‘నువ్వు ఐ పి ఎల్ చూస్తావా’ అని అడిగాడు ఓ మిత్రుడు ఆ ఆటలపై నా పోస్టింగులు చూసి. ‘నేనైతే చూడను, టైం వేస్టు, అన్నాడు, అతనే నా జవాబు కోసం ఎదురు చూడకుండా. టైం ఈజ్ మనీ అనే బాపతు కావచ్చు, హౌ టు స్పెండ్ టైం అనేది నా సమస్య. నిజమే చూడగా చూడగా నా ఫ్రెండ్ చెప్పేది నిజమేనేమో అనిపిస్తోంది, ఇంతింత డబ్బులు పోసి కొనుక్కున్న ఆ ఆటగాళ్ళ ఆట తీరు చూస్తుంటే. ఇరవై ఓవర్లు కూడా నిలకడగా ఆడలేని పెద్ద పెద్ద జట్ల పేలవమైన ఆటలు. ఏమో వాళ్ళ మీద ఎలాంటి వత్తిడులు వున్నాయో మనకేం తెలుసు, వడ్డున కూర్చుని ఎకసెక్కాలు చేయడం తేలికే. ఎప్పుడో, అరవై డెబ్బయ్ ఏళ్ళ కిందటి నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. బెజవాడలో మా బావ గారింటిలో వుండి చదువుకుంటున్న రోజులు. ఆదివారం వచ్చింది అంటే మా చిన్న పిల్లలకు ఆటవిడుపు. పట్నంలో పెద్ద పెద్ద ప్లీడర్లు ఓ పది మంది దాకా గవర్నర్ పేట లక్ష్మి టాకీసు, జైహింద్ టాకీసు మధ్య రాజగోపాలా చారి రోడ్డులో కామేశ్వర్ అండ్ కో ఎదురుగా వున్న బావగారి ఇంటిలో జమ అయ్యేవారు. వాళ్ళ కోసం మధ్య హాల్లోని బల్లలు, కుర్చీలు జరిపి జంబుఖానాలు, తుంగ చాపలు పరిచేవాళ్ళం. వచ్చిన వాళ్ళు గుండ్రంగా కుర్చునేవాళ్ళు. వాళ్ళ ముందు రూపాయి, రెండు రూపాయలు, అయిదు రూపాయల నోట్లు, వాటితో పాటు చిల్లర నాణేలు వుండేవి. పేకాట కార్డులు పంచిన తర్వాత తమ చేతిలో వున్న మూడు ముక్కలు అతి జాగ్రత్తగా తెరిచి చూసీ చూడనట్టు చూసి డబ్బులు విసురుతుండే వాళ్ళు. మా పని ఆట చూడడం కాదు. మా అక్కయ్య వాళ్ళ కోసం తయారు చేసిన టీ, కాఫీలను చిన్న స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసుల్లో చాలా జాగ్రత్తగా, తొణకకుండా తీసుకువెళ్లి అందించడం. వారిలో మా బావ గారికి నశ్యం తప్ప వేరే అలవాటు లేదు. కానీ కొందరు సిగరెట్లు తాగేవాళ్లు. అవి అయిపోయినప్పుడల్లా మా చేతికి కొంత చిల్లర ఇచ్చి కొనుక్కు రమ్మనే వాళ్ళు. జైహింద్ టాకీసు ముందు రోడ్డు మూల మీద రెడ్డి బడ్డీ కొట్టు వుండేది. ట్రిపుల్ ఫైవ్, గోల్డ్ ఫ్లేక్, బర్క్లీ, పాసింగ్ షో, క్యాప్ స్టన్, ప్లేయర్స్ నావీ కట్, కేమెల్, చార్మినార్ ఇలా ఎన్నో రకాలు. వాళ్ళలో ఒకాయనకు బాగా డబ్బు వున్నట్టు వుంది. చాలా ఖరీదు అయిన మార్కోపోలో సిగరెట్లు తెప్పించుకునేవారు. రెడ్డి పాన్ షాపుకు పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం. మా పిల్లల ధ్యాస సిగరెట్ల మీద కాదు, వాళ్ళు తాగి పారేసే ఖాళీ సిగరెట్ ప్యాకెట్ల మీద మా దృష్టి. వాటితో బచ్చా ఆట ఆడుకోవచ్చు. అదీ పెద్ద వాళ్ళ కంట్లో పడకుండా. ఇప్పుడు ఆ ఇల్లు లేదు. ఆ సినిమా హాళ్ళు లేవు. రెడ్డి బడ్డీ కొట్టు లేదు, లీలగా పాత జ్ఞాపకాలు తప్ప. ఇది సరే! పెద్దగా ఊహాగానాలతో అవసరం లేకుండానే చెన్నై చేతిలో కోల్ కతా ఓడిపోయింది. ఇంకా చాలా మ్యాచ్ లు వున్నాయి. ఇదే ఫైనల్ కాదు. కానీ ఈ రాత్రికి మాత్రం శుభం కార్డు పడింది.
(14-04-2026)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి