17, సెప్టెంబర్ 2026, గురువారం

నిజాం మరణ వార్త : భండారు శ్రీనివాసరావు

 

తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు (తూనీగలు) వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం, కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన రాకడకు సూచనలుగా పేర్కొనేవారు.
1975 లో నేను హైదరాబాదు రేడియో విలేకరిగా చేరినప్పుడు పరిచయం అయిన విలేకరులలో ధర్మవరపు సీతారాం ఒకరు. UNI వార్తా సంస్థ కు చీఫ్. అప్పటికి వయసులో ఆయన నాకంటే పెద్దవారు అయినా నా బోటి కుర్రకారు రిపోర్తర్లతో చాలా చనువుగా మాట్లాడే వారు.
“ He is a good friend, but bad colleague” అని ఆయన్ని గురించి చెప్పుకునేవారు. ఆ న్యూస్ ఏజెన్సీ లో పనిచేసే విలేకరులకు ఆయన పేరు వింటేనే సింహ స్వప్నం. వాళ్ళతో ఆయన వ్యవహార శైలి అంత కరకుగా వుండేది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో కూడా ఆయన అలాగే లెక్కలేకుండా, ‘Mr. Chief Minister! First answer my question, మీ పురాణం తర్వాత’ అని నిలదీయడం నేను చాలా సార్లు చూశాను.
‘జర్నలిజం ఒక నషా’ అనే వారు ధర్మవరపు సీతారాం.
ఆయన మాటల్లోనే ఆయన అనుభవాలు కొన్ని.
“పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది.
“నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు.
“ఒక్కోసారి పెద్ద ప్రయత్నం లేకుండానే కొన్ని అద్భుతమైన వార్తలు వచ్చి విలేకరి వొళ్ళో పడతాయి. 1967 లో నిజాం అస్వస్థతకు గురై మరణించినప్పటి వార్త నాకు అలానే అయాచితంగా దొరికింది.
అప్పుడు యు.ఎన్.ఐ. ఆఫీసు నిజాం క్లబ్ ని ఆనుకుని వున్న రోషన్ మంజిల్ లో వుండేది. అప్పట్లో మూడు సంపన్న క్లబ్బుల్లో సభ్యత్వం కలిగిన ఏకైక జర్నలిష్టును నేనే. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉద్యోగం చేస్తూనే నాలుగు ఆంగ్ల పత్రికలకు కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని. సహజంగా క్లబ్బు పక్షులకు అన్నిరకాల వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వీలుంటుంది. పారిశ్రామికవేత్తలు, ఐ.యే.ఎస్., ఐ.పి.ఎస్. వంటి మూడక్షరాల బ్యూరోక్రాట్లు, జూదర్లు, లోఫర్లు, తిరుగుబోతులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. రాజకీయ, అధికార సౌధాల్లోని ముచ్చట్ల నుంచి సామాజిక రంకు పురాణాల వరకు అక్కడ బయల్పడుతుంటాయి.
నా నివాసం జాంబాగ్ లో. స్కూటర్ పై బయలుదేరి బొగ్గులకుంట మీదుగా యే అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం అలవాటు. ఓ రాత్రి అలా వస్తుండగా నిజాం రాజభవనంలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. ప్రధాన ద్వారం తెరిచి వుంది. గార్డులు సావధానంగా నిలబడి వున్నారు. ఒక కారు బయటకు వస్తోంది. కారులో వున్నది డాక్టర్ రామయ్య కాదు కదా అన్న అనుమానం కలిగింది. ఇంటికి వెళ్లి డాక్టర్ కు ఫోను చేసాను.
"రాజభవనంలో ఎవరో అస్వస్తులుగా వున్నారు. ఎవరని అడిగితే కరక్టుగా జవాబు రాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి సూటిగా అడిగేశా. ‘డాక్టర్, ముసలాయన తెల్లారేదాకా వుంటాడా’ అని. ఆయన ముక్తసరిగా ‘యెలా చెప్పగలను? మంచే జరుగుతుందని అనుకుందాం’ అన్నాడు.
ఇక ఆలశ్యం చేయకుండా ఫోను తీసుకుని ఆఫీసుకు ఫోను చేసి డ్యూటీలో వున్న ఆపరేటర్ కు ‘నిజాంకు తీవ్ర అస్వస్తత’ అంటూ రెండు లైన్ల ఫ్లాష్ వార్త చెప్పాను. ఉద్దేశ్య పూర్వకంగానే స్తానిక పత్రికలకు ఈ వార్తను తెల్లవారు ఝాము వరకు విడుదల చేయకుండా ఆపాను. ఈ విధంగా చేయడంవల్ల ప్రత్యర్ధి న్యూస్ ఏజెన్సీ పీ.టీ.ఐ. కి వార్త లీక్ అయ్యే అవకాశం వుండదు. మరునాటికల్లా ఈ వార్త సంచలనంగా మారింది. నిజాం వంటశాలలో పనిచేసేవాడు మా ఆఫీసులో ప్యూను జానేజాద్ కు బంధువు. సమాచారం పట్టి సాయంత్రానికల్లా ‘నిజాం మృతి’ అంటూ స్నాప్ వార్త పంపాను. ప్రత్యర్ధి వార్తా సంస్థలు అప్పటికి ఇంకా నిజాం అస్వస్థతకు సంబంధించిన వార్తలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సమయంలో మా వార్తా సంస్థ నిజాం మరణం గురించి ప్రపంచానికి తెలియచేసింది.”
ఇక నిజాం మరణ వార్త ఆకాశవాణిలో చిన్న కలకలం సృష్టించింది.
రేడియోలో రోజువారీ కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే, ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
అయితే మరణ వార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేక సార్లు, ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు.
ఇంతకీ విషయానికి వస్తే,
ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటుంబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావు కబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది.
యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ మాత్రం ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే ఆ సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. ఆ వార్తా సంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని, ఇప్పట్లా త్వరితగతిన సమాచారం చేరవేతకు అవకాశం లేకపోవడంవల్ల, దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి.
కానీ చూచాయగా వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం అందేదాకా విషాద సంగీతం ప్రసారం చేసే విషయం పక్కనబెట్టారు.
ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు ఓరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది, నిజాం మరణంపై వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపోయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా జనంలో ఈ విషయం చర్చకు రాలేదు కానీ, పత్రికా వార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.
నిజానికి అంతగా బయటకు రాని విషయాలపై కూడా రేడియో అధికారులు అంతటి జాగ్రత్త చూపేవారనడానికి ఇదొక దృష్టాంతం.
(17-09-2026)

కామెంట్‌లు లేవు: