కోడలు కాపాడింది.
నున్నటి నేలపై పడ్డ చేప పిల్ల పైకి కిందికి ఎగురుతూ విలవిలా కొట్టుకుంటూ పక్కనే నీటి చెలమ లోకి గెంతి ప్రాణం కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది.
నిన్నఆగస్టు 17 సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో నాదీ అదే మాదిరి పరిస్థితి. ప్రాణం మీదకు రాలేదు ప్రాణాలు ఉగ్గపట్టుకుని దాదాపు అర గంటకు పైగా అవస్థ పడ్డ మాట వాస్తవం. ఇంకా ఎక్కువ సమయం కావచ్చు కూడా.
ఏదైనా బాధను వ్యక్త పరిచేటప్పుడు, విషయాన్ని కొంచెం హాస్యం జోడించి చెప్పాలనే వారు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు. ( నరసారావుపేట స్నేహితుడు, పాత్రికేయ మిత్రుడు Svkrishnamohan Singam సింగం కృష్ణ మోహన్ కు ఇది రుచించక పోవచ్చు. అసలే జూలు విదిల్చిన సింగం. నేను కొద్దిరోజుల క్రితం, పాతకాలపు రాజకీయ నాయకులు దినపత్రికల్లో వచ్చే కార్టూన్లను ఆస్వాదించేవారని కొన్ని ఉదాహరణలు ఇస్తే, కృష్ణ మోహన్ ఇంత పొడుగున కామెంటు పెట్టాడు. నాదేమో ‘నవ్వుతూ బతకాలిరా’ టైపు. అంచేత చదివి ఊరుకున్నాను.
PUC లో ఇంగ్లీష్ నాండిటెల్ లో ఒక పాఠం వుంది. టైట్ కార్నర్. పరీక్షకు పోతుంటే జేబులో కలం జారి రోడ్డు పక్కన మురికి కాలువలో పడుతుంది. మరో పక్క పరీక్షకు టైం మించిపోతుంది. ప్రాణం పోయే సమస్య కాదు. ఏమి చేయాలో తెలియని, పాలు పోని ప్రాణాంతకమైన సమస్య.
నిన్న ఉదయం అలాంటిదే జరిగింది.
నిన్న మొదలు పెట్టిన స్నానం 24 గంటల తర్వాత ముగించిన వైనం అంటే మామూలు కాదు.
ఇంత సుదీర్ఘ సమయం స్నానించడానికి (కలం కూలీగా ప్రసిద్ధులైన ప్రసిద్ధ పత్రికా రచయిత జీ. కృష్ణ గారు, ఎవరైనా ఇంటికి వెళ్లి ఆయన గురించి వాకబు చేస్తే, ‘నాన్నగారు లోపల నీళ్ళాడుతున్నారు’ అనేవారు పిల్లలు ఆయన చెప్పమన్న రీతిలో. అలా వుండేది ఆయనగారి చమత్కారం) నేను బాత్ రూమ్ లో చేసింది సరిగంగ స్నానాలు ఎంతమాత్రం కాదు. సుగంధ ద్రవ్యాలు, కస్తూరి సువాసన తైలం కలిపిన గోరు వెచ్చటి నీటితో అప్సరసలు దేవతలకు చేయించే అభ్యంజన స్నానం అంతకంటే కాదు. అత్తరు ఘుమఘుమలతో, కాశ్మీర్ పూల పుప్పొడి కలిపి మసాజు చేయించే అభ్యంగన స్నానం అసలే కాదు. జస్ట్ సాధారణ దిగువ మధ్యతరగతి స్నానం. నిజం చెప్పాలంటే నీళ్ళ కరువువల్ల పది నిమిషాల లోపే ముగించాల్సిన కాకి స్నానం.
దానికే ఇంత సమయమా!
అవును. అందుకే విధి బలీయం అంటారు.
అదేమిటంటే, నిన్న ఉదయం ఎప్పటిలాగే ఆరున్నరకు బాత్ రూమ్ కు వెళ్లాను. గీజర్ వేసి కాలకృత్యాలు తీర్చుకుని బకెట్ లోకి వేడి నీళ్ళు పట్టాను. మామూలుగా అయితే పది నిమిషాలు కూడా పట్టదు నా స్నానానికి. తలకు షాంపూ పట్టించి నెత్తిన నీళ్ళు పోసుకోవడానికి బకెట్ కు వున్న మగ్గును చేతి లోకి తీసుకోబోయాను. ఏం జరిగిందో ఏమిటో కాళ్ళు రెండు ఒకేసారి స్లిప్ అయి నేల మీద ధడాలున పడ్డాను. ఇదేమంత పెద్ద పనిలే అని అరచేతుల మీద బరువు మోపి పైకి లేవబోయాను. చేతులతో సహా ముందుకు జరిగాను కానీ బెత్తెడు ఎత్తు కూడా లేవలేకపోయాను. ఈ సారి కాళ్ళను గోడకు అదిమిపెట్టి లేచే ప్రయత్నం చేశాను. జర్రున జారి బాత్ రూమ్ లో మరో వైపుకు జారి పోయాను.
లేవలేక పోవడం ప్రధాన సమస్య అని తేలిపోయింది. ఇంట్లో నేనొక్కడినే మగవాడిని. కోడలు నిషా, ఆమె అన్న కుమార్తె నందిక ఇంట్లో వున్నారు. ఈ జారుడు ప్రయత్నాలలో ఒంటి మీద టవల్ చెదిరిపోయి అస్తవ్యస్తంగా వుంది నా పరిస్థితి. వాళ్ళు లోపలకి రాకుండా వాచ్ మన్ రమేశ్ ను పిలవమని గట్టిగా అరచి చెప్పాను. కానీ వాళ్లకి వినపడ్డట్టు లేదు. లేదా నాకే నిమిషం యుగంలా అనిపించి అలా అనిపించిందేమో. బయట పడే చాన్స్ సాయంత్రానికి అయినా దొరకవచ్చు. అప్పటిదాకా ఒంటరిగా ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. యండమూరి వీరేంద్ర నాద్ ఒక నవలలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలాంటి స్థితిలో హాస్యమే గతి.
మూడు రోజుల క్రితం నేనే పోస్టు చేసిన ఒక జోక్ గుర్తుకు తెచ్చుకున్నాను.
'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
పాతిక అంతస్తు దగ్గర మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తన పేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఇదీ ఆ జోకు.
ఇది నాకెలా వర్తిస్తుంది అంటే బాత్ రూములో చేపపిల్లలా కొట్టుకుంటూ వుంటే తలుపు గడియ ఆటోమేటిక్ లాక్ అని గుర్తుకు వచ్చింది. దాన్ని తెరిపించాలి అంటే అమీర్ పేట వెళ్లి ‘ఇచ్చట తాళాలు బాగుచేయబడును’ అనే వాడిని పట్టుకు రావాలి. ఈ టైం లో మా వాచ్ మన్ అందరికీ నీళ్ళు వదిలే పనిలో బిజీగా వుంటాడు. అతడు తెమిలే సరికి మరో గంట పడుతుంది. అప్పటిదాకా నా మత్సావతారం కొనసాగుతుంది అన్నమాట.
ఈ లోపల ప్రయత్నలోపం లేకుండా అతికష్టం మీద తలుపు దగ్గరకు చేరి అరచేతులతో, మోచేతులతో మోదడం మొదలెట్టాను.
ఈలోగా మా కోడలుకి అతి హీన స్వరంతో నిషా నిషా అని నేను పెడుతున్న అరుపులు వినపడ్డాయి కాబోలు. తాను ఆఫీసు వర్క్ షాపుకు వెళ్ళే హడావిడిలో కూడా, మా అపార్ట్ మెంటులో మా ఫ్లోర్ లోనే వుండే మర్యాద రామన్నకు మారు పేరయిన రవిగారిని పిలుచుకు వచ్చింది. ఆయన అప్పుడే వాకింగ్ నుంచి వచ్చాడు. రమేశ్ కు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు.
గతంలో మా ఇల్లు రినోవేషన్ సమయంలో మా అబ్బాయి సంతోష్ కొని వుంచిన టూల్ బాక్స్ తెచ్చి తన చేతనయిన రీతిలో తాళం తీసే పనిలో పడ్డాడు. చిత్రం అది అది ఇట్టే తెరుచుకుంది. అప్పుడు గుర్తుకు వచ్చింది. నేనసలు లోపలనుంచి డోర్ లాక్ చేయలేదని.
మొత్తం మీద ఈ జారుడు బండల కధ సుఖాంతం అయింది.
ఆ సమయంలో మా కోడలు నిషా, ఆఫీసులో వర్క్ షాపుకు వెళ్ళే హడావిడిలో కూడా నన్ను దేవతలా ఆదుకుంది. వెంటనే అమెజాన్ కు మెసేజ్ పెట్టి బాత్ రూమ్ యాంటీ స్లిప్పరీ మ్యాట్ ఆర్డర్ చేసింది. అర్బన్ కంపెనీతో మాట్లాడి అప్పటికప్పుడు బాత్ రూమ్ క్లీన్ చేయించింది.
ఇప్పుడు నా పరిస్థితి డబుల్ ఓకే!
ఇలాంటిదే మరో రికార్డు నా పేరిట మరోటి వుంది. దాన్ని చెరపడం కొంచెం కష్టం. బాలాజీ కొలువు తీరిన హైదరాబాదు బిర్లా మందిర్ దాపులో మలుపులు తిరిగి చేరాల్సిన గుట్ట మీద మిత్రుడు వి.జే.ఎం దివాకర్ ఇంట్లో సాయంకాలక్షేపం చేసి బయలు దేరిన నాపై దివాకర్ పేల్చిన జోకు ఇది.
అక్కడినుంచి స్కూటర్ మీద బయలు దేరి పంజాగుట్టలో జ్వాలాను దింపి దుర్గానగర్ లోని మా ఇంటికి తిరిగి వస్తుండగా స్కూటర్ కు కన్ను మలిగి పక్కకు ఒరిగిపోయింది.
మా ఇంటి నుంచి బయలు దేరి చాలాసేపయింది, ఇంటికి చేరాడా అని జ్వాలా భార్య నా మేనకోడలు మా ఆవిడను వాకబు చేస్తే, అప్పుడు విషయం బోధ పడింది.
మా ఇంట్లో ఎప్పుడు పిల్లల మంద వుంటుంది కాబట్టి నన్ను వెతుకుతూ బయలు దేరారు. జ్వాలా ఇంటికి దగ్గరలోనే రోడ్డు పక్కన నేను, నా స్కూటర్ తో శేషతల్ప సాయి లాగా గాఢ నిద్రలో కనిపించాను. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. తెలిసిన డాక్టర్ కనుక వెంటనే చేర్చుకుని కత్తికి పని చెప్పారు. అలా ఆస్పత్రిలో చేరిన వాడిని, మూడు నెలల తర్వాత ఇంటికి పంపించారు. ‘బిర్లా మందిర్ దగ్గర మా ఇంటి నుంచి పంజా గుట్టలోని తన ఇంటికి చేరడానికి శ్రీనివాసరావుకు మూడు మాసాలు పట్టిందనేది' దివాకర్ జోకు.
ఇది 1995 నాటి సంఘటన.
నాకు ఆపరేషన్ చేసిన డాక్టరు గారు నన్ను తన నర్సింగ్ హోంలో మూడు నెలలు అట్టే పెట్టాడు. ‘నిన్న మిమ్మల్ని చూడడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఈరోజు ఎవరు వస్తున్నారు’ అని అడిగేవాడు.
ఆయన వీ ఐ పీ చాదస్తం ఏమిటో కానీ మూడు వారాల్లో కట్టు విప్పి పంపాల్సిన నన్ను మూడు నెలలు ఆస్పత్రిలో వుంచేసారు. ఇక అన్నీ రాజభోగాలే. పార్లమెంటు మధ్యంతర ఎన్నికల సమయం. నేను వార్తలు కనుక్కుని రేడియోకి ఇవ్వడంకోసం నా గదిలో డైరెక్ట్ ఫోన్ పెట్టించారు.
జరుగుబాటు వుంటే జబ్బంత సుఖం లేదు. (18-08-2026)