22, అక్టోబర్ 2010, శుక్రవారం

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

న్యూఢిల్లీ లో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం కాకమునుపే -

అనుమానపు మబ్బులు పట్టాయి.

ఆ మబ్బుల నడుమే పూజల్లులు కురిశాయి.

ఆ పూజల్లుల మధ్యనే హరివిల్లులు విరిశాయి.

ఆ హరివిల్లుల వెలుగులో బంగరు బిళ్లలు మెరిశాయి.

ఆ పుత్తడి కాంతుల జిలుగులో చిచ్చర పిడుగులు రాలాయి.

ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.

అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ,
అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.

ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంట కత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో – పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని ఆ బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హటాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

ఎట్టకేలకు పూర్తయిన ఏర్పాట్ల నడుమ, ఆతిధ్య దేశం భారత్ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొంటున్న డెబ్భయ్ ఒక్క దేశాల జట్లు - ప్రారంభోత్సవానికి సంసిద్ధమయిన మందిరంలో క్రీడా స్పూర్తితో కాలుమోపాయి. కామన్ వెల్త్ కు ఆధ్య దేశమయిన ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కామన్ వెల్త్ క్రీడలను లాంచనగా ప్రారంభించడంతో క్రీడా సంరంభం – ప్రతిష్టాత్మకంగా, కన్నుల పండుగగా, అందరి దృష్టిని ఆకట్టుకునేవిధంగా అట్టహాసంగా మొదలయింది. దాన్ని మరిపించేలా ముగింపు వేడుక మరింత శోభాయమానంగా కళ్ళు చెదిరే విధంగా జరిగింది.

అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో భారత్ శక్తి సామర్ధ్యాలను ఇంటా బయటా శంకించడంతో మొదలయిన కధ, క్రీడల ప్రారంభ సంరంభాలలోనే సమసిపోయింది. సాధించిన పతకాలతో మన క్రీడాకారుల సామర్ధ్యం, పొందిన మెచ్చుకోళ్ళతో మన నిర్వాహక ప్రతిభ – క్రీడల ప్రారంభానికి ముందు చెలరేగిన విమర్శలను దూదిపింజల్లా చెదరగొట్టాయి.

2014 లో జరిగే కామన్ వెల్త్ క్రీడోత్సవాలకు ఆతిధ్యదేశంగా ఎంపికయిన స్కాట్లాండ్ –భారత్ నిర్వహణ సామర్ధ్యాన్ని కీర్తించడం ఇందుకు చక్కని ఉదాహరణ. ‘న్యూఢిల్లీ ఒరవడిలో నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న పెను సవాల్’ అని ఆ దేశం పేర్కొనడం, అలాగే కామన్ వెల్త్ క్రీడా సమాఖ్య అధ్యక్షుడు మైఖేల్ ఫెన్నల్ – ‘భారత్ నిర్వహించిన తీరు అనితర సాధ్యం’ అని ప్రకటించడం మనకు దక్కిన చక్కని కితాబులు.

కామన్ వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. ‘భారత్ కు మరో స్వర్ణం’ అంటూ అనుదినం వెలువడిన టీవీ స్క్రోలింగ్ లు యావత్ జాతినీ ఉర్రూతలూగించాయి. మన వాళ్ళు రికార్డ్ స్తాయిలో మొత్తం నూటొక్క పతకాలను కైవసం చేసుకున్నారు. ముప్పయ్ ఎనిమిది స్వర్ణ పతకాలను, ఇరవై ఏడు రజిత పతకాలను, ముప్పయ్ ఆరు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకుని పతకాల పట్టికలో భారత్ ను రెండో స్తానంలో నిలబెట్టారు. గతంలో జరిగిన అంతర్జాతీయ క్రీడోత్సవాలతో పోలిస్తే ఈసారి భారత్ క్రీడాకారులు అంచనాలకు మించిన ఫలితాలను రాబట్టారనే చెప్పవచ్చు. ఇందులో మన రాష్ట్ర క్రీడాకారుల పాత్ర మరువలేనిది. పదిహేనుమందితో క్రీడల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టు ఆరు స్వర్ణాలు సాధించి మొత్తం పదిహేను పతకాలు గెలుచుకుంది. స్వర్ణాలు సాధించిన వారిలో కొందరి నేపధ్యం మట్టిలో దాగున్న మాణిక్యాలను తలపించింది. ఆర్ధిక,సాంఘిక అసమానతలను అధిగమించి వారు సాధిస్తున్న విజయాలు నిజంగా నిరుపమానం. పతకాల పంట పండించిన మన క్రీడాకారుల పంట సయితం పండింది. వారి శ్రమనూ, దీక్షా దక్షతలను గుర్తిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు నజరానాలతో వారిని ముంచెత్తుతున్నాయి. మరిన్ని విజయాల సాధన దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాయి.
విజయ దశమి పండుగకు ముందే పన్నెండు రోజుల ఆటల పండుగ ముగిసింది. భారతీయ ఆతిధ్య వైభవాన్ని మనసుల్లో పదిలం చేసుకుంటూ విదేశీ జట్లు ఇంటి దారి పట్టాయి.

