25, అక్టోబర్ 2010, సోమవారం

రేడియో గురించి ఇంకా ఇంకా రాయాలని ఉంది – భండారు శ్రీనివాసరావు

రేడియో గురించి ఇంకా ఇంకా రాయాలని ఉంది – భండారు శ్రీనివాసరావు

రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ రేడియో గురించి రాసిన వ్యాసంపై వచ్చిన అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీరాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం లో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.

ఆకాశవాణి న్యూస్ రీడర్లను పరిచయం చేసే క్రమంలో శ్రీ శ్రీ ప్రసక్తి వచ్చిన సందర్భంలో సుజాత గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. 90 దశకం పూర్వార్ధంలో కన్నుమూసిన సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయం లో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏల్చూరి విజయ రాఘవ రావు గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని ఫిలిమ్స్ డివిజన్ లో చాలాకాలం మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు  మురళీధరరావు గారు  న్యూఢిల్లీ లో ప్రొఫెసర్ గా వున్నారు. తెలుగులో నడిచే నిఘంటువుగా పేరుతెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలాకాలం మద్రాసులో సోవియట్ భూమి తెలుగు విభాగం లో పనిచేశారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు, శెట్టి ఈశ్వర రావు గారు, తాపీ మోహన రావు గారు (తాపీ ధర్మారావు గారి తనయుడు) ఆయనకు సహచరులు. శ్రీ శ్రీ, ఝరుఖ్ శాస్త్రి గార్లకు సుబ్రహ్మణ్యం గారు సన్నిహిత మిత్రులు. వారి నడుమ సంభాషణలు కవితాత్మకంగా, కొండొకచో రసాత్మకంగా వుండేవని చెప్పుకునేవారు. ఒకసారి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతూ ప్రాసక్రీడల్లో అనుకుంటాను –

“ఏ సోడా! ఏ నీళ్ళూ
వీసం కూడా కలపక
సౌనాయాసంగా విస్కీ సేవించే ఏసుకు ...” అని ఆశువుగా ఆలపించారు. ఇక్కడ సౌనాయాసంగా అంటే సునాయాసంగా – ఏసు అంటే ఏల్చూరి సుబ్రహ్మణ్యం. అలా వుండేదన్న మాట మహాకవితో ఆయనగారికున్న సాన్నిహిత్యం.

సుబ్రహ్మణ్యం గారు మద్రాసులో వున్నప్పుడు రాళ్ళభండి వెంకటేశ్వరరావు (ఆర్వీయార్) గారు పాస్ పోర్ట్ పనిమీద అనుకుంటాను అక్కడికి వెళ్లారు. తదనంతర కాలంలో రచయిత, గ్రంధకర్త, విమర్శకుడు అయిన ఆర్వీయార్ గారు మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలాకాలం పనిచేశారు. మాస్కోలో చదువు కోవడానికి వచ్చే పిల్లలందరికీ ఆయనే అక్కడ పెద్దదిక్కు. మా కుటుంబం మాస్కోలో వున్నప్పుడు కూడా వారి ఇంటికి రాకపోకలు ఎక్కువ. సరే, ఆయన మద్రాసు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారిని కలిసారు. పక్కన వున్న శెట్టి ఈశ్వర రావుగారు ‘జగమెరిగిన బ్రాహ్మణుడు’ అంటూ సుబ్రహ్మణ్యం గారిని ఆర్వీయార్ గారికి పరిచయం చేయబోయారు. “అదేమిటండీ అలా అంటారు చొక్కా లోపలనుంచి జంధ్యం అలా కనబడుతుంటేనూ” అని ఆర్వీయార్ గారు తన సహజ శైలిలో అనేసారుట - “జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా?” అన్న నానుడిని గుర్తు చేస్తూ.

సుబ్రహ్మణ్యం గారి వియ్యంకులు ధనికొండ హనుమంతరావు గారికి మద్రాసులో తెలుగు ముద్రణాలయం వుండేది. ఎవరయినా రచయిత పుస్తకం అచ్చుపని ఎప్పుడు పూర్తవుతుందని అడిగితె ఆయనకు చర్రున మండుకొచ్చేదిట. “ఏమిటయ్యా హడావిడి. బట్టలు ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కట్టుకోవాలి కాని ఇలా వెంటపడితే ఎలా” అనేవారని ఆర్వీయార్ గారు చెప్పారు.

అన్నట్టు, ఆర్వీయార్ గారు కూడా మాస్కో రేడియోలో ఆపద్ధర్మంగా వార్తలు చదివేవారు. రష్యన్-తెలుగు డిక్షనరీ కూడా తయారు చేసారు. పనులమీదా, ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ) ఆహ్వానం మీదా సోవియట్ యూనియన్ సందర్శించే తెలుగువారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా వుండేది.

15 కామెంట్‌లు:

manavaani చెప్పారు...

దయచేసి రేడియో వ్యక్తుల గురించి వీలున్నప్పుడల్లా
వ్రాస్తూ ఉండండి. హృదయపూర్వక ధన్యవాదములు

సుజాత వేల్పూరి చెప్పారు...

శ్రీనివాసరావు గారూ, చిన్న సవరణ, సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి పేరు మురళీధర రావు! ఈయనే ఢిల్లీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పోతన భాగవతం ఎవరెవరు ఎన్ని సార్లు అచ్చు వేశారనే దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. పరిశోధన ఏదో మొదలుపెట్టినట్లున్నారు.తెలుగు క్రాస్ వర్డ్ పజిల్స్ పూరించేటపుడు మరీ కొరుకుడు పడని వాటి కోసం మురళి గారికి ఫోన్లు చేస్తుంటాం!

రెండో అబ్బాయి ఆనంద్, మూడో అబ్బాయి హర్ష! ధనికొండ హనుమంత రావు గారి అబ్బాయికే వారి పెద్దమ్మాయిని ఇచ్చి వివాహం చేసి బంధుత్వం కూడా కలుపుకున్నారు.

మహాకవులతో సుబ్రహ్మణ్యగారికున్న పరిచయం గురించి ఆయన భార్య (మా అత్తగారి అక్క) చెప్తుంటే ఆశ్చర్యంగా వినడం తప్ప కలుసుకునే భాగ్యం లేకపోయింది. ఈ వ్యాసం గురించి ఆమెకు,మురళి గారికి చెపితే సంతోషిస్తారు.

చాలా మంచి టపా! ఇలా మీరెన్ని విషయాలు రాసినా ఆసక్తిగా చదవడానికి మేమున్నామని గుర్తుంచుకోండి

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ చెప్పారు...

అయ్యా నమస్కారం,

చాలా సంతోషం,రేడియో టపాలు ప్రచురిస్తున్నందుకు...

పొద్దున్నే, ఆ రోజుల్లో వచ్చిన సంస్కృత పాఠం మొదలయ్యే ముందు వచ్చే" కేయూరాణి న భూషయంతి పురుషం..." రికార్డు వుంటే,ఒక టపాలో పెట్టండి.

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

Unknown చెప్పారు...

శ్రీనివాస రావు గారూ
మీ బ్లాగ్, అందులోని విషయాలు, విశేషాలపై వచ్చిన స్పందనా చూసి ఆనందించాను.
రెండు దశాబ్దాలకు పైగా రేడియో వార్తలతో అనుబంధం ఉన్నమీ సహచరుడిగా నా అనుభవాలను కూడా మీతో పంచుకోవాలనిపిస్తోంది.
(కాకపోతే నా అనుభవాలు ఎక్కువ భాగం విజయవాడ వార్తా విభాగానికి సంబంధించినవి). మీరు ప్రస్తావించిన కొప్పుల సుబ్బా రావు, ప్రయాగ, కల్పన, సాధన వీళ్ళంతా బెజవాడలో నేను న్యూస్ ఎడిటర్ గా ఉన్నపుడు వార్తలు చదివిన వారే. మిగతా వాళ్ళంతా ఇప్పుడు నాతో హైదరాబాద్ వార్తా విభాగం లో పనిచేస్తున్నారు. మీరు చెప్పినట్టు "కోణంగి"బాలభాస్కర్ కాదు, వాళ్ళ ఇంటి పేరు "పోణంగి" (పోణంగి శ్రీరామ అప్పారావు గారి బంధువులు).
ఏమైనా, ఒకనాడు న్యూస్ రీడర్లకున్న శ్రద్ధాసక్తులు ఈనాడు తగ్గిపోయాయని చెప్పక తప్పదు. దానికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి! టీవీ చానళ్లు
వచ్చాక న్యూస్ "రీడర్" లే కాని వ్రాసేవాళ్ళు కరువైపోయారు. రేడియోలో రాతా, కూతా రెండూ వచ్చిఉండాలన్న నిబంధన ఒకటి ఏడ్చింది మరి!
పోను పోను ఈ రెండు నైపుణ్యాలూగలవారు దొరకరు స్వామీ అని పై వారితో మొత్తుకుంటున్నాను ఎప్పటికప్పుడు. వారెప్పుడు వింటారో!
ప్రసాద్ MVS

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

రేడియో న్యూస్ డైరెక్టర్ ప్రసాద్ గారికి
జర్నలిజం లో వున్నవాళ్ళు ‘తొందరపాటులో ఎలా తప్పులు తొక్కు తారో’ అన్న విషయంపై లోగడ నేనే రాసి- ఇప్పుడు అదే తప్పు నేను చేసాను. ఇంటి పేరు విషయంలో జరిగిన పొరబాటుని గుర్తించి బాల భాస్కర్ ని ఈ రోజు రేడియోలో కలిసి స్వయంగా క్షమాపణ చెప్పాను. దయచేసి మీరు కూడా మన్నించండి. ఈ వయస్సులో నేర్చుకున్న కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇందుకు దోహదం చేసి వుండవచ్చు. కానీ అది నా తప్పును కప్పిపుచ్చలేదు. – భండారు శ్రీనివాసరావు

Kalpana Rentala చెప్పారు...

ఎంవిఎస్ ప్రసాద్ గారు,

ఎలా వున్నారు? ఇక్కడ మీ వ్యాఖ్య ని చూసి ఈ కామెంట్ ద్వారా మిమ్మల్ని పలకరిస్తున్నాను.

ఆర్వీవీ కృష్ణారావు గారు, మీరు, సుబ్రమణ్యం గారు, మిమ్మల్ని ఎవ్వరిని నేను మర్చిపోలేదండీ...మీతో పని చేసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేను కూడా.మీ మైల్ అడ్రెస్ శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకుంటానులెండి.

శ్రీనివాసరావు గారు, మీ బ్లాగ్ పోస్ట్ ల ద్వారా ఈ విషయాలనీ గుర్తు చేసుకోవటమే కాకుండా ఇలా పాత స్నేహాలను కలుపుకోవటం కూడా బావుంది. అందుకు మీకు థాంక్స్.

Kalpana Rentala చెప్పారు...

మా నాన్నాగారి ఆప్తమిత్రుడు, మా కుటుంబానికి అతి సన్నిహితులు అయినా ఎల్చూరి సుబ్రహ్మణ్యం గారి గురించి మీరు రాసిన విశేషాలు నా మదిలో ఎన్నో పాత జ్నాపకాల్ని తట్టి లేపాయి. ధన్యవాదాలు.

సుజాత, మీరు ఎల్చూరి కుటుంబానికి సన్నిహితులని తెలియదు. మురళీ తో ఈ సారి మాట్లాడితే అడిగానని చెప్పండి.

karlapalem Hanumantha Rao చెప్పారు...

నాకూ అత్యంత ఇష్ట మయిన ఎన్నో విషయాలు మీ బ్లాగ్ లో కనిపిస్తున్నాయండి!నిజానికి నేను దీనికి ఎడిక్ట్ ఆయనేమో !నాకూ తెలిసినంత వరకు మీ బ్లాగ్ మన తెలుగు బ్లాగుల్లో one of the very few best-ఇంతకు మించి మరీ ఎక్కువ రాస్తే అపార్ధం చేసుకునే అన ర్ధం వుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

హనుమంతరావుగారికి –మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈ వ్యాసాల్లో ఏదయినా ప్రత్యేకత వుందనుకుంటే ఆ గొప్పదనం పూర్తిగా నూటికి నూరుపాళ్ళు ‘రేడియో’కే దక్కుతుంది. నేను కేవలం నిమిత్తమాత్రుడుని మాత్రమె. – భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

యడవల్లి వెంకట సత్యనారాయణ శర్మ గారికి – “కేయూరా న విభూషయంతి పురుషం – హారా న చంద్రోజ్వలాః – న స్నానం న విలేపనం న కుసుమం – నా లంక్రుతామూర్ధ్వజాః – వాన్యైకా సమలంకరోతి పురుషం – యా సంస్కృతా ధార్యతే – క్షీయంతే ఖలు భూషణానిసతతం – వాగ్భూషణం భూషణం” - ఇలా సాగిపోయే ఈ శ్లోకం రేడియోలో సంస్కృత పరిచయ కార్యక్రమం ప్రారంభ సూచికగా వినబడే సిగ్నేచర్ ట్యూన్. ప్ర్రాతఃస్మరణీయులు కేశవపంతుల నరసింహశాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని పండిత పామర జనరంజకంగా నిర్వహించేవారు. శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీమతి పాకాల సావిత్రి ప్రభ్రుతులు తమ కోయిల స్వరాలతో ఈ శ్లోకానికి జీవం పోశారు. – భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

రెంటాల కల్పన గారికి – నిన్ననే అనుకోకుండా హైదరాబాద్ రేడియో స్టేషన్ లో ప్రసాద్ గారిని కలిసాను. వెంటనే మీ టపా. ఆయన మొబైల్ : 94404 04552 ఈమెయిల్: sarojaprasad@gmail.com

ఆర్వీవీ కృష్ణారావు గారి సెల్: 98490 33991 eemail: rvvkrao@hotmail.com

Kalpana Rentala చెప్పారు...

Thanks SrinivasaRao garu. I will mail them.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యులు శ్రీ భండారు శ్రీనివాసరావు గారికి,

అప్రతర్కితంగా కనుపించిన ఏదో సంధానకరణి మూలాన ఈ బ్లాగుకు వచ్చి మీ విలేఖనాన్ని చదివి ఎంతో ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి.

ఆకాశవాణి ప్రసారక్షితిజరేఖ మీద నిత్యం వెలుగొందే మీరు మీ జ్ఞాపకాలను అక్షరాలకు అంకితం చేయటం నిజంగా అభినందనీయం. అందులో అక్కడక్కడ నన్ను గురించి, మా నాన్నగారు, బాబాయి గార్లను గురించి మీరు చేసిన ప్రస్తావనలను చూసి నివ్వెరపోయాను. మీకు అన్నన్ని విశేషాలు విదితమై ఉండటమూ, అవి మీ స్మృతిపథంలో నిలిచి ఉండటమూ మా అందరి అదృష్టం.

మీకు, మీ వ్యాఖ్యలకు స్మరణోత్సవంగా స్పందించిన చి.సౌ. రెంటాల కల్పన, సుజాత గారలకు – హృదయపూర్వక ధన్యవాదాలు.

ఎంతో వైవిధ్యపూర్ణంగా ఉన్న మీ వ్యాసవాహిని ఇదే విధంగా ప్రశాంతగమనంతో నిత్యం కొనసాగాలని ఆకాంక్షిస్తూ,

భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ఏల్చూరి మురళీధరరావు గారికి - ఆలశ్యంగా చదివినా చక్కటి స్పందన.అది మీ సహృదయత రేడియోకున్న గొప్పదనం.మీ మెయిల్ ఐడి తెలుసుకోవడానికి గత రెండు రోజులుగా నేను చేయని ప్రయత్నం లేదు.మరింతగా మనసు పరిచి మాట్లాడుకుందామన్న ఉద్దేశ్యం మాత్రమే. నా ఐ డి కింద ఇస్తున్నాను. ఇది చూడడం తటస్తిస్తే జవాబు రాయండి - భండారు శ్రీనివాసరావు (bhandarusr@yahoo.co.in లేదా bhandarusr@gmail.com) Phone 040-2373 1056 (HYD) Mobile: 98491 30595