22, అక్టోబర్ 2010, శుక్రవారం

హక్కులకు కూడా హద్దులుండాలి - భండారు శ్రీనివాసరావు

హక్కులకు కూడా హద్దులుండాలి - భండారు శ్రీనివాసరావు

“పత్రికలు చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.

భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్తల ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.

‘చేతులు బార్లా జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే చేతి కొస భాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఈ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

పైకి చెప్పుకునే కారణాలు ఏమైనప్పటికీ, ఎన్ని వున్నప్పటికీ, ప్రజాస్వామ్య మూలసౌధాలన్నీ పత్రికా స్వేచ్చకు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అసలు సిసలు పునాది రాయి వంటి సామాన్య వోటరుతో నిమిత్తం లేకుండా, అతడి ప్రమేయం లేకుండా ఈ రభస సాగుతూ వుండడమే ఇందులోని విషాదం.

మన దేశ ప్రజాస్వామ్యం ఇంత బలంగా వేళ్ళూనుకుని వుండడానికి కారణం మేమంటే మేమని ఎందరు బడాయిలకు పోయినా ఈ ఘనత సాధారణ వోటరుదని ఒప్పుకుని తీరాలి. అత్యధిక శాతం నిరక్షురాస్యులయిన వోటర్లు – పత్రికలూ చదవకుండానే, మీడియా విశ్లేషణలతో నిమిత్తం లేకుండానే – గతంలో జరిగిన ఎన్నో ఎన్నికలలో తమ పరిణతిని ప్రపంచానికి చాటి చూపారు. భారత దేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన ఇరుగు పొరుగు దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్తలు కుప్పకూలిపోయి, సైన్యం సాయంతో నియంతలు రాజ్యం చేయాల్సిన దుస్తితి దాపురిస్తుంటే, మన వోటర్లు మాత్రం కేవలం వోటు హక్కుతో ప్రభుత్వాలను మారుస్తున్నారు. గిట్టని పార్టీలకు బుద్ధి చెప్పి, తాము మెచ్చిన పార్టీలను గద్దెనెక్కిస్తున్నారు.

మేధావులమని అనుకుంటున్నవాళ్ళు గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్తలన్నీ ఈ ఆరుదశాబ్దాల పై చిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్తలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్తానాల్లో , చట్ట సభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు ప్రతి విమర్శలు, వాదోపవాదాలు,నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు-
పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ-
వ్యాపార కళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి. పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్తలు – కాలక్రమేణా ప్రత్యర్ధిపై పైచేయికోసం కత్తులు దూస్తున్నాయి.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు సాగించే అక్రమాలతో పోలిస్తే-
పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.

తాము ప్రాతినిధ్యం వహించే సంస్తల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ –
తమ రాతలతో, చేతలతో –సమాజానికి సంకటంగా తయారయిన వారు –
వారు ఎవరయినా సరే-

ఆ వ్యక్తి,

గ్రామస్తాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు-
బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు-
ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు-
రాష్ట్రాన్ని పాలించే అధినేత కావచ్చు-
పార్ట్ టైం విలేకరి కావచ్చు-
ప్రధాన సంపాదకుడు కావచ్చు-
ఏ స్తాయిలో వున్నా, ఏ హోదాలో వున్నా – ఖండనకు అర్హులే.

ఏదో ఒక పేరుతొ – ఏదో ఒక సాకుతో
అలాటివారిని కాపాడాలని అనుకోవడం –
కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది.

కామెంట్‌లు లేవు: