2, ఆగస్టు 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (351) : భండారు శ్రీనివాసరావు


పిల్లలే గురువులు 


మాకిద్దరు మగ పిల్లలు. కానీ నా పెద్ద పిల్లాడు మాత్రం సుభాషే అనేది మా ఆవిడ ఎప్పుడూ. 


సుభాష్ అంటే సుభాష్ చంద్ర బోస్. మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారి రెండో కుమారుడు.


మా పెద్దవాడు సందీప్  చదువుల కోసం నాగపూరులో ఉండేవాడు. మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ ఎప్పుడూ మా ఇద్దర్నీ కనిపెట్టుకుని ఉండేవాడు. వాడికి పెళ్ళయిన తర్వాత కూడా మా రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో పైనా కిందా వుండే వాళ్ళం.

మాకే కాదు మొత్తం మా కుటుంబంలో అందరికీ సుభాష్ 108. పిలిస్తే పలికే మనిషి. ఎవరికి ఏ అవసరం పడినా చాలు, వాలిపోయేవాడు, సొంత పనులు పక్కనపెట్టి.


ఈ విషయంలో వాడిది, మా అన్నయ్య, అంటే వాడి నాన్నగారు  రామచంద్రరావు గారి పోలిక. కుటుంబంలో పెద్ద. దానికి తోడు పెద్ద మనసు.  స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజరుగా రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేసినన్ని రోజులు క్రమం తప్పకుండా ఆఫీసుకు వెళ్ళేవారు. రిటైర్ అయిన మర్నాడు వెళ్ళలేదు. అంతే తేడా! పదవీ విరమణ వేడుకలు లేవు. షష్టిపూర్తి  ఉత్సవాలు లేవు. అలాగే ఎనభయ్యేళ్లు పూర్తయిన తరువాత కూడా సహస్ర చంద్ర దర్శన క్రతువులు లేవు.


అలాంటి రోజుల్లో వాళ్ళు హైదరాబాద్ లో వుండకుండా తిరుపతి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో గడుపుతారు.

అంతటి నిరాడంబర జీవన శైలి. 


మా సుభాష్, హేమల పెళ్లి రోజు, మా ఆవిడ పుట్టిన రోజూ ఒకే రోజు కావడంతో వాళ్లకు పెళ్ళయిన నాటి నుంచీ కలిసే వేడుక జరుపుకుంటూ రావడం ఆనవాయితీ. మా ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళు తమ పెళ్లి వేడుక జరుపుకోలేదు. పిన్ని అంటే వాడికి అంతటి ఆపేక్ష. 


మా అన్నయ్య కొడుకు, కోడలు సుభాష్, హేమల ముద్దుల కుమార్తె శిఖిర. మా కళ్ళముందు పుట్టి పెరిగిన ఈ బంగారు బొమ్మ అప్పుడే ఇంజనీరింగ్ ఫైనల్. సెలవుల్లో చేసిన ఇంటర్న్ షిప్ వేతనంతో వాళ్ళ బామ్మాతాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలతో పాటు నాకూ మా ఆవిడకూ కొత్త బట్టలు పెట్టి ఆశీర్వచనం తీసుకుంది. (ఇప్పుడు పెళ్లి చేసుకుని కాపురం, ఉద్యోగం అమెరికాలో)

 

నాకూ ఎనభయ్ ఏళ్ళు ఈ వారంలో నిండుతాయి. చుట్టపక్కాల్లో నా సహస్ర చంద్ర దర్శనం గురించి ముచ్చట్లు మొదలయ్యాయి. భార్య పక్కన లేకుండా ఆ వేడుక నాకు అస్సలు ఇష్టంలేదు.  నేను ఆ రోజు ఇక్కడ వుండకుండా కటక్ వెళ్లి నా చిన్న మనుమరాలు జీవిక ముఖచంద్ర దర్శనం చేసుకోవాలని. ఎవరికీ చెప్పకుండా  టికెట్ బుక్ చేసుకున్నాను. అసలు ఇన్నేళ్ళు గడిచి, రేపోమాపో ఎనభయ్ ఒకటో ఏట అడుగుపెట్టడమే కలిసివచ్చిన అదృష్టం అనుకోవాలి. దేవుడిచ్చిన వరం అనుకోవాలి.  


నాకు ఇద్దరు మగపిల్లలే కావడంతో, నాకు  కన్యాదాన ఫలం దక్కే అవకాశం లేదని, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, వదిన సరోజిని దేవి తమ  మూడో అమ్మాయి వివాహం సమయంలో నాకూ, మా ఆవిడకూ లేని, రాని ఆ అదృష్టాన్ని కలిగించి, మా చేతుల మీదుగా వాణిని కన్యాదానం చేసే మహత్తర భాగ్యం కల్పించారు. 


అలాగే మా రెండో అన్నయ్య రామచంద్రరావు, వదిన  విమలాదేవి గార్ల రెండో కుమారుడు సుభాష్ చంద్రబోస్, భార్య హేమ, మంచి మనసుతో మళ్ళీ  నాకు అటువంటి గొప్ప అవకాశం ఇచ్చారు. వాడి పెద్ద బిడ్డ శిఖిర వివాహంలో  మా రెండో కుమారుడు సంతోష్, నిశా దంపతుల ఏకైక కుమార్తె చిన్నారి జీవికను తోడు పెళ్లి కూతురిగా కూర్చోబెట్టి అలంకారం చేశారు. మరో పాతిక ఏళ్ళకు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలమీద జీవికని చూసే అవకాశం నాకు ఎట్లాగూ వుండదు. 

ఆ మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మా అన్నయ్యకు, సుభాష్, హేమ దంపతులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


ఇక మా సుభాష్ కు, మా అన్నగారికి ఏమాత్రం ఇష్టం లేని ఒక సమాచారంతో ఇది ముగిస్తాను. ఎందుకంటే, వాళ్ళకూ  ప్రచార ఆర్భాటాలకు, చుక్కెదురు. 

సుభాష్ ఎలాగూ ఈ ఫేస్ బుక్ లో లేడు, ఎవరైనా చెబితే తప్ప తెలియదు. ఇక  మా అన్నయ్య రామచంద్ర రావు గారితోనే ఇబ్బంది. అయినా మా కుటుంబంలో ఆయనకు మాత్రమే వున్న పెద్ద మనసుతో నా ఈ కుర్ర చేష్టను మన్నిస్తారని భావిస్తున్నాను.


మా అన్నయ్య రెండో కుమారుడు సుభాష్ చంద్ర బోస్ మొన్న జులై ముప్పయి ఒకటో తేదీన కష్టమ్స్ అండ్ జీ.ఎస్.టీ.  అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యాడు. 


సాధారణంగా  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే రోజున ఒక సాంప్రదాయం పాటిస్తారు. హోదాతో నిమితం లేకుండా ఇంటికి కారు పంపించి, కుటుంబ సభ్యులను రప్పించి ఆఫీసులో వీడ్కోలు కార్యక్రమం తరువాత  మళ్ళీ ఇంటికి ఆఫీసు కారులోనే సాగనంపుతారు.  ఇది షరా మామూలుగా జరిగే విషయమే. విశేషం ఏమీ లేదు. 


కానీ సుభాష్ తన రిటైర్ మెంటు కొత్త పద్దతిలో ప్లాన్ చేశాడు. ఎప్పుడో 34 ఏళ్ళ క్రితం కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మా అన్నయ్య వాడికి ఒక బైక్ కొనిపెట్టాడు. ఏళ్ళు గడుస్తున్నా, ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నా ఆ బైక్ ను పదిలంగా చూసుకుంటూ వచ్చాడు. ఏ బైక్ మీద మొదటి సారి ఆఫీసుకు వెళ్ళాడో,  వాళ్ళ నాన్న ప్రేమగా కొనిచ్చిన అదే బైక్ పై ఆఫీసు నుంచి భార్య హేమను వెనుక కూర్చోబెట్టుకుని ఇంటికి చేరాడు. 

కుటుంబ సభ్యుల నడుమ కృతజ్ఞతలు వుండరాదు. కానీ ఆదరణలు, ఆప్యాయతలు,  ప్రేమాభిమానాలు లుప్తం కాకూడదు. అప్పుడే కుటుంబ వ్యవస్థ నాలుగు కాలాల పాటు నిలబడుతుంది. 


నిజంగా గొప్ప పని చేశావ్ సుభాష్! కంగ్రాట్స్!


(చట్టబద్ధమైన హెచ్చరిక: హెల్మెట్ లేకుండా వాహనాలు నడప రాదు)









PHOTOS COURTESY: A FRIEND OF SUBHASH


(ఇంకావుంది)