VALID UPTO 2099
సీ.జీ.హెచ్.ఎస్.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షల మంది ఉద్యోగులకు, ముప్పై లక్షల మంది రిటైర్డ్ సిబ్బందికీ సుపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)
1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సీతారామారెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయి వుంటాయి.
నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల, సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసి వుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. 'మా దేశం బయట ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి, కావున మాకు సంబంధం లేద'ని వాళ్లు తేల్చారు.
సరే విదేశాల్లో ఉద్యోగం కనుక ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాలేదు. దీనికి తోడు ఆ నాటి వైద్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారు చేసిన మాట సాయం బాగా ఉపయోగపడింది.
ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ 2009 లో మరో గుండె ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీ ఉద్యోగిని. మాజీ విలేకరిని. CGHS ప్రమేయం లేకుండా మా అబ్బాయి ఇన్స్యురెన్స్ పాలసీతో బయట పడ్డాం.
2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీ.జీ.హెచ్.ఎస్. సేవలను వాడుకోగల అవకాశం నాకు ఏనాడూ దొరకలేదు.
రిటైర్ అయిన తర్వాత, 2014 లో కాబోలు, డీడీ లో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే, బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీ.జీ.హెచ్.ఎస్. ప్రధాన కార్యాలయానికి వెళ్లాను.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం అటూ ఇటుగా లేట్ ఫీ ఇరవై వేలు డబ్బు కట్టించుకుని, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా మొత్తం మీద పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు.
వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ, మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా, 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం, తీసుకెళ్ళి లామినేట్ చేసుకుని వాడుకోండ'ని సలహా ఇచ్చారు.
ఆ రోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకు రమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే, (టీవీ చర్చల మహత్యం కాబోలు) 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి, మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని, ఇచ్చిన కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న గర్వంతో బయట పడ్డాను.
పడి, ఇంటికి వచ్చి చూసుకుంటే, 2099 వరకు ఈ కార్డు చెల్లుబాటులో వుంటుందని వుంది. అప్పటికి నా వయసు డెబ్బయి దాటలేదు. మరో 84 ఏళ్ళు, అంటే 154 ఏళ్ళ వయసు వరకు వాడుకోవచ్చు. అప్పటికి ఎవరికి ఎవరో ఎవరికి తెలుసు.
కేంద్ర సిబ్బంది బాగోగులు చేసే విభాగం కదా! ‘అంతకాలం ఆరోగ్యంగా వుంటూ మళ్ళీ మాకు పని పెట్టకండీ! దీర్ఘాయుష్మాన్ భవ!’ అని దీవించి ఇచ్చిన బాపతు కాబోలు అని సరి పెట్టుకున్నాను.
పతు అని సరిపెట్టుకున్నాను.
తదుపరి లామినేటెడ్ ఫోటో కార్డు జారీ చేసినప్పుడు ఈ పొరపాటు సరిచేశారు అనుకోండి.
వాళ్ళ దీవెన కొంత ఫలించి, ఆ కార్డు వాడే అవసరం ఇంతవరకు రాలేదు. సంతోషం.
