హ్యాపీ డే
ప్రతిమనిషి జీవితంలో కొన్ని హ్యాపీ డేస్ వుంటాయి. వాటిని పూర్తిగా ఎంజాయ్ చేస్తే మిగిలిన అన్ని రోజులు కూడా హ్యాపీగా గడుస్తాయి.
కొన్నేళ్ల క్రితం ఒక పెళ్ళికి వెళ్లాను. గుళ్ళో పెళ్లి. పెళ్ళికొడుకు తండ్రి నాకు తెలుసు. మంచి కలిగిన కుటుంబం. అవతల కన్యాదాత వాళ్ళు కూడా స్థితిమంతులే.
బంజారాహిల్స్ , వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి.
ముహూర్తం వేళకు వెళ్ళాము. బయట నాలుగయిదు కార్లు. లోపలకు వెడితే యాభయ్ అరవై మంది కనబడ్డారు. దగ్గరి చుట్టపక్కాలు కాబోలు.
వరుడి తండ్రి అందర్నీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించాడు. వున్న కొద్ది జాగాలో నలుచదరపు బల్లమీద తెల్లటి గుడ్డ పరచి, దాన్ని కళ్యాణ వేదిక చేశారు. ఆహూతులు అందరికీ పెళ్లివేడుక కనబడేటట్టు చుట్టూ కుర్చీలు వేశారు. వీడియో, కెమెరాల హడావిడి లేకపోవడంతో పెళ్ళికి వచ్చిన వారు అందరూ శుభకార్యాన్ని చక్కగా చూడగలిగారు. మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాల సంబరం ఇతర వివాహ వేడుకలను, చాలా కాలం తర్వాత దగ్గర నుంచి చూడగలిగాము.
వధూవరులు ఇద్దరూ ఆహూతులు అందరి దగ్గరకు వచ్చి, పెద్దలకు పాదనమస్కారాలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం బయటకు వెళ్లి అరుంధతీ నక్షత్రం చూసే సాంప్రదాయాన్ని పాటించి, ఆ ఆవరణలోనే వున్న దేవాలయానికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
వచ్చిన అతిధులు అందరికీ దాపునే ఉన్న ఒక పెద్ద రెస్టారెంట్ లో విందు భోజనం ఏర్పాటు చేశారు. దగ్గరుండి కనుక్కున్నారు.
పెళ్లి వేడుకను సలక్షణంగా తిలకించడానికి అవకాశం దొరక్క, వేదికమీదకు వెళ్ళడానికి హడావుడిగా పెద్ద క్యూలో నిలబడి, అంతకంటే హడావిడిగా అక్షింతలు వేసి, వధూవరులుని ఆశీర్వదించి, గ్రూపు ఫోటోలు దిగి, అప్పటికే ఆలస్యం అయిపోయిందంటూ తొడతొక్కిడిగా భోజనాలు చేశామనిపించుకుని, కారు పార్కింగులో మరింత సమయం వృధా చేసుకుని ఇళ్లకు మళ్లే వివాహాలతో పోల్చుకుంటే, ఈ పెళ్లి వేడుక మనసుని మురిపించింది. ఆహ్లాదపరచింది.
అదే సాయంత్రం నా అదృష్టం కొద్దీ మరోచోట నా మనసుకు ఉల్లాసం కలిగించే రీతిలో కొన్ని గంటలు గడిపే మరో అవకాశం దొరికింది.
బుంటీ అని మేము పిలుచుకునే Premamalini Vanam ప్రేమమాలిని ది జర్నలిస్ట్, ఆమె భర్త విజయ్ ఈ ఇద్దరూ మా కుటుంబం మొత్తంలో స్వర మిధునం.
చేసే ఉద్యోగాలు వేరైనా వారి ప్రవృత్తి ఒక్కటే. ఒకరు పాడతారు. రెండోవారు వింటారు. రెండో వారు పాడతారు. మొదటి వారు వింటారు. లేకపోతే పాడేవారితో గొంతు కలుపుతారు. ఇలా చాలా సంవత్సరాలుగా వారి కాపురం అన్యోన్యంగా మూడు పాటలు ఆరు స్వరాలుగా సాగుతూ వచ్చింది.
విజయ్ కి ఓ కొత్త ఐడియా వచ్చింది. అంతే! తనకు తానుగా నిర్ణయం తీసుకుని ఔత్సాహిక గాయనీ గాయకుల కోసం ఏకంగా ఒక సంస్థనే నెలకొల్పాడు. 'మా అమ్మాయి, అల్లుడి కార్యక్రమం వీలుంటే రా' అని జ్వాలా రమ్మన్నప్పుడు 'లేదు, కుదరదు' అనకుండా వెళ్ళడం చాలా మంచిదయింది.
మనం ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోతుంటాం. కానీ అక్కడికి వచ్చిన వారందరూ అలా కాదు. వేరువేరు వయసుల వాళ్ళు. వాళ్ళందరినీ కట్టిపడేసేది పాట. అందరికీ పాట అంటే ఇష్టం. పాడడం అంటే ఇష్టం. పాట వినడం మరీ ఇష్టం.
వాళ్ళు మనసు పెట్టి పాడుతుంటే మనసు వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. టైం తెలవకుండా గడిచిపోయింది.
ఆ తర్వాత జ్వాలాతో కలిసి అమెరికా నుంచి వచ్చిన మా మేనత్త మనుమలు Rao Tallapragada తల్లాప్రగడ రామచంద్రరావు, వారి సోదరుడు Subbarao Tallapragada సుబ్బారావుతో చక్కని మాటల కచ్చేరీ నడిచింది.
ఏదైతేనేం, ఒంటరి మనసు ఆ రోజు తేటపడింది.
తరువాత కొన్ని రోజులకే నా మరో మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు ఆకస్మిక మరణంతో పెన్నులో ఇంకు ఇంకిపోయింది. రాతకు బ్రేకు పడింది.
అన్నిరోజులు హ్యాపీ డేస్ కావు.
లాటరీ తీసినట్టు వాటిల్లో ఒక్కటే హ్యాపీ డే.
అదే ముందు చెప్పిన రోజు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి