తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు
వేదిక మీద కూర్చొన్న కుర్చీలో నుంచి లేచి పది పదిహేను అడుగులు నడిచి, మైకు దగ్గరకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే నా ప్రసంగానికి ఆరోజు తక్కువ సమయం పడుతుందని సభికులు కానీ, సభానిర్వహకులు కానీ ఊహించి వుండరు.
‘ఇంకా ఎంతసేపురా బాబూ ఈ సోది’ అని వినేవాళ్ళు అనుకోకముందే ప్రసంగం ముగించేవాడు, ‘అయ్యో! అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండేది అని శ్రోతలు భావించేవాడు మంచి వక్త అని ఏనాడో నా ఈ సీరియల్ లోనే రాసుకున్న గుర్తు.
సందర్భం ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ ఎం వీ ఆర్ శాస్త్రి గారి డెబ్బయ్ అయిదవ పుట్టినరోజు వేడుక. ఇటీవలే, ఏప్రిల్ 22 బుధవారం నాడు, హైదరాబాదులో ఖత్రియ హోటల్లో ఆయన మిత్ర బృందం నిర్వహించారు. నగరంలోని చిన్నా పెద్దా, అతి పెద్ద పాత్రికేయులు, పురప్రముఖులు శాస్త్రి గారి మీది గౌరవంతో తరలి వచ్చారు. శాస్త్రి గారిని, వారి సతీమణి దుర్గ గారిని ఘనంగా, సముచితంగా సత్కరించారు.
ఆ సందర్భంగా చాలా మంది ఘనాపాటీలు శాస్త్రి గారి గురించీ, వారి విద్వత్ సంపద గురించీ చాలా ఘనమైన ప్రసంగాలు చేశారు. అవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా.
ఆ క్రమంలో శాస్త్రి గారిని గురించి నన్నూ నాలుగు మాటలు మాట్లాడమన్నారు. పై ప్రస్తావన అప్పటిది అన్నమాట.
‘సభకు నమస్కారం. నేను ప్రసంగాలు చేయను. ఓ కధ చెబుతాను. అదీ శాస్త్రి గారు చెప్పిందే సుమా!’ అని మొదలు పెట్టి కొనసాగించాను.
‘గతంలో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శాస్త్రి గారు, తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంచామని చెప్పుకొచ్చారు.
అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషాదోషాలను, సంపాదకీయాల్లో దొర్లే గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. ‘దిద్దుబాటు’ అనుకుంటా ఆ కాలమ్ పేరు.
ఈ రోజుల్లో, శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలంపోట్లని జనం అందరూ గమనిస్తున్నారు. కానీ ఇది పాతకాలం ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.
వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!
శాస్త్రి గారి మాటపై ఆయన తన కలాన్ని ఝలిపించారు.
అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసే వారు.
పక్క పత్రికల మీద రాతలు కదా! ఆంధ్ర భూమిలో పనిచేసే వాళ్ళు, వరదాచారి గారి చెణుకులను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ‘ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి’ అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.
అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత, వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే అపభ్రంశపు రాతలను, చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.
ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.
ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.
ఇలాంటి రాతలు ఎం వీ ఆర్ శాస్త్రి గారి లాంటి ఎడిటర్ మాత్రమే రాయించగలరు.
శాస్త్రి గారు ఇక ఎలాంటి ఆస్తిపాస్తులను కూడబెట్టాల్సిన అవసరం లేదు. రాదు. ఆయన అంతటి భాగ్యశాలి మరొకరు వుండబోరు అనడానికి ఈనాటి ఈ వేడుకే సాక్ష్యం. కేవలం ధనధాన్యాలు, సిరి సంపదలు మాత్రమే ఒక వ్యక్తిని సంపన్నుడిని చేయలేవు. అదే కొలమానం అయితే, వేదిక మీదా, కిందా వున్న వారిలో అధిక సంపన్నులు చాలామంది వున్నారు.
అయితే మీరు కూడబెట్టిన సంపదను లెక్కకట్టే కరెన్సీ కౌంటింగ్ మిషన్లను ఇంకా కనుక్కోలేదు, మీ ఖాతాలో పేరుకుపోయిన అభిమాన ధనంపై పన్ను వేయగల సామర్ధ్యం ఆదాయపు పన్ను శాఖకు వుంటుందని అనుకోను.
ఇంటికి వెళ్ళగానే మీకు దిష్టి తీయమని మీ శ్రీమతి గారికి నా విజ్ఞప్తి.
చివర్లో ఒక్క మాట. వృత్తి రీత్యా ఆయన శిఖర సమానుడు. ఆ విధంగా ఆయనకు శత సహస్ర వందనాలు. వయసు రీత్యా నాకంటే నాలుగయిదేళ్ళు చిన్న. అంచేత ‘శతమానం భవతి’ అని ఆశీర్వదిస్తున్నాను.”
కింది ఫోటోలు: శాస్త్రి గారి అమృతోత్సవంలో వేదికపై, శాస్త్రి గారు, షణ్ముఖ శర్మ గారి వంటి దిగ్గజాల పక్కన నేను.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి