అనుమానప్పక్షి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుమానప్పక్షి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (352) : భండారు శ్రీనివాసరావు


అనుమానప్పక్షి
‘కామన్ మ్యాన్ అంటే ఎవరో చెప్పు మ్యాన్!’ అడిగాడు శవంలోని భేతాళుడు.
‘చెప్పడానికి ఏముంది? అతగాడో అనుమానప్పక్షి. అన్నీ అనుమానాలే. సందేహం ముందు పుట్టి అతడు తర్వాత పుట్టాడు’
విక్రమార్కుడికి మౌనభంగం కాగానే శవంలోని భేతాళుడు చెట్టెక్కి కూర్చున్నాడో లేదో మనకనవసరం.
ఈ దేశంలో అనుమానపు మనుషుల సంఖ్య ఎంతో తెలియదు కానీ అది భారీగానే వుంటుందని నా అనుమానం. ఎందుకంటే వారి వరుసలో నేనూ వుంటాను కనుక. నేనూ కామన్ మ్యాన్ నే కదా! అనుమానపు మొగుళ్లు, అనుమానపు భార్యలు ఈ కోవలోకి రారు. ఆ తరగతి వేరే! ఇదంతా ఫక్తు సామాన్యుల గోల. పైకి వినిపించని రొద.
మొన్న అమెరికా నుంచి బయలుదేరిన మా పెద్దవాడు సందీప్ రాత్రి అంటే ఈరోజు తెల్లవారుఝామున రెండు గంటలకు హైదరాబాదు చేరాడు. కాసేపు నడుం వాల్చి ఫ్రెష్ అప్ అయి ఆఫీసుకు వాళ్ళ కారులో వెళ్ళిపోయాడు. హైదరాబాదులో వాడికి ఇండియన్ కరెన్సీ అవసరం అని మా కోడలు భావన ముందుగానే కొంత డబ్బు (డాలర్లు) నా ఖాతాకు బదిలీ చేసింది.
మా ఇంటి దగ్గరలో రోడ్డు దాటగానే ఏటీఎం. రద్దీగా వుండే ఆ రోడ్డు దాటడం ఒక్కటే ఇబ్బంది కానీ, ఫోను చేతిలో వుంటే చాలు, అయిదువందల రూపాయల నోట్లు గలగలమంటూ చేతిలో పడతాయి అనే ధైర్యంతో సాధారణంగా పెద్దగా డబ్బు ఇంట్లో పెట్టుకోను. పైగా డబ్బు లావాదేవీలన్నీ మొబైల్ తోనే అయిపోతున్నప్పుడు ఇక కరెన్సీతో పనేముందని ధీమా.
సరే స్నానం చేసి, అయిదు నిమిషాల పని అనుకుని షార్ట్స్ తోనే బయట పడ్డాను. ఏటీఎం కు వెళ్లి నెలలు గడిచాయి. ఇంటి దగ్గర ఏటీ ఎం కనిపించలేదు. దాని స్థానంలో వేరే ఏదో షాపు వచ్చింది. సరే అని కొంత ముందుకు నడిచాను.
అక్కడో ఏటీఎం వుంది. అద్దాల తలుపుల్లో ఒకటి లేదు. తోసుకుని వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోపలకు వెళ్లాను. అప్పుడే ఖాళీ చేసి వెళ్ళిన అద్దె కొంపలా చిందరవందరగా వుంది. మూడు మెషిన్లు బోసిగా కనిపించాయి. ప్రతి మిషన్ మీద లైట్లు వెలుగుతున్నాయి. ‘నగదు లేదు’ అని ఇంగ్లీష్ లో వాటి తెరలపై నోటిఫికేషన్.
మరి కాస్త ముందుకు వెళ్లాను. అక్కడ ఒక్క చోటనే మూడు బ్యాంకుల ఏటీఎంలు. లోపలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే బయటకు వస్తున్నారు. వాకబు చేస్తే అదే జవాబు, కాకపొతే ఈసారి వారి నోటి వెంట. ‘క్యాష్ లేదు’. మూడిట్లో ఒకే రోజు ఒకే సమయంలో క్యాష్ లేదు. విచిత్రం అనిపించింది. ఏదో అనుమానం పొటమరించింది.
విసుగు చెందని విక్రమార్కుడిలా మరింత ముందుకు నడిచాను. మరో రెండు కనపడ్డాయి. ఒక దాంట్లో క్యాష్ లేదు. మరో దాంట్లో వుంది. కానీ చాలామంది వున్నారు. తీరా మన టర్న్ వచ్చేసరికి కేవలం వంద రూపాయల నోట్లు అవీ నలభయ్ మాత్రమే అని రాసి వుంది. అంటే నాలుగు వేలు. రెండు సార్లు తీసినా ఎనిమిది వేలు. అవసరానికి ఏమాత్రం సరిపోవు.
ఇక లాభం లేదని ఒక కిలోమీటరు దూరంలో మా బ్యాంకు బ్రాంచి వుంది. దానికి అనుకుని ఏటీఎం కూడా వుంది. నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరాను.
ఇంట్లో వున్నప్పుడు ఎప్పుడూ కురవని వాన మొదలయింది. తల దాచుకోవడానికి రత్న దీప్ సూపర్ మార్కెట్లోకి వెళ్లాను. వెళ్లాను కనుక ఏవో అనవసరమైనవి కొన్నాను. ఒక సేల్స్ గర్ల్ వచ్చి ట్రాలీ ముందు పెట్టింది. తోసుకుంటూ తోసుకుంటూ లేనిపోనివి అన్నీ కొన్నాను. బిల్లింగు దగ్గర అమ్మాయి ఎవర్నో పిలవడం ఏదో తెమ్మనడం చూసి ఏమిటి అని ఆరా తీస్తే, నేను కొన్న వాటిల్లో కొన్ని ‘ఒకటి కొంటే రెండు’ బాపతు. అసలు కొన్నవే అనవసరం అనుకుంటే ఇవి అదనం. ఒక పెద్ద సంచీలో సరుకులు సర్ది చేతికి ఇచ్చింది. వీటితో బ్యాంకుకు ఎలా వెళ్ళాలి?
అవసరం తప్పదు కదా! ఆటో మాట్లాడుకుని వెళ్లాను. ఆ బ్రాంచి ఏటీఎం లో చాలామంది కనిపించారు. అక్కడా క్యాష్ లేదు, వాన కోసం నిలబడ్డ బాపతు వారంతా.
ఆ బ్రాంచికి వెళ్లి దాదాపు మూడేళ్లు. అంతకు ముందు ‘బతికే వున్నాను’ సర్టిఫికేట్ కోసం ఏడాదికి ఒకసారి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా నెట్లోనే. దాంతో బ్యాంకు మొహం చూడక చాలా కాలం అయింది.
బ్రాంచిలో జనం వున్నారు. పనిచేసేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో. ‘మేనేజర్ గారున్నారా’ అని అడిగితే అక్కడ కుర్చీలో కూచున్న నాలుగో తరగతి అధికారి ‘ఎందుకు ఏం కావాలి’ అని ఆర్చేవాడు, తీర్చేవాడు తానే అన్నట్టు అడిగాడు. వచ్చిన పని చెబితే, ‘బయటకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదు’ అనేశాడు మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా.
పక్కన మరో అద్దాల క్యాబిన్ లో ఒక లేడీ అధికారి కూర్చుని వుంది. బయట బోర్డు చూస్తే క్యాష్ ఆఫీసర్ అని కనిపించింది. బల్ల మీద బోలెడు కరెన్సీ బండిల్స్. వాటి నడుమ ఆమె సాక్షాత్తూ లక్ష్మీ దేవిలా వుంది. నేను అనుమానపు చూపులు చూస్తుంటే, ఆమెకు అనుమానం వేసిందేమో లోపలకు రమ్మని సైగ చేసింది. అంత డబ్బుతో వున్న ఛాంబర్ లోకి నేను అనుమానంగానే వెళ్లాను. ‘ఏమి కావాలి’ అని అడిగారు మర్యాదగా. ‘యాభయ్ ఏళ్ళకు పైగా మీ బ్యాంకు కష్టమర్ని. ఈ రోజు కొంత డబ్బు అవసరం వచ్చింది. ఏమైనా సాయం చేయగలరా!’ అని అడిగాను.
‘తప్పకుండా. చెక్ వుందా! మీది కోటీ బ్రాంచ్. చెక్ లేకుండా క్యాష్ ఇవ్వలేము సారీ!' అనేశారు ఇదే ఫైనల్ అన్నట్టు.
కొన్నేళ్ళ క్రితం ఏవో ఎరియర్స్ వస్తే ఇదే బ్రాంచి మేనేజర్ రిక్వెస్ట్ మీద డిపాజిట్ చేశాను. ఇప్పుడు అదే బ్రాంచి వాళ్ళు ‘కోటీ పోతే కానీ మీ పని కాదు’ అంటున్నారు. డిజిటల్ యుగంలో ఇలా వుండకూడదు కదా! కానీ డబ్బులతో పని. బ్యాంకుల బాధ్యతలు వేరు అనుకోవాలి. సామాన్యుడి ఆలోచన ఆ హద్దు దాటకూడదు.
‘పక్కనే మీ ఏటీఎంలో క్యాష్ లేదు, ఎప్పుడు ఫిల్ చేస్తారు, ఒక అరగంట వెయిట్ చేస్తే సరిపోతుందా’ అని అడిగాను.
‘చెప్పలేము. ఇదిగో ఈ క్యాష్ అంతా అందులో లోడ్ చేయాలి. ఆ స్టాఫ్ వేరే!’
విషయం బోధ పడింది. ఈ రోజుకు ఇంతే!
ఉబెర్ బుక్ చేసుకుని ఉసూరుమంటూ ఇంటికి చేరాను. స్విచ్ ఆఫ్ చేసినట్టు వాన ఆగిపోయింది.
సామాన్యుడిని కదా! అనుమానాలు ఎక్కువ.
అసలేం జరుగుతోంది?
పెద్ద నోట్ల రద్దు కాలం గుర్తుకు వచ్చింది.
వస్తే తప్పంటే చేసేది ఏమీ లేదు. అసలే బేబీ బూమర్ని. స్వాతంత్రానికి పూర్వం పుట్టిన వాడిని.
(ఇంకా వుంది)