.
చాలా మంది వయసు మళ్ళిన ఒంటరి మగవాళ్ల పరిస్థితి ఈ బోనులో సింహాల మాదిరే. కాకపోతే ఈ బోనులకు ఇనుప చువ్వల తలుపులు వుండవు. బార్లా తెరిచి వున్నా బయటకు వెళ్లి వేటాడ లేని దుస్థితి.
మొదటి నుంచీ, పనిచేసే సంస్థ కారణంగా ఈ పలుకుబడి, తగిలించుకున్న హోదా వల్ల ఈ అధికారం అనుకుంటే, ‘నేనే మోనార్క్ ని' అనుకుంటూ అదేదో సినిమాలోలా నలుగురిలో పలుచన అయ్యే అవకాశం వుండదు.
కింది ఫోటో:
అప్పటి గవర్నర్ శ్రీ కేసీ అబ్రహాం అంజయ్య గారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న దృశ్యం. వేదిక మీద అంజయ్య గారి వెనుక చుబుకం మీద చేయి ఆనించుకుని చూస్తున్నది నేనే. నాకు ఇరువైపులా నాటి పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎంవీ నారాయణరావు గారు, తదనంతర కాలంలో డీజీపీ అయిన పి.ఎస్. రామమోహన రావుగారు.



(ఇంకావుంది)

1, ఏప్రిల్ 2026, బుధవారం

అనుమాన పక్షి – భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్లు వెనక్కి వెడితే ..
“డీ.జే. టిల్లు! ఇదేం పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే.
ఈ సినిమా డైరెక్టర్ విమల్ కృష్ణ, నా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ Sravan Kumar Pingili ఏకైక కుమారుడు. బీ. టెక్. చదివాడు. అమెరికా ఛాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండిపోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. విమల్ డైరెక్ట్ చేసిన చిత్రం డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని ఆ రోజుల్లో అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.
నాది పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవ తరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది.
అప్పటికి జెన్ జడ్ (Gen Z అంటే 1997 - 2012 మధ్య జన్మించిన వాళ్ళు) అనే పదం కూడా ప్రాచుర్యంలో లేదు. నేటి కుర్రకారుకు ముందు చూపులేదు అని పాత తరం అనుకునే మాటలోనే ఏమాత్రం ముందు చూపులేదు అని ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది.
“జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన డీ జే టిల్లు కుర్ర బృందానికి అభినందనలు.
పొతే, ఈ సినిమాలో హీరోగా వేసిన సిద్దూతో మరో బాదరాయణ సంబంధం. అతగాడు ఒకానొక రోజుల్లో నా రేడియో సహోద్యోగి శారద గారి అబ్బాయి. సినిమా విజయవంతం అయిన పుత్రోత్సాహంతో ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకీ విషయం తెలిసింది. సినిమా నిర్మాణ సమయంలో తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతుండే కుర్ర డైరెక్టర్ విమల్ నా మేనల్లుడి కుమారుడు అని నేను చెప్పేదాకా ఆమెకూ తెలియదు.
మొన్న నా మేనకోడలు Manikumari Govindarajula మణి కుమారి ఇంట్లో, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విమల్ కృష్ణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధం అవుతున్న మరో చిత్రం అనుమాన పక్షి సినిమాలో ఒక పాటను (నేటి సినీ పరిభాషలో టీజర్ అంటారనుకుంటా) విన్నప్పుడు, ఈ విషయాలు అన్నీ సినిమా రీలులా మనసులో సుడి తిరిగాయి.
'ఘన విజయం సినిమా తీసిన ఒక డైరెక్టర్ కు మరో సినిమా తీయడానికి నాలుగేళ్ల కాలం ఎందుకు పట్టింది? డీజే టిల్లు సీక్వెల్ కు దర్శకత్వం చేసే అవకాశం ఎందుకు అంది పుచ్చుకోలేదు' అనే సందేహాలకు విమల్ కృష్ణ తనదైన రీతిలో చాలా హుందాగా జవాబు చెప్పాడు.
'డీజే టిల్లులో హీరో పాత్ర ఒక ఐకానిక్ కేరక్టర్. మళ్ళీ అలాంటి కేరక్టర్ కోసమే ఇంత విరామం. సీక్వెల్ కంటే మరో ఐకానిక్ పాత్ర రూపొందించడమే నేను ఇష్టపడ్డాను, వేరే కారణాలు ఏవీ లేవు' అన్నది విమల్ కృష్ణ వివరణ.
జెన్ జడ్ అంటేనే సొంత, నిర్ధిష్ట అభిప్రాయాలతో ముందుకు సాగే తరం. మా తరం మాట్లాడేది ఏముంటుంది? ఆ తరాన్ని సమర్థించక పోయినా, వారిని నిరుత్సాహ పరచకపోవడమే మా తరం చేయాల్సిన పని.
All the best my dear Vimal Krishna
తోకటపా : మేనల్లుడు శ్రవణ్ కుమార్ సుప్రసిద్ధ చలన చిత్ర నటుడు కృష్ణ, ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మలకు ప్రగాఢ అభిమాని. వారి పట్ల అభిమాన సూచకంగా తన సంతానానికి విమల్ కృష్ణ, రమ్య కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు.
కింది లింక్ :
అనుమాన పక్షి సినిమాలో రమణ గోగుల పాడిన గులాబ్ జామ్





(01-04-2026)