కామన్ వెల్త్ గేమ్స్ విజయోత్సాహపు ఉద్విగ్న క్షణాలు నిమిషాలుగా, గంటలుగా మారుతుండగానే, కేంద్ర ప్రభుత్వం అసలు ఆటకు తెర తీసింది.

క్రీడోత్సవాలు ముగిసేవరకూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం, నిమిషం ఆలస్యం చేయకుండా నిర్వహణ కమిటీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా స్వయానా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వెలువడడం విశేషం.

ప్రతిపక్షాలు ఈ విషయంలో యాగీ చేయడం మొదలు పెట్టేలోగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రీడోత్సవాలకు ముందే ఈ నిర్ణయానికి వచ్చి, దేశం పరువు ప్రతిష్టల దృష్ట్యా అంతా సలక్షణంగా ముగిసిన తరువాత ప్రకటించివుండవచ్చని భావిస్తున్నారు.

కళ్ళు తిరిగే ఖర్చు

ఈ క్రీడలకు అయిన ఖర్చు వివరాలు ఇంకా పూర్తిగా అందాల్సివుంది. అయినా ప్రాధమిక అంచనాల ప్రకారం యిరవై ఎనిమిది వేలకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యాయని సమాచారం. ఇంత డబ్బు పోసి సాధించింది ఏమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. క్రీడా ప్రపంచంలో భారత దేశం తలెత్తుకు తిరగడానికి ఇటువంటి క్రీడోత్సవాల నిర్వహణ దోహదపడు తుందని, క్రీడాకారులకు అవసరమయిన దన్నూ ధీమా ఇవి కలిగిస్తాయని అనుకుంటే ఈ ఖర్చుని లెక్కలోకి తీసుకోకూడదనే వాళ్ళూ వున్నారు. ఇతర దేశాల్లో క్రీడలపై పెడుతున్న ఇబ్బడి ముబ్బడి పెట్టుబడులను ఈ ఈసందర్భంగా ఉదహరిస్తున్నారు. అభివృద్ధిచెందిన దేశాలలో ‘ఆడుకుంటూ చదువుకో, చదువుకుంటూ ఆడుకో’ అనే తరహాలో అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటున్నారు.

శారీరక,మానసిక వికాసానికి క్రీడలు ఉపకరిస్తాయనే నమ్మకంతో అక్కడి విద్యావిధానాలు రూపుదిద్దుకుంటూ వుండడం కూడా వారికి కలసి వస్తోంది. అయితే, విద్య వ్యాపారంగా మారిన మన దేశంలో మాత్రం ఆటలకు లభిస్తున్న ప్రాధాన్యం శూన్యం అనే చెప్పాలి. కోట్లు వెచ్చించి క్రీడోత్సవాలు నిర్వహించి అందరితో సెహభాష్ అనిపించుకుంటున్న మన ఏలికలు – క్రీడలను ప్రోత్సహించే పధకాలపై కూడా దృష్టి సారించాలనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడివున్న క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి ఆసరా అందివ్వాలి. అభిరుచి వున్నా అవసరాలు అడ్డం వచ్చి ఆటలకు దూరం అవుతున్న పేద యువతను వెతికి పట్టుకోవాలి. వారికి అవసరమయిన శిక్షణ ఇచ్చి వారి ప్రతిభకు పదును పెట్టాలి. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి కూపాలుగా మారుతున్న క్రీడా సంఘాలకు ముకుతాడు వేసి అదుపులో పెట్టాలి. జాతీయ స్తాయిలోనే కాకుండా, గ్రామ స్తాయినుంచి క్రీడలను ప్రోత్సహించే సమగ్ర క్రీడా విధానానికి రూపకల్పన చేయాలి. ఇరవై ఏళ్ళ క్రితం ఒలింపిక్స్ లో అట్టడుగున వున్న చైనా ఈనాడు అగ్రస్తానానికి ఎలా చేరుకుందో అధ్యయనం చేయాలి.

కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ఆ క్రీడోత్సవాలు బోధించిన పాఠాలను కూడా ఎప్పటికీ గమనంలో వుంచుకోవాలి. చైనాలోని గువాన్జ్ నగరంలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆసియా క్రీడోత్సవాలను ఇందుకు సవాలుగా తీసుకోవాలి. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అపూర్వ విజయాలు స్తానబలిమితో కాదన్న విషయాన్ని అక్కడ నిరూపించుకోవాలి.

ఈ దిశగా ఆలోచించినప్పుడు ప్రభుత్వం చేయాల్సింది కొండంత కనబడుతుంది. దేశంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదవ లేదు. కొరత వున్నదల్లా లక్ష్యాల సాధనకు అవసరమయిన చిత్తశుద్ధి మాత్రమే.

కొసవిరుపులు

“మహాత్మా గాంధీ జీవించివున్నట్టయితే, కామన్వెల్త్ క్రీడలను వ్యతిరేకించి వుండేవారు. దేశంలో నలభయ్ ఏడు శాతం బాలబాలికలు సరయిన పౌష్టికాహారం లేక రోగాలబారిన పడుతున్నారు. పది శాతం పేద గర్భిణులు రక్త హీనతతో కాలం గడుపుతున్నారు. అన్నార్తుల దేశంలో ఈ ఆటల పోటీలేమిటి?” – మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్

“దళితుల నిధులతో ఆటలా! కామన్వెల్త్ క్రీడల సన్నాహాల కోసం ఢిల్లీ సర్కారు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఏడువందల నలభయ్ కోట్ల రూపాయలు దారి మళ్ళించిందన్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఒకవేళ అలా బదిలీ చేసుంటే తక్షణం వాటిని వెనక్కు ఇవ్వాలి” – జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీ ఎల్ పునియా

“కామన్వెల్త్ క్రీడోత్సవాల ప్రారంభానికీ, ముగింపు వేడుకలకు మాజీ అథ్లెట్లకు ఆహ్వానాలు పంపకుండా అవమానపరిచారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మన దేశానికి తొట్టతొలి పతకం అందించింది నేను. అయినా నిర్వాహకులు నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే నిన్నటి తరం క్రీడా దిగ్గజాలు - పీటీ ఉష, గురుబచన్ సింగ్ రణధవా, శ్రీ రాం కుమార్, అశోక్ కుమార్ వంటి వారిని కూడా నిర్వాహక సంఘం చిన్నచూపు చూసింది. ఇది అత్యంత శోచనీయం.” - ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్

కొసమెరుపు

పన్నెండు రోజులపాటు జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడోత్సవాలలలో ఫోటోగ్రాఫర్ల కన్ను ఎవరిపై ఎక్కువ పడిందో తెలుసా? సాధారణ ప్రేక్షకుల మాదిరిగా వచ్చి హాకీ మాచ్ చూసి వెళ్లిన సోనియా,రాహుల్ గాంధీలు అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. ఈ గౌరవం దక్కింది ఒక మామూలు వృద్ధ వాలంటీర్ కు. “కామన్వెల్త్ గేమ్స్ 2010 విజయవంతం” అని ప్లకార్డ్ చేత ధరించి స్టేడియం నలుమూలల తిరుగుతున్న ఆ వృద్ధుడిని ఫోటో తీయడానికి ప్రెస్ ఫోటో గ్రాఫర్లు అదే పనిగా వెంబడి పడ్డారు.

 

కామెంట్‌లు లేవు: