పుత్రోత్సాహము తండ్రికి... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుత్రోత్సాహము తండ్రికి... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఆగస్టు 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (353) : భండారు శ్రీనివాసరావు



పుత్రోత్సాహము తండ్రికి...
ఓ ఎనభయ్ ఏళ్ళ కిందట.
"విన్నారా పొద్దున్న పర్వతాలయ్య బావగారి కోడలు వెంకట్రావమ్మ నీళ్ళాడింది. మగ పిల్లాడు"
"అలాగా సంతోషం. ముందా ముందు గది బీరువాలో పంచాంగం, రూళ్ళ పుస్తకం వుంటాయి. పట్రా!"
"వ్యయ నామ సంవత్సరం శ్రావణ మాసం బుధవారం ఉదయం ఆరు ఘడియలకు చిరంజీవి భండారు రాఘవ రావు నాలుగో కుమారుడి జననం"
రూళ్ళ పుస్తకంలో బర్త్ సర్టిఫికేట్.
ఆ తర్వాత పాతిక ముప్పయ్యేళ్లకు.
"చిట్టి డెలివర్డ్. మేల్ చైల్డ్. మదర్ అండ్ బేబీ సేఫ్" టెలిగ్రాం
ఇక ఇప్పుడో!
అప్పుడే పుట్టిన పాపాయిని చేతుల్లో పట్టుకున్న ఫోటోతో, "డాడ్ అండ్ మామ్ , వుయ్ ఆర్ నవ్ ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ యే క్యూట్ బేబీ"
- వాట్సప్ లో సందేశం
ఇవన్నీ మారిన మారుతున్న కాలానికి చెందిన మాటలు.
ఇందులో మొదటి ముచ్చట నాదయితే, రెండోది,
'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్’ అని చెన్నై (అప్పుడు మద్రాసు) నుంచి టెలిగ్రాం ఇచ్చింది మా మామగారు పెనుమర్తి గోపాలరావు గారు. దాన్ని మరునాడు బెజవాడలో అందుకుని మురిసిపోయింది భండారు శ్రీనివాసరావు అనే నేను.
‘ఉత్త మురిసిపోవడాలేనా, ఇంత మంచి వార్త అందించిన మా నోరు తీపి చేసేది ఏమన్నా వుందా లేదా’
ఆంధ్రజ్యోతి నైట్ డ్యూటీ నుంచి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన నాకు, ఆ టెలిగ్రాం చేతిలో పెడుతూ అన్నది మా ఇంటి ఓనరు భార్య రమణి గారు.
పత్రికల్లో పనిచేసేవారికి ఆ రోజుల్లో ప్రతి నెలా ఏడో తేదీన జీతాలు ఇచ్చేవారు. అంటే ఆ టెలిగ్రాం అందుకున్న రోజు మాకు పక్కా నెలాఖరు రోజు. ఆమె మాటకు ఏమనాలో తెలియక, తెల్ల మొహం వేసుకుని ఇంట్లో (గదిలో) వచ్చి పడ్డాను. ( ఆ రోజుల్లో మా కాపురం ఒకే ఒక గదిలో మొదలయింది)
1974 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల నాడు వాడి యాభయ్యవ పుట్టిన రోజున నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి పుట్టినరోజు వేడుకను సియాటిల్ లోని వాషింగ్టన్ సరస్సులో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు.
ఆ సందర్భంగా సందీప్ గురించి మాట్లాడమని వాడి ఫెండ్స్ అడిగితే, నాకు మాటలు కరువయ్యాయి. ఒక్కటే మాట చెప్పాను.
‘2019 లో నా భార్య నిర్మల కన్ను మూసే వరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు'
ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.
ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.
ఈ సారి వాడు తన పుట్టిన రోజున హైదరాబాదులో వున్నాడు.
హ్యాపీ బర్త్ డే మై డియర్ సందీప్!
(సాంఘిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టడం వాడికి అస్సలు ఇష్టం వుండదు. వాడి పుట్టిన రోజున వాడికి ఇష్టం లేని పని చేయడం నాకు ఇష్టం వుండదు. అంచేత వాడి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బెజవాడ మాతా స్టూడియోకి తీసుకువెళ్లి తీయించిన ఫోటో పెట్టి ఊరుకుంటున్నాను)



(ఇంకా వుంది)